![Congress slams former karnataka cm kumaraswamy for power theft - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/15/kumaraswamy.jpg.webp?itok=rizCCP_0)
బెంగళూరు: జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై బెంగళూరులో విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ కేసుకు సంబంధించి బెంగళూరు పవర్ సప్లై కంపెనీ విజిలెన్స్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా బుక్కయింది. భారత విద్యుత్ చట్టం(ఐఈఏ) సెక్షన్ 135 కింద కుమారస్వామిపై కేసు పెట్టారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే మూడేళ్ల దాకా శిక్ష లేదంటే జరిమానా విధిస్తారు.
దీపావళి సందర్భంగా బెంగళూరులో జేపీ నగర్‌లోని తన ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించుకునేందుకు కుమారస్వామి విద్యుత్ చోరీ చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై స్పందించిన కుమారస్వామి అది తన తప్పు కాదని చెప్పారు. ఒక ప్రైవేట్ డెకరేటర్ అవగాహన లేక తన ఇంటి బయట ఉన్న పోల్ నుంచి డెకరేషన్ కోసం ప్రత్యేక కనెక్షన్ తీసుకున్నాడని తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే తాను ఆ కనెక్షన్‌ను తొలగించానని చెప్పారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ ఘటన కాంగ్రెస్‌కు మంచి అవకాశంగా దొరికింది. ఇటీవలే కుమారస్వామి ఒక పప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి అసలు కరెంటే ఉండడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇస్తున్న గ్యారెంటీలేవీ అమలు కావని ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ మాటలు నమ్మొద్దని ప్రజలు, రైతులను కోరారు. కుమారస్వామి చెప్పినట్లు కర్ణాటకలో కరెంటే లేకపోతే ఎలా దొంగిలిస్తారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదీ చదవండి...సుబ్రతా రాయ్‌కు అమితాబ్‌తో దోస్తీ ఎలా కుదిరింది?
Comments
Please login to add a commentAdd a comment