అన్యాయపు ఆర్డినెన్సును అడ్డుకోండి: అన్నా
అన్నా దీక్షలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్
న్యూఢిల్లీ: భూసేకరణ ఆర్డినెన్సు రైతుల కడుపుకొట్టే ఆర్డినెన్సు అని గాంధేయవాది అన్నా హజారే మోదీ సర్కారుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోనంత వరకూ యుద్ధం ఆపేది లేదని మంగళవారం స్పష్టం చేశారు. తాము చేస్తున్నది మరో స్వాతంత్య్ర పోరాటంగా అభివర్ణించిన అన్నా.. ఎన్డీఏ తెచ్చిన ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, మండలాల్లో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు పాదయాత్రల నిర్వహణకు సంకల్పించాలని ప్రజలకు అన్నా పిలుపునిచ్చారు. భూ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన అన్నా ఆందోళన మంగళవారంతో ముగిసింది. నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్, ఆల్ ఇండియా యూనియన్ ఆఫ్ ఫారెస్టు వర్కింగ్ పీపుల్, అఖిల భారతీయ కిసాన్ సభ, నర్మదా బచావ్ ఆందోళన్ తదితర సంఘాలు ధర్నాలో పాల్గొన్నాయి. ఏపీ రాజధాని ప్రాంత రైతు, రైతు కూలీల పరిరక్షణ వేదిక, వైఎస్సార్‌సీపీ అన్నా ఆందోళనకు మద్దతు తెలిపాయి. భారీ ధర్నా వేదికపైనుంచి అన్నా హజారే మాట్లాడుతూ రైతుల కోసం బలిదానాలకు సిద్ధంకావాలన్నారు. నిరాహార దీక్ష చేసి తాను చనిపోవాలని అనుకోవడం లేదని, ప్రజలు, రైతుల కోసం జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.
కాగా, భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న అన్నాహజారేకు మద్దతుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం వేదిక పంచుకున్నారు. ఆయనతో పాటు ఢిల్లీ శాసనసభకు ఎన్నికైన ఆమ్‌ఆద్మీపార్టీ ఎమ్మెల్యేలు 67మందీ ధర్నాలో పాల్గొన్నారు. కార్పొరేట్ల కోసం ఓ దళారిలాగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. భూసేకరణ బిల్లు పేదల వ్యతిరేక బిల్లు, రైతుల వ్యతిరేక బిల్లు అని తెలుపుతూ బిల్లును వ్యతిరేకించడంలో అన్నా వెంట ఉన్నామని చెప్పారు.
సచివాలయానికి ఆహ్వానించిన కేజ్రీవాల్
ఢిల్లీ ప్రభుత్వ సచివాలయానికి బుధవారం రావలసిందిగా అన్నాను కేజ్రీవాల్ ఆహ్వానించారు. అన్నా రాకవల్ల ఢిల్లీ సచివాలయం పవిత్రమవుతుందని చెప్పారు. అన్ని ప్రభుత్వ విభాగాధిపతులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు స్ఫూర్తినిచ్చేందుకు వారితో మాట్లాడాలని అన్నాను కోరారు. అయితే అన్నా వేరే కార్యక్రమం వల్ల సచివాలయానికి వెళ్లక పోవచ్చని సమాచారం.
జైల్‌భరోకు సిద్ధం కండి..
Published Wed, Feb 25 2015 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM
Advertisement