
టీడీపీ సమర్ధిస్తుందా?వ్యతిరేకిస్తుందా?
గుంటూరు:కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న భూసేకరణ ఆర్డినెన్స్ ను టీడీపీ సమర్ధిస్తుందా?లేక వ్యతిరేకిస్తుందా?అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ప్రశ్నించారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడుల కోసమే భూసేకరణ ఆర్డినెన్స్ ను తెరపైకి తీసుకొచ్చారని ఆర్కే విమర్శించారు. భూసేకరణ ఆర్డినెన్స్ పై టీడీపీ తన వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్ ల అన్ని ప్రతిపక్ష పార్టీల సభ నుంచి వాకౌట్ చేసినా టీడీపీ ఎంపీలు మాత్రం సభలోనే ఉన్నారని రామకృష్ణా రెడ్డి ఎద్దేవా చేశారు. భూసేకరణ ఆర్డినెన్స్ ను మేధావులు సైతం వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ అంశంపై టీడీపీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కొంతమంది నాయకుల స్వార్ధపూరిత ప్రయోజనాల కోసమే బీజేపీ ప్రభుత్వం హడావిడిగా ఈ ఆర్డినెన్స్ ను తెచ్చిందన్నారు. ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తూ రైతులు ఇచ్చే 9.2 ఫారాల గడువును పొడగించాలన్నారు. భూసేకరణకు సంబంధించి 9.3 ఫారాలు ఇచ్చిన రైతులు కూడా పునరాలోచనలో పడ్డారని రామకృష్ణా రెడ్డి తెలిపారు.