కార్మిక సంఘాలు, ప్రభుత్వం మధ్య నేడు మళ్లీ చర్చలు
కార్మికుల డిమాండ్లు సర్కారు అంగీకరిస్తే సమ్మె విరమించే అవకాశం!
విలీనం సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీ వేస్తామన్న మంత్రి
ఆర్థిక అంశాల పరిశీలనకు అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో
జీవోలో ఎక్కడా విలీనం ప్రస్తావనే లేని వైనం
కార్మిక సంఘాలను సర్కారు తప్పుదోవ పట్టించిందనే విమర్శలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాలతో రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం జరి పిన చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు బస్‌భవన్‌లో మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తమ డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరిస్తే ఆర్టీసీ యూనియన్లు సమ్మె విరమించే అవకాశం ఉంది. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) ప్రతినిధులతో తొలుత వేర్వేరుగా, తర్వాత రెండు సంఘాలతో ఉమ్మడిగా చర్చలు సాగాయి. ప్రజా రవాణా సమ్మె వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, సమ్మె విరమించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అయితే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ఏకైక డిమాండ్‌తో ఉద్యోగ, కార్మిక సంఘాలతో కూడిన జేఏసీ ఆధ్వర్యంలో తాము సమ్మె చేస్తున్నామని, విరమణపై తమకు తాముగా నిర్ణయం తీసుకోలేమని సంఘాల నేతలు చెప్పారు. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఆర్టీసీ విభజన తర్వాత అస్థిత్వం కోల్పోయే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ‘విలీనంపై నిర్ణయం తీసుకోవడం నా పరిధిలో లేదు. సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేస్తాం. ఎన్‌ఎంయూ, ఈయూ ప్రతినిధులకూ చోటు కల్పిస్తాం’ అని మంత్రి హామీ ఇచ్చారు. కార్మిక సంఘాల మిగతా డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తూ ఆర్థిక మంత్రి, సీఎంతో చర్చించి శుక్రవారం మళ్లీ కార్మిక సంఘాలతో మాట్లాడతానని మంత్రి చెప్పారు. చర్చల్లో ఈయూ అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి పద్మాకర్, ప్రచార కార్యదర్శి ప్రసాదరెడ్డి, సమైక్యాంధ్ర పోరాట కమిటీ కన్వీనర్ దామోదరరావు, ఎన్‌ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మహమూద్, సమైక్యాంధ్ర స్టీరింగ్ కమిటీ నేతలు ప్రసాదరావు, చంద్రయ్య పాల్గొన్నారు.
విలీనం ఊసు లేని జీవో
సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మిక సంఘాలను మభ్యపెట్టేందుకు ప్రభుత్వ వర్గాలు ప్రయత్నించాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని పరిశీలించడానికి అధికారుల కమిటీ ఏర్పాటు చేసినట్లుగా ప్రచారం చేశాయి. వాస్తవానికి ఆర్టీసీకి సంబంధించిన కొన్ని ఆర్థిక అంశాల పరిశీలనకు అధికారుల కమిటీని ఏర్పాటు చేస్తూ రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్థసారథి గురువారం జీవో (నంబర్ 954) జారీ చేశారు. ఆ జీవోలో ఎక్కడా విలీనం అన్న ప్రస్తావనే లేదు. ‘కార్మిక సంఘాలు లేవనెత్తిన కొన్ని ఆర్థిక అంశాల్ని పరిశీలించడానికి కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమిటీలో రవాణాశాఖ ఉప/సంయుక్త/అదనపు కార్యదర్శి, ఆర్టీసీ ఆర్థిక సలహాదారు, కార్మిక సంఘాల ప్రతినిధి సభ్యులుగా నియమితులయ్యారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(పాలన) కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఆర్టీసీ ఎమ్‌డీ అవసరమని భావిస్తే మరికొంత మందిని సభ్యులుగా నియమించడానికి అవకాశం ఉంది. ఈ కమిటీ 100 రోజుల్లో నివేదిక సమర్పించాలి’ అని మాత్రమే జీవోలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కార్మిక సంఘాల్ని ప్రభుత్వం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
విలీనంపై స్పష్టమైన జీవో ఇవ్వాలి
విలీనం సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేస్తామని రవాణా మంత్రి హామీ ఇచ్చినా.. అందుకు భిన్నంగా అస్పష్టమైన జీవో జారీ కావడం పట్ల కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమకు హామీ ఇచ్చిన మేరకు స్పష్టమైన జీవో ఇవ్వాలని ఈయూ అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి, ఎన్‌ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
సంఘాల డిమాండ్లు కొన్ని..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.
సమ్మె కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణించి మొత్తం జీతం చెల్లించాలి. సమ్మె విరమణ జరిగిన వెంటనే రెగ్యులర్ కార్మికులకు రూ.40 వేలు, కాంట్రాక్టు కార్మికులకు రూ.30 వేల చొప్పున అడ్వాన్స్ చెల్లించాలి. సీమాంధ్రలో కార్మికులకు దసరా అడ్వాన్స్ తక్షణం ఇవ్వాలి.
ఆర్టీసీకి మోటారు వాహన పన్ను మినహాయింపు ఇవ్వాలి. డీజిల్ మీద వ్యాట్ విధించకుండా మినహాయించాలి.
ప్రయాణికుల భద్రత దృష్ట్యా కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం తక్షణం రూ.1,000 కోట్ల ఆర్థిక సహాయం చేయాలి. పల్లె వెలుగు బస్సుల నష్టాలను ప్రభుత్వమే భరించాలి.
8% డీఏ మంజూరు చేసి బకాయిల్ని తక్షణం చెల్లిం చాలి. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌కు అవకాశమివ్వాలి.
డీజిల్ ధర పెరిగినప్పుడు చార్జీలు పెంచుకొనే అధికారం ఆర్టీసీకి ఇవ్వాలి.
వేతన పెంపు ప్రక్రియను పూర్తి చేసి, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలి. అప్పటివరకు 40 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలి.
కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలి.
ఆర్టీసీ చర్చలు అసంపూర్ణం
Published Fri, Oct 11 2013 12:50 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
Advertisement
Advertisement