
సాక్షి, న్యూఢిల్లీ : విపక్షాల తీవ్ర ఆందోళనల మధ్య రెండు వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లులకు పెద్దల సభ ఆమోదం తెలిపింది. రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపడతామని, వ్యవసాయ సంస్కరణల ఫలితంగా దేశవ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు పెరుగుతాయని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ బిల్లులపై చర్చ సందర్భంగా పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలను విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎమపీలు నినాదాలు చేశారు. బిల్లు ప్రతులను పలువురు సభ్యులు చించివేశారు.
వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులను సభ ఆమోదం తెలిపిందని ప్రకటించిన డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ సభను సోమవారానికి వాయిదా వేశారు. ఇక అంతకుముందు రాజ్యసభలో బిల్లు ఓటింగ్‌ను అడ్డుకునేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నం చేశాయి. డిప్యూటీ చైర్మన్ పోడియం చుట్టూ చేరి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ బిల్లు మాసాయిదా ప్రతులు చింపి.. పోడియంపై విసిరారు.
టీఎంసీ, ఆమ్‌ఆద్మీ, శిరోమణీ అకాలీదళ్ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని మైకులు విరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో రాజ్యసభలో విపక్షాల తీరు తీవ్ర గందగోళానికి దారితీసింది. కాగా లోక్‌సభలో వ్యవసాయ బిల్లులు గురువారం రాత్రి ఆమోదం పొందాయి. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌కు చెందిన హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులకు నిరసనగా పంజాబ్, హరియాణ సహా పలు రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలు చేపట్టారు. చదవండి : రసవత్తరంగా రాజ్యసభ.. గట్టెక్కేదెలా!
Comments
Please login to add a commentAdd a comment