చండీగఢ్: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత తదితర డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రుల కమిటీ చేసిన తాజా ప్రతిపాదనలను కూడా రైతు సంఘాల నేతలు తిరస్కరించారు.
అవి రైతులకు మేలు చేసేవి కాదని నేతలు జగ్‌జీత్‌సింగ్ దల్లేవాల్, శర్వాన్‌సింగ్ పంథేర్ తదితరులు సోమవారం కుండబద్దలు కొట్టారు. ప్రతిపాదనలపై సంఘాలన్నీ చర్చించుకున్న మీదట ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. తమ ‘ఢిల్లీ చలో’ ఆందోళన బుధవారం ఉదయం 11 నుంచి శాంతియుతంగా కొనసాగుతుందని ప్రకటించారు. దాంతో సమస్య మొదటికొచ్చింది.
రైతు సంఘాలతో ఆదివారం సాయంత్రం మొదలైన కేంద్ర మంత్రుల కమిటీ నాలుగో దశ చర్చలు అర్ధరాత్రి తర్వాత ముగిశాయి. చర్చల్లో మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. ‘ఐదేళ్ల ఒప్పంద’ ప్రతిపాదనను మంత్రులు తెరపైకి తెచ్చారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న రైతుల నుంచి పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పారు.
ఆ పంటలకు ఐదేళ్లపాటు ఎంఎస్‌పీ చెల్లింపుకు సుముఖత వ్యక్తం చేశారు. వారి నుంచి ఎంత పంటనైనా కొనుగోలు చేస్తామన్నారు. ఇది వినూత్నమైన ఆలోచన అని అనంతరం గోయల్ మీడియాతో చెప్పారు. ‘‘ఐదేళ్లపాటు ఎంఎస్‌పీకి ఆయా పంటల కొనుగోలుకు ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్ వంటి ప్రభుత్వ రంగ సహకార సంఘాలు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి.
ఇందుకు ఒక పోర్టల్ అభివృద్ధి చేస్తాం’’ అని చెప్పారు. కనీస మద్దతు ధరకు ఇప్పటికిప్పుడు చట్టబద్ధత అసాధ్యమని తేల్చిప్పారు. ఈ ప్రతిపాదనపై రైతులు, నిపుణులతో చర్చించి రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని పంథేర్ సోమవారం ఉదయం చెప్పారు. అప్పటిదాకా ‘ఢిల్లీ చలో’ కార్యక్రమాన్ని నిలిపేస్తున్నామన్నారు. కానీ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నామంటూ రైతు నేతల నుంచి రాత్రికల్లా ప్రకటన వెలువడింది.
Comments
Please login to add a commentAdd a comment