దలేవాల్ దీక్షను భగ్నం చేయమనడం లేదు
ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించాలని చెబుతున్నాం
పంజాబ్ ప్రభుత్వ అధికారుల తీరుపై న్యాయస్థానం ఆగ్రహం
న్యూఢిల్లీ: నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పంజాబ్ రైతు సంఘం నాయకుడు జగ్జీత్‌సింగ్ దలేవాల్ ఆరోగ్య పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని పంజాబ్ ప్రభుత్వంపై మండిపడింది. పైగా సుప్రీంకోర్టు వల్లే దలేవాల్ దీక్ష కొనసాగిస్తున్నారంటూ పంజాబ్ ప్రభుత్వ అధికారులు, కొందరు రైతు సంఘాల నాయకులు మీడియాలో తప్పుడు ప్రచారానికి పూనుకుంటున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది.
దలేవాల్ దీక్షను భగ్నం చేయాలని తాము చెప్పడం లేదని, ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించాలని మాత్రమే సూచిస్తున్నామని వెల్లడించింది. దలేవాల్ గత ఏడాది నవంబర్ 26న దీక్ష ప్రారంభించారు. గురువారం నాటికి 38వ రోజుకు చేరుకుంది. ఆయనకు వైద్య చికిత్స అందించాలని సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాలను పంజాబ్ ప్రభుత్వ అధికారులు లెక్కచేయడం లేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల∙ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
అలాగే రైతుల ఉద్యమంలో కోర్టు జోక్యం చేసుకోవాలని, కేంద్రానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దలేవాల్ దాఖలు చేసిన తాజా పిటిషన్‌నూ విచారించింది. ‘‘పంజాబ్ ప్రభుత్వ అధికారులు, కొందరు రైతు సంఘాల నేతలు మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. దలేవాల్ దీక్షను భగ్నం చేయడానికి సుప్రీంకోర్టు ప్రయతి్నస్తోందని, అందుకు ఆయన ఒప్పుకోవడం లేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలి్పస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తున్నారు. దలేవాల్ పట్ల రైతు సంఘాల నాయకుల వ్యవహారాల శైలి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన దీక్షను భగ్నం చేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని మేము ఏనాడూ ఆదేశించలేదు.
దలేవాల్ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఆసుపత్రి తరించాలని మాత్రమే చెబుతున్నాం. ఆసుపత్రిలో ఆయన దీక్ష కొనసాగించుకోవచ్చు. దలేవాల్ ఆరోగ్యంపై మేము ఆందోళన చెందుతున్నాం. ఆయన రాజకీయ సిద్ధాంతాలకు సంబంధం లేదని నాయకుడు. కేవలం రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్నారు. రైతు నాయకుడిగా దలేవాల్ ప్రాణం ఎంతో విలువైంది. ఆసుపత్రిలో చికిత్స పొందేలా దలేవాల్‌ను ఒప్పించడానికి పంజాబ్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. మంత్రులు గానీ, అధికారులు గానీ ఒక్కసారైనా దీక్షా శిబిరానికి వెళ్లారా? రైతు సంఘాలతో సఖ్యత కుదుర్చుకోవాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు’’ అని ధర్మాసనం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment