
రాజధాని భూసేకరణకు బ్రేక్
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధానికి అవసరమైన మిగిలిన భూముల కోసం భూసేకరణ అస్త్రాన్ని ప్రయోగిస్తామని చెప్పిన ప్రభుత్వం చివరకు తోకముడవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు ప్రతిపక్షం ఆందోళనలు, మరోవైపు భూసేకరణ ఆర్డినెన్స్ గడువును కేంద్రం మరోసారి పొడిగించకపోవడంతో.. భూసేకరణ యోచనకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకాల్సి రానుంది.
వాస్తవానికి కేంద్రం ఆర్డినెన్స్ గడువును పొడిగించే అవకాశం లేదని ముందే తెలియడంతో భూసేకరణ నోటిఫికేషన్‌ను ఈలోపే ఇచ్చేయాలని ప్రభుత్వం హడావుడి పడింది. అందులో భాగంగానే తుళ్లూరు మండలంలోని ఐదు గ్రామాలకు సంబంధించిన 11 ఎకరాలను సేకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే అప్పటినుంచి భూ సేకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి భూసేకరణను వ్యతిరేకిస్తూ సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహిం చారు. ఈ నేపథ్యంలో మరింత ముందుకెళ్లడానికి ప్రభుత్వం సాహసించలేదు. ఈలోపు భూ సేకరణ ఆర్డినెన్స్‌ను మరోసారి పొడిగించే అవకాశం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టంగా ప్రకటించారు.
చివరిగా పొడిగించిన ఆర్డినెన్సు గడువు సోమవారంతో ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇక భూసేకరణకు వెళ్లే అవకాశం లేకుండాపోయింది. ఒకవేళ పట్టుదలకు పోతే 2013 భూసేకరణ చట్టం ప్రకారం చేయాలి. దీనిప్రకారం గ్రామసభలు నిర్వహించి 80 శాతం మంది అంగీకరిస్తేనే భూములు తీసుకోవాలి. బహుళ పంటలు పండే భూములను తీసుకోకూడదు. సామాజిక, ఆర్థిక సర్వే చేసి దాని ఆధారంగా అక్కడి ప్రజలకు పరిహారాన్ని ప్రకటించాలి. భూము లు కోల్పోయే రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి. అన్నింటికీ మించి తీసుకున్న భూముల విలువకు నాలుగు రెట్ల అధిక ధరను పరిహారంగా చెల్లించాలి. ఇవన్నీ చేయాడానికి భారీగా సొమ్ములు అవసరం. అవి లేకే పైసా ఖర్చులేని భూ సమీకరణను రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చి తెలివిగా రైతుల భూములను చాలావరకూ దక్కించుకుంది.
భూసమీకరణకు అంగీకరించని గ్రామాల రైతులను ఎలాగైనా లొంగదీసుకోవాలని, ముఖ్యం గా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ గ్రామాలకు చెందిన వారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ఆర్డినెన్స్ ద్వారా సేకరణకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు తొలి నోటిఫికేషన్ విడుదల చేసినా.. తదుపరి పరిణామాలు ప్రభుత్వానికి ప్రతికూలంగా మారాయి. చివరకు కేంద్రం సైతం వెనకడుగు వేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం సమీకరణ మినహా వేరే గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది.