power theft
-
కాంగ్రెస్‌కు అస్త్రంగా.. కుమారస్వామి విద్యుత్ చౌర్యం కేసు
బెంగళూరు: జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై బెంగళూరులో విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ కేసుకు సంబంధించి బెంగళూరు పవర్ సప్లై కంపెనీ విజిలెన్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా బుక్కయింది. భారత విద్యుత్ చట్టం(ఐఈఏ) సెక్షన్ 135 కింద కుమారస్వామిపై కేసు పెట్టారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే మూడేళ్ల దాకా శిక్ష లేదంటే జరిమానా విధిస్తారు. దీపావళి సందర్భంగా బెంగళూరులో జేపీ నగర్‌లోని తన ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించుకునేందుకు కుమారస్వామి విద్యుత్ చోరీ చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై స్పందించిన కుమారస్వామి అది తన తప్పు కాదని చెప్పారు. ఒక ప్రైవేట్ డెకరేటర్ అవగాహన లేక తన ఇంటి బయట ఉన్న పోల్ నుంచి డెకరేషన్ కోసం ప్రత్యేక కనెక్షన్ తీసుకున్నాడని తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే తాను ఆ కనెక్షన్‌ను తొలగించానని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ ఘటన కాంగ్రెస్‌కు మంచి అవకాశంగా దొరికింది. ఇటీవలే కుమారస్వామి ఒక పప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి అసలు కరెంటే ఉండడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇస్తున్న గ్యారెంటీలేవీ అమలు కావని ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ మాటలు నమ్మొద్దని ప్రజలు, రైతులను కోరారు. కుమారస్వామి చెప్పినట్లు కర్ణాటకలో కరెంటే లేకపోతే ఎలా దొంగిలిస్తారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదీ చదవండి...సుబ్రతా రాయ్‌కు అమితాబ్‌తో దోస్తీ ఎలా కుదిరింది? -
కరెంట్ చౌర్యం ఖరీదు రూ.3,158 కోట్లు
సాక్షి, అమరావతి: మీ పక్కనే కరెంట్ చౌర్యం జరుగుతున్నా నాకెందుకులే అనుకుంటున్నారా? అయితే ఆ దోపిడీకి మీరు కూడా మూల్యం చెల్లిస్తున్నారని మరిచిపోకండి! రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలు ఏటా సగటున 9.5 % వరకు నమోదవుతున్నాయి. ప్రతి సంవత్సరం 6,526 మిలియన్ యూనిట్ల విద్యుత్ లెక్కకు చిక్కడం లేదు. దీని ఖరీదు అక్షరాలా రూ.3,158 కోట్లు అని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విజిలెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు. టారిఫ్ పెంచడం, లోడ్ చార్జీల భారం మోపడం ద్వారా ఈ మొత్తాన్ని డిస్కమ్‌లు వినియోగదారుల నుంచే వసూలు చేస్తున్నాయి. ప్రత్యేక డ్రైవ్ పంపిణీ, సరఫరా నష్టాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని డిస్కమ్‌లకు సూచించినట్లు ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యుత్ చౌర్యంపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని ట్రాన్స్‌కో సీనియర్ ఇంజనీర్ రాజబాబు అభిప్రాయపడ్డారు. ఎవరో చేసిన చౌర్యం వల్ల నిజాయితీ కలిగిన వినియోగదారుడిపై భారం పడుతున్నట్లు తెలియచేయాలన్నారు. ఎందుకంటే... ఏపీ ట్రాన్స్‌కో, డిస్కమ్‌లు ఏటా 62 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగదారుల వద్దకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిపై యూనిట్‌కు రూ.4.84 చొప్పున రెవెన్యూ రావాలి. కానీ 6,526 మిలియన్ యూనిట్లు లెక్కకు రావడం లేదు. దీనికి పలు కారణాలున్నాయని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. కొందరు మీటర్లు సరిగా తిరగకుండా చేస్తున్నారు. మరికొందరు లైన్లపై నేరుగా వైర్లు వేసి మీటర్ లేకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. ఇలాంటివి వ్యవసాయ విద్యుత్ విషయంలో ఎక్కువగా ఉంటున్నాయి. కొన్ని రకాల పరిశ్రమల్లోనూ మీటర్‌ను టాంపర్ చేసి చౌర్యానికి పాల్పడుతున్నారని అధికారులు చెబుతున్నారు. కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే అడ్డదారిలో విద్యుత్ వాడుకుంటున్నారు. పబ్లిక్ మీటింగ్‌లు, ఫంక్షన్ల కోసం తాత్కాలిక మీటర్లు లేకుండా విద్యుత్ వినియోగిస్తున్నారు. ఇలా ఏటా నష్టపోయే రూ.3,158 కోట్ల విలువైన విద్యుత్ భారాన్ని అధికారులు టారిఫ్ రూపంలో ప్రజలపైనే వేస్తున్నారు. చౌర్యంపై ఇక నిఘా విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు ఫీడర్ల వారీగా వివరాలు సేకరించనున్నారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ అందుబాటులోకి తెస్తున్నామని ఈపీడీసీఎల్ అధికారి ఒకరు తెలిపారు. ఓ ఫీడర్ పరిధిలో ఎంత విద్యుత్ సరఫరా అవుతుంది? ఎంత రీడింగ్ జరుగుతుంది? అనే వివరాలను సాఫ్ట్వేర్ జిల్లా కార్యాలయానికి అందిస్తుంది. దీని ఆధారంగా ఆ ప్రాంతంలో చౌర్యాన్ని గుర్తించే వీలుంది. విద్యుత్తు సిబ్బంది సహకారంతో కొన్ని పరిశ్రమలు చౌర్యానికి పాల్పడుతున్నాయని భావిస్తున్నారు. ఇక నుంచి పంపిణీ, సరఫరా నష్టాలకు స్థానిక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లే బాధ్యులని కొద్ది నెలల క్రితం ఇంధనశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డిస్కమ్‌ల పరిధిలోని విజిలెన్స్ విభాగం కూడా ప్రతి మూడు నెలలకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సిబ్బంది పాత్ర ఉంటే కఠిన చర్యలు విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించాలని సిబ్బందికి సూచించాం. విద్యుత్ చౌర్యం వెనుక వారి పాత్ర ఉందని తెలిస్తే కఠిన చర్యలుంటాయి. చౌర్యాన్ని గుర్తించడానికి వినియోగదారుల సాయం కూడా తీసుకుంటాం. – శ్రీకాంత్ నాగులపల్లి, ఇంధన శాఖ కార్యదర్శి -
కరెంటు మీటర్ రీడింగ్‌నే మార్చారు
సిరిసిల్ల : విద్యుత్ వినియోగంపై సెస్ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుండగా, అంతకుమించిన పరిజ్ఞానంతో సెన్సార్ మీటర్లనే మార్చేసి విద్యుత్‌ను అక్రమంగా వాడుకుంటున్న వైనం సిరిసిల్లలో శుక్రవారం వెలుగుచూసింది. పట్టణంలోని నెహ్రూనగర్ ప్రాంతంలో సెస్ టౌన్ ఏఈ భక్తిసింగ్ ఆధ్వర్యంలో సెన్సార్ మీటర్లను తనిఖీ చేశారు. బొల్లి రవీందర్, గడ్డం శంకరయ్య, శ్రీనివాస్, సిద్దులవాడలో రాజేశం అనే వినియోగదారుల ఇళ్లలో సెన్సార్ మీటర్లను సీల్ ఓపెన్‌చేసి మీటరు తిరగకుండా కట్టడి చేశారు. తనిఖీల సందర్భంగా సెన్సార్ మీటర్ సీల్ ఓపెన్ చేసినట్లుగా సంకేతాలు ఇవ్వడంతో మరింత నిశితంగా మీటర్లను పరిశీలించారు. దీంతో విద్యుత్ చౌర్యం జరిగినట్లుగా నిర్ధారణ అయింది. సమాచారం అందుకున్న సెస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ యూనస్, డీఈఈ గోపికృష్ణ నెహ్రూనగర్‌కు వెళ్లి పరిశీలించారు. వినియోగదారులకు థెప్ట్‌కు సంబంధించి జరిమానా విధిస్తామని, ఆ మీటర్ల స్థానంలో కొత్త మీటర్లను ఏర్పాటు చేసినట్లు సెస్‌ఎండీ యూనస్ తెలిపారు. పదిరోజుల వ్యవధిలో సిరిసిల్ల పట్టణంలో 15 థెప్ట్ కేసులు నమోదయ్యాయని సెస్ ఎండీ యూనస్ వివరించారు. సెప్టెంబర్ 1 నుంచి విద్యుత్ చౌర్యానికి పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
ప్రకాశం బ్యారేజీపై విద్యుత్ చోరీ
అది ఓ భారీ ప్రాజెక్టు....అవినీతీ అంతకంటే భారీగానే జరుగుతోంది. మరమ్మతుల మా టున విద్యుత్‌ను యథేచ్ఛగా చోరీ చేస్తున్నారు. ఇదంతా తెలిసినా అధికారులు అదేమీ లేదంటూ నీళ్లు నములుతున్నారు. ప్రకాశం బ్యారేజీ మరమ్మతుల్లో చోటుచేసుకుంటున్న అవినీతి బాగోతం ఇది.. వివరాల్లోకి వెళితే... - తాడేపల్లి రూరల్ కొద్ది నెలలుగా ప్రకాశం బ్యారేజీ గేట్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. నాణ్యత లోపించిందని ఉన్నతాధికారులు మరమ్మతులు చేయిస్తున్నారు. దీనికి భారీస్థాయిలో విద్యుత్ వాడవలసి ఉంటుంది. అందుకు కాంట్రాక్టర్ జనరేటర్లు ఏర్పాటు చేసుకొని మరమ్మతులు చేయాలి. అయితే, ప్రభుత్వ కరెంటు ఉండగా, జనరేటర్లు ఎందుకు దండగా అనుకున్నారేమో తెచ్చిన జనరేటర్లను అలంకారప్రాయంగా బ్యారేజీపైనే ఉంచేసి ప్రభుత్వ విద్యుత్‌ను యథేచ్ఛగా వాడుకుంటున్నారు. గేట్లు మరమ్మతులకు నిత్యం 30కు పైగా వెల్డింగ్ మిషన్లు పనిచేయాలి. వీటికి సుమారు 1296 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించాల్సి ఉంటుంది. దీంతో జనరేటర్లను వదిలి, ప్రభుత్వ విద్యుత్‌ను చోరీచేస్తూ మరమ్మతులు కొనసాగిస్తున్నారు. అలాగే సాండ్ బ్లాస్టింగ్‌కు రోజుకు వంద యూనిట్లు, రాత్రి వేళ 20 ఫ్లడ్‌లైట్ల వినియోగానికి ఇలా ప్రతి పనికి జనరేటర్లను పక్కన పెట్టిన కాంట్రాక్టర్ ప్రభుత్వ విద్యుత్‌ను యథేచ్ఛగా చోరీ చేస్తున్నారు. కొద్ది నెలలుగా ప్రకాశం బ్యారేజీపై ఇదే తంతు కొనసాగుతున్నా అడిగే అధికారే లేకపోవడం ఆలోచించవలసిన విషయం. భారీ మొత్తంలో చోరీ చేస్తున్న విద్యుత్ భారం ప్రకాశం బ్యారేజీ నిర్వహణపై పడుతుంటే రోజూ పర్యవేక్షించే అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ నిర్వహణకు సంబంధించి విద్యుత్ శాఖకు రూ.45 లక్షల బకాయి పడినట్టు విశ్వసనీయ సమాచారం. గేట్ల మరమ్మతులకు సంబంధించి జరుగుతున్న విద్యుత్ చోరీపై ఓ ఉన్నతాధికారిని ప్రశ్నించగా, అటువంటిది ఏమీ లేదని చెప్పి, ఆ తరువాత చోరీని అరికడతామని చెప్పారు. -
విద్యుత్ చౌర్యానికి పాల్పడిన ఇద్దరి అరెస్టు
సంగారెడ్డి టౌన్, న్యూస్‌లైన్: విద్యుత్ చౌర్యానికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఏపీసీపీడీసీఎల్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఎం.పిచ్చయ్య తెలిపారు. మంగళవారం ఆయన కార్యాలయంలో విలేకరుల ఎదుట నిందితులను హాజరుపర్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం...అందోల్ మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన ఇటిక్యాల పోచయ్య రూ.25,848, పోసానిపేటకు చెందిన గాండ్ల దశరథ్ రూ.28,160 ట్రాన్స్‌కోకు బకాయి ఉన్నారు. దీంతో అధికారులు వీరి ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయితే వీరిద్దరూ బకాయి చెల్లించకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారు. ఇది గమనించిన ట్రాన్స్‌కో అధికారులు గత నెల వీరిని తొలి తప్పు కింద మందలించి వదిలివేశారు. అయితే వీరు బకాయి చెల్లించకపోగా, ఇటీవల రెండోసారి కూడా విద్యుత్ చౌర్యం చేస్తూ ట్రాన్స్‌కో అధికారులకు దొరికిపోయారు. వీరిని అరెస్టు చేసిన ఏపీసీపీడీసీఎల్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఎం.పిచ్చయ్య విద్యుత్ శాఖ చట్టప్రకారం కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించారు. వినియోగదారులు ఎవరైనా విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ పిచ్చయ్య హెచ్చరించారు. సమావేశంలో ఎస్ఐ గోవిందు, కానిస్టేబుళ్లు పరమేష్, శ్రీధర్‌గౌడ్, మస్తాన్పాష పాల్గొన్నారు.