అది ఓ భారీ ప్రాజెక్టు....అవినీతీ అంతకంటే భారీగానే జరుగుతోంది. మరమ్మతుల మా టున విద్యుత్‌ను యథేచ్ఛగా చోరీ చేస్తున్నారు. ఇదంతా తెలిసినా అధికారులు అదేమీ లేదంటూ నీళ్లు నములుతున్నారు. ప్రకాశం బ్యారేజీ మరమ్మతుల్లో చోటుచేసుకుంటున్న అవినీతి బాగోతం ఇది.. వివరాల్లోకి వెళితే...
- తాడేపల్లి రూరల్
కొద్ది నెలలుగా ప్రకాశం బ్యారేజీ గేట్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. నాణ్యత లోపించిందని ఉన్నతాధికారులు మరమ్మతులు చేయిస్తున్నారు. దీనికి భారీస్థాయిలో విద్యుత్ వాడవలసి ఉంటుంది. అందుకు కాంట్రాక్టర్ జనరేటర్లు ఏర్పాటు చేసుకొని మరమ్మతులు చేయాలి. అయితే, ప్రభుత్వ కరెంటు ఉండగా, జనరేటర్లు ఎందుకు దండగా అనుకున్నారేమో తెచ్చిన జనరేటర్లను అలంకారప్రాయంగా బ్యారేజీపైనే ఉంచేసి ప్రభుత్వ విద్యుత్‌ను యథేచ్ఛగా వాడుకుంటున్నారు. గేట్లు మరమ్మతులకు నిత్యం 30కు పైగా వెల్డింగ్ మిషన్లు పనిచేయాలి. వీటికి సుమారు 1296 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించాల్సి ఉంటుంది.
దీంతో జనరేటర్లను వదిలి, ప్రభుత్వ విద్యుత్‌ను చోరీచేస్తూ మరమ్మతులు కొనసాగిస్తున్నారు. అలాగే సాండ్ బ్లాస్టింగ్‌కు రోజుకు వంద యూనిట్లు, రాత్రి వేళ 20 ఫ్లడ్‌లైట్ల వినియోగానికి ఇలా ప్రతి పనికి జనరేటర్లను పక్కన పెట్టిన కాంట్రాక్టర్ ప్రభుత్వ విద్యుత్‌ను యథేచ్ఛగా చోరీ చేస్తున్నారు. కొద్ది నెలలుగా ప్రకాశం బ్యారేజీపై ఇదే తంతు కొనసాగుతున్నా అడిగే అధికారే లేకపోవడం ఆలోచించవలసిన విషయం. భారీ మొత్తంలో చోరీ చేస్తున్న విద్యుత్ భారం ప్రకాశం బ్యారేజీ నిర్వహణపై పడుతుంటే రోజూ పర్యవేక్షించే అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ నిర్వహణకు సంబంధించి విద్యుత్ శాఖకు రూ.45 లక్షల బకాయి పడినట్టు విశ్వసనీయ సమాచారం. గేట్ల మరమ్మతులకు సంబంధించి జరుగుతున్న విద్యుత్ చోరీపై ఓ ఉన్నతాధికారిని ప్రశ్నించగా, అటువంటిది ఏమీ లేదని చెప్పి, ఆ తరువాత చోరీని అరికడతామని చెప్పారు.
ప్రకాశం బ్యారేజీపై విద్యుత్ చోరీ
Published Mon, Mar 16 2015 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM
Advertisement