
కేంద్రం ఆర్డినెన్స్‌పై భగ్గుమన్న రైతన్న
బెంగళూరు : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూ స్వాధీన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ రైతన్నలు పిడికిలి బిగించారు. రాష్ట్రానికి చెందిన వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఉద్యాననగరి బెంగళూరులో భారీ ర్యాలీని నిర్వహించారు. బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఫ్రీడం పార్కు వరకు కొనసాగింది. ర్యాలీలో వేలాది సంఖ్యలో రైతులు పాల్గొనడంతో సిటీ రైల్వే స్టేషన్, ఫ్రీడం పార్కు వరకు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఇక ఫ్రీడం పార్కులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌తో పాటు ఆప్ మాజీ నేత యోగేంద్ర యాదవ్, రచయిత దేవనూరు మహదేవప్ప, ఇతర రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సభలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ...భూ స్వాధీన ఆర్డినెన్స్‌ను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక బగర్ హుకుం భూములపై సైతం రైతులకు హక్కులు కలిగించేలా భూ రెవెన్యూ చట్టానికి సైతం సవరణలు చేయాలని, ఇప్పటి వరకు రైతులు సాగు చేస్తూ వచ్చిన అటవీ భూములపై సైతం వారికి హక్కును కల్పించేలా అటవీ హక్కుల చట్టంలో సైతం కేంద్ర ప్రభుత్వం సవరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.