discussions
-
ఆదిమూలం కేసు: అజ్ఞాతంలోకి వరలక్ష్మి.. టీడీపీ నేతల రహస్య మంతనాలు!
సాక్షి, చిత్తూరు జిల్లా: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బాధితురాలు వరలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లింది. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో కేసు దర్యాప్తునకు అవసరమైన ఆరు రకాల పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరణ పూర్తయిన తర్వాత వరలక్ష్మి నిన్న(గురువారం) డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి తాళం వేసుకొని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.వరలక్ష్మి జాడ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆదిమూలం-వరలక్ష్మిల మధ్య రాజీ కుదుర్చేందుకు టీడీపీ నాయకులు రహస్య మంతనాలు జరుపుతుండగా, ఈ క్రమంలోనే వరలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు, ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలుమరోవైపు, ఈ కేసులో హైడ్రామా నడుస్తోంది. మొక్కుబడిగా ఆయన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయగా.. విమర్శల నేపథ్యంలో కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే.. వేధింపులు వెలుగులోకి రాగానే చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన.. తాజా డిశార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు. కోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.కాగా, బాధితురాలి ఆరోపణల మేరకు తిరుపతి భీమా ప్యారడైజ్‌లో ఎమ్మెల్యే గడిపిన 109, 105 రూములు సీజ్, సీసీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని అశ్లీల వీడియోను ఫారెన్సీక్ ల్యాబ్‌కు పంపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో శాసనసభ స్పీకర్ అనుమతి తీసుకొని ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించనున్నారు. -
Lok Sabha elections 2024: కాంగ్రెస్, ఆప్ సీట్ల సర్దుబాటు!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపే అంశంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మంతనాలు మొదలెట్టాయి. త్వరలోనే ఢిల్లీ, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపై తుది నిర్ణయం వెలువడనుందని విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి. అయితే ఇప్పటికే కొన్ని ఎంపీ స్థానాల్లో ఏ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలనే దానిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, వాయవ్య ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాల్లో ఆప్ బరిలో దిగనుంది. చాంద్నీ చౌక్, తూర్పు ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెడుతుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గత ఎన్నికల్లో ఈ ఏడు ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలిచింది. హరియాణాలో ఒకటి, గుజరాత్లో రెండు స్థానాలను ఆప్కే కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. గురుగ్రామ్ లేదా ఫరీదాబాద్‌లో ఆప్ పోటీచేయనుంది. గుజరాత్‌లోని భరూచ్ స్థానం నుంచి ఆప్ నేత ఛైతర్ వసావా, భావ్‌నగర్‌లో ఉమేశ్‌భాయ్ మాక్వానా పోటీ చేస్తారని ఇప్పటికే ఆప్ ప్రకటించింది. -
108, 104 ఉద్యోగుల సమ్మె లేదు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో 108, 104 ఉద్యోగులు సమ్మె యోచనను విరమించుకున్నారు. 108, 104 ఉద్యోగ సంఘాల నాయకులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని శనివారం గుంటూరులో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తమ సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారని, ఈ నెల 22 నుంచి జరపతలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నట్లు సంఘాల నేతలు ప్రకటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ఉద్యోగులకు గుర్తింపు, గౌరవం: మంత్రి రజిని ఈ చర్చల్లో ఉద్యోగుల డిమాండ్లపై మంత్రి రజిని ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు తగిన గుర్తింపు, గౌరవం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే దక్కాయని వివరించారు. 108, 104 వాహనాల ఉద్యోగులను ఆప్కాస్‌లో చేర్చాలనే వినతిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజిపైనా ప్రతిపాదనలు తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు కోరుతున్నవాటిలో ప్రధానమైన శ్లాబ్ పద్ధతిని వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ప్రతినెలా క్రమం తప్పకుండా ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో 104, 108 ఉద్యోగుల జీతాలను సమయానికి ఇచ్చేవారు కాదని గుర్తు చేశారు. ఇకపై కూడా ప్రతి నెలా మొదటి వారంలోనే ఉద్యోగులందరికీ జీతాలు అందేలా కృషి చేస్తామన్నారు. సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 104, 108 వ్యవస్థను, వాహనాలను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని, ఈ విభాగాల్లోని ఉద్యోగులకు కూడా ఏ సమస్యలు రానీయరని తెలిపారు. అత్యవసర సేవలు అందించే విషయంలో 108 సిబ్బంది చేస్తున్న కృషి ఎంతో గొప్పదని చెప్పారు. 104, 108 ఉద్యోగులకు అండగా ఉంటామని, ఏ సమస్యలున్నా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. సీఎం జగన్ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా ప్రజలకు ఎలా సేవ చేస్తోందో, ఉద్యోగులకు కూడా ఏ సమస్యలూ రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హామీలకు ఉద్యోగుల సంఘ నేతలు అంగీకరించారు. ఈ సమావేశంలో 108 ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.కిరణ్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఎన్.మహేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.శ్రీనివాసరావు, 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.ఫణికుమార్, ఉపాధ్యక్షుడు రాంబాబు, అరబిందో సంస్థ నుంచి ఎంవీ సత్యనారాయణ, రాకేష్ పాల్గొన్నారు. -
ఆరోగ్య రంగానికీ నియంత్రణలు!
న్యూఢిల్లీ: ఆరోగ్య పరిరక్షణ రంగానికి ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు.. అందరికీ ఆరోగ్య బీమా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక, ఆరోగ్య శాఖల మధ్య ఇందుకు ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్లు సంబంధిత ప్రభుత్వ అధికారులు ఇద్దరు తెలియజేశారు. అందరికీ ఆరోగ్య బీమా లక్ష్యాన్ని సాధించేందుకు మరింత సమర్ధవంత చర్యలకు తెరతీయవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య బీమాను అందుబాటులో అందరికీ అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఇటీవల జాతీయ బీమా ఏజెన్సీ(ఎన్ఐఏ) వెలువరించిన నివేదిక ప్రకారం 40 కోట్లమందికిపైగా వ్యక్తులకు జీవిత బీమా అందుబాటులో లేదు. అంటే మొత్తం జనాభాలో మూడో వంతుకు బీమా అందడం లేదు. బీమా వ్యాప్తిలేకపోవడం, చాలీచాలని కవరేజీ, ఆరోగ్య పరిరక్షణా వ్యయాలు పెరిగిపోవడం ఇందుకు కారణాలుగా అధికారులు పేర్కొన్నారు. అయితే చికిత్సా వ్యయాలలో ప్రామాణికత, ఆరోగ్య క్లెయిములను పరిష్కారించడం తదితర అంశాలలో విభిన్న సవాళ్లు, అవకాశాలు ఉన్నట్లు వివరించారు. ఆరోగ్య రంగంలో తాజాగా ఏర్పాటు చేయతలపెట్టిన నియంత్రణ సంస్థ తప్పనిసరిగా వీటిని పరిష్కరించవలసి ఉంటుందని తెలియజేశారు. వెరసి సవాళ్ల పరిష్కార వ్యూహాలు, నియంత్రణ సంస్థ(హెల్త్ రెగ్యులేటర్) పాత్ర వంటి అంశాలపై చర్చించేందుకు ఆరోగ్య బీమా రంగ కంపెనీలతోపాటు.. సంబంధిత వ్యక్తులు, సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. అంతేకాకుండా హెల్త్ రెగ్యులేటర్.. ఆరోగ్య క్లెయిముల జాతీయ ఎక్సే్ఛంజీ(ఎన్‌హెచ్‌సీఎక్స్) పరిధిని విస్తరించడం, పరిశ్రమను మరింత సమర్ధవంతంగా పర్యవేక్షించే అధికారాలను కలిగి ఉండటం ముఖ్యమని మరో అధికారి వ్యాఖ్యానించారు. -
ఇంతకూ ఎవరు గెలుస్తారంటావ్!
‘‘అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటావ్? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఓటరు నాడి ఎలా ఉంది?’’ ప్రభుత్వ కార్యాలయాల్లో తరచూ వినిపించిన ప్రశ్నలివి. అధికారి స్థాయి నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు తారసపడిన వ్యక్తులతో ఆసక్తిగా ప్రశ్నలడిగారు. వాటికి వస్తున్న జవాబులతో ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ విశ్లేషణ వాతావరణం కనిపించింది. సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్‌తో ప్రభుత్వ స్థాయిలో కొత్త కార్యక్రమాలేవీ లేవు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలకు సంబంధించి కొత్తగా లబ్ధిదారుల ఎంపిక, లబ్థి చేకూర్చే కార్యక్రమాలకు బ్రేక్ పడింది. ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులకు కాస్త విరామం దొరికినట్టయ్యింది. దీంతో ఆ కార్యాలయాల్లో ఎటు చూసినా ఎన్నికలపైనే చర్చోపచర్చలు జరిగాయి. ఉద్యోగులు కాకుండా ఇతరులెవరైనా కార్యాలయానికి వెళ్తే ‘‘ఎవరు గెలుస్తారంటావ్’’ అంటూ ఉద్యోగులు సరదాగా ఆసక్తికర చర్చ పెట్టారు. ఉన్నతాధికారులు సైతం.. తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడోసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలివి. వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్(అప్పట్లో టీఆర్ఎస్) అధికారం చేపట్టగా... ఇప్పుడు మూడోసారి కూడా గెలుపుపై అదే ధీమా వ్యక్తం చేస్తూ అందరి కంటే ముందుగా ప్రచారం ప్రారంభించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఓటరు నాడిని అంచనా వేస్తూ గత పదేళ్లలో జరిగిన సంక్షేమ పథకాలు, లబి్ధదారులు, ఓటరు నాడి తదితర విశ్లేషణతో గెలుపోటములు ఎలా ఉంటాయో ఊహాజనిత అంచనాలకు దిగారు. స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతున్న చర్చల్లో కొందరు ఉన్నతాధికారులు సైతం పాలుపంచుకుంటున్నారు. అప్పుడే బెట్టింగ్‌లు? చాలామంది ఉద్యోగులు, అధికారులు వారి సొంత నియోజకవర్గాలు, పనిచేసిన నియోజకవర్గాల్లో స్నేహితులను ఫోన్లలో అడిగి మరీ ఎన్నికల సరళిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని, మరి కొందరు మరో పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తూ కొందరైతే ఏకంగా బెట్టింగులకు సైతం దిగారు. ఇదీ చదవండి: ముగిసిన ప్రచార గడువు, అమల్లోకి నిషేధాజ్ఞలు, 144 సెక్షన్ -
‘సెమీఫైనల్’ వ్యూహాలకు పదును!.. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న సారత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహాలకు బీజేపీ పెద్దలు పదును పెడుతున్నారు. ఈ ఏడాది చివరన ఎన్నికలు జరిగే తెలంగాణ సహా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం ఎన్నికలకు కార్యాచరణను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నూతనంగా నిర్మించిన రెసిడెన్షియల్ భవనంలో సోమవారం అర్ధరాత్రి వరకు, తిరిగి మంగళవారం ఉదయం దాదాపు పది గంటలపాటు కీలక చర్చలు జరిపారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీకున్న బలాబలాలు, బలహీనతలను బేరీజు వేసుకొని వాటిని అధిగమించే అంశంపై మేథోమథనం జరిపారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపునకు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు కీలకంగా ఉండటం, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు, రాజస్తాన్‌లో 25, మధ్యప్రదేశ్‌లో 29, ఛత్తీస్‌గఢ్‌లో 11 స్థానాలు కలిపి మొత్తంగా 82 స్థానాలు ఉన్నందున అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటితేనే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు సులువవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులోభాగంగా కొన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను, ఇంచార్జీలను మార్చాలని నిర్ణయించినట్టు సమాచారం. తెలంగాణలో ఏం చేయాలి? తెలంగాణలో ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, దీనిని తమకు అనుకూలంగా మలుచుకోవడంతోపాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో ఉన్న అసమ్మతిని తమవైపు తిప్పుకునే అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. దీంతోపాటే కొత్తగా ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, మేనిఫెస్టో సహా ఇతర కమిటీల నియామకాలను పూర్తి చేస్తూనే, సంస్థాగత నియామకాలను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. పార్టీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న ఈటల రాజేందర్‌కు ముఖ్యమైన బాధ్యతలు కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై అసంతృప్తిగా ఉన్న నేతలతో మాట్లాడి.. నేతల మధ్య ఐక్యత చెడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించినట్లు సమాచారం. పార్టీ ప్రచార కార్యక్రమాలు, ఈ నెలలో తెలంగాణలో జరిపే పర్యటనలపైనా చర్చించారు. ఇదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు, అధికార పక్షం లేదా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న అసమ్మతి నేతలతో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు అవకాశాలపైనా సమాలోచనలు చేశారు. అలాంటివి సాధ్యంకాని చోట ప్రభుత్వాలపై ఉన్న ప్రజా వ్యతిరేకతను సొమ్ముచేసుకునే అంశంపై చర్చించినట్లు చెబుతున్నారు. ఇందులోభాగంగానే ఇటీవల జరిపిన భేటీలో తెలంగాణ విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ ముందుంచిన ప్రతిపాదనలపైనా ముగ్గురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఆయా అంశాలపై ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో ఉన్న పార్టీ ఇంచార్జి సునీల్ బన్సల్ అభిప్రాయాలను కూడా ముగ్గురు అగ్రనేతలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. చదవండి: పోలీసులు రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి -
బీజేపీ అధినాయకత్వం వరుస భేటీలు.. ఢిల్లీలో ఏం జరుగుతోంది?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలో సాగుతున్న సమాలోచనలపై రాష్ట్ర బీజేపీ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో వేర్వేరుగా చర్చలు జరుపుతుండటంతో రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన పరిణామాలు ఏవైనా చోటుచేసుకోనున్నాయా? ఈ వరుస భేటీల ఆంతర్యమేంటి? ఎలాంటి రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అన్న దానిపై పార్టీలో చర్చలు సాగుతున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ నేపథ్యంలో.. ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలంగాణ విషయంలో జాతీయ నాయకత్వం ఆచితూచి స్పందిస్తోంది. ఐదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. రాష్ట్ర పార్టీలో సమన్వయ లేమి, నేతల్లో అసంతృప్తి, ఉమ్మడిగా ముందుకెళ్లకపోవడం, కేసీఆర్ సర్కార్‌పై ప్రజా వ్యతిరేకతను సరైన పద్దతిలో బీజేపీకి అనుకూలంగా మలచకపోవడం, ముఖ్య నేతలు తమ సొంత ప్రచారానికే ప్రయత్నించడం, నాయకత్వం అందరినీ కలుపుకొనిపోవడం లేదనే విమర్శలు వంటివాటిపై కేంద్ర నాయకత్వం దృష్టి పెట్టింది. జాతీయ నాయకత్వం వద్ద నోరువిప్పుతున్న నేతలు! నాలుగైదు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న చర్చల్లో రాష్ట్ర నేతలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు, నాయకుల వ్యవహారశైలి, ఇతర విషయాలను జాతీయ నాయకులకు వివరించినట్టు విశ్వసనీయ సమాచారం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఎదుర్కోవాలంటే ప్రస్తుతం పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలు, విధానాలు సరిపోవని.. ఇప్పటివరకు పాటించిన పద్ధతులకు భిన్నంగా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని వారు సూచించినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే నాయకత్వ మార్పు, విడిగా ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీలు ఏర్పాటు చేసి పూర్తిగా ఎన్నికల బాధ్యతలు కట్టబెట్టడం వంటి అంశాలు తెరపైకి వచ్చినట్టు సమాచారం. దీనితోపాటు తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని, ఇక్కడ హిందూత్వ ఎజెండాను పక్కనపెట్టి లౌకికవాదంతో బీసీలు, అణగారినవర్గాలకు భరోసా కల్పించేలా సాగాల్సిన అవసరం ఉందని అభిప్రాయాన్ని వినిపించినట్టు తెలిసింది. కేసీఆర్ ప్రభుత్వ నియంతృత్వ విధానాలు, వారి కుటుంబసభ్యులపై వచ్చిన అవినీతి, అక్రమాల ఆరోపణలు, తొమ్మిదేళ్ల పాలన వైఫల్యాలు, హామీల అమల్లో వెనకడుగు వంటి అంశాల్లో బీజేపీ వైఖరిని సుస్పష్టం చేయాలని సూచించినట్టు సమాచారం. అభిప్రాయాలన్నీ తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది రాష్ట్ర పార్టీ చర్చనీయాంశమైంది. కొత్త వారికి పెద్దపీటతో అసంతృప్తి! గత రెండు, మూడేళ్లలో పార్టీలో చేరిన వారికి జాతీయ నాయకత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న అభిప్రాయం రాష్ట్రంలోని సీనియర్లు, పాత నేతల్లో అసంతృప్తికి కారణం అవుతోంది. వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరాక వారు ఏ మేరకు పార్టీకి ఉపయోగపడ్డారు, ఓటర్లను పార్టీవైపు మళ్లించేందుకు కీలకంగా వ్యవహరించారా, వారి సొంత ప్రాంతాలు, జిల్లాలు, నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతకు, బలోపేతానికి కృషిచేశారా అన్నది కూలంకషంగా పరిశీలించాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటన్నింటితో నిమిత్తం లేకుండానే పలువురిని ఏకంగా జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించడంతో పార్టీలో నాయకుల మధ్య అసమానతలు తలెత్తాయనే భావన వ్యక్తమవుతోంది. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి దాకా పార్టీ కార్యక్రమాల్లో వారిని వేదికపై కూర్చోబెట్టడం, మాట్లాడే అవకాశం ఇవ్వడం.. ఇదే సమయంలో సీనియర్లు, పాత నాయకులు కిందే కూర్చోవాల్సి రావడం అసంతృప్తిని పెంచుతోందన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఏర్పడిన స్తబ్దతను, సందిగ్ధతను దూరం చేసేలా.. జాతీయ నాయకత్వం నుంచి స్పష్టత అవసరమని నేతలు అంటున్నారు. -
కరెంట్ ఉద్యోగులకు 7% ఫిట్మెంట్
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ, ఇతర సమస్యల పరిష్కారంపై విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగుల జేఏసీల మధ్య చర్చలు సఫలమయ్యాయి. యాజమాన్యాలు ప్రతిపాదించిన 7 శాతం ఫిట్మెంట్తోపాటు ఇంక్రిమెంట్ల మంజూరు, పలు ఇతర ప్రతిపాదనలకు జేఏసీల ప్రతినిధులు అంగీకారం తెలిపారు. దీనితో సోమవారం నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకున్నట్టు పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించగా, అన్నిరకాల ఆందోళనలను విరమించుకుంటున్నట్టు ఎలక్ర్టీసిటీ ఎంప్లాయీస్ జేఏసీ తెలిపింది. పలు విడతల్లో జరిగిన చర్చలతో.. విద్యుత్ ఉద్యోగులకు వేతన సవరణపై వేసిన పీఆర్సీ కమిటీ తొలుత 5శాతం ఫిట్‌మెంట్‌ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దానిపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. దీనితో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు నేతృత్వంలోని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు.. తెలంగాణ స్టేట్ పవర్/ఎలక్ర్టీసిటీ ఎంప్లాయిస్ జేఏసీల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. తొలుత 6 శాతం, తర్వాత 7 శాతానికి ఫిట్‌మెంట్‌ను పెంచుతామని యాజమాన్యాలు ప్రతిపాదించగా జేఏసీలు తిరస్కరించాయి. అయితే శనివారం మరోసారి జరిగిన చర్చల్లో అనూహ్యంగా 7శాతం ఫిట్మెంటే ఫైనల్ కావడం గమనార్హం. చర్చల్లో అంగీకారం కుదిరిన అంశాలపై యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాల మధ్య రాతపూర్వక ఒప్పందం జరిగింది. చర్చల్లో ఉత్తర/దక్షిణ డిస్కంల సీఎండీలు ఎ.గోపాల్‌రావు, జి.రఘుమారెడ్డి, పవర్ జేఏసీ నేతలు జి.సాయిబాబు, రత్నాకర్‌రావు, ఎలక్ట్రిసిటీ జేఏసీ నేత ఎన్.శివాజీ పాల్గొన్నారు. ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవీ.. ♦ 7 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు. 2022 ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్న 24.992 శాతం డీఏ (కరువు భత్యం) వేతనంలో విలీనం. ♦ 2022 ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ వర్తింపు. బకాయిలను జీతం/పెన్షన్‌తో పాటు 12 నెలల సమ వాయిదాల్లో చెల్లిస్తారు. ♦ ఈపీఎఫ్‌కు బదులు జీపీఎఫ్ సదుపాయం కల్పనపై విద్యుత్ సంస్థల బోర్డుల్లో సానుకూల నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. ♦ వర్క్‌మెన్, ఇతరులకు సింగిల్ మాస్టర్ స్కేలువర్తింపు. ♦ ఆర్టిజన్ల పర్సనల్ పేను బేసిక్ పేలో విలీనం చేస్తారు. ♦ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెచ్ఆర్ఏ, సీసీఏ సదుపాయం. ఈ విషయంలో పరిమితులకు లోబడి రాష్ట్ర ప్రభుత్వ జీవోల అమలు. ♦ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రూ.16 లక్షల గ్రాట్యూటీ, అదనపు పెన్షన్ సదుపాయం. ♦ జీవితకాలం పాటు ఉద్యోగులకు రూ.10లక్షలు, ఆర్టీజన్లకు రూ.2లక్షల పరిమితితో వైద్య సదుపాయం. ♦ పెద్ద జబ్బులకు జీవితకాలం పాటు ఉద్యోగులకు రూ.15లక్షల వరకు వైద్య సదుపాయం (ఒక విడతలో రూ.5లక్షల గరిష్ట పరిమితి). ♦ సెల్ఫ్ ఫండింగ్ వైద్య పథకం కింద నెలకు రూ.1,000 చెల్లిస్తే.. ఉద్యోగులు, ఆర్టీజన్లు, పెన్షనర్లకు రూ.12లక్షల వరకు వైద్య సదుపాయం. ♦ ఈఎన్టీ/డెంటల్/కంటి వైద్యానికి పరిమితి రూ.15వేల నుంచి రూ.50వేలకు పెంపు. ఆపై ఖర్చులను సెల్ఫ్ ఫండింగ్ పథకం నుంచి చెల్లిస్తారు. ♦ 5 ఏళ్లలోపు సర్విసు ఉంటే ఒక ఇంక్రిమెంట్, ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య సర్విసుంటే రెండు ఇంక్రిమెంట్లు, 15ఏళ్లకుపైగా సర్వీసు ఉంటే 3 ఇంక్రిమెంట్లను వర్తింపజేస్తారు. ♦ ఆర్టిజన్లకు రెండు ఇంక్రిమెంట్లను వర్తింపజేస్తారు. ♦ ప్రస్తుత అలవెన్సులను ప్రస్తుత రేట్లతో యథాతథంగా కొనసాగిస్తారు. ♦ జెన్కో ఉద్యోగుల ప్రత్యేక అలవెన్సు కొనసాగింపు 25 నుంచి ఆర్టీజన్ల సమ్మె యథాతథం ఆర్టిజన్లకు 7శాతం ఫిట్‌మెంట్‌ను తిరస్కరిస్తున్నామని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది. విద్యుత్ సంస్థల్లో ఆర్టీజన్లుగా విలీనమైన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి తలపెట్టిన సమ్మె యథాతథంగా కొనసాగుతుందని యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు తెలిపారు. తమను చర్చలకు ఆహ్వానించలేదని పేర్కొన్నారు. ఆర్టిజన్లకు ఇప్పటికే హెచ్ఆర్ఏ తగ్గించారన్నారు. విధి నిర్వహణలో విద్యుత్ ప్రమాదాలకు గురై పెద్ద సంఖ్యలో ఆర్టిజన్లు మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ శ్రమకు తగినట్టుగా పీఆర్సీ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. -
అక్కడ రష్యా.. ఇక్కడ చైనా..
న్యూఢిల్లీ: యుద్ధంలో మునిగిన ఉక్రెయిన్, రష్యాలతో భారత్, చైనా సరిహద్దు వివాదాన్ని పోలుస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ‘ ఉక్రెయిన్ను ఆక్రమిస్తూ రష్యా ఆ దేశంతో ఉన్న సరిహద్దులను మార్చేస్తోంది. అదే తరహాలో భారత్‌తో ఉన్న సరిహద్దును మార్చేందుకు చైనా తన సైన్యం చొరబాట్లతో దుస్సాహసానికి తెగబడుతోంది’ అని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్‌తో చర్చాగోష్టి తాలూకూ సుదీర్ఘ వీడియోను రాహుల్ గాంధీ సోమవారం ట్వీట్ చేశారు. ‘బలహీన ఆర్థిక వ్యవస్థ, దమ్ములేని నాయకత్వంలో దార్శనికత కొరవడిన ప్రజలు, విద్వేషం, ఆగ్రహం కలగలిసిన ఈ పరిస్థితులను చైనా తనకు అనువుగా మలచుకుంటోంది. లద్దాఖ్‌లోకి వస్తామంటోంది. అరుణాచల్‌లో అడుగుపెడతామంటోంది’ అని రాహుల్ ఆందోళన వ్యక్తంచేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఈనెల 3వ తేదీ నుంచి మొదలయ్యే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలంటూ ఆహ్వానం పంపిన రాహుల్ గాంధీకి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతి కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి కాంగ్రెస్ ప్లీనరీ ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఫిబ్రవరి 24 నుంచి 26 దాకా.. మూడు రోజులపాటు తమ పార్టీ 85వ ప్లీనరీ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం తెలియజేశారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)కి సైతం ప్లీనరీ సందర్భంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
Telangana VRAs: ప్రభుత్వంతో ముగిసిన వీఆర్ఏల చర్చలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంతో వీఆర్ఏల చర్చలు ముగిశాయి. వీఆర్ఏ సమస్యలు పరిష్కారిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వీఆర్ఏలు ఆందోళన విరమించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 20న వీఆర్ఏలతో మళ్లీ చర్చలు జరుపుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. అనంతరం వీఆర్ఏలు మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్‌పై తమకు నమ్మకం ఉందన్నారు. చదవండి: TS: దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే? తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. వీఆర్ఏలు ఆందోళన చేపట్టారు అసెంబ్లీ నుంచి ప్రగతిభవన్ రోడ్డును పోలీసులు మూసివేశారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అక్కడున్న వ్యాపార సముదాయాలను సైతం పోలీసులు మూసివేయించారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ప్రధానితో చర్చకు తలతంపర సర్పంచ్‌కు పిలుపు
కంచిలి: జాతీయ బాల్య వివాహాల చట్టంలో వయస్సును సవరించడం కోసం ప్రవేశపెట్టనున్న బిల్లుపై భారత ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించనున్న చర్చకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 8 మందిని ఎంపిక చేశారు. అందులో కంచిలి మండలం తలతంపర పంచాయతీ సర్పంచ్ డాక్టర్ దొళాయి జగబంధును కూడా ఎంపిక చేస్తూ అమరావతి నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక జెడ్పీ చైర్మన్, ఒక ఎంపీపీ, ఒక జెడ్పీటీసీ, ఐదుగురును సర్పంచ్‌లతో పీఎం మోదీ ఆన్లైన్లో ఈ విషయమై చర్చిస్తారని, ఎంపిక చేసిన 8 మంది ప్రజాప్రతినిధులకు సీఎంఓ కార్యాలయం నుంచి సమాచారం అందించినట్లు తలతంపర సర్పంచ్ డాక్టర్ జగబంధు శుక్రవారం సాయంత్రం స్థానిక విలేకరులకు తెలిపారు. అన్ని రాష్ట్రాల నుంచి ఈ విధమైన కమిటీలను నియమించి, అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. ఈ నెల 31వ తేదీన అమరావతిలో ఈ కార్యక్రమం ఉంటుందని, తప్పనిసరిగా హాజరు కావాలని సమాచారం వచ్చినట్లు తెలిపారు. (చదవండి: దొంగ సొత్తు చెరువులో ఉందా..?) -
సర్వత్రా చర్చ.. హాట్ టాపిక్‌గా సీఎం కేసీఆర్ ప్రకటన
మొయినాబాద్(రంగారెడ్డి జిల్లా): ప్రస్తుతం చర్చంతా 111 జీవోపైనే సాగుతోంది. సీఎం కేసీఆర్ మంగళవారం అసెంబ్లీలో ప్రకటన చేసింది మొదలు స్థానికంగా ఎక్కడ చూసినా ‘జీవో ఎత్తేస్తారంట కదా..’ అంటూ చర్చించుకోవడం కనిపిస్తోంది. జీవో పరిధిలోని గ్రామాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తూ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు ఇది ఎన్నికల స్టంట్ అంటూ విమర్శిస్తున్నాయి. చదవండి: సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిర్వాకం.. మహిళ కాల్ రికార్డింగ్, వీడియోలు, ఫోటోలతో.. ఇదీ జీవో కథ.. హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించడంకోసం నిజాం కాలంలో ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ జంట జలాశయాలను నిర్మించారు. జలాశయాల్లో నీరు కలుషితం కాకుండా 1996లో అప్పటి ప్రభుత్వం 111 జీవోను తెచ్చింది. జలాశయాలకు వరదనీరు వచ్చే ఎగువ ప్రాంతంలో ఉన్న ఏడు మండలాల్లోని 84 గ్రామాలను జీవో పరిధిలో చేర్చింది. నిబంధనల ప్రకారం ఈ గ్రామాల పరిధిలో కొత్త నిర్మాణాలు, పరిశ్రమలు, లేఅవుట్లు, వెంచర్లు ఏర్పాటు చేసేందుకు వీల్లేదు. దీంతో ఈ ప్రాంతంలో నగర విస్తరణ జరగలేదు. జంట జలాశయాల కింది భాగం వరకు పెద్ద నిర్మాణాలు చేపట్టి నగర విస్తరణ జరిగినా జలాశయాలను దాటి మాత్రం రాలేదు. స్థానికంగా భూముల ధరలు పెరగలేదు. అందరికీ ప్రచారాస్త్రం జీవో కారణంగా కొత్త నిర్మాణాలు చేపట్టలేకపోతున్నాం.. భూముల ధరలు పెరగడంలేదంటూ స్థానిక రైతులు, ప్రజలు వ్యతిరేకించారు. 2007లో 111 జీవో వ్యతిరేక కమిటీ ఏర్పాటు చేసి పోరాటం చేపట్టారు. ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులకు జీవో ఎత్తివేయాలంటూ విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. రాజకీయ పారీ్టలు సైతం ఈ జీవోను ప్రచారాస్త్రంగా వాడుకున్నాయి. రెండు సార్లు టీఆర్ఎస్ కూడా జీవోను ఎత్తేస్తామని హామీ ఇచ్చింది. సీఎం ప్రకటనతో.. ‘హైదరాబాద్ దాహర్తి తీర్చడానికి కృష్ణా, గోదావరి జలాలు సమృద్ధిగా ఉన్నాయని.. జంటజలాశయాల నీళ్లను ఇప్పుడు వాడటం లేదని.. ఇక 111 జీవో కాలం చెల్లిందని.. ఎత్తివేస్తాం’ అంటూ సీఎం ప్రకటన చేయడం హాట్ టాపిక్‌గా మారింది. సీఎం ప్రకటనపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లు, బస్టాపులు, ఆఫీసులు, రోడ్లపై ఎటు చూసినా ఇదే చర్చ. జీవో నిజంగా ఎత్తివేస్తే తమ భూములకు ధరలు పెరుగుతాయని రైతులు పేర్కొంటున్నారు. ఇది సాధ్యం కాదని కొందరు వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉందని.. గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తోందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో జీవోను ఎత్తివేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రతి పక్ష పారీ్టల నాయకులు ఇది ఎన్నికల డ్రామా అని కొట్టిపారేస్తున్నారు. ముందస్తు ఎన్నికల వస్తాయనే ఊహాగానాలతోనే సీఎం ఇలాంటి ప్రకటన చేశారని విమర్శిస్తున్నారు. ఏదిఏమైనా 111 జీవోపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో వేచిచూడాలి. జీవో ఎత్తేస్తేనే మేలు 111 జీవోతో ఇప్పటి వరకు మా భూములకు ధరలు లేవు. భూమిపై బ్యాంకులో అప్పు తీసుకోవాలన్నా ఇబ్బంది ఉంది. జీవో ఎత్తేస్తే భూ ముల ధరలు పెరుగుతాయి. మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు ఏర్పాటైతే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. -మల్లేష్, రైతు, ఎత్బార్పల్లి మా పోరాట ఫలితమే.. 111 జీవోను వ్యతిరేకిస్తూ 2007 నుంచి పోరాటం చేస్తున్నాం. స్థానికులంతా జీవోను వ్యతిరేకిస్తున్నారు. మా పోరాటంతోనే ఇప్పు డు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ ప్రకటనను త్వరలోనే నిజం చేయాలి. -కొమ్మిడి వెంకట్‌రెడ్డి, 111 జీవో వ్యతిరేక పోరాట కమిటీ అధికార ప్రతినిధి ఇది ఎన్నికల డ్రామా సీఎం కేసీఆర్ 111 జీవోను ఎన్నికల స్టంట్‌గా వాడుకుంటున్నారు. గతంలో రెండుసార్లు జీవో ఎత్తేస్తామని హామీ ఇచ్చా రు. ఇప్పుడు ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని మరోసారి జీవోను తెరపైకి తెచ్చారు. ఇది ఎన్నికల డ్రామాలో భాగమే. -మధుసూదన్‌రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు, మొయినాబాద్ -
ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి పోరాటం
-
త్రిసభ్య కమిటీ అజెండాలో కీలక అంశాలు
-
కేంద్ర హోంశాఖ అజెండాలో ప్రత్యేకహోదా
-
ఏపీ ప్రత్యేక హోదా అంశం: చర్చలకు రావాలని కేంద్ర హోంశాఖ ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ ఎంజెండాలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. ఈ మేరకు ఏపీ ప్రత్యేక హోదా అంశంపై ఈ నెల 17న చర్చలకు రావాలని రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ ఆహ్వానం పంపించింది. కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. త్రిసభ్య కమిటీలో ఏపీ నుంచి ఎస్ఎస్ రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణా రావు ఉన్నారు. ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై 9 అంశాలపై చర్చ జరుపుతారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఏపీ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేసిన సంగతి విదితమే. ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ కాంగెస్ పార్టీ చాలా రోజులుగా డిమాండ్ చేస్తూ వస్తోంది. జనవరి మొదటివారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీని కలిసి ఏపీ ప్రత్యేక హోదాతో పాటు, రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. త్రిసభ్య కమిటీ ఎజెండాలో 9 అంశాలు... ఎజెండా1: ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన ఎజెండా 2: ఏపీ- తెలంగాణ మధ్య విద్యుత్ వినియోగ సమస్యపై పరిష్కారం ఎజెండా 3: పన్ను అంశాలపై తలెత్తిన వివాదాల పరిష్కారం ఎజెండా 4: రెండు రాష్టాలకు సంబంధించిన బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్లు ఎజెండా 5: ఏపీఎస్సీఎస్సీఎల్, టీఎస్సీఎస్సీఎల్ మధ్య నగదు ఖాతాల విభజన ఎజెండా 6: ఏపీ-తెలంగాణ మధ్య వివిధ వనరుల పంపిణీ ఎజెండా 7: ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన 7 జాల్లాలకు ప్రత్యేక గ్రాంట్లు ఎజెండా 8: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎజెండా 9: రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్ను రాయితీలు -
తిలా పాపం... తలా పిడికెడు!
అనుకున్నదే అయింది. అందరూ అనుమానించినట్టే అయింది. ఏ ప్రజాసమస్య పైనా తగిన చర్చ జరగకుండానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వర్షార్పణమయ్యాయి. అదీ... మొదట ప్రకటించిన ఆగస్టు 13 కన్నా రెండు రోజుల ముందే ముగిశాయి. ప్రతిపక్షాలు గొంతు చించుకున్నా పట్టించుకోని ప్రభుత్వం, సర్కారు సావధానంగా పోదామన్నా పట్టు వీడని విపక్షం, సాక్షాత్తూ పార్లమెంటరీ స్థాయీ సంఘం కబురు చేసినా సరే ఖాళీ లేదనే అధికార వర్గం, మంత్రి చేతిలోని ప్రకటనను చించివేసే సభ్యుల తెంపరితనం, పెద్దల సభలోనే బల్లలెక్కి అధ్యక్షుడి ఖాళీ కుర్చీ మీదకు నిబంధనావళిని విసిరేయగల దాదాగిరి, సమస్యల పరిష్కారం కన్నా ప్రతిపక్షాలదే తప్పు అన్న ప్రచారమే కీలకమని భావించిన పాలకులు, ప్రతిపక్ష మహిళా ఎంపీలపై మార్షల్స్ దౌర్జన్యం, మహిళా మార్షల్‌పై ఎంపీలే దాడి చేశారన్న పాలకపక్ష ఆరోపణలు – ఇలా ఈ విడత పార్లమెంట్లో ఎన్నెన్నో వివాదాలు, విషాద దృశ్యాలు. చివరకు, ఈ విడత కూడా విలువైన సభాసమయం వృథా అయింది. తిలాపాపంలో తలా పిడికెడు వాటా అన్ని పక్షాలకూ దక్కింది. లెక్కిస్తే – ఈ సమావేశాల్లో కేవలం 17 సార్లే సభ కొలువు తీరింది. నిజానికి, లోక్‌సభ 96 గంటలు పనిచేయాల్సి ఉండగా, కేవలం 21 గంటల 14 నిమిషాలే పని చేసింది. ఏకంగా 74 గంటల 46 నిమిషాల సమయం గందరగోళాలకే సరిపోయింది. వెరసి, నిరుడు పార్లమెంట్ ఉత్పాదకత 126 శాతం దాకా ఉంటే, ఈసారి ఏకంగా 22 శాతానికి పడిపోయింది. సాధారణంగా సభా నిర్వహణకు నిమిషానికి రూ. 2.5 లక్షలు, రోజుకు రూ. 9 కోట్లు ఖర్చవుతాయని లెక్క. అంటే విలువైన సమయంతో పాటు, ఎంత ప్రజాధనం వృథా అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక, ఈ సమావేశాల్లో ప్రభుత్వం 13 బిల్లుల్ని ప్రవేశపెట్టింది. మరో 20 బిల్లుల్ని ఆమోదించింది. చర్చకు అవకాశమివ్వకుండా, సంఖ్యాబలంతో కీలకమైన బిల్లులకు క్షణాల్లో ఆమోదముద్ర వేస్తూ పోయింది. ‘ఏ మాత్రం చర్చ లేకుండా దాదాపు 35కి పైగా బిల్లుల్ని పాస్ చేశారు. అనేక బిల్లుల్ని పార్లమెంటరీ సెలక్ట్ కమిటీకైనా పంపకుండానే ఆమోదిస్తున్నార’ని ప్రతిపక్షాల ఆరోపణ, ఆవేదన. సభకు అడ్డుపడి తమ వాదన వినిపించాలనుకోవడం, తామెత్తిన అంశంపై చర్చ జరగాలనడం ప్రతిపక్షాలు ఆది నుంచి చేసేదే. అధికారపక్షం ఎక్కడోచోట సర్దుకొని, అందుకు అంగీకరించడం సంప్రదాయం. కానీ, ఈసారి మోదీ సర్కారు విదేశీ నిఘా సాఫ్ట్వేర్ పెగసస్ వివాదంపై చర్చకు సై అనకుండా, తప్పుకు తిరగడంతో పీటముడి బిగిసింది. సమావేశాలకు ఒక్క రోజు ముందుగా బయటపడ్డ పెగసస్ పైనే చివరి దాకా ప్రతిష్టంభన సాగింది. అదే పట్టుకొని వేలాడిన ప్రతిపక్షాలు ఇతర అంశాలపై చర్చ లేవనెత్తడంలో విఫలమయ్యాయి. మరోపక్క ప్రతిపక్షాల అనుమానాల్ని నివృత్తి చేయాల్సింది పాలకులే. అధికారంలో ఉన్నవారే పెద్దమనసుతో ముందుకు రావడం ఎక్కడైనా మర్యాద, గౌరవం. కానీ, ఆపాటి విశాల హృదయం పాలకపక్షానికి లేకుండా పోయింది. పెగసస్‌పై ఐరోపా దేశాలు కొన్ని విచారణకు ఆదేశించినా, మనవాళ్ళు అందుకు సిద్ధమనలేదు. కేంద్ర ఐటీ మంత్రేమో ఫోన్లను తాము ట్యాప్ చేయలేదన్నారు కానీ, పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను హ్యాకింగ్‌కు వాడారో లేదో చెప్పలేదు. రక్షణ మంత్రేమో లిఖిత పూర్వక ఏకవాక్య సమాధానంలో తమ శాఖ పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనలేదని సరిపెట్టారు. కానీ, దర్యాప్తు సంస్థలు దాన్ని వాడిందీ లేనిదీ సర్కారు సూటిగా జవాబివ్వలేదు. సభలో ప్రతిష్టంభనకు కారణం ప్రతిపక్షాలే అని ప్రచారం చేస్తే చాలనుకుంది. వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి, మాట్లాడలేమంటూ తర్కం లేవదీసింది. ‘కరోనా రెండో వేవ్ మరణాలు స్వతంత్ర భారత ప్రభుత్వాలన్నిటి సమష్టి వైఫల్యం’ అంటూ ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా చేసిన భావోద్వేగభరిత ‘మాఫీనామా’ ప్రసంగమొక్కటే ఈ సమావేశాల్లో అందరినీ కదిలించింది. అధికార, విపక్షాలు రెంటి మధ్య ఒకే ఒక్క అంశంలో అరుదైన ఐక్యత కనిపించింది. అది – సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల (ఎస్ఈబీసీలు – వాడుకలో ఓబీసీలు) జాబితాను రాష్ట్రాలే తయారుచేసుకొనే అధికారాన్ని పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఓటుబ్యాంకు ఓబీసీల విషయంలో రాజకీయ విభేదాలతో సంబంధం లేకుండా పార్టీలన్నీ ఏకతాటిపై నిలిచాయి. అయితే, ఓబీసీల జాబితా రూపకల్పనకు రాష్ట్రాలకున్న అధికారాన్ని 2018లో మోదీ ప్రభుత్వమే తొలగించిందనీ, ఇప్పుడా తప్పు దిద్దుకొనేందుకు తాము సహకరించామనీ విపక్షాల వాదన. ఆ బిల్లు పని కాగానే సర్కారు ఈ సమావేశాలకు సెలవిచ్చేసింది. ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంటులో జరగాల్సింది ప్రజాసమస్యలపై విలువైన చర్చ. ఈ విడత సభలో చర్చలు లేవు. జరిగిందల్లా రచ్చ. దానితోనే చివరకు సమావేశాలు సమాప్తం కావడం విచారకరం. సభలో ఘటనలతో రాత్రి నిద్ర పట్టలేదంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు భావోద్వేగం చూపారు. అధికార – ప్రతిపక్షాల మంకుపట్టు, ఓబీసీ బిల్లు వేళ కూడా సభా నాయకుడు – హోమ్ మంత్రుల గైర్హాజరు, ప్రతిపక్షాల ప్రశ్నలకు కొన్నేళ్ళుగా సభలో జవాబివ్వని పాలకుల తీరు చూస్తుంటే నిజంగానే ప్రజాస్వామ్య వాదులకు కన్నీరొస్తుంది. లోక్‌సభ కొలువుదీరి రెండేళ్ళు దాటినా, ప్రతిపక్షాలకు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోవ డమూ విడ్డూరమనిపిస్తుంది. మూకబలానికే తప్ప, చర్చకు స్థానం లేనివేళ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి రోజులు కావా అన్న అనుమానమొస్తోంది. ఇప్పుడిక దీని మీద చర్చ జరగాల్సిందే! -
విబేధాల పరిష్కారం దిశగా తొలి అడుగు
జెనీవా: అగ్రదేశాలు అమెరికా, రష్యాల అధ్యక్షులు జో బైడెన్, వ్లాదిమిర్ పుతిన్‌ల శిఖరాగ్ర సమావేశం బుధవారం జెనీవా వేదికగా జరిగింది. సుహృద్భావ వాతావరణంలో భేటీ జరిగిందని, తమ ఇద్దరి మధ్య ఎలాంటి విరోధ భావన నెలకొనలేదని పుతిన్ పేర్కొన్నారు. చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయన్నారు. ‘చాలా అంశాల్లో మేం విబేధిస్తాం. అయితే, ఒకరినొకరు అర్థం చేసుకునే, పరస్పరం దగ్గరయ్యే దిశగా ముందడుగు వేశామని భావిస్తున్నా’ అని పుతిన్ పేర్కొన్నారు. ఇరుదేశాల రాయబారులను తమతమ విధుల్లో చేరేందుకు తాను, బైడెన్ అంగీకరించామన్నారు. రెండు దేశాల మద్య విబేధాలను తొలగించేందుకు, అణ్వాయుధ పరిమితిపై ఒప్పందానికి సంబంధించి చర్చలను ప్రారంభించేందుకు అంగీకారం కుదిరిందన్నారు. సైబర్ సెక్యూరిటీపైనా చర్చలు జరపాలని నిర్ణయించారు. ‘చర్చల సమయంలో మా మధ్య ఎలాంటి శత్రు భావం లేదు. అనుకున్న సమయం కన్నా ముందే చర్చలను ముగించాం’ అన్నారు. రెండు గొప్ప శక్తుల మధ్య భేటీగా ఈ సదస్సును చర్చలకు ముందు బైడెన్ అభివర్ణించారు. ముఖాముఖి చర్చలెప్పుడూ మంచిదేనని వ్యాఖ్యానించారు. ఇద్దరు నేతలు అంత సౌకర్యవంతంగా కనిపించలేదు. గత కొన్ని నెలలుగా ఇరువురు నేతల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చర్చలు ముగిసిన అనంతరం ఇరువురు నేతలు వేర్వేరుగా మీడియా సమావేశంలో పాల్గొనడం విశేషం. మొదట పుతిన్, ఆ తరువాత బైడెన్ చర్చల వివరాలను వేర్వేరుగా మీడియాకు తెలిపారు. సైబర్ భద్రత అంశంపై చర్చలు జరపాలని రెండు దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించాయని పుతిన్ వెల్లడించారు. అమెరికాలోని వ్యాపార, ప్రభుత్వ సంస్థల వెబ్‌సైట్స్‌ను రష్యా హ్యాక్ చేస్తోందని యూఎస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను పుతిన్ ఖండించారు. చర్చల సందర్భంగా మానవ హక్కుల అంశాన్ని, ప్రతిపక్ష నేత నేవల్నీ జైలు శిక్ష విషయాన్ని బైడెన్ ప్రస్తావించారని పుతిన్ వెల్లడించారు. -
చర్చలకు రండి; కేంద్ర సర్కారు ఆహ్వానం
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో గత ఐదు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాల నేతలను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. మంగళవారం తమతో చర్చలకు ముందుకు రావాలని కోరింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం రాత్రి ప్రకటించారు. రైతు సంఘాలు పోరాటం ఇక్కడితో ఆపాలని, చర్చలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. వాస్తవానికి డిసెంబర్ 3న రైతు సంఘాల నాయకులతో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం భావించింది. అయితే, ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు నానాటికీ పెరుగుతుండడం, చలి సైతం తీవ్రమవుతుండడంతో రెండు రోజుల ముందే చర్చలు సాగించాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు.. అక్టోబర్ 14, నవంబర్ 13న రైతులతో చర్చించింది. మంగళవారం(డిసెంబర్ 1) మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మూడో దఫా చర్చలు జరగనున్నాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై రైతులు, రైతు సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. సాగు చట్టాలు కరోనా కంటే ప్రమాదం కరోనా›హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా అన్నదాతలు నిరసన సాగిస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. కరోనాతో ముప్పు ఉంటుందన్న విషయం తమకు తెలుసని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ కొత్త వ్యవసాయ చట్టాలు కరోనా కంటే మరింత ప్రమాదకరమని పేర్కొంటున్నారు. ధర్నాలో ఉన్న రైతులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహమ్మారిపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఏడుగురు వైద్యులతో కూడిన బృందం నవంబర్ 28 నుంచి 90 మంది రైతులకు పరీక్షలు చేసింది. వీరిలో ఎవరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదని డాక్టర్లు చెప్పారు. షరతులు పెడితే.. ఢిల్లీని ముట్టడిస్తాం సాక్షి, న్యూఢిల్లీ: చర్చల విషయం లో కేంద్రం ఎలాంటి షరతులు విధించరాదని రైతులు పేర్కొన్నారు. అవసరమైతే ఢిల్లీని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన చలో ఢిల్లీ సోమవారం ఐదో రోజుకు చేరుకుంది. చలిని సైతం లెక్కచేయకుండా సింఘు, టిక్రీ రహదారులపై బైఠాయించి రైతులు నిరసన తెలుపుతున్నారు. రైతుల ఆందోళనకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. యూనియన్ల మద్దతు.. నిరసన తెలుపుతున్న రైతులకు అఖిల భారత వ్యవసాయ కార్మికుల సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్లు (సీఐటీయూ) సంయుక్త కార్యదర్శి విక్రమ్ సింగ్, అధ్యక్షురాలు కె.హేమలత, సీఐటీయూ కార్యదర్శి కరుమలియన్లు మద్దతు తెలిపారు. రైతుల పోరాటాన్ని దేశవ్యాప్తంగా తీవ్రతరం చేయాలని ఏఐఏడబ్ల్యూయూ నిర్ణయించింది. ఈ మేరకు తక్షణ కార్యాచరణ ప్రకటించింది. -
అమెరికాతో ద్వైపాక్షిక బంధం : కీలక చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-అమెరికాల మధ్య రక్షణ, భద్రతా సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సంప్రదింపులు జరిపేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్లు సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారంపైనా వీరు చర్చలు జరపనున్నారు. పాంపియో, ఎస్పర్ మంగళవారం విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సంప్రదింపులు చేపట్టనున్నారు. చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో భారత్-అమెరికా మంత్రుల భేటీలో ఈ అంశంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. పాంపియో, ఎస్పర్ లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తోనూ భేటీ అవుతారు. భారత్‌తో సరిహద్దు ప్రతిష్టంభనతో పాటు, దక్షిణ చైనా సముద్రంలో సైనిక పాటవాలు, హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై బీజింగ్ వైఖరి వంటి పలు అంశాలపై గత కొద్దినెలలుగా అమెరికా చైనా తీరును తప్పుపడుతోంది. ఇక అమెరికన్ మంత్రులతో ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృత చర్చలు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై సంప్రదింపులు సాగుతాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఇప్పటికే స్పష్టం చేశారు. చదవండి : చైనాతోనే అమెరికాకు ముప్పు -
సరిహద్దు వివాదం: ముగిసిన చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో సరిహద్దు ఉద్రిక్తతలను నివారించేందుకు గురువారం ఆరుగంటల పాటు సాగిన ఇరు దేశాల మేజర్ జనరల్ స్ధాయి చర్చలు ముగిశాయి. గాల్వన్ లోయలో సాధారణ స్ధితి నెలకొనేలా చూడటంతో పాటు సరిహద్దుల నుంచి సేనల ఉపసంహరణపై వరుసగా మూడోరోజూ ఇరు దేశాల సీనియర్ సైనికాధికారులు సుదీర్ఘంగా చర్చించారు. గాల్వన్ లోయలో సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణలో కల్నల్ బీ. సంతోష్‌బాబు సహా 20 మంది భారత జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. కాగా గత రెండు రోజులుగా గాల్వన్ లోయలో భారత్-చైనా సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనగా తాజా చర్చల సారాంశం ఇంకా తెలియరాలేదు. మరోవైపు డ్రాగన్ సైన్యంతో జరిగిన ఘర్షణల్లో 20 మంది సైనికులు మరణించడం, మరో 18 మంది జవాన్లకు గాయాలవడం మినహా ఏ ఒక్కరి ఆచూకీ గల్లంతు కాలేదని సైనిక వర్గాలు తెలిపాయి. ఇక చైనా దూకుడు తగ్గించకుంటే దౌత్యం యుద్ధం తప్పదని, ఆ దేశ వస్తువుల బహిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
‘భారత్-చైనా చర్చల్లో కీలక పరిణామం’
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని శాంతియుత పరిష్కారం ద్వారా చక్కదిద్దాలని భారత్, చైనాలు నిర్ణయించాయని ఇరు దేశాల మధ్య జరిగిన సైనికాధికారుల చర్చలపై భారత్ వ్యాఖ్యానించింది. ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దు సమస్యల పరిష్కారానికి ఇరు దేశాలు అంగీకరించాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం పేర్కొంది. భారత్, చైనాల మధ్య జరిగిన సైనికాధికారుల సమావేశాలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దు సమస్యలను ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సామరస్యంగా పరిష్కరించుకునేందుకు అంగీకారం కుదిరిందని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఇండో-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నివారించేందుకు ఇరు దేశాల సైనికాధికారుల మధ్య శనివారం లడఖ్‌లో కీలక సంప్రదింపులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, భారత్- చైనా మధ్య ప్రారంభమైన మిలటరీ స్థాయి చర్చల్లో భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ హాజరుకాగా.. చైనా తరఫున టిబెట్ మిలటరీ కమాండర్ సమావేశంలో పాల్గొన్నారు. ఉద్రిక్తతలకు దారితీసిన గాల్వన్ లోయ, పాంగాంగ్ లేక్, గోగ్రా ప్రాంత సరిహద్దు వివాదాలే ప్రధాన ఎజెండాగా చర్చలు కొనసాగాయని సమాచారం. ఈ క్రమంలో పాంగాంగ్ సరస్సు, గాల్వన్ లోయ నుంచి చైనా బలగాలు వెనుదిరగాలని.. అదే విధంగా అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్మీ శిబిరాలను వెంటనే తొలగించాలని భారత్ స్పష్టం చేసింది. చదవండి : చైనా కట్టడికి అంతర్జాతీయ కూటమి -
లెక్క కుదర్లేదు ఆర్టీసీ చర్చలు విఫలం..
‘అంతా సవ్యంగానే సాగింది. హైకోర్టు చెప్పిన సూచనల ప్రకారమే చర్చల ఎజెండా సిద్ధం చేశాం. కానీ వాటిని చర్చించేందుకు జేఏసీ నేతలు ఇష్టపడలేదు. మొత్తం డిమాండ్లపై చర్చకు పట్టుబట్టారు. అదెలా కుదురుతుంది. ఇదే విషయం అడిగితే తమ వారితో మాట్లాడి వస్తామని వెళ్లి తిరిగి రాలేదు – అధికారులు ఆర్టీసీ చరిత్రలోనే కాదు ట్రేడ్ యూనియన్ చరిత్రలో ఇలాంటి నిర్బంధ చర్చలు ఎన్నడూ చూడలేదు. ఫోన్లు కూడా లాగేసుకుని, పోలీసు పహారా పెట్టి జరిపేవి చర్చలెలా అవుతాయి. యూనియన్ల డిమాండ్లు పక్కన పెట్టి తమ ఎజెండా ప్రకారమే చర్చ జరగాలని అధికారులు చెప్పటం దారుణం – కార్మిక సంఘాల జేఏసీ సాక్షి, హైదరాబాద్ : ఇరవై రెండు రోజుల సమ్మె తర్వాత పట్టువిడుపుల ధోరణి ప్రదర్శిస్తూ ఇటు ప్రభుత్వం చర్చలకు పిలవటం, వెంటనే కార్మిక సంఘాలు స్వాగతించటంతో.. ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ చర్చలు ఇటు జేఏసీ నేతలు, అటు అధికారులు సమావేశ మందిరంలో కూర్చున్న కొద్దిసేపటికే అర్ధంతరంగా ఆగిపోయాయి. ఎవరి పట్టు వారు ప్రదర్శించటంతో చర్చలు విఫలమ య్యాయి. అధికారులది తప్పంటూ కార్మిక సంఘాల జేఏసీ, జేఏసీ తీరు సరికాదంటూ అధికారులు ప్రకటించి నిష్క్రమించారు. మళ్లీ చర్చలకు పిలిస్తే తాము సిద్ధమని జేఏసీ పేర్కొనగా, తాము చర్చల హాలులోనే ఉన్నా మళ్లీ జేఏసీ నేతలు రాలేదని అధికారులు పేర్కొనటం విశేషం. వెరసి మళ్లీ చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. ఆదివారం దీపావళి కావ టం, సోమవారమే కోర్టుకు నివేదించాల్సి ఉండటంతో పరిస్థితి అయో మయంగా మారింది. విఫలం కావాలన్న ఎజెండాతోనే ప్రభుత్వం ఈ తరహా చర్చలకు ప్లాన్ చేసిందని జేఏసీ ఆరోపించింది. సమ్మె యథాతథంగా సాగుతుందని, 30న సకల జనుల సమర భేరీ భారీ స్థాయిలో నిర్వహించే ఏర్పాట్లు సాగుతున్నాయని జేఏసీ నేతలు వెల్లడించారు. ఉదయమే చర్చలపై సమాచారం.. శుక్రవారం సాయంత్రం ఆరుగురు సభ్యుల అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రగతి భవన్లో అధికారులతో సీఎం దాదాపు 5 గంటల పాటు సమీక్షించి చర్చలకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. కానీ అధికారికంగా ప్రకటించలేదు. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వరరావు జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానిస్తూ ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ సంతకంతో ఉన్న లేఖలు అందజేశారు. మధ్యాహ్నం 2 గంటలకు చర్చలుంటాయని, ఎండీ కార్యాలయం ఉన్న ఎర్రంమంజిల్లోని రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ కార్యాలయాన్ని వేదికగా పేర్కొన్నారు. దీనికి జేఏసీ నేతలు సమ్మతించి అఖిలపక్ష నేతలతో భేటీ అయి చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా జేఏసీ నేతలు 16 మంది ఆ కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అప్పటికే పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి ఉన్నారు. గేట్ వద్దనే వారిని ఆపేసి జేఏసీలోని నాలుగు సంఘాల నుంచి ఒక్కొక్కరు చొప్పున నలుగురు మాత్రమే హాజరు కావాలని పేర్లను పిలిచారు. దీంతో కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో–కన్వీనర్లు రాజిరెడ్డి, వీఎస్‌రావు, వాసుదేవరావులు చర్చలకు వెళ్లడంతో మిగతావారు బయటే ఉండిపోయారు. లోపలికి వెళ్లిన వారి ఫోన్లు బయటే డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఇది పద్ధతి కాదని, అవసరమైతే తాము వెలుపల ఉన్న నేతలతో మాట్లాడాల్సి ఉంటుందని, ఫోన్లు అనుమతించాలని కోరినా అధికారులు అంగీకరించలేదు. వాటిని స్విచ్ఛాఫ్ చేసి పెట్టిన తర్వాతే అనుమతించారు. ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ, రవాణా శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియాలు చర్చలకు సిద్ధమయ్యారు. హైకోర్టు సూచించినట్లు 21 అంశాలపై చర్చలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అదెలా సాధ్యమని, అసలు హైకోర్టు 21 అంశాలపైనే చర్చించాలని చెప్పలేదని, జే ఏసీ సూచించిన 26 అంశాలపైన అయినా, కోర్టులో మరో పిటిషన్‌దారు అయిన టీఎంయూ పేర్కొన్న 45 డిమాండ్లపైన అయినా చర్చించాలని జేఏసీ నేతలు కోరారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వు ఆధారంగానే ఈ చర్చలుంటాయని, అన్ని డిమాండ్లపై సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఇదే విషయంలో దాదాపు రెండు గంటలు గడిచాక జేఏసీ నేతలు వెలుపలికి వచ్చారు. మీడియా ప్రతినిధులను కూడా గేట్ వద్దనే పోలీసులు అపేయటంతో, వారు గేట్ వద్దకు వచ్చి చర్చలు మొదలు కాకుండానే అర్ధంతరంగా ఆగిపోయినట్లు వెల్లడించారు. తాము అధికారులు పిలిస్తే ఎప్పుడైనా చర్చలకు వచ్చేందుకు సిద్ధమని, వారి పిలుపు కోసం ఎదురు చూస్తామని చెప్పి నిష్క్రమించారు. వారు వెళ్లిన గంటన్నర తర్వాత చర్చల్లో పాల్గొన్న ఇద్దరు అధికారులు కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడి నిష్క్రమించారు. కోర్టు ఉత్తర్వును వక్రీకరించారు: జేఏసీ నేతలు ‘ప్రభుత్వానికి చర్చలు ఫలించాలన్న ఆలోచన లేదని ఈ చర్చల తంతుతో తేలిపోయింది. చర్చలు విఫలమయ్యేలా సొంత ఎజెండా రూపొందించింది. చర్చల సారాంశాన్ని సోమవారం హైకోర్టుకు నివేదించాల్సి ఉన్నందున, జేఏసీ నేతలే చర్చలను విఫలం చేశారని కోర్టుకు చెప్పే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అసలు కోర్టు ఆదేశించింది వేరు.. ఇక్కడ జరిగింది వేరు. 21 అంశాలపైనే చర్చించాలని కోర్టు చెప్పలేదు. జేఏసీ సూచించిన 26 అంశాలపై చర్చించమని కోరాం. వాటిల్లో మేం, అధికారులు ఏయే విషయాల్లో పట్టువిడుపులతో వ్యవహరిస్తారనేది తర్వాత సంగతి. ముందు చర్చిస్తే తేలిపోతుంది కదా.. దానికి అధికారులు సిద్ధంగా లేరు. వారు 21 అంశాలపైనే చర్చిస్తామని పట్టుపట్టి కూర్చున్నారు. సమ్మెకు పూర్వం జరిగిన చర్చల్లో 16 మందిని అనుమతించారు. ఇప్పుడు వారిని బయటే ఆపారు. ఫోన్లు లాగేసుకున్నారు. దీనిపై మేం మాట్లాడుతుండగానే అధికారులే సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు. వారు మళ్లీ వస్తారని కాసేపు అక్కడే కూర్చుని, సిబ్బందితో టీ తెప్పించుకుని తాగాం. అధికారులు రాకపోవటంతో మేం బయటకొచ్చాం. శత్రు దేశాల మధ్య చర్చలు కూడా ఇంత దారుణంగా ఉండవు. చర్చల తంతు మొత్తం వీడియో రికార్డు చేయించాం. ఆ వీడియోను కోర్టుకు సమర్పించాలని డిమాండ్ చేస్తున్నాం. దాన్ని చూస్తే ఎవరు చర్చలను విఫలం చేశారో తెలుస్తుంది’ మళ్లీ వస్తామని వెళ్లిపోయారు: చర్చల్లో పాల్గొన్న ఐఏఎస్ అధికారులు చర్చలు ఫలవంతమయ్యేలా మేం ప్రయత్నించాం. కానీ జేఏసీ నేతలే సహకరించలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం సాధ్యం కాదని ప్రభుత్వం ఎప్పుడో తేల్చి చెప్పింది. కోర్టుకు కూడా విన్నవించింది. అది మినహాయించి మిగతావాటిల్లోని 21 అంశాలపై చర్చించాలని కోర్టు సూచించింది. ఆ మేరకే 21 అంశాలపై చర్చిద్దామని పేర్కొన్నాం. కానీ అన్ని డిమాండ్లపై చర్చించాలని వారు పట్టుపట్టారు. కాసేపు బయటకు వెళ్లి మాట్లాడుకుని వచ్చారు. మళ్లీ అదే పట్టుపట్టారు. మేం మళ్లీ అదే విషయాన్ని వారికి చెప్పాం. దీంతో తమ వారితో మాట్లాడి వస్తామని చెప్పి వారు వెళ్లిపోయారు. సాయంత్రం ఆరున్నర వరకు వేచి చూశాం. వారు రాలేదు. దీంతో ఇక వారు చర్చల నుంచి నిష్క్రమించినట్లు భావించి మేం కూడా వెలుపలికి వచ్చేశాం. సమావేశంలో ఆర్టీసీ ఈడీలు ఉండాలని ఎక్కడా రూల్ లేదు. ఫోన్లను అనుమతించటానికి వేరే కారణమేమీ లేదు. సమావేశం మధ్యలో ఫోన్లు వస్తుంటే ఇబ్బందిగా ఉంటుందన్న ఉద్దేశంతోనే వాటిని అనుమతించకూడదనుకున్నాం’ మీడియాతో మాట్లాడుతున్న ఆర్టీసీ అధికారులు -
మలేషియా ప్రధానితో మోదీ భేటీ
మాస్కో : ప్రధాని నరేంద్ర మోదీ మలేషియా ప్రధాని మహతిర్ బిన్ మహ్మద్‌తో గురువారం భేటీ అయ్యారు. రష్యాలో తూర్పు ప్రాంత ఆర్థిక ఫోరం (ఈఈఎఫ్) సమావేశాల నేపథ్యంలో ఇరువురు నేతలు సంప్రదింపులు జరిపారు. వ్లాదివొటోక్లో వరుస సమావేశాలు సాగుతున్నాయని, మలేషియా ప్రధానితో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. భారత్, మలేషియా ప్రజలు పరస్పరం లబ్ధి పొందేలా ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. భారత్-రష్యా వార్షిక సదస్సు, ఈఈఎఫ్ సమావేశాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రష్యా చేరుకున్న సంగతి తెలసిందే. వ్లాదివొస్టోక్ విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. -
అన్నదాతకు ఆసరా ఎలా?
రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైనా, ప్రత్యేకించి రైతుల ఆత్మహత్యలపైనా పార్లమెంటులో అరుదుగా చర్చ జరుగుతుంటుంది. కనుక లోక్‌సభలో గురువారం జీరో అవర్‌లో రైతుల ఆత్మ హత్యలు ప్రస్తావనకు రావడాన్ని స్వాగతించాలి. దేశంలో రైతుల స్థితిగతులు దారుణంగా ఉన్నా యని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించినప్పుడు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గత అయిదేళ్లలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. దశాబ్దాలపాటు ఏలిన గత పాలకులే రైతుల ప్రస్తుత దుస్థితికి కారణమని కూడా ఆయన చెప్పారు. ఈ ఆరోపణలు, ప్రత్యా రోపణల సంగతలా ఉంచితే రైతులు చాలా దుర్భర స్థితిలో ఉన్నారని అందరూ గుర్తించాలి. ఈ చర్చ జరగడానికి ముందు రోజు ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఒక రైతు ఆత్మహత్య గురించిన కథనం మీడియాలో వచ్చింది. రైతు తన కుమార్తెను మెడిసిన్ చదివించాలన్న కోరికతో ఆమెను ఒక కోచింగ్ సెంటర్లో చేర్చాలనుకున్నాడు. అందుకోసం తనకున్న కొద్దిపాటి భూమిని తనఖా పెట్టాలనుకున్నాడు. కానీ అప్పటికే అప్పులున్న ఆ భూమిపై అదనంగా రుణం ఇవ్వడానికి వడ్డీవ్యాపారులు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పంటలు దెబ్బతినడం, కుటుంబాల్లో అనారోగ్యం, పిల్లల చదువులు, పెళ్లిళ్లు... ఇలా అనేక కారణాలు రైతుల ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. తాజా ఉదంతంలో పోలీసులు ఆ రైతు మానసిక వ్యధతో ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. బహుశా ప్రభుత్వం కూడా ఆయన మరణం వెనక సాగు సంబంధ కారణాలు లేవని చెప్పే అవకాశం ఉంది. కానీ బుందేల్‌ఖండ్ ప్రాంతంలో గత రెండేళ్లలో 20మంది రైతులు కన్నుమూశారు. పంటలు బాగా పండి, ఆ పంటలకు గిట్టుబాటు ధర లభిస్తే... వీరు కుటుంబ సంబంధమైన బాధ్యతల్ని నెరవేర్చుకోలిగేవారు. అందరిలా జీవనం సాగించేవారు. బలవన్మర ణాలకు పాల్పడే స్థితి ఉండేది కాదు. అందువల్ల రైతుల ఆత్మహత్యలను నమోదు చేయడంలోనూ, ఆ కుటుంబాలను ఆదుకోవడంలోనూ ప్రభుత్వాలు పెద్ద మనసుతో వ్యవహరించాల్సి ఉంటుంది. బ్రిటిష్ వలసపాలన కాలంలో 1830లో పాలకుడిగా ఉన్న లార్డ్ మెట్కాఫ్ బ్రిటన్‌కు ఒక నివేదిక పంపుతూ భారత్‌లో గ్రామాలన్నీ వేటికవి రిపబ్లిక్ల వంటివనీ, అవన్నీ స్వయంపోషకాలనీ అభివర్ణించాడు. ఈ కారణం వల్లనే అన్ని ఒడిదుడుకులనూ ఎదుర్కొని భారత్ మనుగడ సాగించగలుగుతున్నదని చెప్పాడు. అప్పట్లో గ్రామాలకున్న ఈ శక్తిసామర్థ్యాలకు వ్యవసాయం, చేతివృత్తులే ప్రధాన కారణమని వేరే చెప్పనవసరం లేదు. కానీ దురదృష్టవశాత్తూ గత కొన్ని దశాబ్దాలుగా ఈ రెండూ క్రమేపీ దెబ్బతిన్నాయి. ఒకనాడు దేశ మనుగడకూ, దాని ఆత్మవిశ్వాసానికీ వెన్నెముకగా నిలిచిన రైతు ఇప్పుడు తానే ఒత్తిళ్లకు లోనవుతున్నాడు. రేపన్నరోజు గడిచేదెలాగో అర్ధంకాక తనువు చాలిస్తున్నాడు. విత్తనాలు మొదలుకొని అన్నీ సకాలంలో సరైన ధరలకు లభ్యమయ్యేందుకు...దిగుబడులకు గిట్టుబాటు ధర వచ్చేందుకు... దళారుల బెడద తప్పించేం దుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోగలిగితే ఈ రైతు ఆత్మహత్యల్ని నివారించడం సాధ్యమవుతుంది. బహుళజాతి సంస్థ మోన్శాంటో దేశమంతా 450 గ్రాముల బీటీ పత్తి విత్తన ప్యాకెట్‌ను రూ. 1858కి అమ్ముతున్న రోజుల్లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ విషయంలో పట్టుదలగా పోరాడి, చివరకు సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఆ ప్యాకెట్ ధరను రూ. 750కి తగ్గించేలా చేశారు. ఈ విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వ పెద్దల ద్వారా ఆయనకు నచ్చజెప్పించినా వైఎస్ లొంగ లేదు. ఆ ఒరవడిని తర్వాత కాలంలో ఎందరు ముఖ్యమంత్రులు అనుసరించగలిగారు? చాలా సంస్థలు రైతుల నుంచి అతి తక్కువ ధరకు కొన్న విత్తనాలను మళ్లీ వారికే అత్యధిక ధరకు అమ్ముతున్నాయి. నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్న సంస్థలున్నాయి. ఎరువులు, పురుగుమందుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆరుగాలం శ్రమించి అధిక దిగుబడి సాధించినా కనీస మద్దతు ధరకు దిక్కులేదు. వీటన్నిటి సంగతలా ఉంచి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి పంటనష్టం జరిగినప్పుడు సాయం అందించడానికి సవాలక్ష నిబంధనలు అడ్డొస్తాయి. వీటిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడితే కనీసం అలాంటి రైతుల కుటుంబాలను ఆదు కోవాలన్న స్పృహ కూడా పాలకులకు ఉండటం లేదు. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో 2014–19 మధ్య 1,513 మంది రైతులు ప్రాణాలు తీసుకుంటే అంతో ఇంతో ఆర్థిక సాయం దక్కింది కేవలం 391 కుటుంబాలకు మాత్రమే. మిగిలిన కుటుంబాలన్నిటి వివరాలూ సేకరించి అర్హతగల ప్రతి కుటుంబానికీ రూ. 7 లక్షల చొప్పున పరిహారం అందించాలని తాజాగా జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్ భరోసా పథకాన్ని చెప్పినకంటే ముందే ప్రారంభించి వార్షిక సాయం రూ. 12,500 అందించాలని నిర్ణయించారు. ఉచిత పంటలబీమా, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు వంటివి ఏర్పాటుచేశారు. అసెంబ్లీలో గురు వారం చర్చ సందర్భంగా రైతు సంక్షేమానికి తీసుకోబోయే చర్యల్ని వివరించారు. ఇలా సమస్యల్ని సహృదయంతో అర్థం చేసుకుని, మానవీయ కోణంలో ఆలోచించే పాలకులుండటం ఇప్పటి అవసరం. మొన్నటివరకూ కేంద్ర వ్యవసాయమంత్రిగా పనిచేసిన రాధామోహన్ సింగ్ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల మంగళవారం బదులిస్తూ 2015 తర్వాతనుంచి రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలను రాష్ట్రాలేవీ పంపలేదని, అందువల్ల జాతీయ క్రైం రికార్డుల బ్యూరో దగ్గర గణాంకాలు లేవని చెప్పారు. బలవన్మరణాలకు పాల్పడిన రైతులెందరో చెప్పలేని దుస్థితిలో ప్రభుత్వాలున్నప్పుడు వాటినుంచి ఇక ఆశించే దేముంటుంది? ఈ పరిస్థితి మారాలి. పాలకులు చిత్తశుద్ధితో రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.