
వచ్చే నెల 19న మరో భేటీ: శివరాజ్‌సింగ్ చౌహాన్
చండీగఢ్: రైతు సంఘాల నేతలతో సుహృద్భావ వాతవరణంలో చర్చలు జరిగాయని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ చౌహాన్ చెప్పారు. తదుపరి సమావేశం మార్చి 19న జరగబోతోందని అన్నారు. రైతాంగం సమస్యలపై రైతుల సంఘాల నాయకులు, కేంద్ర బృందం మధ్య శనివారం చండీగఢ్‌లో చర్చలు జరిగాయి. కేంద్ర బృందానికి చౌహాన్ నేతృత్వం వహించారు.
కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషీ, పీయూష్ గోయల్ సైతం పాల్గొన్నారు. దాదాపు మూడు గంటలపాటు చర్చలు కొనసాగాయి. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు నాయకులు పట్టుబట్టారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించేదాకా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు తేల్చిచెప్పినట్లు సమాచారం. రైతుల తరఫున జగ్జీత్ సింగ్ దలేవాల్, సర్వాన్‌సింగ్ హాజరయ్యారు.