సాగు గిట్టుబాటు కావడం లేదంటూ రైతన్న మరోసారి కన్నెర్రజేశాడు. డిమాండ్ల సాధనకు రాజధాని బాట పట్టాడు. దాంతో రెండు రోజులుగా ఢిల్లీ శివార్లలో యుద్ధ వాతావరణం నెలకొంది. అవసరమైతే మరోసారి నెలల తరబడి ఆందోళనలు కొనసాగించేందుకే రైతులు సిద్ధమవుతున్నారు.
పంజాబ్, హరియాణాతో పాటు ఉత్తర యూపీకి చెందిన రైతులు భారీ సంఖ్యలో నిరసనల్లో పాల్గొంంటున్నారు. అన్ని పంటలకూ కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రకటించడంతో పాటు దానికి చట్టబద్ధత కల్పించాలన్నది వారి ప్రధాన డిమాండ్. దాంతోపాటు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుకు కూడా రైతులు పట్టుబడుతున్నారు. ఇంతకీ ఏమిటీ ఎంఎస్‌పీ? రైతు సంక్షేమానికి స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులేమిటి...?
ఎంఎస్‌పీ కీలకం..
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడంలో కనీస మద్దతు ధర (మినిమం సపోర్ట్ ప్రైస్–ఎంఎస్‌పీ)ది కీలక పాత్ర.
► రైతుల నుంచి పంటను సేకరించేందుకు ప్రభుత్వం చెల్లించే కనీస ధరే ఎంఎస్‌పీ.
► ఇది వారికి మార్కెట్ ఒడిదొడుకుల బారినుంచి రక్షణతో పాటు స్థిరత్వాన్ని, ఆదాయ భద్రతను కల్పిస్తుంది.
► దీన్ని కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (సీఏసీపీ) నిర్ణయిస్తుంటుంది. ఈ విషయంలో ఉత్పత్తి వ్యయం, మార్కెట్ ధోరణులు, డిమాండ్–సరఫరా తదితరాలను పరిగణనలోకి తీసుకుంటుని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి ఎంఎస్‌పీపై సిఫార్సులు చేస్తుంది. వాటి ఆధారంగా సీసీఈఏ తుది నిర్ణయం తీసుకుంటుంది. సీఏసీపీ 1965లో ఏర్పాటైంది.
ఇలా లెక్కిస్తారు...
ఎంఎస్‌పీ లెక్కింపు సంక్లిష్టమైన ప్రక్రియ. ఇందుకోసం రైతులకయ్యే ప్రత్యక్ష, పరోక్ష ఉత్పత్తి వ్యయాలు రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటారు.
► ఎరువులు, విత్తనాలు, కూలీల వంటివి ప్రత్యక్ష వ్యయం కాగా రైతు సొంత కుటుంబం పడే కష్టం, అద్దెలు తదితరాలు పరోక్ష వ్యయం.
► వీటిని స్థూలంగా ఏ2, ఎఫ్‌ఎల్, సీ2గా వర్గీకరిస్తారు.
► పంట ఎదుగుదల, ఉత్పత్తి, నిర్వహణ నిమిత్తం చేసే ఎరువులు, విత్తనాలు, కూలీల వ్యయం ఏ2 కిందకు వస్తుంది.
► ఈ అసలు ఖర్చులకు కుటుంబ కష్టం తదితర
పరోక్ష ఉత్పత్తి వ్యయాన్ని కలిపితే ఎఫ్‌ఎల్.
► ఏ2, ఎఫ్‌ఎల్ రెండింటికీ మూలధన ఆస్తులు, రైతు చెల్లించే అద్దెలను కలిపితే వచ్చేదే సీ2.
► వీటికి తోడు పలు ఇతర అంశాలను కూడా సీఏసీఊ పరిగణలోకి తీసుకుంటుంది. ఉదాహరణకు సాగు వ్యయం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. ప్రతి క్వింటా పంట దిగుబడికి అయ్యే వ్యయమూ అంతే. అలాగే మార్కెట్ ధరలు, వాటి ఒడిదొడుకులు, కూలీల వ్యయం తదితరాలు కూడా ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. వీటన్నింటితో పాటు సదరు పంట ఎగుమతులు, దిగుమతులు, మొత్తం నిల్వలు, డిమాండ్, తలసరి వినియోగం, ప్రాసెసింగ్ పరిశ్రమ ధోరణులు తదితరాలన్నింటినీ ఎంఎస్‌పీ లెక్కింపు కోసం సీఏసీపీ పరిగణనలోకి తీసుకుంటుంది.
స్వామినాథన్ సిఫార్సులు...
► అన్ని పంటలకూ ఎంఎస్‌పీ హామీ ఇస్తూ చట్టం తేవాలి. ఎంఎస్‌పీ మొత్తం పంట సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతం ఎక్కువగా ఉండాలి (దీన్ని సీ2+50 పద్ధతిగా పిలుస్తారు).
► రైతు ఆత్మహత్యలను అరికట్టేలా భూమి, నీరు, సేంద్రియ వనరులు, రుణం, బీమా, టెక్నాలజీ, పరిజ్ఞానం, మార్కెట్ల వంటి మౌలిక సదుపాయాలు వారందరికీ అందుబాటులో తేవాలి.
► రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలి.
► రైతు, వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధం ద్వారా మెరుగైన ధర కలి్పంచాలి.
► వ్యవసాయోత్పత్తుల సేకరణ, ప్యాకేజింగ్, బ్రాండింగ్ స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రమాణాలకు తగ్గట్టు ఉండాలి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment