Land Acquisition Ordinance
-
బలవంతపు భూసేకరణపై జనాగ్రహం
-
రాజధాని భూసేకరణకు బ్రేక్
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధానికి అవసరమైన మిగిలిన భూముల కోసం భూసేకరణ అస్త్రాన్ని ప్రయోగిస్తామని చెప్పిన ప్రభుత్వం చివరకు తోకముడవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు ప్రతిపక్షం ఆందోళనలు, మరోవైపు భూసేకరణ ఆర్డినెన్స్ గడువును కేంద్రం మరోసారి పొడిగించకపోవడంతో.. భూసేకరణ యోచనకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకాల్సి రానుంది. వాస్తవానికి కేంద్రం ఆర్డినెన్స్ గడువును పొడిగించే అవకాశం లేదని ముందే తెలియడంతో భూసేకరణ నోటిఫికేషన్‌ను ఈలోపే ఇచ్చేయాలని ప్రభుత్వం హడావుడి పడింది. అందులో భాగంగానే తుళ్లూరు మండలంలోని ఐదు గ్రామాలకు సంబంధించిన 11 ఎకరాలను సేకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే అప్పటినుంచి భూ సేకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి భూసేకరణను వ్యతిరేకిస్తూ సీఆర్డీఏ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహిం చారు. ఈ నేపథ్యంలో మరింత ముందుకెళ్లడానికి ప్రభుత్వం సాహసించలేదు. ఈలోపు భూ సేకరణ ఆర్డినెన్స్‌ను మరోసారి పొడిగించే అవకాశం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టంగా ప్రకటించారు. చివరిగా పొడిగించిన ఆర్డినెన్సు గడువు సోమవారంతో ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇక భూసేకరణకు వెళ్లే అవకాశం లేకుండాపోయింది. ఒకవేళ పట్టుదలకు పోతే 2013 భూసేకరణ చట్టం ప్రకారం చేయాలి. దీనిప్రకారం గ్రామసభలు నిర్వహించి 80 శాతం మంది అంగీకరిస్తేనే భూములు తీసుకోవాలి. బహుళ పంటలు పండే భూములను తీసుకోకూడదు. సామాజిక, ఆర్థిక సర్వే చేసి దాని ఆధారంగా అక్కడి ప్రజలకు పరిహారాన్ని ప్రకటించాలి. భూము లు కోల్పోయే రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి. అన్నింటికీ మించి తీసుకున్న భూముల విలువకు నాలుగు రెట్ల అధిక ధరను పరిహారంగా చెల్లించాలి. ఇవన్నీ చేయాడానికి భారీగా సొమ్ములు అవసరం. అవి లేకే పైసా ఖర్చులేని భూ సమీకరణను రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చి తెలివిగా రైతుల భూములను చాలావరకూ దక్కించుకుంది. భూసమీకరణకు అంగీకరించని గ్రామాల రైతులను ఎలాగైనా లొంగదీసుకోవాలని, ముఖ్యం గా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ గ్రామాలకు చెందిన వారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ఆర్డినెన్స్ ద్వారా సేకరణకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు తొలి నోటిఫికేషన్ విడుదల చేసినా.. తదుపరి పరిణామాలు ప్రభుత్వానికి ప్రతికూలంగా మారాయి. చివరకు కేంద్రం సైతం వెనకడుగు వేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం సమీకరణ మినహా వేరే గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. -
ఓటమి కాదు.. ప్రత్యామ్నాయం!
భూ సేకరణ ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ చేయకూడదన్న ప్రభుత్వ నిర్ణయంపై అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: వివాదాస్పద భూ ఆర్డినెన్స్‌పై వెనకడుగు వేయడం ప్రధాని మోదీ పరాజయమన్న విపక్షాల వాదనను తిప్పికొట్టేందుకు సోమవారం కేంద్ర మంత్రులు నడుం బిగించారు. దీన్ని ప్రతిష్టకు సంబంధించిన అంశంగా ప్రభుత్వం ఎన్నడూ చూడలేదని స్పష్టం చేశారు. కీలకమైన భూసేకరణ అంశంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకే ఆ ఆర్డినెన్స్‌ను మరోసారి జారీ చేయకూడదన్న నిర్ణయానికి వచ్చామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఓ టీవీ చానల్‌తో అన్నారు. తమ నిర్ణయంతో భూ సేకరణ చట్టాలు చేసుకునే విషయంలో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ లభిస్తుందని, తమ అవసరాలకు అనుగుణంగా అవి సంబంధిత చట్టాలను రూపొందించుకోవచ్చని వివరించారు. ‘మాది వెనకడుగు కాదు. ఒకరకంగా చెప్పాలంటే అది ముందడుగు. ట్రాఫిక్ జామ్ తరహా ప్రతిష్టంభనలో చిక్కుకోకుండా ఉండటం కోసం, ప్రత్యామ్నాయ మార్గం తీసుకున్నాం. ఈ మార్గంలో రాజకీయ జోక్యం తక్కువ. దీని ద్వారా రాష్ట్రాలు తమ అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా భూ సేకరణ చట్టాల్లో మార్పులు చేసుకునేందుకు మరింత వెసులుబాటు లభిస్తుంది’ అని వివరించారు. జీఎస్టీ బిల్లుపై కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కాగా, ఆర్డినెన్స్‌ను మరోసారి జారీ చేయొద్దని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. కాంగ్రెస్ ప్రగతి వ్యతిరేక వైఖరి బట్టబయలైందని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. భూ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించేలా పార్లమెంట్లో చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ ఎన్నడూ సిద్ధంగా లేదని విమర్శించారు. భూ ఆర్డినెన్స్‌పై విపక్ష ఒత్తిడితో ప్రభుత్వం యూటర్న్ తీసుకుందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టివేశారు. 2013 చట్టంతో భూ సేకరణ సాధ్యం కాదని చెప్పినవారిలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలూ ఉన్నారన్నారు. మోదీది రైతు వ్యతిరేక ప్రభుత్వమన్న కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదనడానికి.. ఇటీవలి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడమే రుజువని పేర్కొన్నారు. మరో మంత్రి మంత్రి చౌదరి బీరేందర్ సింగ్‌తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఇప్పుడు రాష్ట్రాలు తమకు నచ్చినట్లుగా భూ సేకరణ చట్టాలు చేసుకోవచ్చు. కాబట్టి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రైతుల ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా నిబంధనలను తమ చట్టాల్లో చేరుస్తాయో లేదో చూడాలి’ అని బీరేందర్‌సింగ్ అన్నారు. కాగా, ‘ఒక ర్యాంకు-ఒక పెన్షన్’ విధానం కింద వార్షిక పెన్షన్‌పై సమీక్ష జరపాలన్న మాజీ సైనికుల డిమాండ్ సాధ్యం కాదని అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. -
ప్రజా వ్యతిరేకతతో తోకముడిచిన భూ సేకరణ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద భూసేకరణ ఆర్డినెన్సు సహజ మరణం పొందబోతున్నది. ఈ ఆర్డినెన్స్ గడువు ఈ నెల 31న ముగియనున్నది. మరోసారి ఆర్డినెన్సును ప్రయోగించే ఉద్దేశం లేనట్టు కేంద్రం నుంచి శుక్రవారం నాడు సంకేతాలు అందాయి. ఈ సంకేతాలు అందడమే తరువాయి, రాష్ట్ర ప్రభుత్వం చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ రాజధాని భూముల కోసం జారీ చేసిన భూసేకరణ ఉత్తర్వులను పక్కనబెట్టినట్టేనని, భూసమీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. ఎందుకంటే కేంద్రం ఆర్డినెన్సును ఆధారం చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం సేకరణ ఉత్తర్వులు జారీ చేసింది ప్రజా వ్యతిరేకతకు తలవొగ్గిన కేంద్రం మరోసారి ఆర్డినెన్సు జారీకి సుముఖంగా లేదన్న విషయం తెలవడంతోనే రాష్ట్ర మంత్రి నారాయణ హడావుడిగా విజయవాడలో విలేకరుల సమావేశం పెట్టారు. రాష్ట్రంలో కూడా భూసేకరణపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేసిన ధర్నా విజయవంతం కావడంతోపాటు రైతుల్లో ఆ పార్టీ ప్రతిష్ట పెరగడం కూడా అధికార పక్షానికి ఇబ్బంది కలిగించింది. ఈ నేపథ్యంలో ఆర్డినెన్సు సహజ మరణానికి మూడు రోజుల ముందుగానే అస్త్ర సన్యాసానికి సిద్ధమైన ప్రభుత్వం మంత్రి నారాయణ ద్వారా ప్రతిపక్ష పార్టీకి క్రెడిట్ దక్కకుండా చూసే ప్రయత్నం చేసింది. భూసేకరణ వ్యవహారం ముఖ్యమంత్రికి కూడా ఇష్టం లేదనీ, తానే ఆ ఉత్తర్వులు ఇచ్చానని నారాయణ చెప్పుకొచ్చారు. భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమిం చిన ప్రతిపక్షనేత విషయం పక్కకు పెట్టి, కేవలం పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడం వల్లనే భూ సేకరణను మానుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిపక్షం ఖాతాలో కాకుండా తమ మిత్రుడైన పవన్ ఖాతాలోకి మళ్లించడానికి మంత్రి ప్రయాసపడ్డారు. విజయవాడలో మంత్రి ఏమన్నారంటే... ‘జనవరి 2న ల్యాండ్ పూలింగ్ (భూసమీకరణ) ప్రకటించి ఫిబ్రవరి 28 నాటికి 58 రోజుల్లో 33 వేల ఎకరాలు సేకరించాం. మార్చి 1న నేను భూసేకరణ ప్రకటించాను. సీఎంగారు భూసేకరణను ఆపండి.. భూసమీకరణ విధానంలోనే రైతుల నుంచి భూములు తీసుకోమని చెప్పారు. అలా వీలుకాని పక్షంలోనే భూసేకరణకు పోదామన్నారు. ఆ తర్వాత ఈ నెల 20 నాటికి రైతులు భూసమీకరణ ద్వారానే వెయ్యి ఎకరాలు ఇచ్చారు. రాజధానికి మాస్టర్ ప్లాన్ వచ్చింది కాబట్టి ఆలస్యం చేయకూడదనే ఉద్దేశంతో ఈ నెల 20న నేను భూసేకరణ పెట్టాను. పవన్‌కళ్యాణ్ ఇక్కడి వచ్చి ప్రభుత్వం భూసేకరణకు పోవద్దు, భూసమీకరణ విధానంలో రైతులను ఒప్పించి భూములను తీసుకోమని చెప్పారు. అందుకే మేం ఇప్పుడు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నంలో ఉన్నాం. నచ్చచెప్పే తీసుకుంటాం. భూసేకరణ జరపాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదు. సీఎంగారు మొదట నుంచి దానికి పూర్తి వ్యతిరేకం. తప్పనిసరి పరిస్థితుల్లో నేను ప్రకటించాను’ అని ముక్తాయించారు.కాగా ఇదే నారాయణ రాత్రికి మాట మార్చారు. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మాట్లాడుతూ.. భూ సేకరణ ప్రభుత్వ నిర్ణయమేనని అన్నారు. మంత్రి గారి డ్రామా ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, అసలు భూ సేకరణ చట్టం ప్రయోగించాలన్న నిర్ణయంలో ముఖ్యమంత్రి ప్రమేయమే లేదని చెప్పుకొచ్చారు. నిజానికి భూసేకరణ చట్టం ప్రయోగించడానికి సంబంధించి అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో నంబర్ 304, తేదీ 20-08-2015) జారీ చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఈ జీవో ద్వారా భూ సేకరణ కోసం 26 మంది డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. వాస్తవం ఇలావుంటే, మంత్రి మాత్రం భూసేకరణకు ముఖ్యమంత్రికి ఏ సంబంధం లేదని బుకాయిం చారు. పెపైచ్చు అంతటి కీలకమైన నిర్ణయం విషయంలో సీఎంకు సంబంధం లేకుండానే తానే నోటిఫికేషన్ జారీ చేయమని అధికారులను ఆదేశించినట్టు విచిత్రమైన వాదన వినిపించారు. మరో ‘భూ’ ఆర్డినెన్స్ ఉండదు! బదులుగా సంబంధిత 13 చట్టాలను భూ సేకరణ చట్టం 2013లో చేర్చిన కేంద్రం న్యూఢిల్లీ: రికార్డు స్థాయిలో నాలుగోసారి భూ సేకరణ ఆర్డినెన్స్‌ను జారీ చేసే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది. అందుకు బదులుగా, జాతీయ రహదారులు, రైల్వేల చట్టం లాంటి భూ సేకరణకు సంబంధించిన 13 చట్టాలను యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన 2013 నాటి భూ సేకరణ చట్టంలో చేరుస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భూ సేకరణ ప్రక్రియలో భాగంగా భూములు ఇచ్చినవారికి ఆ 13 చట్టాల ద్వారా లభించే.. పరిహార నిర్ణయం, పునరావాసం తదితర ప్రయోజనాలు అందనున్నాయి. భూ సేకరణ చట్టంలోని ‘ఇబ్బందుల తొలగింపు నిబంధన(రిమూవల్ ఆఫ్ డిఫికల్టీస్ క్లాజ్ - సెక్షన్ 113)’ కింద కేంద్రం ఈ ‘ఆర్డర్’ జారీ చేసింది. దీంతో భూ సేకరణ ఆర్డినెన్స్‌ను మరోసారి జారీ చేయాల్సిన అవసరం కేంద్రానికి ఉండదు. ప్రస్తుత ఆర్డినెన్స్ కాల పరిమితి ఈ నెల 31తో ముగుస్తుంది. ఈ 13 చట్టాలను తాము అమల్లోకి తెచ్చిన భూ సేకరణ చట్టంలో యూపీఏ చేర్చలేదు. కానీ, భూ సేకరణ చట్టం ఆమోదం పొందే సమయంలో సంవత్సరంలోగా ఈ 13 చట్టాలను ఆ చట్ట పరిధిలోకి తీసుకువస్తామని హామీ ఇచ్చింది. అయితే, తాము రూపొందించిన భూ సేకరణ ఆర్డినెన్స్‌ల్లో ఆ 13 చట్టాలను ఎన్డీయే చేర్చింది. ఈ తరహా ఉత్తర్వుల జారీకి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సుముఖంగా ఉండగా, న్యాయ శాఖ మాత్రం ఆర్డినెన్స్ ద్వారానే ఆ 13 చట్టాలను భూ సేకరణ చట్ట పరిధిలోకి తీసుకురావాలని సూచిస్తోంది. భూ సేకరణ ఆర్డినెన్స్ మరోసారి జారీ చేయాలన్న ఆలోచన నుంచి విరమించుకున్నందున, పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ప్రొరోగ్ చేయాల్సిన అవసరం ఉండదు. దాంతో, జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం మరోసారి వర్షాకాల సమావేశాలను ఏర్పాటు చేసే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుంది. -
రైతు భరోసాకే రాహుల్ యాత్ర
కొల్చారం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న రైతు వ్యతిరేక విధానాల వల్లే అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, డీసీసీ అధ్యక్షురాలు వి.సునీతారెడ్డి అన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ ఈనెల 11న జిల్లాలో ‘రైతు భరోసా పాదయాత్ర’ నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం వారు మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే గీతారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి, పీసీసీ ప్రతినిధి శ్రవణ్‌కుమార్ తదితరులతో కలిసి కొల్చారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా చిన్న ఘనపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. పంజాబ్, విదర్భ, బీహార్‌లో రాహుల్ ‘రైతు భరోసా యాత్ర’ నిర్వహించినట్టు తెలిపారు. తెలంగాణ పర్యటనలో భాగంగా మెదక్ జిల్లాలోని కొల్చారం మండలంలో, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ భరోసా యాత్ర చేపడుతున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తోన్న రైతు వ్యతిరేక విధానాల వల్లే వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు చెప్పారు. భూసేకరణ ఆర్డినెన్స్ సరికాదు.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్ రైతులకు ఏ మాత్రం ఆమోద యోగ్యం కాదని కాంగ్రెస్ నేత, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వాలు వ్యవహరించాలని సూచించారు. బడ్జెట్లో రూ.23,480 కోట్లు వ్యవసాయం కోసం ప్రకటించినా అందులో ఖర్చుచేసింది స్వల్పమేనన్నారు. ఇందులో యాంత్రీకరణ పరికరాల కోసం జిల్లాకు రూ.100 కోట్లు మంజూరు చేశామని చెబుతున్న ప్రభుత్వం వాటి లెక్కలను చూపడం లేదన్నారు. దీనిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 20 వేల మంది యువ రైతులతో.. రాహుల్‌గాంధీ రైతు భరోసా యాత్రను కార్యకర్తలు, పార్టీ నాయకులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గీతారెడ్డి కోరారు. పాదయాత్రలో పాల్గొనేందుకు 20 వేల మంది యువ రైతులు తరలివస్తున్నారని చెప్పారు. సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి, డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మధుసూదన్‌రావు, సేవాదళ్ కమిటీ జిల్లా అధ్యక్షులు అమరసేనారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, ఆప్కో డెరైక్టర్ అరిగే రమేశ్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు మేఘమాల సంతోష్‌కుమార్, మండల పార్టీ నాయకులు నరేందర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం ఆర్డినెన్స్‌పై భగ్గుమన్న రైతన్న
బెంగళూరు : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూ స్వాధీన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ రైతన్నలు పిడికిలి బిగించారు. రాష్ట్రానికి చెందిన వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఉద్యాననగరి బెంగళూరులో భారీ ర్యాలీని నిర్వహించారు. బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఫ్రీడం పార్కు వరకు కొనసాగింది. ర్యాలీలో వేలాది సంఖ్యలో రైతులు పాల్గొనడంతో సిటీ రైల్వే స్టేషన్, ఫ్రీడం పార్కు వరకు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఇక ఫ్రీడం పార్కులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌తో పాటు ఆప్ మాజీ నేత యోగేంద్ర యాదవ్, రచయిత దేవనూరు మహదేవప్ప, ఇతర రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ...భూ స్వాధీన ఆర్డినెన్స్‌ను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక బగర్ హుకుం భూములపై సైతం రైతులకు హక్కులు కలిగించేలా భూ రెవెన్యూ చట్టానికి సైతం సవరణలు చేయాలని, ఇప్పటి వరకు రైతులు సాగు చేస్తూ వచ్చిన అటవీ భూములపై సైతం వారికి హక్కును కల్పించేలా అటవీ హక్కుల చట్టంలో సైతం కేంద్ర ప్రభుత్వం సవరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. -
భూ ఆర్డినెన్స్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసు
నాలుగు వారాల్లోగా స్పందన తెలపాలని ఆదేశం న్యూఢి ల్లీ: భూసేకరణ ఆర్డినెన్స్ పునఃజారీపై దాఖలైన పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా స్పందన తెలిపాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఆర్డినెన్స్ పునఃజారీ చట్టబద్ధతను సవాలు చేస్తూ పలు రైతు సంఘాలు వేసిన పిటిషన్‌పై జస్టిస్ జేఎస్ ఖేహార్, జస్టిస్ ఎస్ఏ బోబ్దేలతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. తమ దావాను అత్యవసరంగా విచారించాలని, లేకపోతే అది నిష్ఫలమవుతుందని పిటిషనర్ల న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. చట్టం వస్తే పిటిషన్ నిష్ఫలమవుతుందని, తాము అవతలి పక్షం వాదన కూడా వినాల్సి ఉందని పేర్కొంది. భూ ఆర్డినెన్స్‌ను తిరిగి జారీ చేయడానికి ఉద్దేశపూర్వకంగా రాజ్యసభను ప్రొరోగ్ చేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని రైతు సంఘాలు తమ పిటిషన్లో ఆరోపించడం తెలిసిందే. కేంద్రానికి గడువు విధించలేం ఎన్నారైలకు ఓటు హక్కు కల్పించే విషయంలో కేంద్రానికి ఎలాంటి గడువూ విధించలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కొత్త చట్టం తీసుకురావడం లేదా చట్టాన్ని సవరించడం ప్రభుత్వ అభీష్టానికే విడిచిపెడుతున్నామంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఎన్నారైలకు ఓటు హక్కు దాఖలుపై పలు పిటిషన్లపై మంగళవారం ధర్మాసనం విచారణ జరిపింది. కేరళలో 70 శాతం మంది ఎన్నారైలే ఉన్నందున, వారందరికీ వెంటనే ఓటు హక్కు కల్పించేలా ఆదేశించాలంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాది దుశ్యంత్ దవే కోర్టును కోరారు. -
భూ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం
పునఃజారీని సవాల్ చేస్తూ ‘సుప్రీం’లో రైతు సంఘాల పిటిషన్ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం భూసేకరణ ఆర్డినెన్స్‌ను పునఃజారీచేయటం రాజ్యాంగ విరుద్ధమంటూ పలు రైతు సంఘాలు గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణంలో పారదర్శకత, న్యాయమైన పరిహారానికి హక్కు (సవరణ) ఆర్డినెన్స్ - 2015ను అమలు చేయకుండా ప్రభుత్వాన్ని నిరోధిస్తూ ఆదేశాలు జారీ చేయాలని భారతీయ కిసాన్ యూనియన్, గ్రామ్ సేవా సమితి, ఢిల్లీ గ్రామీణ్ స్వరాజ్, చోగామ వికాస్ అవాం ఈ పిటిషన్‌ను దాఖలు చేశాయి. పార్లమెంటులో చట్టం చేసే ప్రక్రియను కాదని.. వరుసగా ఆర్డినెన్స్‌లు జారీచేయటం రాజ్యాంగంలోని 14వ అధికరణను ఉల్లంఘించటమే కాక రాజ్యాంగాన్ని దగా చేయటమేనని ఆరోపించాయి. భూసేకరణ బిల్లు 2015 మార్చి 10 నుంచి 20 మధ్య లోక్‌సభలో ఆమోదం పొందాక.. దానిని ఉద్దేశపూర్వకంగానే రాజ్యసభలో చర్చకు పెట్టలేదని.. ఆ సభలో ప్రభుత్వానికి అవసరమైన సంఖ్యాబలం లేకపోవటం, దానిపై ఏకాభిప్రాయం లేకపోవటం, రాజకీయ అభీష్టం లేకపోవటం దీనికి కారణమని వివరించాయి. కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాలు, హోంశాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలతో పాటు.. మంత్రివర్గ సచివాలయాన్ని ఈ వ్యాజ్యంలో ప్రత్యర్థులుగా చేర్చారు. ఆర్డినెన్స్‌లను కొనసాగించటం, వాటిని పునఃజారీచేయటం అనేది.. కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాన్ని బాహాటంగా వినియోగించటమేనని అభివర్ణించారు. యూపీఏ చట్టం రైతులపై కుట్ర: జైట్లీ యూపీఏ హయాంలో ఆమోదించిన భూసేకరణ చట్టం.. తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునే ఉద్దేశంతో.. పల్లెలను అభివృద్ధికి దూరంగా ఉంచేందుకు, భూమిలేని వారిని నిరుద్యోగులుగానే మిగిల్చేందుకు చేసిన కుట్ర అని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ఆరోపించారు. ఆయన భోపాల్‌లో మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో మాట్లాడారు. -
మంటల్లో చేతులు పెడుతున్నారు
⇒ 8 నెలలకే ఆశ, అహంకారం పెరిగితే ఎలా? ⇒ ప్రజామోదం లేని ఏ పనీ లక్ష్యం చేరదు ⇒ అదే జరిగితే జాతీయస్థాయి ఉద్యమం ⇒ రైతులకు ఇష్టం లేకుండా భూ సేకరణ సాధ్యం కాదు ⇒ సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ స్పష్టీకరణ సాక్షి, విజయవాడ బ్యూరో: ‘ఏపీ సీఎం చంద్రబాబు.. మంటల్లో చేతులు పెడుతున్నాడు. ఇలాగైతే భవిష్యత్తు రాజకీయం ఉండదు. 8 నెలలకే ఇంత ఆశ, అహంకారమైతే ఎలా? ప్రజామోదం లేకుండా చేపట్టే ఏ పనీ లక్ష్యం చేరదు. దీన్ని గుర్తిస్తే సరి, లేదంటే పతనమే. రాజధాని రైతులకు ఇష్టం లేకుండా భూ సేకరణ సాధ్యంకాదు. అలా జరిపితే విజయవాడ కేంద్రంగా మహోద్యమాన్ని మొదలు పెడతాం’ అని జాతీయ స్థాయి ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ హెచ్చరించారు. కేంద్రం అమల్లోకి తెచ్చిన భూ సేకరణ ఆర్డినెన్స్‌పై పార్లమెంటులో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆర్డినెన్స్‌ను చూసి భయపడుతున్న ఏపీ రాజధాని ప్రాంత రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు అగ్నివేశ్ విజయవాడ వచ్చారు. వెట్టిచాకిరీ, బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థపై దశాబ్దకాలంగా ప్రజా ఉద్యమాలు చేస్తున్న ఆయన రాకతో రాజధాని రైతుల్లో స్థైర్యం పెరిగింది. ఈ సందర్భంగా అగ్నివేశ్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. ఇలా.. సాక్షి: భూ సమీకరణ నిర్ణయం సమర్థనీయమేనా? అగ్నివేశ్: ముమ్మూటికీ కానేకాదు. మట్టిని నమ్ముకుని బతికే శ్రమజీవులకు అన్యాయం చేసేలా పెద్ద ఎత్తున భూ సమీకరణ చేయడం సబబు కాదు. చండీగఢ్, రాయపూర్ రాజధానులకు 5 వేల ఎకరాలు మాత్రమే సేకరించగా, ఇక్కడ మాత్రం 30 నుంచి లక్ష ఎకరాలు ఎందుకో అర్థం కావడం లేదు. సాక్షి: ప్రజాభిప్రాయం ఎలా ఉంది? అగ్నివేశ్: సారవంతమైన భూములున్న ఎర్రబాలెం, పెనుమాక గ్రామాలకు వెళ్లాను. పొలాలు చేజారి పోతున్నాయన్న ఆందోళన అక్కడి వారిలో కనిపించింది. నేను ప్రశ్నించే లోగా.. ‘ప్రాణాలైనా ఇస్తాం గానీ పొలాలు మాత్రం ఇవ్వలే’మన్నారు. నేలతల్లితో వారికున్న అనుబంధం అలాంటిది. అప్పుడే అనుకున్నా వీరికి అండగా నిలబడాలని. ఎంతటి ఉద్యమానికైనా సిద్ధం కావాలని. సాక్షి: రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని సీఎం అంటున్నారు ? అగ్నివేశ్: ఇది భారత్. భారతదేశంగానే ఉండాలి. మన సంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలు దెబ్బతినకూడదు. సింగపూర్‌గా ఎందుకు మార్చడం?ఎవరికి ప్రయోజనం? రియల్ వ్యాపారులు, కార్పొరేట్ సంస్థలు బాగుపడతాయంతే. సాక్షి: ప్రపంచస్థాయి రాజధాని నగరం అవసరమా? అగ్నివేశ్: డబ్బుల్లేవంటూనే ప్రపంచస్థాయి రాజధాని ఎందుకట? సుందరమైన చిన్న రాజధాని సరిపోతుంది కదా. ఇందుకు పెట్టే ఖర్చును తగ్గించి పరిశ్రమలు, వ్యవసాయ రంగాలను వృద్ధి చేసుకుంటే ఆర్థికాభివృద్ధి పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది. సాక్షి: రాష్ట్రంలో బాబు, కేంద్రంలో మోదీ ఒకే బాటలో వెళ్తున్నారా? అగ్నివేశ్: ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. భూ సేకరణ ఆర్డినెన్సును కేంద్రంలో అన్ని పార్టీలూ వ్యతిరేకించాయి. యూపీ, పంజాబ్‌లతో పాటు రాంవిలాస్‌పాశ్వాన్, శివసేన పార్టీలు కూడా ఆర్డినెన్సును వ్యతిరేకించాయి. కానీ.. మోదీ, చంద్రబాబు మాత్రమే దీన్ని సమర్థించారు. దీన్నిబట్టి ఈ ఆర్డినెన్సును చంద్రబాబు కోసమే తెచ్చారన్నది సుస్పష్టం. సాక్షి: రైతులకు మీభరోసా ? అగ్నివేశ్: వారి కోసం నిలబడతాం. ప్రభుత్వం బలవంతంగా భూములు సేకరిస్తే ప్రతిఘటిస్తాం. జాతీయ స్థాయి నాయకులను తీసుకొస్తాం. అన్నాహజారే, మేథాపాట్కర్ వంటి ఉద్యమకారులూ వస్తారు. హర్యానా, యూపీ, ఢిల్లీల నుంచి ఎంతో మంది తరలివస్తారు. ప్రభుత్వం ఎంత మంది పోలీసులను పెట్టినా, తపాకీ గుళ్లు పేలినా వెనుకంజ వేయం. విజయవాడ కేంద్రంగా జాతీయ స్థాయి ఉద్యమం హోరెత్తేలా చేస్తాం. -
జైల్‌భరోకు సిద్ధం కండి..
అన్యాయపు ఆర్డినెన్సును అడ్డుకోండి: అన్నా అన్నా దీక్షలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ న్యూఢిల్లీ: భూసేకరణ ఆర్డినెన్సు రైతుల కడుపుకొట్టే ఆర్డినెన్సు అని గాంధేయవాది అన్నా హజారే మోదీ సర్కారుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోనంత వరకూ యుద్ధం ఆపేది లేదని మంగళవారం స్పష్టం చేశారు. తాము చేస్తున్నది మరో స్వాతంత్య్ర పోరాటంగా అభివర్ణించిన అన్నా.. ఎన్డీఏ తెచ్చిన ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, మండలాల్లో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు పాదయాత్రల నిర్వహణకు సంకల్పించాలని ప్రజలకు అన్నా పిలుపునిచ్చారు. భూ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన అన్నా ఆందోళన మంగళవారంతో ముగిసింది. నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్, ఆల్ ఇండియా యూనియన్ ఆఫ్ ఫారెస్టు వర్కింగ్ పీపుల్, అఖిల భారతీయ కిసాన్ సభ, నర్మదా బచావ్ ఆందోళన్ తదితర సంఘాలు ధర్నాలో పాల్గొన్నాయి. ఏపీ రాజధాని ప్రాంత రైతు, రైతు కూలీల పరిరక్షణ వేదిక, వైఎస్సార్సీపీ అన్నా ఆందోళనకు మద్దతు తెలిపాయి. భారీ ధర్నా వేదికపైనుంచి అన్నా హజారే మాట్లాడుతూ రైతుల కోసం బలిదానాలకు సిద్ధంకావాలన్నారు. నిరాహార దీక్ష చేసి తాను చనిపోవాలని అనుకోవడం లేదని, ప్రజలు, రైతుల కోసం జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. కాగా, భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న అన్నాహజారేకు మద్దతుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం వేదిక పంచుకున్నారు. ఆయనతో పాటు ఢిల్లీ శాసనసభకు ఎన్నికైన ఆమ్ఆద్మీపార్టీ ఎమ్మెల్యేలు 67మందీ ధర్నాలో పాల్గొన్నారు. కార్పొరేట్ల కోసం ఓ దళారిలాగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. భూసేకరణ బిల్లు పేదల వ్యతిరేక బిల్లు, రైతుల వ్యతిరేక బిల్లు అని తెలుపుతూ బిల్లును వ్యతిరేకించడంలో అన్నా వెంట ఉన్నామని చెప్పారు. సచివాలయానికి ఆహ్వానించిన కేజ్రీవాల్ ఢిల్లీ ప్రభుత్వ సచివాలయానికి బుధవారం రావలసిందిగా అన్నాను కేజ్రీవాల్ ఆహ్వానించారు. అన్నా రాకవల్ల ఢిల్లీ సచివాలయం పవిత్రమవుతుందని చెప్పారు. అన్ని ప్రభుత్వ విభాగాధిపతులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు స్ఫూర్తినిచ్చేందుకు వారితో మాట్లాడాలని అన్నాను కోరారు. అయితే అన్నా వేరే కార్యక్రమం వల్ల సచివాలయానికి వెళ్లక పోవచ్చని సమాచారం. -
టీడీపీ సమర్ధిస్తుందా?వ్యతిరేకిస్తుందా?
గుంటూరు:కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న భూసేకరణ ఆర్డినెన్స్ ను టీడీపీ సమర్ధిస్తుందా?లేక వ్యతిరేకిస్తుందా?అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ప్రశ్నించారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడుల కోసమే భూసేకరణ ఆర్డినెన్స్ ను తెరపైకి తీసుకొచ్చారని ఆర్కే విమర్శించారు. భూసేకరణ ఆర్డినెన్స్ పై టీడీపీ తన వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్ ల అన్ని ప్రతిపక్ష పార్టీల సభ నుంచి వాకౌట్ చేసినా టీడీపీ ఎంపీలు మాత్రం సభలోనే ఉన్నారని రామకృష్ణా రెడ్డి ఎద్దేవా చేశారు. భూసేకరణ ఆర్డినెన్స్ ను మేధావులు సైతం వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ అంశంపై టీడీపీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొంతమంది నాయకుల స్వార్ధపూరిత ప్రయోజనాల కోసమే బీజేపీ ప్రభుత్వం హడావిడిగా ఈ ఆర్డినెన్స్ ను తెచ్చిందన్నారు. ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తూ రైతులు ఇచ్చే 9.2 ఫారాల గడువును పొడగించాలన్నారు. భూసేకరణకు సంబంధించి 9.3 ఫారాలు ఇచ్చిన రైతులు కూడా పునరాలోచనలో పడ్డారని రామకృష్ణా రెడ్డి తెలిపారు. -
భూ ఆర్డినెన్స్‌పై హజారే సమరం
జంతర్‌మంతర్ వద్ద రెండ్రోజుల దీక్ష సాక్షి, న్యూఢిల్లీ: రైతులకు అన్యాయం చేసే భూసేకరణ ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవాలని గాంధేయవాది అన్నా హజారే డిమాండ్ చేశారు. ఆంగ్లేయుల హయాంలో కూడా రైతులకు ఇంతటి అన్యాయం జరగలేదని, వారి పాలనలో కంటే దారుణమైన ఆర్డినెన్సును మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిందని ధ్వజమెత్తారు. ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకొని, భూసేకరణ చట్టం-2013లోనే రైతుకు మరింత మేలు చేకూర్చే అంశాలను జోడించి మంచి చట్టం తేవాలన్నారు. ఆర్డినెన్స్‌ను రద్దు చేయకుంటే మూడు, నాలుగు నెలలు దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించి ఢిల్లీలోని రాంలీలా మైదానం నుంచి జైల్‌భరో కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. భూసేకరణపై ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆయన సోమవారం జంతర్ మంతర్ వద్ద రెండ్రోజుల నిరసన దీక్ష ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన రైతులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచీ రైతులకు ఎప్పుడూ ఇలాంటి అన్యాయం జరిగి ఉండకపోవచ్చు. ఈ అప్రజాస్వామ్యకమైన ఆర్డినెన్స్‌ను అమలు చేయడమంటే రైతుల భూమిని ప్రభుత్వం కబ్జా చేయడమే. బ్రిటిష్ పాలకులు కూడా మన రైతులకు ఇంత అన్యాయం ఎప్పుడూ చేయలేదు. అధికారంలో కాంగ్రెస్, విపక్షంలో మీరు(బీజేపీ) ఉండగా ఇద్దరూ కలిసి 2013లో భూసేకరణ చట్టాన్ని చేశారు. ఇప్పుడు మీ(బీజేపీ) ప్రభుత్వం ఏర్పడ్డాక అకస్మాత్తుగా ఈ ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది రైతులకు తీరని అన్యాయం చేయడమే’ అని అన్నారు. ‘ఎన్నికల ముందు మంచిరోజులు తెస్తామన్నారు. ప్రజలు నమ్మి ఓటేశారు. కానీ ఇప్పుడు నిర్భందంగా రైతుల భూములను పారిశ్రామికవేత్తలకిస్త్తున్నారు. మంచిరోజులు ప్రజలకు రాలేదు. కార్పొరేట్లకే వచ్చాయి’ అని అన్నారు. రెండో స్వతంత్ర పోరాటం.. ‘భారత్ గణతంత్ర దేశంగా ఆవిర్భవించాక ప్రజలే యజమానులని, ప్రభుత్వం సేవకుడని చెప్పారు. అయితే ప్రస్తుతం ఇది తలకిందులైంది. ఈ ఉద్యమాన్ని దేశంలోని ప్రతీ జిల్లాకు తీసుకువెళ్తా. ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం. వ్యవసాయ ఆధారిత దేశంలో రైతుల నుంచి వారి అనుమతి లేకుండా భూమిని ఎలా లాక్కుంటారు’ అని హజారే నిలదీశారు. రైతులకు జరగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనడానికి జైలుకెళ్లడానికీ సిద్ధమేనన్నారు. సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ మాట్లాడుతూ... ప్రజలకు కావాల్సింది రాలేగావ్ సిద్ధినమూనా అని, గుజరాత్ నమూనాఅభివృద్ధి కాదన్నారు. అన్నాతో కేజ్రీవాల్ భేటీ.. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సాయంత్రం మహారాష్ట్ర సదన్‌లో అన్నా హజారేను కలుసుకున్నారు. ఇద్దరూ గంటపాటు చర్చించారు. అనంతరం కేజ్రీవాల్ సన్నిహితుడు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ... మంగళవారం మధ్యాహ్నం అరవింద్ కేజ్రీవాల్ కూడా అన్నా దీక్షలో కూర్చుంటారని తెలిపారు. -
భూములపై ఢిల్లీకి పోరు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలో భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులు ‘చలో ఢిల్లీ’ ఉద్యమంపై దృష్టిపెట్టారు. కేంద్రసర్కారు ఇటీవల అమల్లోకి తెచ్చిన భూ సేకరణ ఆర్డినెన్సు, రాష్ట్రప్రభుత్వం అమలుపరుస్తోన్న భూ సమీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. బుధవారం విజయవాడలో పలువురు రైతు నాయకులు సమావేశమై ఇందుకు సంబంధించిన ప్రాథమిక కార్యాచరణను రూపొందించుకున్నారు. ఆ మేరకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరిలో పార్టీలకతీతంగా రైతులంతా సమావేశమై ఉద్యమ విజయవంతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించుకోనున్నారు. అంతేకాక బాధిత రైతులందరి అభిప్రాయం మేరకు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా 15 మందితో ప్రత్యేక పోరాట కమిటీని ఏర్పాటు చేయనున్నారు. రాజధాని ప్రాంతంలో 30 వేల ఎకరాల భూములను సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకూ 21,620 ఎకరాలను సమీకరించింది. మొదటినుంచీ జరీబు భూముల రైతాంగం భూసమీకరణను వ్యతిరేకిస్తూనే ఉంది. రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు గ్రామాలకు చెందిన రైతులు భూసమీకరణకు దూరంగానే ఉన్నారు. మరోవైపు మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) కూడా రైతుల ప్రయోజనాలకోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ముందు రైతుల గోడు వినిపించడం మంచిదని, దీనివల్ల కొంతైనా మేలు జరిగే వీలుందని భావించిన పలువురు రైతు నాయకులు, సామాజిక ఉద్యమకారులు చలో ఢిల్లీ ఉద్యమం వైపు దృష్టిపెట్టారు. జాతీయ స్థాయిలో సామాజిక ఉద్యమకారునిగా గుర్తింపు తెచ్చుకున్న అన్నాహజారే సాయంతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ ఎదుట నిరసన తెలపడం వల్ల జాతీయస్థాయి మీడియా దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లవుతుందని రైతుసంఘాల నేతలు భావించారు. అన్ని గ్రామాలకు సమాచారాన్ని పంపి కలసివచ్చే రైతులతో 21న ఢిల్లీకి పయనమయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు రైతుల పక్షాన పోరాడుతున్న న్యాయవాది మల్లెల శేషగిరిరావు తెలిపారు. మా భూములను మినహాయించాలి.. రాజధాని భూ సమీకరణపై హైకోర్టులో రైతుల పిటిషన్ సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రపదేశ్ రాజధాని ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) చట్టం కింద చేస్తున్న భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) నుంచి తమ భూములను మినహాయించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని భీమిరెడ్డి శివరామిరెడ్డి, మరో 31 మంది దాఖలు చేశారు. ఇందులో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్, గుంటూరు జిల్లా కలెక్టర్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మాణం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణకు శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగా సీఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వం భూ సమీకరణ బాధ్యతలను సీఆర్డీఏ కమిషనర్‌కు అప్పగించిందని, రాజధాని నిర్మాణం పేరుతో తమ వంటి చిన్న రైతులకు చెందిన చిన్నచిన్న విస్తీర్ణంలో ఉన్న వ్యవసాయ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని తెలిపారు. తరతరాలుగా స్వేదం చిందించి సాగుచేసుకుంటున్న తమ భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటోందని, ఈ భూములు తప్ప తమకు మరో ఆధారం లేదని, భూ సమీకరణపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వివరించారు. ప్రభుత్వం తమను ఏదోరకంగా దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని, దారికి రానివారిని ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. భూ సమీకరణను వ్యతిరేకించిన ఆరు గ్రామాల్లోని రైతులకు చెందిన పంటలను, పంపులను, షెడ్లను గుర్తుతెలియని వ్యక్తులు తగులపెట్టారని, రైతులను అనేక రకాలుగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. -
భూసేకరణ ఆర్డినెన్సుపై పోరాటం
అసెంబ్లీలో తీర్మానం చేయాలని టీపీసీసీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రైతుల పొట్టకొట్టేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమించాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. భూసేకరణ ఆర్డినెన్స్‌పై శనివారం గాంధీభవన్‌లో పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు మాట్లాడుతూ ప్రజల అవసరాల ముసుగులో కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని, ఇది పెట్టుబడిదారులకు కొమ్ముకాసేలా ఉందని విమర్శించారు. భూసేకరణ ఆర్డినెన్సులో పేద రైతులకు నష్టం కలిగించే, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్న అంశాలను సమావేశంలో వివరించారు. 2013 ఫిబ్రవరిలో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన చట్టంలోని అంశాలను కూడా ఈ సందర్భంగా కొప్పుల రాజు వివరించారు. 23న దేశవ్యాప్త ఉద్యమం: పొన్నాల తెలంగాణ పేదలకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్న భూసేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని పొన్నాల డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం పార్టీ నేతలు ఎం.కోదండరెడ్డి, అధికార ప్రతినిధులు దాసోజు శ్రవణ్, మల్లు రవి, శ్యాంమోహన్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. దొంగచాటుగా తెచ్చిన ఆర్డినెన్స్ వల్ల తెలంగాణ రైతులు పెద్ద ఎత్తున భూములు కోల్పోతారన్నారు. పరిశ్రమ అవసరాలకు తీసుకున్న భూమిలో, పరిశ్రమ పెట్టకుండా పడావు పెట్టినా అసలు రైతులకు ఈ ఆర్డినెన్సు ద్వారా ఆ భూమి దక్కకుండాపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలకతీతంగా ఈ ఆర్డినెన్సును వ్యతిరేకించాలని, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే ఫిబ్రవరి 23న ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త పోరాటం చేస్తామని చెప్పారు. ఫిబ్రవరి 10 నుంచి జిల్లాల వారీగా కాంగ్రెస్ ఎస్సీ సెల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు పొన్నాల తెలిపారు. కాగా, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు చేయకుండా, వేధింపులకు గురిచేస్తున్న ప్రభుత్వ విధానానికి నిరసనగా అన్ని పార్టీలను, సంఘాలను కూడగట్టడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పొన్నాల ఒక కమిటీని ప్రకటించారు. మల్లు రవి, బి.మహేశ్‌కుమార్ గౌడ్, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, కొనగాల మహేష్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని చెప్పారు.