రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైనా, ప్రత్యేకించి రైతుల ఆత్మహత్యలపైనా పార్లమెంటులో అరుదుగా చర్చ జరుగుతుంటుంది. కనుక లోక్‌సభలో గురువారం జీరో అవర్‌లో రైతుల ఆత్మ హత్యలు ప్రస్తావనకు రావడాన్ని స్వాగతించాలి. దేశంలో రైతుల స్థితిగతులు దారుణంగా ఉన్నా యని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించినప్పుడు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గత అయిదేళ్లలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. దశాబ్దాలపాటు ఏలిన గత పాలకులే రైతుల ప్రస్తుత దుస్థితికి కారణమని కూడా ఆయన చెప్పారు. ఈ ఆరోపణలు, ప్రత్యా రోపణల సంగతలా ఉంచితే రైతులు చాలా దుర్భర స్థితిలో ఉన్నారని అందరూ గుర్తించాలి. ఈ చర్చ జరగడానికి ముందు రోజు ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఒక రైతు ఆత్మహత్య గురించిన కథనం మీడియాలో వచ్చింది.
రైతు తన కుమార్తెను మెడిసిన్ చదివించాలన్న కోరికతో ఆమెను ఒక కోచింగ్ సెంటర్‌లో చేర్చాలనుకున్నాడు. అందుకోసం తనకున్న కొద్దిపాటి భూమిని తనఖా పెట్టాలనుకున్నాడు. కానీ అప్పటికే అప్పులున్న ఆ భూమిపై అదనంగా రుణం ఇవ్వడానికి వడ్డీవ్యాపారులు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పంటలు దెబ్బతినడం, కుటుంబాల్లో అనారోగ్యం, పిల్లల చదువులు, పెళ్లిళ్లు... ఇలా అనేక కారణాలు రైతుల ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. తాజా ఉదంతంలో పోలీసులు ఆ రైతు మానసిక వ్యధతో ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. బహుశా ప్రభుత్వం కూడా ఆయన మరణం వెనక సాగు సంబంధ కారణాలు లేవని చెప్పే అవకాశం ఉంది. కానీ బుందేల్‌ఖండ్ ప్రాంతంలో గత రెండేళ్లలో 20మంది రైతులు కన్నుమూశారు. పంటలు బాగా పండి, ఆ పంటలకు గిట్టుబాటు ధర లభిస్తే... వీరు కుటుంబ సంబంధమైన బాధ్యతల్ని నెరవేర్చుకోలిగేవారు. అందరిలా జీవనం సాగించేవారు. బలవన్మర ణాలకు పాల్పడే స్థితి ఉండేది కాదు. అందువల్ల రైతుల ఆత్మహత్యలను నమోదు చేయడంలోనూ, ఆ కుటుంబాలను ఆదుకోవడంలోనూ ప్రభుత్వాలు పెద్ద మనసుతో వ్యవహరించాల్సి ఉంటుంది.
బ్రిటిష్ వలసపాలన కాలంలో 1830లో పాలకుడిగా ఉన్న లార్డ్ మెట్‌కాఫ్ బ్రిటన్‌కు ఒక నివేదిక పంపుతూ భారత్‌లో గ్రామాలన్నీ వేటికవి రిపబ్లిక్‌ల వంటివనీ, అవన్నీ స్వయంపోషకాలనీ అభివర్ణించాడు. ఈ కారణం వల్లనే అన్ని ఒడిదుడుకులనూ ఎదుర్కొని భారత్ మనుగడ సాగించగలుగుతున్నదని చెప్పాడు. అప్పట్లో గ్రామాలకున్న ఈ శక్తిసామర్థ్యాలకు వ్యవసాయం, చేతివృత్తులే ప్రధాన కారణమని వేరే చెప్పనవసరం లేదు. కానీ దురదృష్టవశాత్తూ గత కొన్ని దశాబ్దాలుగా ఈ రెండూ క్రమేపీ దెబ్బతిన్నాయి. ఒకనాడు దేశ మనుగడకూ, దాని ఆత్మవిశ్వాసానికీ వెన్నెముకగా నిలిచిన రైతు ఇప్పుడు తానే ఒత్తిళ్లకు లోనవుతున్నాడు. రేపన్నరోజు గడిచేదెలాగో అర్ధంకాక తనువు చాలిస్తున్నాడు. విత్తనాలు మొదలుకొని అన్నీ సకాలంలో సరైన ధరలకు లభ్యమయ్యేందుకు...దిగుబడులకు గిట్టుబాటు ధర వచ్చేందుకు... దళారుల బెడద తప్పించేం దుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోగలిగితే ఈ రైతు ఆత్మహత్యల్ని నివారించడం సాధ్యమవుతుంది.
బహుళజాతి సంస్థ మోన్‌శాంటో దేశమంతా 450 గ్రాముల బీటీ పత్తి విత్తన ప్యాకెట్‌ను రూ. 1858కి అమ్ముతున్న రోజుల్లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ విషయంలో పట్టుదలగా పోరాడి, చివరకు సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఆ ప్యాకెట్ ధరను రూ. 750కి తగ్గించేలా చేశారు. ఈ విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వ పెద్దల ద్వారా ఆయనకు నచ్చజెప్పించినా వైఎస్ లొంగ లేదు. ఆ ఒరవడిని తర్వాత కాలంలో ఎందరు ముఖ్యమంత్రులు అనుసరించగలిగారు?
చాలా సంస్థలు రైతుల నుంచి అతి తక్కువ ధరకు కొన్న విత్తనాలను మళ్లీ వారికే అత్యధిక ధరకు అమ్ముతున్నాయి. నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్న సంస్థలున్నాయి. ఎరువులు, పురుగుమందుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆరుగాలం శ్రమించి అధిక దిగుబడి సాధించినా కనీస మద్దతు ధరకు దిక్కులేదు. వీటన్నిటి సంగతలా ఉంచి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి పంటనష్టం జరిగినప్పుడు సాయం అందించడానికి సవాలక్ష నిబంధనలు అడ్డొస్తాయి. వీటిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడితే కనీసం అలాంటి రైతుల కుటుంబాలను ఆదు కోవాలన్న స్పృహ కూడా పాలకులకు ఉండటం లేదు. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో 2014–19 మధ్య 1,513 మంది రైతులు ప్రాణాలు తీసుకుంటే అంతో ఇంతో ఆర్థిక సాయం దక్కింది కేవలం 391 కుటుంబాలకు మాత్రమే.
మిగిలిన కుటుంబాలన్నిటి వివరాలూ సేకరించి అర్హతగల ప్రతి కుటుంబానికీ రూ. 7 లక్షల చొప్పున పరిహారం అందించాలని తాజాగా జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్ భరోసా పథకాన్ని చెప్పినకంటే ముందే ప్రారంభించి వార్షిక సాయం రూ. 12,500 అందించాలని నిర్ణయించారు. ఉచిత పంటలబీమా, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు వంటివి ఏర్పాటుచేశారు. అసెంబ్లీలో గురు వారం చర్చ సందర్భంగా రైతు సంక్షేమానికి తీసుకోబోయే చర్యల్ని వివరించారు. ఇలా సమస్యల్ని సహృదయంతో అర్థం చేసుకుని, మానవీయ కోణంలో ఆలోచించే పాలకులుండటం ఇప్పటి అవసరం.
మొన్నటివరకూ కేంద్ర వ్యవసాయమంత్రిగా పనిచేసిన రాధామోహన్ సింగ్ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల మంగళవారం బదులిస్తూ 2015 తర్వాతనుంచి రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలను రాష్ట్రాలేవీ పంపలేదని, అందువల్ల జాతీయ క్రైం రికార్డుల బ్యూరో దగ్గర గణాంకాలు లేవని చెప్పారు. బలవన్మరణాలకు పాల్పడిన రైతులెందరో చెప్పలేని దుస్థితిలో ప్రభుత్వాలున్నప్పుడు వాటినుంచి ఇక ఆశించే దేముంటుంది? ఈ పరిస్థితి మారాలి. పాలకులు చిత్తశుద్ధితో రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment