Chalo Delhi movement
-
Farmers movement, Delhi Chalo: కేసు నమోదయ్యాకే అంత్యక్రియలు
చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద బుధవారం ‘ఢిల్లీ చలో’ఆందోళనల్లో పాల్గొన్న రైతులు హరియాణా పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో శుభ్‌కరణ్‌సింగ్(21) అనే యువ రైతు గాయాలతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. శుక్రవారం ఖనౌరీ వద్ద కొనసాగుతున్న ఆందోళనలో పలువురు రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. శుభ్‌కరణ్ మృతికి బాధ్యులైన వారిపై పంజాబ్ ప్రభుత్వం కేసు నమోదు చేసే వరకు అంత్యక్రియలు జరిపేది లేదని నేతలు తేల్చి చెప్పారు. శుభ్‌కరణ్‌ను అమరుడిగా ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్ మేరకు శుభ్‌కరణ్ కుటుంబానికి రూ.కోటి పరిహారంతోపాటు అతడి సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ పంజాబ్ సీఎం మాన్ ప్రకటించారు. రైతు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయని కూడా సీఎం స్పష్టం చేశారు. అనంతరం రైతు నేత సర్వాన్ సింగ్ పంథేర్ మీడియాతో మాట్లాడారు. ‘మాక్కావాల్సింది డబ్బు కాదు. మృతికి బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే మాకు ముఖ్యం. ఆ తర్వాతే అంత్యక్రియలు జరుపుతాం. ఇందుకు అవసరమైతే 10 రోజులైనా సరే వేచి ఉంటామని శుభ్‌కరణ్ కుటుంబసభ్యులు మాకు చెప్పారు’అని వివరించారు. రైతులపైకి టియర్ గ్యాస్.. హిసార్: హరియాణా పోలీసులతో శుక్రవారం మరోసారి రైతులు తలపడ్డారు. ఖనౌరీ వద్ద నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఖేరి చోప్తా గ్రామ రైతులను పోలీసులు అడ్డగించారు. కొందరు రైతులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొందరు రైతులతోపాటు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు వారిపైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. కొందరు రైతులను అదుపులోకి తీసుకున్నారు. గుండెపోటుతో మరో రైతు మృతి పంజాబ్–హరియాణా సరిహద్దుల్లో ఆందోళనల్లో పాల్గొంటున్న దర్శన్ సింగ్(62) అనే రైతు గుండెపోటుతో చనిపోయినట్లు రైతు సంఘం నేతలు చెప్పారు. మరోవైపు ఆందోళనలకు సారథ్యం వహిస్తున్న రైతు సంఘాల నేతలు శుక్రవారం పలు అంశాలపై చర్చించారు. తదుపరి కార్యాచరణను 29న ప్రకటిస్తామని మీడియాకు తెలిపారు. శనివా రం కొవ్వొత్తులతో ర్యాలీ చేపడతామ న్నారు. పంజాబ్‌వ్యాప్తంగా బ్లాక్ డే అమృత్సర్: రైతులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ పంజాబ్ అంతటా రైతులు బ్లాక్ డే పాటించారు. శుభ్‌కరణ్ మృతిని నిరసిస్తూ అమృత్సర్, లూధియానా, హోషియార్పూర్ సహా 17 జిల్లాల్లో నిరసనలు చేపట్టినట్లు రైతు సంఘాలు వెల్లడించాయి. -
దద్దరిల్లిన సరిహద్దులు
చండీగఢ్: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, వ్యవసాయ రుణాల రద్దుతో సహా ఇతర డిమాండ్లపై రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. రెండు రోజుల విరామం తర్వాత బుధవారం నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా తమ పోరాటం ఆగదని తేలి్చచెప్పారు. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణలతో పంజాబ్–హరియాణా సరిహద్దులోని శంభు, ఖనౌరీ బోర్డర్ పాయింట్లు దద్దరిల్లిపోయాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో ట్రాక్టర్ ట్రాలీలు, మినీ వ్యాన్లు, జేసీబీలపై నిరసనకారులు తరలివచ్చారు. సరిహద్దుల్లో వేలాది మంది గుమికూడారు. రక్షణ వలయాన్ని ఛేదించుకొని ముందుకు దూసుకెళ్లడానికి ప్రయతి్నంచారు. వాహనాలతో బారీకేడ్లను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని పోలీసులు అనుమానించారు. నిరసనకారులను చెదరగొట్టడానికి హరియాణా పోలీసులు డ్రోన్‌తో బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. శంభు బోర్డర్ పాయింట్ వద్ద బుధవారం మూడుసార్లు బాష్పవాయువు ప్రయోగం చోటుచేసుకుంది. డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెంచారు. ఖనౌరీలోనూ రైతుల ఆందోళన కొనసాగింది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఢిల్లీ వెళ్లడానికి తమను అనుమతించడానికి డిమాండ్ చేశారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, వారిని చెదరగొట్టారు. బాష్పవాయువు ప్రభావం నుంచి తప్పించుకోవడానికి చాలామంది రైతులు మాసు్కలు, కళ్లద్దాలు ధరించారు. -
కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. చర్చలు విఫలం
చండీగఢ్: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత తదితర డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రుల కమిటీ చేసిన తాజా ప్రతిపాదనలను కూడా రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. అవి రైతులకు మేలు చేసేవి కాదని నేతలు జగ్జీత్సింగ్ దల్లేవాల్, శర్వాన్‌సింగ్ పంథేర్ తదితరులు సోమవారం కుండబద్దలు కొట్టారు. ప్రతిపాదనలపై సంఘాలన్నీ చర్చించుకున్న మీదట ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. తమ ‘ఢిల్లీ చలో’ ఆందోళన బుధవారం ఉదయం 11 నుంచి శాంతియుతంగా కొనసాగుతుందని ప్రకటించారు. దాంతో సమస్య మొదటికొచ్చింది. రైతు సంఘాలతో ఆదివారం సాయంత్రం మొదలైన కేంద్ర మంత్రుల కమిటీ నాలుగో దశ చర్చలు అర్ధరాత్రి తర్వాత ముగిశాయి. చర్చల్లో మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. ‘ఐదేళ్ల ఒప్పంద’ ప్రతిపాదనను మంత్రులు తెరపైకి తెచ్చారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న రైతుల నుంచి పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆ పంటలకు ఐదేళ్లపాటు ఎంఎస్పీ చెల్లింపుకు సుముఖత వ్యక్తం చేశారు. వారి నుంచి ఎంత పంటనైనా కొనుగోలు చేస్తామన్నారు. ఇది వినూత్నమైన ఆలోచన అని అనంతరం గోయల్ మీడియాతో చెప్పారు. ‘‘ఐదేళ్లపాటు ఎంఎస్పీకి ఆయా పంటల కొనుగోలుకు ఎన్సీసీఎఫ్, నాఫెడ్ వంటి ప్రభుత్వ రంగ సహకార సంఘాలు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఇందుకు ఒక పోర్టల్ అభివృద్ధి చేస్తాం’’ అని చెప్పారు. కనీస మద్దతు ధరకు ఇప్పటికిప్పుడు చట్టబద్ధత అసాధ్యమని తేల్చిప్పారు. ఈ ప్రతిపాదనపై రైతులు, నిపుణులతో చర్చించి రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని పంథేర్ సోమవారం ఉదయం చెప్పారు. అప్పటిదాకా ‘ఢిల్లీ చలో’ కార్యక్రమాన్ని నిలిపేస్తున్నామన్నారు. కానీ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నామంటూ రైతు నేతల నుంచి రాత్రికల్లా ప్రకటన వెలువడింది. -
Delhi Chalo: రైతు ఉద్యమం ఉధృతం
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా పలు డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మరింత ఉధృతమైంది. ఢిల్లీ సమీపంలో శంభు, టిక్రి సరిహద్దుల వద్ద పోలీసుల బారికేడ్లు, ఇనుపకంచెలు, సిమెంట్ దిమ్మెలను దాటేందుకు రైతులు ప్రయతి్నస్తున్నారు. పోలీసుల భాష్పవాయు గోళాలు, జలఫిరంగుల దాడితో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఉద్యమం మొదలై మూడురోజులవుతున్నా అటు రైతులు, ఇటు కేంద్ర ప్రభుత్వం పట్టువిడవడం లేదు. పంజాబ్, హరియాణాల మధ్యనున్న శంభు సరిహద్దు వద్ద వేలాదిగా రైతులు సంఘటితమయ్యారు. టిక్రి, సింఘు, కనౌరీ బోర్డర్ పాయింట్ల వద్దా అదే పరిస్థితి కనిపించింది. వారిని నిలువరించేందుకు మరింతగా బాష్పవాయుగోళాలు అవసరమని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. 30,000 టియర్‌గ్యాస్ షెల్స్‌కు ఆర్డర్ పెట్టారు. గ్వాలియర్‌లోని బీఎస్ఎఫ్ టియర్‌స్మోక్ యూనిట్ వీటిని సరఫరా చేయనుంది. ఘాజీపూర్ సరిహద్దు వద్ద సైతం పోలీసులు మొహరించారు. చండీగఢ్‌లో రైతు సంఘాల నేతలు జగ్జీత్సింగ్ దల్లేవాల్, శర్వాణ్ సింగ్ పాంథెర్, ప్రభుత్వ ప్రతినిధులైన వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మధ్య గురువారం రాత్రి మూడో దఫా చర్చలు మొదలయ్యాయి. చర్చల్లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం పాల్గొన్నారు. వాటిలో తేలిందనేది ఇంకా వెల్లడి కాలేదు. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)లో భాగమైన భారతీయ కిసాన్ యూనియన్ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా రైతులు నేడు గ్రామీణ భారత్ బంద్‌ను పాటించనున్నారు. ‘‘రైతులెవ్వరూ శుక్రవారం నుంచి పొలం పనులకు వెళ్లొద్దు. కారి్మకులు సైతం ఈ బంద్‌ను భాగస్వాములవుతున్నారు. ఈ రైతు ఉద్యమంలో ఎంతగా భారీ సంఖ్యలో జనం పాల్గొంటున్నారో ప్రభుత్వానికి అర్థమవుతుంది’’ అని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. భారత్‌బంద్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు హరియాణాలోని నోయిడాలో కర్ఫ్యూ విధించారు. పలు జిల్లాల్లో 17వ తేదీ దాకా టెలికాం సేవలను నిలిపేస్తూ హరియాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులు సైన్యంలా ఢిల్లీ ఆక్రమణకు వస్తున్నారంటూ బీజేపీ పాలిత హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పంజాబ్‌లోనూ శుక్రవారం దాకా ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. పట్టాలపై బైఠాయింపు నిరసనల్లో భాగంగా గురువారం రైతులు రైల్ రోకో కూడా నిర్వహించారు. పంజాబ్, హరియాణా సరిహద్దుల్లో అతి పెద్దదైన రాజాపురా రైల్వే జంక్షన్ వద్ద వందలాది మంది రైతులు పట్టాలపై బైఠాయించారు. మధ్యా హ్నం నుంచి సాయంత్రం దాకా రైళ్ల రాకపోకలను అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. చాలా రైళ్లను దారి మళ్లించగా కొన్నింటిని రద్దు చేశారు. -
ఇది ప్రభుత్వ దోపిడీయే!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రకృతి సహకరించక, తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గి ఇప్పటికే ఆందోళనలో ఉన్న రైతన్నకు వ్యాపారుల మాయాజాలం మరింత వేదన కలిగిస్తోంది. సీసీఐ కొనుగోళ్లు చేయకపోవడం, మద్దతు ధర దక్కకపోవడం, వ్యాపారులు నానా సాకులు చెబుతూ అతితక్కువ ధర చెల్లిస్తుండటంతో కడుపు మండిన రైతన్న ఆందోళనకు దిగుతున్నాడు. అసలు ప్రభుత్వమే తమ వద్ద దోచుకుంటోందంటూ మండిప డుతున్నాడు. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో రైతులు.. తమ ఆవేదనను, క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టేలా నిరసన తెలిపారు. ‘పత్తి ధరలపై బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది? అధికారంలోకి వచ్చాక హామీ ఇచ్చిన ధర ఎంత? ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఎంత? క్షేత్రస్థాయిలో ఈ రోజు తమ పత్తికి పలికిన ధర ఎంత? తాము నష్టపోయిన మొత్తం ఎంత?’ అనే వివరాలతోపాటు ఈ నష్టాన్ని ప్రభుత్వం దోచుకున్న ట్లేనంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లతో వినూత్నంగా ప్రదర్శించా రు. ఆరుగాలం శ్రమించి ఉత్పత్తిని మార్కెట్‌కు తీసుకొస్తే వ్యాపారులు కుమ్మక్కై అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారుల ఇష్టారాజ్యం వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (సీఏసీపీ) అంచనా ప్రకారం క్వింటాల్ దిగుబడికి ఖర్చు ఎంత అవుతుందో దానికి 50 శాతం కలిపి మద్దతు ధర ఇవ్వాలి. పత్తికి రూ.6,564 గిట్టుబాట ధర వస్తే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని స్వామినాథన్ కమిషన్ కూడా పేర్కొంది. ఈ రెండు అంశాలను గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీజేపీ తమ మేనిఫెస్టోలో పెట్టింది. తాము అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని ప్రకటించిం ది. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై మూడున్న రేళ్లు దాటిపోతున్నా ఇవేవీ అమల్లోకి రాలేదు. ఇక ప్రస్తుతం పత్తికి క్వింటాల్‌కు రూ.4,320 మద్దతు ధర (ఎంఎస్పీ)గా ప్రకటించింది. అయితే ఇందులోనూ పత్తి నాణ్యత, తేమ శాతంపై సీసీఐ అడ్డగోలు నిబంధనలు విధించింది. రైతులు తెస్తున్న పత్తి ఆ నిబంధనల ప్రకారం లేదంటూ కొనుగోలు చేయడం లేదు. దీంతో వ్యాపారులు, ట్రేడర్లు ఇష్టానుసారం ధరలు నిర్ణయిస్తున్నారు. కేవలం రూ.1,500 నుంచి రూ.3,000 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. పూర్తి నాణ్యౖ మెన, నిబంధనల ప్రకారం ఉన్న పత్తికి కూడా గరిష్టంగా రూ.4,000 వరకు మాత్రమే ఇస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ హామీలు, వాస్తవాలపై ఆందోళన రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 20న ‘ప్రభుత్వం రైతులను మోసం చేసింది.. దీనిపై ప్రధాని మోదీని లెక్కలు అడుగుదాం’ అనే నినాదంతో ఢిల్లీలో కిసాన్ ముక్తియాత్రను చేపట్టనున్నారు. ఇందుకోసం తెలంగాణ, ఏపీల్లోని ప్రధాన మార్కెట్లలో ముక్తి వికాస్, మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదికలతోపాటు సుమారు 40 ప్రజా సంఘాల నాయకులు పత్తి రైతుల వద్ద వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు బుధవారం జమ్మికుంట మార్కెట్లో పత్తికి మద్దతు ధర అమలు, కొనుగోళ్ల తీరుపై పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యాపారుల దోపిడీపై రైతులతో కలసి నిరసన తెలుపుతు న్నారు. ‘ప్రభుత్వం మమ్మల్ని దోచుకుంటోంది’ అనే పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. ఆయా రైతుల పేర్లు, గ్రామం, తెచ్చిన పత్తి, చెల్లించిన ధర, స్వామినాథన్ నివేదిక ఆధారం గా అందాల్సిన ధర, మద్దతు ధర, ప్రభుత్వం దోచుకున్నది ఎంత..’’ అనే వివరాలు రాస్తున్నారు. మొత్తంగా ‘కిసాన్ ముక్తియాత్ర’ కార్యక్రమానికి ఐదు వేల మంది రైతులు, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు, రైతు సంఘాల నాయకులు, ప్రజాసంఘాల నేతలు వెళ్లనున్నారు. ఈ చిత్రంలో ఆవేదనతో కనిపిస్తున్న మహిళా రైతు ఉనుగూరి కమల. జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామం. ఆమె ఖరీఫ్‌లో ఆరెకరాల్లో పత్తి సాగు చేసింది. గులాబీరంగు పురుగు కారణంగా దిగుబడి పడిపోయింది. 65 మంది కూలీలతో పత్తి ఏరితే 11 బస్తాలు (7 క్వింటాళ్లు) వచ్చింది. దానిని బుధవారం జమ్మికుంట మార్కెట్‌కు తీసుకొచ్చింది. వ్యాపారులు ఆ పత్తిని పరిశీలించి.. కాయ, తేమ ఉందని, గుడ్డి పత్తి అంటూ క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున మాత్రమే చెల్లించారు. అంత తక్కువ ధర చెల్లించడంతో కమల కన్నీరు పెట్టుకుంది. పత్తి ఏరిన కూలీల కోసమే రూ.15 వేలు ఖర్చయింది. దానిని అమ్మితే రూ.10,500 మాత్రమే చేతికి వచ్చాయంటూ ఆవేదనకు గురైంది. అటు మూడెకరాల్లో వరి సాగు చేస్తే దోమపోటు సోకి దెబ్బతిన్నదని విలపించింది. సాగును నమ్ముకుంటే అప్పులు, కన్నీళ్లే మిగిలాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. రైతులకు పంట నష్టం చెల్లించాలి ‘‘ప్రభుత్వం హామీ ఇచ్చిన ధర కాకుండా ఎంఎస్పీని ప్రకటించింది. అది కూడా అందని పరిస్థితి ఉంది. అకాల వర్షాలతో పత్తి రైతులు చాలా నష్టపోయారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ధరను వెంటనే అమల్లోకి తేవాలి. బుధవారం సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కానీ ఒక్క రైతు వద్ద కూడా కొనుగోలు చేయకుండా ట్రేడర్స్‌కు వదిలేశారు. సీసీఐ కంటే ట్రేడర్సే ఎక్కువ ధర చెల్లిస్తున్నారంటూ బుకాయిస్తున్నారు. నష్టపోయిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం చెల్లించాలి..’’ – విస్స కిరణ్‌కుమార్,రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు -
భూములపై ఢిల్లీకి పోరు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలో భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులు ‘చలో ఢిల్లీ’ ఉద్యమంపై దృష్టిపెట్టారు. కేంద్రసర్కారు ఇటీవల అమల్లోకి తెచ్చిన భూ సేకరణ ఆర్డినెన్సు, రాష్ట్రప్రభుత్వం అమలుపరుస్తోన్న భూ సమీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. బుధవారం విజయవాడలో పలువురు రైతు నాయకులు సమావేశమై ఇందుకు సంబంధించిన ప్రాథమిక కార్యాచరణను రూపొందించుకున్నారు. ఆ మేరకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరిలో పార్టీలకతీతంగా రైతులంతా సమావేశమై ఉద్యమ విజయవంతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించుకోనున్నారు. అంతేకాక బాధిత రైతులందరి అభిప్రాయం మేరకు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా 15 మందితో ప్రత్యేక పోరాట కమిటీని ఏర్పాటు చేయనున్నారు. రాజధాని ప్రాంతంలో 30 వేల ఎకరాల భూములను సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకూ 21,620 ఎకరాలను సమీకరించింది. మొదటినుంచీ జరీబు భూముల రైతాంగం భూసమీకరణను వ్యతిరేకిస్తూనే ఉంది. రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు గ్రామాలకు చెందిన రైతులు భూసమీకరణకు దూరంగానే ఉన్నారు. మరోవైపు మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) కూడా రైతుల ప్రయోజనాలకోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ముందు రైతుల గోడు వినిపించడం మంచిదని, దీనివల్ల కొంతైనా మేలు జరిగే వీలుందని భావించిన పలువురు రైతు నాయకులు, సామాజిక ఉద్యమకారులు చలో ఢిల్లీ ఉద్యమం వైపు దృష్టిపెట్టారు. జాతీయ స్థాయిలో సామాజిక ఉద్యమకారునిగా గుర్తింపు తెచ్చుకున్న అన్నాహజారే సాయంతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ ఎదుట నిరసన తెలపడం వల్ల జాతీయస్థాయి మీడియా దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లవుతుందని రైతుసంఘాల నేతలు భావించారు. అన్ని గ్రామాలకు సమాచారాన్ని పంపి కలసివచ్చే రైతులతో 21న ఢిల్లీకి పయనమయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు రైతుల పక్షాన పోరాడుతున్న న్యాయవాది మల్లెల శేషగిరిరావు తెలిపారు. మా భూములను మినహాయించాలి.. రాజధాని భూ సమీకరణపై హైకోర్టులో రైతుల పిటిషన్ సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రపదేశ్ రాజధాని ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) చట్టం కింద చేస్తున్న భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) నుంచి తమ భూములను మినహాయించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని భీమిరెడ్డి శివరామిరెడ్డి, మరో 31 మంది దాఖలు చేశారు. ఇందులో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్, గుంటూరు జిల్లా కలెక్టర్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మాణం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణకు శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగా సీఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వం భూ సమీకరణ బాధ్యతలను సీఆర్డీఏ కమిషనర్‌కు అప్పగించిందని, రాజధాని నిర్మాణం పేరుతో తమ వంటి చిన్న రైతులకు చెందిన చిన్నచిన్న విస్తీర్ణంలో ఉన్న వ్యవసాయ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని తెలిపారు. తరతరాలుగా స్వేదం చిందించి సాగుచేసుకుంటున్న తమ భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటోందని, ఈ భూములు తప్ప తమకు మరో ఆధారం లేదని, భూ సమీకరణపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వివరించారు. ప్రభుత్వం తమను ఏదోరకంగా దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని, దారికి రానివారిని ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. భూ సమీకరణను వ్యతిరేకించిన ఆరు గ్రామాల్లోని రైతులకు చెందిన పంటలను, పంపులను, షెడ్లను గుర్తుతెలియని వ్యక్తులు తగులపెట్టారని, రైతులను అనేక రకాలుగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు.