వైఫల్యం జంకుతోనే 'బోట్లపై బొంకు'! | CM Chandrababu Boats Politics In flood control and relief measures Failure | Sakshi
Sakshi News home page

వైఫల్యం జంకుతోనే 'బోట్లపై బొంకు'!

Published Wed, Sep 11 2024 5:03 AM | Last Updated on Wed, Sep 11 2024 8:30 AM

CM Chandrababu Boats Politics In flood control and relief measures Failure

వరద నియంత్రణ, సహాయ చర్యల్లో చేతులెత్తేసిన సీఎం చంద్రబాబు 

ఆ నిర్వాకాలను కప్పిపుచ్చేందుకే ‘బోటు’ రాజకీయం

బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల యజమాని ఉషాద్రి.. టీడీపీ వర్గీయుడే 

చంద్రబాబు, లోకేశ్, దేవినేని ఉమాకు అత్యంత సన్నిహితుడు

టీడీపీ హయాంలోనే ఆ బోట్లకు అనుమతి.. గెలిచాక విజయోత్సవ ర్యాలీలు

4 నెలలుగా కృష్ణా ఒడ్డునే బోట్లకు లంగరు 

మరో నిందితుడు రామ్మోహన్‌.. టీడీపీ ఎన్నారై నేత జయరామ్‌ సోదరుడి కుమారుడే

టీడీపీకే చెందిన అలూరి చిన్న పేరు ప్రస్తావించకపోవడంపై అనుమానాలు

బోట్ల ఉదంతాన్ని వైఎస్సార్‌సీపీకి అంటగట్టేందుకు బాబు విఫల యత్నాలు

వరద ముప్పుపై ప్రజలను అప్రమత్తం చేయకుండా తీవ్ర అలసత్వం

జలాశయాలు నిండు కుండలను తలపిస్తుంటే ‘ఫ్లడ్‌ కుషన్‌’ ఏది?

బోట్ల యజమాని.. టీడీపీ వర్గీయుడు... ఆ బోట్లకు అనుమతులిచ్చిందీ టీడీపీ ప్రభుత్వమే.. టీడీపీ విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నవి అవే బోట్లు...  అయినా సరే ఆ బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడం వైఎస్సార్‌సీపీ కుట్రే...! వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు నమోదు చేయండి.. ఇదీ సర్కారు ఆదేశం! ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కు రాజకీయ కుట్ర ఇదీ!!
– సాక్షి, అమరావతి 

అతి భారీ వర్షాలపై వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలను పెడచెవిన పెట్టడంతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు అప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నిండుకుండలను తలపిస్తున్నా దిగువకు ప్రవాహాన్ని విడుదల చేసేందుకు ప్లడ్‌ కుషన్‌ నిబంధనను పాటించకుండా సీఎం చంద్రబాబు లక్షల మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడారు. వరద ముంపు ముంచుకొస్తున్నా రెవెన్యూ, పోలీస్, జలవనరుల శాఖలతో కనీసం సమీక్ష నిర్వహించకుండా.. ప్రజలను అప్రమత్తం చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. మానవ తప్పిదంతో విజయవాడను వరదలు ముంచెత్తేందుకు కారణమయ్యారు. 

వరద నియంత్రణ, సహాయ, పునరావాస చర్యల్లో ఘోర వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ‘బోట్ల’ రాజకీయానికి తెర తీశారు. ఏకంగా రాజద్రోహం లాంటి కఠిన సెక్షన్ల కింద అక్రమ కేసులు బనాయించాలని ఆదేశించడం ఈ కుతంత్రానికి పరాకాష్ట. అయితే ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్ల యజమాని కొక్కిలగడ్డ ఉషాద్రి టీడీపీ వర్గీయుడన్న విషయం ఆధారాలతో సహా బట్టబయలైంది. ఆ బోట్లను కోమటి రామ్మోహన్‌ అనే వ్యక్తికి విక్రయించారన్న ప్రభుత్వ ఆరోపణలు అవాస్తవమని తేలిపోయింది. ఇక ఆ బోట్లకు అనుమతులిచ్చింది కూడా టీడీపీ హయాంలోనే కావడం గమనార్హం.  

అక్రమ కేసు కుట్రదారు బాబే.. 
ఓ వైపు విజయవాడలో 7 లక్షల మందికిపైగా వర­దలో చిక్కుకుని అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు బోట్ల ఉదంతానికి ఉద్దేశపూర్వకంగా ప్రాధాన్య­మిచ్చారు. తద్వారా అక్రమ కేసు నమోదు చేయాల్సిందేనని పోలీసులకు çసంకేతాలిచ్చారు. దీంతో బోట్లు ఢీకొనడం యాధృచి్ఛకమేనని అప్పటివరకు చెబుతూ వచ్చిన నీటిపారుదల శాఖ, పోలీసు శాఖ అధికారులకు ప్రభుత్వ పెద్దల ఆంతర్యం బోధపడింది. ఇక చేసేదిలేక ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఇదే అదనుగా అధికార పార్టీ నేతలు వైఎస్సార్‌సీపీపై బురదజల్లుతూ ఎల్లో మీడియాలో చర్చలతో హడావుడి చేస్తున్నారు.  

ఉషాద్రి టీడీపీ వర్గీయుడే 
బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల యజమాని కొక్కిలగడ్డ ఉషాద్రి టీడీపీ వర్గీయుడే. చంద్రబాబు, లోకేశ్, దేవినేని ఉమామహేశ్వరరావుకు ఆయన అత్యంత సన్నిహితుడు. ఉషాద్రి వారితో కలసి టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 2014–19 మధ్య టీడీపీ హ­యాంలోనే ఉషాద్రి బోట్లకు లైసెన్స్‌లు మంజూరయ్యాయి. ఆయన బోట్లకు మారిటైమ్‌ బోర్డ్‌ అను­మతులతోపాటు అమరావతి బోటింగ్‌ క్లబ్‌లో సభ్య­త్వం కూడా ఇచ్చారు.  దాంతో కృష్ణా నదిలో ఇసుక తవ్వి విక్రయించేవారు. 

ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తరువాత ని­ర్వహించిన విజయోత్సవ వేడుకల్లో ఉషాద్రి బోట్లు కూడా ఉన్నాయి. ఆ బోట్లకు టీడీపీ జెండాలు కట్టి పార్టీ నేతలు వాటిపై కృష్ణా నదిలో విహరిస్తూ బాణసంచా కాల్చారు. ఆ ఫొటోలు, వీడియోలు తాజా­గా వైరలయ్యాయి. టీడీపీలో అత్యంత క్రియాశీల సభ్యుడైన ఉషాద్రి బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొంటే అందుకు ఆ పారీ్టనే బాధ్యత వహించాలి కదా? వైఎస్సార్‌సీపీపై రాజకీయ కక్షతోనే ఆ­రోపణలు చేస్తున్నట్లు  పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.  
 


గోప్యత వెనుక గుట్టు ఇదీ..! 
పోలీసులు అరెస్ట్‌ చేసిన రెండో నిందితుడు కోమటి రామ్మోహన్‌కూ టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తల­శిల రఘురాం మేనల్లుడు అని పోలీసులు పేర్కొ­న్నారు. రామ్మోహన్‌ టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగంలో కీలక నేత కోమటి జయరాం సోదరుడి కుమారుడు అనే విషయాన్ని ప్రభుత్వం కప్పిపుచ్చుతోంది. ఇ­ప్ప­టికీ రామ్మోహన్‌ టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావుకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. ఆ విషయాలనూ ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. ఉషాద్రి, రా­మ్మో­హన్‌లకు మరో వ్యాపార భాగస్వామి ఉన్నారు. ఆయనే టీడీపీ నేత అలూరి చిన్న. ఈ ఉ­దంతంలో టీడీపీకి సంబంధాలున్నా­యనే విషయా­న్ని కప్పిపుచ్చేందుకే పోలీసులు ఆలూరి చిన్న పేరు­ను తప్పించారన్న విషయం కీలకంగా మారింది.  

టీడీపీ ప్రభుత్వ రాజకీయ కుట్రే 
వాస్తవానికి బోట్లు వరద ధాటికి తాళ్లు తెగి కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నట్లు నీటిపారుదల శాఖ, పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విషయాన్ని వెల్లడించకుండా వైఎస్సార్‌సీపీపై బురద చల్లేందుకు ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేసింది. బ్యారేజీని దెబ్బతీసేందుకే బోట్లను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టేలా చేశారని కేసు నమోదు చేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తెరతీసింది. వైఎస్సార్‌సీపీ నేతలు నందిగం సురేశ్, తలశిల రఘురాంను ఈ అక్రమ కేసులో ఇరికించాలన్నదే ప్రభుత్వ కుతంత్రం.

తేలిపోయిన ప్రభుత్వ కుట్ర...
ప్రకాశం బ్యారేజీకి తీవ్ర నష్టం కలిగించేందుకే కృష్ణా నదికి అటువైపు ఉన్న బోట్లను కొద్ది రోజుల ముందు ఇటువైపు తెచ్చారని మంత్రి రామానాయుడు చెబుతున్నారు. కానీ ఆ అభియోగాలు పూర్తిగా అవాస్తవమని ఆధారాలతో వెల్లడైంది. ఆ బోట్లను నాలుగు నెలలుగా గొల్లపూడి సమీపంలో కృష్ణా నదిని ఆనుకుని ఉన్న శ్మశానం సమీపంలోనే లంగరు వేసి ఉంచారు. గూగుల్‌ శాటిలైట్‌ ఫొటోలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

⇒ బోట్లను ఉద్దేశపూర్వకంగానే ప్లాస్టిక్‌ తాళ్లతో కట్టారని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని కేసులో ప్రస్తావించారు. కానీ ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న ఆ బోట్లే కాదు.. కృష్ణా నదిలో అన్ని బోట్లను అవే బలమైన ప్లాస్టిక్‌ తాళ్లతో లంగరు వేసి ఉంచుతున్నారు. అందుకోసమే తయారు చేసిన  ప్లాస్టిక్‌ తాళ్లను అమరావతి బోటింగ్‌ క్లబ్‌ తమ సభ్యులకు సరఫరా చేస్తోంది.

⇒ ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద ఉన్న స్లూయిజ్‌ చైన్లను తెంపేశారని ప్రభుత్వం ఆరోపించడం విడ్డూరంగా ఉంది. ‘అవేమీ చిన్నా చితకా తాళ్లు కాదు తెంపేయడానికి. బలమైన ఇనుప గొలుసులు. వాటిని తెంపడం అసాధ్యం’ అని నీటిపారుదల శాఖ అధికారులే వ్యాఖ్యానించడం గమనార్హం.

⇒ 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నేతలే కృష్ణా నది వద్ద ఇసుక వ్యాపారం చేస్తున్నారు. విజయవాడలో అన్ని బో­ట్లు ఆ పార్టీ నేతల ఆదీనంలోనే ఉన్నాయి. అవి బ్యారేజీని ఢీకొంటే అందుకు బాధ్యత టీడీపీ వర్గీయులదే అవుతుంది కానీ వైఎస్సార్‌సీపీకి ఏం సంబంధం?

ఈ ప్రశ్నలకు బదులేది బాబూ?
⇒ ఈ కేసులో కీలక నిందితుడు ఉషాద్రి స్వయంగా సీఎం చంద్రబాబుతోపాటు లోకేశ్, దేవినేని ఉమాకు సన్నిహితుడు కాదా?  
⇒ ఆ బోట్లు నాలుగు నెలలుగా కృష్ణా ఒడ్డున లంగరు వేసి ఉండటం నిజం కాదా? వరద సమయంలో వాటిని తొలగించకుండా నీటిపారుదల, పోలీసులు, పర్యాటక శాఖ అధికారులను ఎవరు అడ్డుకున్నారు?  
⇒ జూన్‌లో టీడీపీ విజయోత్సవ వేడుకల్లో ఆ బోట్లతో ర్యాలీ నిర్వహించలేదా? 
⇒ తలశిల రఘురాం, నందిగం సురేశ్‌తో­పాటు వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసుల నమోదుకు పోలీసులపై ఒత్తిడి తేవ­డం నిజం కాదా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement