చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దు ల్లో ఖనౌరి వద్ద బుధవారం చోటుచేసుకున్న రైతు మరణంపై హరియాణా ముఖ్యమంత్రి, హోం మంత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రైతు మృతికి సంతాపం ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా శుక్రవారం ‘బ్లాక్ డే’ గా పాటించాలని రైతులను కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హరియాణా సీఎం ఖట్టర్, రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు తెలిపింది.
ఈ నెల 26వ తేదీన రైతులంతా తమ ట్రాక్టర్లతో జాతీయ రహదారులను దిగ్బంధించాలని పిలుపునిచ్చింది. అదేవిధంగా, మార్చి 14వ తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో మహాపంచాయత్‌లో చేపట్టనున్నట్లు తెలిపింది. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా(కేఎంఎం)లు కలిసి చేపట్టగా ఎస్‌కేఎం మద్దతు మాత్రమే ఇస్తోంది. 2020–21లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా పోరాడిన ఎస్‌కేఎం నేతలెవరూ ‘ఢిల్లీ చలో’లో పాలుపంచుకోవడం లేదు.
గురువారం ఎస్‌కేఎం నేతలు చండీగఢ్‌లో సమావేశమై సరిహద్దుల్లోని శంభు, ఖనౌరిల వద్ద నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఎస్‌కేఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, జోగీందర్ సింగ్ ఉగ్రహాన్, రాకేశ్ తికాయత్, దర్శన్‌పాల్ మీడియాతో మాట్లాడారు. ఖనౌరి వద్ద బుధవారం జరిగిన ఆందోళనల్లో శుభ్‌కరణ్ సింగ్ అనే రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం ఖట్టర్, మంత్రి విజ్‌లపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
వారిద్దరూ వెంటనే పదవులకు రాజీనామా చేయాలన్నారు. మృతుడి కుటుంబానికి పరిహారంగా రూ.కోటి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అతడికున్న రూ.14 లక్షల రుణాలను మాఫీ చేయాలన్నారు. ఈ నెల 26వ తేదీన ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) దిష్టిబొమ్మను కూడా దహనం చేస్తామన్నారు. ఎస్‌కేఎం(రాజకీయేతర)ను కూడా కలుపుకుని పోయేందుకు చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment