భూ సేకరణ ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ చేయకూడదన్న ప్రభుత్వ నిర్ణయంపై అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: వివాదాస్పద భూ ఆర్డినెన్స్‌పై వెనకడుగు వేయడం ప్రధాని మోదీ పరాజయమన్న విపక్షాల వాదనను తిప్పికొట్టేందుకు సోమవారం కేంద్ర మంత్రులు నడుం బిగించారు. దీన్ని ప్రతిష్టకు సంబంధించిన అంశంగా ప్రభుత్వం ఎన్నడూ చూడలేదని స్పష్టం చేశారు. కీలకమైన భూసేకరణ అంశంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకే ఆ ఆర్డినెన్స్‌ను మరోసారి జారీ చేయకూడదన్న నిర్ణయానికి వచ్చామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఓ టీవీ చానల్‌తో అన్నారు.
తమ నిర్ణయంతో భూ సేకరణ చట్టాలు చేసుకునే విషయంలో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ లభిస్తుందని, తమ అవసరాలకు అనుగుణంగా అవి సంబంధిత చట్టాలను రూపొందించుకోవచ్చని వివరించారు. ‘మాది వెనకడుగు కాదు. ఒకరకంగా చెప్పాలంటే అది ముందడుగు. ట్రాఫిక్ జామ్ తరహా ప్రతిష్టంభనలో చిక్కుకోకుండా ఉండటం కోసం, ప్రత్యామ్నాయ మార్గం తీసుకున్నాం.
ఈ మార్గంలో రాజకీయ జోక్యం తక్కువ. దీని ద్వారా రాష్ట్రాలు తమ అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా భూ సేకరణ చట్టాల్లో మార్పులు చేసుకునేందుకు మరింత వెసులుబాటు లభిస్తుంది’ అని వివరించారు. జీఎస్టీ బిల్లుపై కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కాగా, ఆర్డినెన్స్‌ను మరోసారి జారీ చేయొద్దని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. కాంగ్రెస్ ప్రగతి వ్యతిరేక వైఖరి బట్టబయలైందని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. భూ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించేలా పార్లమెంట్లో చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ ఎన్నడూ సిద్ధంగా లేదని విమర్శించారు.
భూ ఆర్డినెన్స్‌పై విపక్ష ఒత్తిడితో ప్రభుత్వం యూటర్న్ తీసుకుందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టివేశారు. 2013 చట్టంతో భూ సేకరణ సాధ్యం కాదని చెప్పినవారిలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలూ ఉన్నారన్నారు. మోదీది రైతు వ్యతిరేక ప్రభుత్వమన్న కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదనడానికి.. ఇటీవలి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడమే రుజువని పేర్కొన్నారు. మరో మంత్రి మంత్రి చౌదరి బీరేందర్ సింగ్‌తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.
‘ఇప్పుడు రాష్ట్రాలు తమకు నచ్చినట్లుగా భూ సేకరణ చట్టాలు చేసుకోవచ్చు. కాబట్టి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రైతుల ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా నిబంధనలను తమ చట్టాల్లో చేరుస్తాయో లేదో చూడాలి’ అని బీరేందర్‌సింగ్ అన్నారు. కాగా, ‘ఒక ర్యాంకు-ఒక పెన్షన్’ విధానం కింద వార్షిక పెన్షన్‌పై సమీక్ష జరపాలన్న మాజీ సైనికుల డిమాండ్ సాధ్యం కాదని అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు.
ఓటమి కాదు.. ప్రత్యామ్నాయం!
Published Tue, Sep 1 2015 3:36 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM
Advertisement
Advertisement