శంభు సరిహద్దు వద్ద భద్రతా బలగాలతో ఘర్షణకు దిగిన రైతులు
చండీగఢ్: డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ ఉద్రిక్తతలు వరుసగా రెండో రోజు బుధవారం సైతం కొనసాగాయి. ఢిల్లీకి చేరుకోకుండా రైతులను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు. పంజాబ్–హరియాణా శంభు సరిహద్దులో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఇక్కడికి చేరుకున్న వేలాది మంది రైతులు రాత్రంతా ట్రాక్టర్లపైనే ఉండిపోయారు.
బుధవారం ఉదయం రక్షణ వలయాన్ని ఛేదించుకొని, ఢిల్లీవైపు వెళ్లేందుకు ప్రయతి్నంచారు. రోడ్లపై బారీకేడ్లు ఏర్పాటు చేసి, తమను అడ్డుకున్న పోలీసులపై నిరసనకారులు ఆగ్రహావేశాలతో రాళ్లు విసిరారు. అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టడానికి డ్రోన్లతో బాష్ప వాయువు గోళాలు ప్రయోగించారు. ఇలాంటి ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. శంభు బోర్డర్‌లో రోజంతా యుద్ధ వాతావరణం కనిపించింది. పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. హరియాణా ప్రభుత్వం రాష్ట్రంలో పలు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.
పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీకి చేరుకొని తమ గళం వినిపించడం తథ్యమని, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రైతులు తేలి్చచెప్పారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న తమ డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదని, ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని రైతు సంఘం నేత జగజీత్ సింగ్ దలీవాల్ చెప్పారు. మరోవైపు, ఢిల్లీ సరిహద్దుల్లోనూ బుధవారం ఉద్రిక్తత కొనసాగింది. రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
డ్రోన్లను కూల్చడానికి పతంగులు
శంభు బోర్డర్ వద్ద పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను నేల కూల్చడానికి కొందరు యువ రైతులు వినూత్న ప్రయత్నం చేశారు. పతంగులు ఎగురవేశారు. పతంగుల దారాలతో డ్రోన్లను బంధించి, కూల్చివేయాలన్నదే వారి ఆలోచన. డ్రోన్లతో నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శంభు సరిహద్దులో హరియాణా పోలీసులు డ్రోన్లు ప్రయోగించడం పట్ల పంజాబ్ పోలీసులు అభ్యంతరం తెలిపారు. తమ రాష్ట్ర భూభాగంలోకి డ్రోన్లను పంపొద్దని స్పష్టం చేశారు. తమ ఆందోళన కొనసాగిస్తామని, గురువారం పంజాబ్‌లో పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపై బైఠాయిస్తామని రైతు సంఘాల నాయకులు చెప్పారు.
నేడు మూడో దశ చర్చలు!
రైతుల డిమాండ్ల విషయంలో రైతు సంఘాలతో నిర్మాణాత్మక చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా బుధవారం చెప్పారు. చర్చలకు సానుకూల వాతావరణం కలి్పంచాలని, నిరసన కార్యక్రమాలు విరమించాలని రైతులకు సూచించారు. అసాంఘీక శక్తుల వలలో చిక్కుకోవద్దని చెప్పారు. కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య ఇటీవల జరిగిన రెండు దశల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. చర్చలకు ఇరుపక్షాలు సముఖంగా ఉన్నాయి. మూడో దశ చర్చలు గురువారం మధ్యాహ్నం చండీగఢ్‌లో జరుగనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment