ఏడు రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతున్న యునైటెడ్ ప్రొగెసివ్ అలయన్స్(UPA) (ఐక్య ప్రగతిశీల కూటమి) పేరు మార్చుకోబోతోందా?. బీజేపీపై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో మరో పేరుతో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో కూటమి నేతలు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు బెంగళూరు(కర్ణాటక) తాజ్ వెస్ట్‌ఎండ్ హోటల్ వేదిక సోమ, మంగళవారాల్లో జరగబోయే విపక్ష భేటీలో ఈ నిర్ణయమూ ఉండబోతుందనే సంకేతాలు అందుతున్నాయి.
బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి కూటమికి కొత్త పేరు ఉండాలనే యోచనలో ఉన్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ సహా టీఎంసీ, ఆమ్‌ఆద్మీ పార్టీలు పేరు మార్పుపై ఏకాభిప్రాయంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త పేరును మంగళవారం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2004-14 మధ్య రెండుసార్లు యూపీఏ కూటమి అధికారంలో కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇది కొనసాగుతోంది. సోనియా గాంధీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు.
ఇప్పటికే కీలక నేతలు బెంగళూరు బాట పట్టారు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఖర్గే ప్రసంగంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. 24 పార్టీల నేతలు ఈ రెండురోజుల కీలక భేటీకి హాజరు కానున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్షాలు ఈ భేటీని నిర్వహిస్తున్నాయి. కామన్ మినిమమ్ ప్రొగ్రామ్‌తో పాటు రాష్ట్రాల వారీగా సీట్ షేరింగ్ గురించి కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. అలాగే.. సీఎంపీ కోసం సబ్ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ర్యాలీలు, నిరసనలు, సదస్సుల నిర్వహణతో పాటు ఈవీఎంల విషయంలో ఎన్నికల సంఘానికి తమ అభ్యంతరాలను సైతం విపక్ష నూతన కూటమి తెలియజేసే ఛాన్స్ ఉంది.
యూపీఏ ప్రస్థానం ఇలా..
► 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఏపార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో.. ఐక్య ప్రగతిశీల కూటమి యూపీఏ కూటమి ఏర్పాటు అనివార్యమైంది.
► అప్పటికే అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి 181 సీట్లు గెల్చుకోగా.. యూపీఏ సంఖ్యాబలం 218కి చేరింది.
► అప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యా బలంలేని యూపీఏ బయటి పార్టీల మద్దతును కూడదీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
► లెఫ్ట్ ఫ్రంట్‌కు చెందిన 59 మంది ఎంపీలు, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 39 ఎంపీలు, బహుజన్ సమాజ్ పార్టీ 19 మంది ఎమ్మెల్యేలు.. యూపీఏలో చేరకుండానే మద్దతు ప్రకటిస్తూ వచ్చారు.
► గతంలో.. యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీయే కూటమి, పీవీ నరసింహారావు నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకు ముందూ వీపీ సింగ్, చంద్రశేఖర్‌ల నేతృత్వంలోని మైనార్టీ ప్రభుత్వాలు పాటించిన విధానాన్నే యూపీఏ పాటించి అధికారం చేపట్టింది.
► 2009-14 మధ్య కూడా.. యూపీఏ 2 కూటమి అధికారంలో కొనసాగింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ కూటమి 262 సీట్లు గెల్చుకోగా.. అందులో కాంగ్రెస్ 206 స్థానాలు దక్కించుకుంది. అయితే.. అప్పటికే కుంభకోణాలు యూపీఏ-2ను కుదిపేయడం ప్రారంభించాయి.
► అటుపై పలు రాజకీయ సమీకణాలు, ఇతరత్రా పరిణామాలు కూటమిని ఘోరంగా దెబ్బతీశాయి. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 60 సీట్లు మాత్రమే గెల్చుకోగలిగింది యూపీఏ కూటమి. అందులో ఒకే ఒక్క రాష్ట్రంలో అధికారం కైవసం దక్కించుకుంది.
► 2015-19 నడుమ.. యూపీఏ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. యూపీఏ కూటమి బలహీనపడుతూ వచ్చింది.
► ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో అయితే ఏకంగా 91 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అందునా కాంగ్రెస్ 52 స్థానాలను దక్కించకుంది. తద్వారా లోక్‌సభలో ప్రతిపక్ష హోదా(10 శాతం సీట్లు గెలిచి తీరాలి) కూడా దక్కించుకోలేని స్థితికి చేరుకుంది.
► ఆ తర్వాత కూటమి నుంచి కొన్ని పార్టీలు బయటకు వెళ్లడంతో.. యూపీఏ ఘోరంగా కుదేలు అయ్యింది.
► 2020 నుంచి యూపీఏలో మరిన్ని పార్టీలూ చేరుతూ వచ్చాయి. అయినప్పటికీ పలు రాష్ట్రాల ఎన్నికల్లో కూటమికి చేదు అనుభవమే ఎదురవుతూ వస్తోంది.
► అయితే తాజాగా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని మట్టి కరిపించి ఘన విజయం సాధించింది యూపీఏను లీడ్ చేస్తున్న కాంగ్రెస్. ఈ ఉత్సహాంతో యూపీఏను సంస్కరించి.. కొత్త పేరుతో ముందుకు సాగాలని భావిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment