భూములపై ఢిల్లీకి పోరు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలో భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులు ‘చలో ఢిల్లీ’ ఉద్యమంపై దృష్టిపెట్టారు. కేంద్రసర్కారు ఇటీవల అమల్లోకి తెచ్చిన భూ సేకరణ ఆర్డినెన్సు, రాష్ట్రప్రభుత్వం అమలుపరుస్తోన్న భూ సమీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. బుధవారం విజయవాడలో పలువురు రైతు నాయకులు సమావేశమై ఇందుకు సంబంధించిన ప్రాథమిక కార్యాచరణను రూపొందించుకున్నారు.
ఆ మేరకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరిలో పార్టీలకతీతంగా రైతులంతా సమావేశమై ఉద్యమ విజయవంతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించుకోనున్నారు. అంతేకాక బాధిత రైతులందరి అభిప్రాయం మేరకు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా 15 మందితో ప్రత్యేక పోరాట కమిటీని ఏర్పాటు చేయనున్నారు. రాజధాని ప్రాంతంలో 30 వేల ఎకరాల భూములను సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకూ 21,620 ఎకరాలను సమీకరించింది. మొదటినుంచీ జరీబు భూముల రైతాంగం భూసమీకరణను వ్యతిరేకిస్తూనే ఉంది. రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు గ్రామాలకు చెందిన రైతులు భూసమీకరణకు దూరంగానే ఉన్నారు. మరోవైపు మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) కూడా రైతుల ప్రయోజనాలకోసం ఉద్యమిస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో కేంద్రం ముందు రైతుల గోడు వినిపించడం మంచిదని, దీనివల్ల కొంతైనా మేలు జరిగే వీలుందని భావించిన పలువురు రైతు నాయకులు, సామాజిక ఉద్యమకారులు చలో ఢిల్లీ ఉద్యమం వైపు దృష్టిపెట్టారు. జాతీయ స్థాయిలో సామాజిక ఉద్యమకారునిగా గుర్తింపు తెచ్చుకున్న అన్నాహజారే సాయంతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ ఎదుట నిరసన తెలపడం వల్ల జాతీయస్థాయి మీడియా దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లవుతుందని రైతుసంఘాల నేతలు భావించారు. అన్ని గ్రామాలకు సమాచారాన్ని పంపి కలసివచ్చే రైతులతో 21న ఢిల్లీకి పయనమయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు రైతుల పక్షాన పోరాడుతున్న న్యాయవాది మల్లెల శేషగిరిరావు తెలిపారు.
మా భూములను మినహాయించాలి..
రాజధాని భూ సమీకరణపై హైకోర్టులో రైతుల పిటిషన్
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రపదేశ్ రాజధాని ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) చట్టం కింద చేస్తున్న భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) నుంచి తమ భూములను మినహాయించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని భీమిరెడ్డి శివరామిరెడ్డి, మరో 31 మంది దాఖలు చేశారు. ఇందులో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్‌డీఏ కమిషనర్, గుంటూరు జిల్లా కలెక్టర్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మాణం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణకు శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగా సీఆర్‌డీఏ చట్టాన్ని తీసుకొచ్చిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం భూ సమీకరణ బాధ్యతలను సీఆర్‌డీఏ కమిషనర్‌కు అప్పగించిందని, రాజధాని నిర్మాణం పేరుతో తమ వంటి చిన్న రైతులకు చెందిన చిన్నచిన్న విస్తీర్ణంలో ఉన్న వ్యవసాయ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని తెలిపారు.
తరతరాలుగా స్వేదం చిందించి సాగుచేసుకుంటున్న తమ భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటోందని, ఈ భూములు తప్ప తమకు మరో ఆధారం లేదని, భూ సమీకరణపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వివరించారు. ప్రభుత్వం తమను ఏదోరకంగా దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని, దారికి రానివారిని ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు.
భూ సమీకరణను వ్యతిరేకించిన ఆరు గ్రామాల్లోని రైతులకు చెందిన పంటలను, పంపులను, షెడ్లను గుర్తుతెలియని వ్యక్తులు తగులపెట్టారని, రైతులను అనేక రకాలుగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు.