Lok sabha elections 2024: నేడే రెండో దశ.. 13 రాష్ట్రాలో 88 స్థానాలకు ఎన్నికలు | Lok Sabha elections 2024: Lok Sabha Phase 2 Over 1200 candidates in fray for voting for 88 seats in 13 states | Sakshi
Sakshi News home page

Lok sabha elections 2024: నేడే రెండో దశ.. 13 రాష్ట్రాలో 88 స్థానాలకు ఎన్నికలు

Published Fri, Apr 26 2024 5:03 AM | Last Updated on Fri, Apr 26 2024 5:05 AM

అస్సాంలో బ్రహ్మపుత్ర నది మీదుగా బాగ్‌మోరా ఛపోరీ ద్వీపంలో పోలింగ్‌ కేంద్రానికి పడవలో బయల్దేరిన ఎన్నికల సిబ్బంది

సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక పోరులో రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో నేడు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్‌ నిర్వహించనున్నారు. 16 లక్షలకుపైగా సిబ్బందితో పోలింగ్‌కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. వాస్తవానికి 89 స్థానాల్లో పోలింగ్‌ జరగాల్సి ఉంది. కానీ మధ్యప్రదేశ్‌లోని బైతూల్‌లో బీఎస్పీ అభ్యర్థి హఠాన్మరణంతో అక్కడ ఓటింగ్‌ను మే 7వ తేదీకి వాయిదావేశారు. ఈరోజు కేరళలోని అన్ని 20 స్థానాలకు ఒకేసారి పోలింగ్‌ నిర్వహించనున్నారు.
 

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ 89 స్థానాల్లో ఎన్‌డీఏ కూటమి 56 చోట్ల, యూపీఏ కూటమి 24 చోట్ల విజయం సాధించాయి. ఇప్పటికే తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఏప్రిల్‌ 19వ తేదీన జరిగిన ఓటింగ్‌లో 65.5 శాతం పోలింగ్‌ నమోదైన విషయం విదితమే. నేతల మాటల మంటలు ఎన్నికల వేడిని మరింత రాజేసిన నేపథ్యంలో ఎండవేడిమిని సైతం తట్టుకుని ఈదఫా ఓటర్లు ఏ మేరకు పోలింగ్‌శాతాన్ని పెంచేస్తారో నేటితో తేలిపోనుంది. ఎండవేడి కారణంగా బిహార్‌లోని నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్‌ సమయాన్ని        పెంచారు.  

బరిలో కేంద్ర మంత్రులు
రెండోదశ పోలింగ్‌ ఉన్న స్థానాల్లో కేరళలోని వయనాడ్‌ స్థానంలో రాహుల్‌ గాం«దీ, సీపీఐ నాయకురాలు అన్నీ రాజా, బీజేపీ నుంచి కె. సురేంద్రన్‌ బరిలో నిలిచారు. తిరువనంతపురంలో నాలుగోసారి గెలవాలని శశిథరూర్‌ ఆశపడుతుండగా ఆయనను నిలువరించేందుకు కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ రంగంలో దిగారు. కర్ణాటకలోని బెంగళూరు సౌత్‌లో బీజేపీ నేత తేజస్వీ సూర్య, కాంగ్రెస్‌ నాయకురాలు సౌమ్యా రెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఉత్తరప్రదేశ్‌ నుంచి హేమామాలిని, అరుణ్‌ గోవిల్‌ పోటీచేస్తున్నారు.
 
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ జో«ద్‌పూర్‌ నుంచి మూడోసారి గెలవాలని ఉవి్వళ్లూరుతున్నారు. ఓం బిర్లా, డీకే సురేశ్‌(కాంగ్రెస్‌), కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి(జేడీఎస్‌), ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ భఘేల్‌(రాజ్‌నంద్‌గావ్‌), సు కాంత మజూందర్‌(బీజేపీ), రాజేశ్‌ రంజన్‌ అలియాస్‌ పప్పూ యాదవ్, వైభవ్‌ గెహ్లాట్, వి.సోమన్న, మన్సూర్‌ అలీ ఖాన్, కైలాశ్‌ చౌదరి సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కేరళలో 20 సీట్లకుగాను ఓడిపోయిన ఏకైక అలప్పుజ సీటును ఈసారి ఎలాగైనా గెలవాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కాంగ్రెస్‌ కూటమి బరిలో నిలిపింది.  

కేరళలో బీజేపీ బోణీ కొట్టేనా?
కేరళలో ఎలాగైనా బోణీ కొట్టేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది. అందుకే తొలి దశ ఎన్నికలు పూర్తయ్యాక కొత్తగా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తోందని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఓబీసీలకు కేటాయించిన కోటాలోనే ముస్లింలకు రిజర్వేషన్లు కలి్పస్తూ వారిపై కాంగ్రెస్‌ అతి ప్రేమ చూపిస్తోందంటూ మోదీ చేస్తున్న తీవ్ర విమర్శలు కేరళలో పాగా వేసేందుకు పనికొస్తాయా అనే చర్చ సర్వత్రా నెలకొంది. ముస్లింలను చొరబాటుదారులంటూ, హిందూ మహిళల మంగళసూత్రాలు, బంగారం లాగేసుకుని ముస్లింలకు పంచనుందన్న మోదీ ప్రసంగాలు ఏ మేరకు ముస్లిమేతర ఓట్లను బీజేపీ తనవైపునకు తిప్పుకోనుందో చూడాలి.
 

రాష్ట్రం               సీట్లు
కేరళ                 20
కర్ణాటక             14
రాజస్థాన్‌           13
మహారాష్ట్ర           8
ఉత్తరప్రదేశ్‌          8
మధ్యప్రదేశ్‌         6
అస్సాం              5
బిహార్‌               5
ఛత్తీస్‌గఢ్‌           3
పశి్చమబెంగాల్‌   3
మణిపూర్‌          1
త్రిపుర               1
జమ్మూకశీ్మర్‌   1
 

రెండో విడత              88 స్థానాలు
జనరల్‌                        73
ఎస్టీ                              6
ఎస్సీ                            9
మొత్తం అభ్యర్థులు    1,202
పురుషులు             1,098
మహిళలు                 102
థర్డ్‌ జెండర్‌                    2
మొత్తం ఓటర్లు      15.88 కోట్లు
పురుషులు          8.08 కోట్లు
మహిళా ఓటర్లు       7.8 కోట్లు
థర్డ్‌ జెండర్‌               5,929
తొలిసారి ఓటర్లు        34.8 లక్షలు
పోలింగ్‌ స్టేషన్లు    1.67 లక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement