కేంద్ర ప్రభుత్వానికీ విషయం తెలిసేలా చేయండి
నిరశన దీక్ష చేస్తున్న రైతు నేత దలేవాల్ సందేశం
చండీగఢ్: పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కు చట్టబద్ధత కేవలం పంజాబ్‌కే కాదు, దేశంలోని రైతులందరికీ అవసరమేనని నిరాహార దీక్ష చేస్తున్న పంజాబ్ రైతు నేత జగ్జీత్ సింగ్ దలేవాల్(70) పేర్కొన్నారు. ఈ విషయం కేంద్రానికి తెలిసేలా చేయాలన్నారు. ఈ పోరాటంలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల రైతులు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద దలేవాల్ చేపట్టిన దీక్షకు శనివారంతో 40 రోజులు పూర్తయ్యాయి.
దీన్ని పురస్కరించుకుని ఖనౌరీలో ఏర్పాటైన ‘కిసాన్ మహాపంచాయత్’నుద్దేశించి దలేవాల్ మాట్లాడారు. కార్యక్రం వేదికపైకి దలేవాల్‌ను స్ట్రెచర్‌పై తీసుకువచ్చారు. బెడ్‌పై పడుకుని సుమారు 11 నిమిషాలపాటు మాట్లాడారు. ‘ఎంఎస్‌పీ పంజాబ్ రైతులకు మాత్రమే దేశమంతటికీ అవసరమే. ఎంఎస్‌పీకి గ్యారెంటీ సహా మనం చేస్తున్న డిమాండ్లు సాధారణమైనవి కావన్న విషయం నాకు తెలుసు. వీటిని సాధించుకోవడం ఏ ఒక్కరి వల్లో అయ్యే పనికాదు కూడా. ఇప్పటి ఆందోళనల్లో రెండు రైతు సంఘాలు మాత్రమే పాలుపంచుకుంటున్నాయి. పంజాబ్ ఈ పోరాటాన్ని ముందుండి నడిపిస్తోంది.
ఇతర రాష్ట్రాల రైతులు కూడా ఈ పోరులో పాల్గొనాలి. ఇది కేవలం పంజాబ్ డిమాండ్ మాత్రమే కాదు, యావద్దేశానిది. అనే సందేశాన్ని కేంద్రానికి వినిపించేలా చేయాలని చేతులు జోడించి వేడుకుంటున్నా’అని ఆయన పేర్కొన్నారు. ‘మనం గెలుస్తామనే విశ్వాసం నాకుంది. బల ప్రయోగం చేసేందుకు ప్రభుత్వం ప్రయతి్నంచినా మనల్ని మాత్రం ఓడించలేదు. నాకేమైనా పట్టించుకోను. మళ్లీ రైతులు ఆత్మహత్యలకు పాల్పడే అవసరం రాకూడదనే నా ప్రయత్నమంతా’అని వివరించారు. ‘దలేవాల్ ప్రాణాలు ముఖ్యమని సుప్రీంకోర్టు అంటోంది. నేనూ మనిషిని సరే, దేశవ్యాప్తంగా బలవన్మరణాలకు పాల్పడిన 7 లక్షల మంది సంగతేమిటని గౌరవ సుప్రీంకోర్టును అడుగుతున్నా’అని దలేవాల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment