
భూ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం
పునఃజారీని సవాల్ చేస్తూ ‘సుప్రీం’లో రైతు సంఘాల పిటిషన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం భూసేకరణ ఆర్డినెన్స్‌ను పునఃజారీచేయటం రాజ్యాంగ విరుద్ధమంటూ పలు రైతు సంఘాలు గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణంలో పారదర్శకత, న్యాయమైన పరిహారానికి హక్కు (సవరణ) ఆర్డినెన్స్ - 2015ను అమలు చేయకుండా ప్రభుత్వాన్ని నిరోధిస్తూ ఆదేశాలు జారీ చేయాలని భారతీయ కిసాన్ యూనియన్, గ్రామ్ సేవా సమితి, ఢిల్లీ గ్రామీణ్ స్వరాజ్, చోగామ వికాస్ అవాం ఈ పిటిషన్‌ను దాఖలు చేశాయి. పార్లమెంటులో చట్టం చేసే ప్రక్రియను కాదని.. వరుసగా ఆర్డినెన్స్‌లు జారీచేయటం రాజ్యాంగంలోని 14వ అధికరణను ఉల్లంఘించటమే కాక రాజ్యాంగాన్ని దగా చేయటమేనని ఆరోపించాయి.
భూసేకరణ బిల్లు 2015 మార్చి 10 నుంచి 20 మధ్య లోక్‌సభలో ఆమోదం పొందాక.. దానిని ఉద్దేశపూర్వకంగానే రాజ్యసభలో చర్చకు పెట్టలేదని.. ఆ సభలో ప్రభుత్వానికి అవసరమైన సంఖ్యాబలం లేకపోవటం, దానిపై ఏకాభిప్రాయం లేకపోవటం, రాజకీయ అభీష్టం లేకపోవటం దీనికి కారణమని వివరించాయి. కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాలు, హోంశాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలతో పాటు.. మంత్రివర్గ సచివాలయాన్ని ఈ వ్యాజ్యంలో ప్రత్యర్థులుగా చేర్చారు. ఆర్డినెన్స్‌లను కొనసాగించటం, వాటిని పునఃజారీచేయటం అనేది.. కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాన్ని బాహాటంగా వినియోగించటమేనని అభివర్ణించారు.
యూపీఏ చట్టం రైతులపై కుట్ర: జైట్లీ
యూపీఏ హయాంలో ఆమోదించిన భూసేకరణ చట్టం.. తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునే ఉద్దేశంతో.. పల్లెలను అభివృద్ధికి దూరంగా ఉంచేందుకు, భూమిలేని వారిని నిరుద్యోగులుగానే మిగిల్చేందుకు చేసిన కుట్ర అని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ఆరోపించారు. ఆయన భోపాల్‌లో మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో మాట్లాడారు.