కరెంట్‌ చౌర్యం ఖరీదు రూ.3,158 కోట్లు | Power theft cost is Rs 3158 crores | Sakshi
Sakshi News home page

కరెంట్‌ చౌర్యం ఖరీదు రూ.3,158 కోట్లు

Published Mon, Dec 9 2019 5:05 AM | Last Updated on Mon, Dec 9 2019 5:05 AM

Power theft cost is Rs 3158 crores - Sakshi

సాక్షి, అమరావతి: మీ పక్కనే కరెంట్‌ చౌర్యం జరుగుతున్నా నాకెందుకులే అనుకుంటున్నారా? అయితే ఆ దోపిడీకి మీరు కూడా మూల్యం చెల్లిస్తున్నారని మరిచిపోకండి! రాష్ట్రంలో విద్యుత్‌ పంపిణీ, సరఫరా నష్టాలు ఏటా సగటున 9.5 % వరకు నమోదవుతున్నాయి. ప్రతి సంవత్సరం 6,526 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లెక్కకు చిక్కడం లేదు. దీని ఖరీదు అక్షరాలా రూ.3,158 కోట్లు అని దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ విజిలెన్స్‌ అధికారి ఒకరు వెల్లడించారు. టారిఫ్‌ పెంచడం, లోడ్‌ చార్జీల భారం మోపడం ద్వారా ఈ మొత్తాన్ని డిస్కమ్‌లు వినియోగదారుల నుంచే వసూలు చేస్తున్నాయి. 

ప్రత్యేక డ్రైవ్‌ 
పంపిణీ, సరఫరా నష్టాలపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని డిస్కమ్‌లకు సూచించినట్లు ట్రాన్స్‌కో విజిలెన్స్‌ జేఎండీ వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యుత్‌ చౌర్యంపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని ట్రాన్స్‌కో సీనియర్‌ ఇంజనీర్‌ రాజబాబు అభిప్రాయపడ్డారు. ఎవరో చేసిన చౌర్యం వల్ల నిజాయితీ కలిగిన వినియోగదారుడిపై భారం పడుతున్నట్లు తెలియచేయాలన్నారు. 

ఎందుకంటే... 
ఏపీ ట్రాన్స్‌కో, డిస్కమ్‌లు ఏటా 62 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను వినియోగదారుల వద్దకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిపై యూనిట్‌కు రూ.4.84 చొప్పున రెవెన్యూ రావాలి. కానీ 6,526 మిలియన్‌ యూనిట్లు లెక్కకు రావడం లేదు. దీనికి పలు కారణాలున్నాయని విజిలెన్స్‌ అధికారులు చెబుతున్నారు. కొందరు మీటర్లు సరిగా తిరగకుండా చేస్తున్నారు. మరికొందరు లైన్లపై నేరుగా వైర్లు వేసి మీటర్‌ లేకుండా విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నారు. ఇలాంటివి వ్యవసాయ విద్యుత్‌ విషయంలో ఎక్కువగా ఉంటున్నాయి. కొన్ని రకాల పరిశ్రమల్లోనూ మీటర్‌ను టాంపర్‌ చేసి చౌర్యానికి పాల్పడుతున్నారని అధికారులు చెబుతున్నారు. కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే అడ్డదారిలో విద్యుత్‌ వాడుకుంటున్నారు. పబ్లిక్‌ మీటింగ్‌లు, ఫంక్షన్ల కోసం తాత్కాలిక మీటర్లు లేకుండా విద్యుత్‌ వినియోగిస్తున్నారు. ఇలా ఏటా నష్టపోయే రూ.3,158 కోట్ల విలువైన విద్యుత్‌ భారాన్ని అధికారులు టారిఫ్‌ రూపంలో ప్రజలపైనే వేస్తున్నారు. 

చౌర్యంపై  ఇక నిఘా 
విద్యుత్‌ చౌర్యాన్ని అరికట్టేందుకు ఫీడర్ల వారీగా వివరాలు సేకరించనున్నారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి తెస్తున్నామని ఈపీడీసీఎల్‌ అధికారి ఒకరు తెలిపారు. ఓ ఫీడర్‌ పరిధిలో ఎంత విద్యుత్‌ సరఫరా అవుతుంది? ఎంత రీడింగ్‌ జరుగుతుంది? అనే వివరాలను సాఫ్ట్‌వేర్‌ జిల్లా కార్యాలయానికి అందిస్తుంది. దీని ఆధారంగా ఆ ప్రాంతంలో చౌర్యాన్ని గుర్తించే వీలుంది. విద్యుత్తు సిబ్బంది సహకారంతో కొన్ని పరిశ్రమలు చౌర్యానికి పాల్పడుతున్నాయని భావిస్తున్నారు. ఇక నుంచి పంపిణీ, సరఫరా నష్టాలకు స్థానిక అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లే బాధ్యులని కొద్ది నెలల క్రితం ఇంధనశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డిస్కమ్‌ల పరిధిలోని విజిలెన్స్‌ విభాగం కూడా ప్రతి మూడు నెలలకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.  

సిబ్బంది పాత్ర ఉంటే  కఠిన చర్యలు
విద్యుత్‌ పంపిణీ, సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించాలని సిబ్బందికి సూచించాం. విద్యుత్‌ చౌర్యం వెనుక వారి పాత్ర ఉందని తెలిస్తే కఠిన చర్యలుంటాయి. చౌర్యాన్ని గుర్తించడానికి వినియోగదారుల సాయం కూడా తీసుకుంటాం.            
– శ్రీకాంత్‌ నాగులపల్లి, ఇంధన శాఖ కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement