అనుకున్నదే అయింది. అందరూ అనుమానించినట్టే అయింది. ఏ ప్రజాసమస్య పైనా తగిన చర్చ జరగకుండానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వర్షార్పణమయ్యాయి. అదీ... మొదట ప్రకటించిన ఆగస్టు 13 కన్నా రెండు రోజుల ముందే ముగిశాయి. ప్రతిపక్షాలు గొంతు చించుకున్నా పట్టించుకోని ప్రభుత్వం, సర్కారు సావధానంగా పోదామన్నా పట్టు వీడని విపక్షం, సాక్షాత్తూ పార్లమెంటరీ స్థాయీ సంఘం కబురు చేసినా సరే ఖాళీ లేదనే అధికార వర్గం, మంత్రి చేతిలోని ప్రకటనను చించివేసే సభ్యుల తెంపరితనం, పెద్దల సభలోనే బల్లలెక్కి అధ్యక్షుడి ఖాళీ కుర్చీ మీదకు నిబంధనావళిని విసిరేయగల దాదాగిరి, సమస్యల పరిష్కారం కన్నా ప్రతిపక్షాలదే తప్పు అన్న ప్రచారమే కీలకమని భావించిన పాలకులు, ప్రతిపక్ష మహిళా ఎంపీలపై మార్షల్స్ దౌర్జన్యం, మహిళా మార్షల్‌పై ఎంపీలే దాడి చేశారన్న పాలకపక్ష ఆరోపణలు – ఇలా ఈ విడత పార్లమెంట్‌లో ఎన్నెన్నో వివాదాలు, విషాద దృశ్యాలు. చివరకు, ఈ విడత కూడా విలువైన సభాసమయం వృథా అయింది. తిలాపాపంలో తలా పిడికెడు వాటా అన్ని పక్షాలకూ దక్కింది.
లెక్కిస్తే – ఈ సమావేశాల్లో కేవలం 17 సార్లే సభ కొలువు తీరింది. నిజానికి, లోక్‌సభ 96 గంటలు పనిచేయాల్సి ఉండగా, కేవలం 21 గంటల 14 నిమిషాలే పని చేసింది. ఏకంగా 74 గంటల 46 నిమిషాల సమయం గందరగోళాలకే సరిపోయింది. వెరసి, నిరుడు పార్లమెంట్ ఉత్పాదకత 126 శాతం దాకా ఉంటే, ఈసారి ఏకంగా 22 శాతానికి పడిపోయింది. సాధారణంగా సభా నిర్వహణకు నిమిషానికి రూ. 2.5 లక్షలు, రోజుకు రూ. 9 కోట్లు ఖర్చవుతాయని లెక్క. అంటే విలువైన సమయంతో పాటు, ఎంత ప్రజాధనం వృథా అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక, ఈ సమావేశాల్లో ప్రభుత్వం 13 బిల్లుల్ని ప్రవేశపెట్టింది. మరో 20 బిల్లుల్ని ఆమోదించింది. చర్చకు అవకాశమివ్వకుండా, సంఖ్యాబలంతో కీలకమైన బిల్లులకు క్షణాల్లో ఆమోదముద్ర వేస్తూ పోయింది. ‘ఏ మాత్రం చర్చ లేకుండా దాదాపు 35కి పైగా బిల్లుల్ని పాస్ చేశారు. అనేక బిల్లుల్ని పార్లమెంటరీ సెలక్ట్ కమిటీకైనా పంపకుండానే ఆమోదిస్తున్నార’ని ప్రతిపక్షాల ఆరోపణ, ఆవేదన.
సభకు అడ్డుపడి తమ వాదన వినిపించాలనుకోవడం, తామెత్తిన అంశంపై చర్చ జరగాలనడం ప్రతిపక్షాలు ఆది నుంచి చేసేదే. అధికారపక్షం ఎక్కడోచోట సర్దుకొని, అందుకు అంగీకరించడం సంప్రదాయం. కానీ, ఈసారి మోదీ సర్కారు విదేశీ నిఘా సాఫ్ట్‌వేర్ పెగసస్ వివాదంపై చర్చకు సై అనకుండా, తప్పుకు తిరగడంతో పీటముడి బిగిసింది. సమావేశాలకు ఒక్క రోజు ముందుగా బయటపడ్డ పెగసస్ పైనే చివరి దాకా ప్రతిష్టంభన సాగింది. అదే పట్టుకొని వేలాడిన ప్రతిపక్షాలు ఇతర అంశాలపై చర్చ లేవనెత్తడంలో విఫలమయ్యాయి. మరోపక్క ప్రతిపక్షాల అనుమానాల్ని నివృత్తి చేయాల్సింది పాలకులే.
అధికారంలో ఉన్నవారే పెద్దమనసుతో ముందుకు రావడం ఎక్కడైనా మర్యాద, గౌరవం. కానీ, ఆపాటి విశాల హృదయం పాలకపక్షానికి లేకుండా పోయింది. పెగసస్‌పై ఐరోపా దేశాలు కొన్ని విచారణకు ఆదేశించినా, మనవాళ్ళు అందుకు సిద్ధమనలేదు. కేంద్ర ఐటీ మంత్రేమో ఫోన్లను తాము ట్యాప్ చేయలేదన్నారు కానీ, పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను హ్యాకింగ్‌కు వాడారో లేదో చెప్పలేదు. రక్షణ మంత్రేమో లిఖిత పూర్వక ఏకవాక్య సమాధానంలో తమ శాఖ పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనలేదని సరిపెట్టారు. కానీ, దర్యాప్తు సంస్థలు దాన్ని వాడిందీ లేనిదీ సర్కారు సూటిగా జవాబివ్వలేదు. సభలో ప్రతిష్టంభనకు కారణం ప్రతిపక్షాలే అని ప్రచారం చేస్తే చాలనుకుంది. వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి, మాట్లాడలేమంటూ తర్కం లేవదీసింది.
‘కరోనా రెండో వేవ్ మరణాలు స్వతంత్ర భారత ప్రభుత్వాలన్నిటి సమష్టి వైఫల్యం’ అంటూ ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా చేసిన భావోద్వేగభరిత ‘మాఫీనామా’ ప్రసంగమొక్కటే ఈ సమావేశాల్లో అందరినీ కదిలించింది. అధికార, విపక్షాలు రెంటి మధ్య ఒకే ఒక్క అంశంలో అరుదైన ఐక్యత కనిపించింది. అది – సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల (ఎస్‌ఈబీసీలు – వాడుకలో ఓబీసీలు) జాబితాను రాష్ట్రాలే తయారుచేసుకొనే అధికారాన్ని పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఓటుబ్యాంకు ఓబీసీల విషయంలో రాజకీయ విభేదాలతో సంబంధం లేకుండా పార్టీలన్నీ ఏకతాటిపై నిలిచాయి. అయితే, ఓబీసీల జాబితా రూపకల్పనకు రాష్ట్రాలకున్న అధికారాన్ని 2018లో మోదీ ప్రభుత్వమే తొలగించిందనీ, ఇప్పుడా తప్పు దిద్దుకొనేందుకు తాము సహకరించామనీ విపక్షాల వాదన. ఆ బిల్లు పని కాగానే సర్కారు ఈ సమావేశాలకు సెలవిచ్చేసింది.
ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంటులో జరగాల్సింది ప్రజాసమస్యలపై విలువైన చర్చ. ఈ విడత సభలో చర్చలు లేవు. జరిగిందల్లా రచ్చ. దానితోనే చివరకు సమావేశాలు సమాప్తం కావడం విచారకరం. సభలో ఘటనలతో రాత్రి నిద్ర పట్టలేదంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు భావోద్వేగం చూపారు. అధికార – ప్రతిపక్షాల మంకుపట్టు, ఓబీసీ బిల్లు వేళ కూడా సభా నాయకుడు – హోమ్ మంత్రుల గైర్హాజరు, ప్రతిపక్షాల ప్రశ్నలకు కొన్నేళ్ళుగా సభలో జవాబివ్వని పాలకుల తీరు చూస్తుంటే నిజంగానే ప్రజాస్వామ్య వాదులకు కన్నీరొస్తుంది. లోక్‌సభ కొలువుదీరి రెండేళ్ళు దాటినా, ప్రతిపక్షాలకు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోవ
డమూ విడ్డూరమనిపిస్తుంది. మూకబలానికే తప్ప, చర్చకు స్థానం లేనివేళ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి రోజులు కావా అన్న అనుమానమొస్తోంది. ఇప్పుడిక దీని మీద చర్చ జరగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment