aptransco
-
ఏపీ గ్రిడ్‌తో ‘సెంబ్‌కార్ప్’ అనుసంధానం
సాక్షి, అమరావతి: విద్యుత్ వృథాకు అడ్డుకట్ట వేయడంతోపాటు విద్యుత్ ఆదా చేయడం ద్వారా వినియోగదారులపై భారం తగ్గించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు ఏపీ ట్రాన్స్‌కో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సెంబ్‌కార్ప్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణణం చేపట్టింది. 5 కిలోమీటర్ల పొడవున ఈ లైన్ పూర్తికావడంతో మంగళవారం ఏపీట్రాన్స్కో అధికారులు సెంబ్‌కార్ప్ థర్మల్ ప్లాంటు లైన్‌ను పవర్‌గ్రిడ్ లైన్ నుంచి తప్పించి ఏపీగ్రిడ్ లైన్‌కు అనుసంధానం చేశారు. దీంతో పవర్‌గ్రిడ్ ట్రాన్స్మిషన్ లైన్లతో సంబంధం లేకుండా నేరుగా ఏపీట్రాన్స్కో ట్రాన్స్మిషన్ లైన్ల ద్వారా ఏపీ గ్రిడ్‌కు, అక్కడ నుంచి డిస్కంలకు విద్యుత్ సరఫరా అవుతోంది. ఏడాదికి రూ.365 కోట్లు ఆదా విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లో భాగంగా సెంబ్‌కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈఐఎల్)కు చెందిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని థర్మల్ పవర్ ప్లాంటు నుంచి రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఈ ప్లాంటు నుంచి పవర్‌గ్రిడ్‌కు చెందిన ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా ఏపీ ఏపీట్రాన్స్కోకు చెందిన రాష్ట్ర గ్రిడ్‌కు, అక్కడి నుంచి డిస్కమ్‌లకు విద్యుత్ సరఫరా అవుతోంది. పవర్‌గ్రిడ్ ట్రాన్స్మిషన్ లైన్ వినియోగించుకున్నందుకు ఆ సంస్థకు యూనిట్‌కు రూ.0.72 పైసలు చొప్పున ఏపీ ట్రాన్స్‌కో చెల్లిస్తోంది. అంటే రోజుకు సగటున రూ.కోటి పవర్‌గ్రిడ్‌కు ట్రాన్స్‌కో ఇవ్వాల్సి వస్తోంది. సెంబ్‌కార్ప్ థర్మల్ పవర్ ప్లాంట్‌తో ఏపీ గ్రిడ్‌ను నేరుగా అనుసంధానం చేయడంవల్ల ఈ ఖర్చు ఆదా కానుంది. రోజుకు 15 మిలియన్ యూనిట్ల చొప్పున ఏడాదికి సుమారు 5,475 మిలియన్ యూనిట్ల విద్యుత్ ‘సెంబ్‌కార్ప్’ నుంచి రాష్ట్ర గ్రిడ్‌కు సరఫరా అవుతోంది. శుభపరిణామం: మంత్రి పెద్దిరెడ్డి తక్కువ సమయంలోనే ఈ లైన్ నిర్మాణం పూర్తిచేసి సెంబ్కార్ప్ను నేరుగా ఏపీ గ్రిడ్‌కు అనుసంధానం చేయడం రాష్ట్రానికి ఎంతో మేలు చేకూర్చే పరిణామమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. -
డిమాండ్‌కు సరిపడా విద్యుత్.. రాష్ట్రంలో ఎక్కడా కోత లేదు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ హామీ మేరకు రాష్ట్రంలో డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా జరుగుతోందని, ఎక్కడా విద్యుత్ కోతలు విధించడంలేదని ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో) బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ నెల 24న 206.62 మిలియన్ యూనిట్లు, 25న 197.19 మిలియన్ యూనిట్లు, 26న 201.97 మిలియన్ యూనిట్లు చొప్పున ఎలాంటి విద్యుత్ లోటు, లోడ్ రిలీఫ్‌లు లేకుండా అందించాయని తెలిపింది. ఈ మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీజెన్కో) థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు సగటున రోజుకు 80 మిలియన్ యూనిట్లు అందించాయని వెల్లడించింది. 27వ తేదీ వరకు సగటు విద్యుత్ ఎగుమతి (అమ్మకాలు) రోజుకు 1.36 మిలియన్ యూనిట్లు మాత్రమేనని పేర్కొంది. అందువల్ల సరఫరా – డిమాండ్ గ్యాప్ కారణంగా లోడ్ రిలీఫ్‌లు లేవని, గ్రిడ్ డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను డిస్కంలు సమకూర్చుకుంటున్నాయని తెలిపింది. విద్యుత్ కొరత తీర్చడానికి ఎప్పటికప్పుడు బహిరంగ మార్కెట్ (ఎనర్జీ ఎక్సే్చజీలు) నుంచి కొని, రాష్ట్రంలోని వినియోగదారులకు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నాయని వివరించింది. -
సాంకేతికతతో ‘పవర్’ఫుల్‌గా ప్రసారం
సాక్షి, అమరావతి: ఏపీ ట్రాన్స్‌కో సొంతంగా ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటూ.. నిర్వహణను సులభతరంగా మార్చుకుంటోంది. భవిష్యత్ విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్రంలో ప్రసార వ్యవస్థ(ట్రాన్స్మిషన్ నెట్వర్క్)ను మరింత బలోపేతం చేస్తోంది. నెట్వర్క్ మెయింటెనెన్స్, మానిటరింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను సులభతరం చేసేందుకు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్)ను అమలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ జీఐఎస్‌కు 63,000 టవర్లు, 30,010 సర్క్యూట్ కిలోమీటర్ల పొడవు లైన్లు, 358 ఎక్స్ట్రా హైటెన్షన్ సబ్స్టేషన్ల నెట్‌వర్క్‌ను అనుసంధానించింది. దీంతో మొత్తం నెట్వర్క్ నిర్వహణ సులభతరంగా మారింది. క్షేత్రస్థాయి అధికారుల విధులతో పాటు నెట్వర్క్ సమాచారాన్ని భౌగోళికంగా ఒకే ప్లాట్‌ఫాంపై మ్యాపింగ్ చేసింది. ఈ మ్యాపింగ్‌లను ఉపయోగించి డేటాను యాక్సెస్ చేయడం ద్వారా నిర్వహణ కార్యకలాపాలకు రూపకల్పన జరుగుతోంది. అలాగే జీఐఎస్ వల్ల ఫీల్డ్ ఇంజనీర్లకు ప్రాథమిక సర్వే నిర్వహించడం సులభంగా మారింది. మరోవైపు తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడానికి సహాయపడేలా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అంతర్గత డిమాండ్ అంచనా నమూనా(ఇన్‌హౌస్ ఎనర్జీ ఫోర్ కాస్టింగ్ మోడల్)ను కూడా అభివృద్ధి చేసింది. ఇది దాదాపు 99 శాతం కచ్చితత్వాన్ని కలిగి ఉంది. దీన్ని ఉపయోగించి విద్యుత్ అవసరాలను ముందే అంచనా వేస్తున్నారు. దీని ద్వారా విద్యుత్ సంస్థలు.. తమ కొనుగోళ్లలో కొన్ని రూ.కోట్లను పొదుపు చేసే అవకాశం ఉంది. ఏపీలో అభివృద్ధి చేసిన ఈ ఫోర్ కాస్టింగ్ మోడల్ దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ సంస్థల్లోనే మొదటిది. దీంతో అనేక రాష్ట్రాలు ఈ మోడల్‌ను తమకూ ఇవ్వాలని ఏపీని కోరుతున్నాయి. సీఎం ఆశయానికి అనుగుణంగా.. – బి.శ్రీధర్, సీఎండీ,ఏపీ ట్రాన్స్‌కో ఇటీవలే రెండు జాతీయ స్థాయి అవార్డులను గెల్చుకున్నాం. భవిష్యత్‌లోనూ విద్యుత్ ప్రసార నష్టాలను 2.8 శాతంలోపు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలనే సీఎం వైఎస్ జగన్ ఆశయానికి అనుగుణంగా ఏపీ ట్రాన్స్‌కో ఉత్తమ సాంకేతిక విధానాలను అమలు చేస్తోంది. డిస్కంలకు ఇవి సహాయపడతాయి. ఏపీ ట్రాన్స్‌కో విధానాలను తమకూ చెప్పాలని తమిళనాడు, రాజస్తాన్ తదితర రాష్ట్రాలు కోరాయి. -
అద్దెకివ్వండి.. ఆదాయం పొందండి!
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన సంస్కరణల్లో భాగంగా మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల అప్పులు రూ.1.32 లక్షల కోట్లకు చేరడంతో వాటి వసూలుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం.. తాజాగా రాష్ట్రాలకు ఓ మార్గాన్ని చూపింది. గతేడాది అమల్లోకి తెచ్చిన ఎలక్ట్రిసిటీరూల్స్–2021(ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్లానింగ్, డెవలప్మెంట్ అండ్ రికవరీ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జెస్)కు కొనసాగింపుగా మరికొన్ని నిబంధనలను ప్రవేశపెడుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తద్వారా రాష్ట్రాలు తమ ఆధీనంలోని విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను అమ్ముకునేందుకు, ఇతరుల నుంచి కొనుక్కునేందుకు, లీజుకు ఇవ్వడానికి అవకాశం కల్పించింది. ఈ వెసులుబాట్లతో విద్యుత్ సంస్థలు ఆదాయాన్ని ఆర్జించి అప్పుల ఊబి నుంచి బయటపడతాయని కేంద్రం చెబుతోంది. నెట్వర్క్ సమస్యకు చెక్ ఆంధ్రప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్(ఏపీ ట్రాన్స్‌కో)కు ప్రస్తుతం 5,532.161 సీకేఎం(సర్క్యూట్ కిలోమీటర్ల) మేర 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 12,200.9 సీకేఎం మేర 220 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 13,568.18 సీకేఎం మేర 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు ఉన్నాయి. మొత్తంగా 400 కేవీ, 220 కేవీ,132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు 354 ఉండగా, వాటి ద్వారా రాష్ట్రంలోని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థలకు ఏడాదికి సగటున 70 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్పొరేషన్ యాజమాన్యంలోని అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ లైన్లను ప్రయివేటుకు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. డిస్కంల ఆధీనంలోని ట్రాన్స్మిషన్ లైన్ల లీజుకు అవకాశం కల్పించింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న లైన్లను అద్దె ప్రాతిపదికన ఇకపై ఎవరికైనా ఇవ్వొచ్చు. భవిష్యత్‌లో రానున్న ప్రైవేటు డిస్కంలకు నెట్వర్క్ సమస్యలు రాకుండా చూడటం దీని ప్రధాన ఉద్దేశం. ఇదీ చదవండి: రూ.10 వేల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన! -
రూ.3,897.42 కోట్లతో విద్యుత్ వ్యవస్థ పటిష్టం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో) ఆధ్వర్యంలో విద్యుత్ వ్యవస్థను పటిష్టపరిచే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇందుకోసం మొత్తం రూ.3,897.42 కోట్లు ఖర్చు చేస్తోంది. కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం, లైన్ల ఆధునికీకరణ, కొత్త విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అమర్చడం వంటి పనులతో పాటు ప్రస్తుతం ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేపట్టారు. ఈ పనులన్నీ పూర్తయితే సాంకేతిక, సరఫరా నష్టాలు తగ్గి విద్యుత్ సంస్థలు ఆర్థికంగా బలపడటంతోపాటు వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్ అందుతుందని అధికారులు చెబుతున్నారు. ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో 31,301 సర్క్యూట్ కిలోమీటర్ల (సీకేఎంల) మేర విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లు ఉన్నాయి. వీటిలో 5,532.161 సర్క్యూట్ కిలోమీటర్ల (సీకేఎంల) 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 12,200.9 సీకేఎంల 220 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 13,568.18 సీకేఎంల పొడవున 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు ఉన్నాయి. ఇవి 354 మార్గాల ద్వారా రాష్ట్ర, అంతర్రాష్ట్ర పవర్ గ్రిడ్‌కు అనుసంధానమయ్యాయి. ఏపీ ట్రాన్స్‌కో పరిధిలో 351 సబ్స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 400 కేవీ సామర్థ్యంగలవి 16, 220 కేవీ సామర్థ్యం ఉన్నవి 103, 132 కేవీ సామర్థ్యంగలవి 232 సబ్స్టేషన్లు ఉన్నాయి. ఈ 351 సబ్స్టేషన్ల ద్వారా రాష్ట్రంలోని తూర్పు, మధ్య, దక్షిణప్రాంత విద్యుత్ సంస్థలకు (డిస్కంలకు) ఏడాదికి సగటున 70 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ పంపిణీ జరుగుతోంది. ఆ విద్యుత్‌ను డిస్కంలు వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయి. వీటన్నిటినీ అధికారులు తనిఖీ చేయించనున్నారు. ఎక్కడైనా ఆయిల్ లీకేజీలు ఉన్నా, కాయిల్స్ మార్చాల్సి వచ్చినా, వైండింగ్ చేయాల్సినా, స్విచ్‌లు, ఇతర సామగ్రి పాడైనా గుర్తించి వాటిస్థానంలో కొత్తవి అమర్చాలని భావిస్తున్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ‘విద్యుత్ పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేయడం వల్ల అనేక నష్టాలను తగ్గించవచ్చు. ట్రాన్స్మిషన్ నష్టాలను పరిశీలిస్తే.. 2018–19లో 3.10 శాతం ఉండగా, 2022–23లో మే నెల నాటికి 2.83 శాతానికి తగ్గాయి. 2014–15లో ఇవి 3.37 శాతం ఉండేవి. అలాగే విద్యుత్ సరఫరా నష్టాలు 2020–21లో 7.5 శాతం ఉండగా, 2021–22లో 5 శాతానికి తగ్గాయి. సాంకేతిక, వాణిజ్య (ఏటీ అండ్ సీ) నష్టాలు 2020–21లో 16.36 శాతం ఉండగా 2021–22లో 11 శాతమే ఉన్నాయి. ఇలా సాంకేతిక నష్టాలను తగ్గించేందుకు, మరింత నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు అందించేందుకు ప్రభుత్వ సహకారంతో పనులు జరుగుతున్నాయి.’ – బి.శ్రీధర్, సీఎండీ, ఏపీ ట్రాన్స్‌కో -
లెక్క.. ఇక పక్కా!
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లలో సరికొత్త సాంకేతికత రాష్ట్ర విద్యుత్ సంస్థలకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ ఉపయోగించి ఒక రోజు ముందు విద్యుత్ డిమాండ్ అంచనా వేస్తున్నారు. ఇప్పుడు పవన విద్యుత్, సౌర విద్యుత్, మార్కెట్ సూచన, డిస్పాచ్ మోడల్, ఫ్రీక్వెన్సీ సూచనల కోసం 4 రోజుల ముందే డిమాండ్‌ను అంచనా వేసేలా ఎనర్జీ ఫోర్కాస్టింగ్ సాంకేతికత (నూతన సాఫ్ట్వేర్)ను విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో) అభివృద్ధి చేసింది. భవిష్యత్ డిమాండ్‌ను ఎదుర్కొనేలా ఏపీ ట్రాన్స్‌కోకు ప్రస్తుతం 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు 5532.161 సర్క్యూట్ కిలోమీటర్లు (సీకేఎం) ఉన్నాయి. మరో 12200.9 సీకేఎం 220 కేవీ లైన్లు ఉన్నాయి. 132 కేవీ లైన్లు 13568.18 సీకేఎం పొడవున విస్తరించాయి. వీటి ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలకు ఏటా సగటున 70 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ పంపిణీ జరుగుతోంది. వచ్చే మార్చినాటికి విద్యుత్ డిమాండ్ రోజుకు అత్యధికంగా 250 మిలియన్ యూనిట్లకు చేరుతుందని ఏపీ ట్రాన్స్‌కో గ్రిడ్ నిర్వహణ విభాగం అంచనా వేసింది. ప్రస్తుత లైన్లపై అదనపు భారం మోపకుండా ఈ అసాధారణ పెరుగుదలను ఎదుర్కొనేందుకు చర్యలు మొదలయ్యాయి. ఆ ప్రయత్నాల్లో ‘ఎనర్జీ ఫోర్కాస్టింగ్’ కూడా ఒకటని ఏపీ ట్రాన్స్‌కో చెబుతోంది. ముందస్తు అంచనాలతో ప్రయోజనాలు విద్యుత్ సంస్థలు దీర్ఘకాలిక సంప్రదాయ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) కాలం నుండి స్వల్పకాలిక ఒప్పందాలు (షార్ట్ టెర్మ్ టెండర్లు) వైపు మళ్లుతున్నాయి. ఈ క్రమంలో ఇంధన ధరల అంచనా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎనర్జీ ఫోర్కాస్టింగ్ ద్వారా థర్మల్, సోలార్, విండ్, గ్యాస్ వంటి ప్రతి విద్యుత్ ఉత్పత్తి స్టేషన్ నుండి డిస్కంలకు ఎంత విద్యుత్ పంపిణీ చేయాలో నాలుగు రోజుల ముందే తెలుసుకోవచ్చు. ప్రతి 15 నిమిషాలకు ఇది అప్డేట్ అవుతుంటుంది. అంతేకాదు తక్కువ ఖర్చుతో విద్యుత్ పంపిణీ ఎక్కడి నుంచి ఎప్పుడు జరుగుతుందో కచ్చితంగా అంచనా వేసే అవకాశం ఉంటుంది. పవర్ జనరేటర్లు, డిస్కంలు తగిన బిడ్డింగ్ వ్యూహాలను రూపొందించడానికి ధర అంచనా డేటాను ఉపయోగిస్తున్నాయి. జనరేటర్ల ధరల గురించి కచ్చితమైన సూచనను తెలుసుకొంటే దాని లాభాలను పెంచుకోవడానికి బిడ్డింగ్ వ్యూహాన్ని రూపొందించవచ్చు. అలాగే మరుసటి రోజు కచ్చితమైన ధర ఎంతో అంచనా వేయగలిగితే డిస్కంలు సొంత ఖర్చులను తగ్గించుకోవడానికి వ్యూహాన్ని రూపొందించుకోవచ్చు. ఖర్చు తగ్గుతుంది పవన, సౌర విద్యుత్ కొనుగోళ్లలో, ఫ్రీక్వెన్సీ సూచనలు తెలుసుకోవడంలో జాతీయ స్థాయిలో విద్యుత్ రంగ నిపుణుల సహకారంతో నాలుగు రోజుల ముందే అంచనాలు రూపొందించడానికి ఈ సాంకేతికతను అభివృద్ధి చేశాం. గ్రిడ్ డిమాండ్‌ను తీర్చడానికి, అతి తక్కువ తేడాతో విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేయడానికి ఎనర్జీ ఫోర్కాస్టింగ్ మోడల్ ఉపయోగపడుతుంది. దీనిద్వారా బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్‌ను కొనొచ్చు. తద్వారా విద్యుత్ కొనుగోలు ఖర్చు తగ్గుతుంది. –బీ శ్రీధర్, సీఎండీ, ఏపీ ట్రాన్స్‌కో -
ట్రాన్స్‌కో పటిష్టతతోనే విద్యుత్ సమస్యలకు చెక్
సాక్షి, అమరావతి: విద్యుత్ సమస్యలకు చెక్ పెట్టి, ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలంటే ఏపీ ట్రాన్స్‌కో పటిష్టంగా ఉండాలని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నారు. ఆయన సోమవారం సచివాలయంలో ట్రాన్స్‌కో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో రూ.3,897.42 కోట్లతో జరుగుతున్న పనులను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. వీటిలో వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.223.47 కోట్లతో, గ్రీన్ ఎనర్జీ కారిడార్ కోసం రూ.941.12 కోట్లతో, విశాఖపట్నం–చెన్నై కారిడార్‌లో రూ.605.56 కోట్లతో పనులు జరుగుతున్నాయని వివరించారు. మూడు జోన్లలో సిస్టమ్ ఇంప్రూవ్‌మెంట్‌లో భాగంగా రూ.762.53 కోట్ల పనులు, అలాగే 400 కేవీ సామర్థ్యంతో కూడిన విద్యుత్ సరఫరా కోసం రూ.1,257.56 కోట్ల పనులు, ఇతరత్రా రూ.107.18 కోట్ల పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఎస్ఎస్ఆర్పై కమిటీ ట్రాన్స్‌కో చేపట్టిన పనులకు సంబంధించి ఏటా స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ (ఎస్ఎస్ఆర్)పై రివిజన్ జరగాలని సూచించారు. ఇందుకోసం వెంటనే కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్, ట్రాన్స్ కో జేఎండీ పృధ్వీతేజ్, డిప్యూటీ సెక్రటరీ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు సకాలంలో అనుమతులు రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి, నిర్మాణ పనులకు సకాలంలో నిబంధనలకు అనుగుణంగా అనుమతులివ్వాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం అటవీ శాఖ, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, ఎస్ఎస్ఏ, జెన్కో, ట్రాన్స్‌కో, ఏపీఐఐసీ తదితర ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన పనులు అటవీ ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయన్నారు. అటవీ శాఖ నుంచి అనుమతులు రాకపోవడం వల్ల ఆయా పనులు ముందుకు సాగడం లేదనే ఫిర్యాదులొస్తున్నాయని తెలిపారు. ఫారెస్ట్ కన్సర్వేటివ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ విభాగాలు అవసరమైన అనుమతులు పొందడంలో అలసత్వం వహిస్తున్నాయన్నారు. అడవులు, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ప్రసాద్, అటవీ దళాల అధిపతి ప్రతీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘టెలిస్కోపిక్’తో తక్కువ బిల్లులు
సాక్షి, అమరావతి: టెలిస్కోపిక్ బిల్లింగ్ ద్వారా తక్కువ భారం పడుతుందని గృహ విద్యుత్ వినియోగదారులకు విస్తృత అవగాహన కల్పించాలని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ విద్యుత్ సంస్థలను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ఆదివారం ఆయన వెబినార్ ద్వారా సమీక్షించారు. ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఏ.చంద్రశేఖర్ రెడ్డి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వీతేజ్, డిస్కమ్‌ల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె.పద్మాజనార్దన్ రెడ్డి, కె.సంతోష్ రావు, డైరెక్టర్లు ఏవీకే భాస్కర్, కె.ముథుపాండియన్, జి.చంద్రశేఖరరాజు ఇందులో పాల్గొన్నారు. టెలిస్కోపిక్ బిల్లింగ్‌కు సంబంధించిన వివరాలతో కరపత్రాలను విద్యుత్తు బిల్లులతో వినియోగదారులకు అందజేయాలని ఇంధన శాఖ కార్యదర్శి సూచించారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. నూతన టెలిస్కోపిక్ విధానంతో వినియోగదారులకు మేలు జరుగుతుంది. దీనివల్ల మొత్తం వినియోగానికి ఒకే స్లాబ్‌లో బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు ఒక వినియోగదారుడు నెలకు 250 యూనిట్లు వాడితే తొలి 30 యూనిట్లకు యూనిట్ రూ.1.90 చొప్పున, తర్వాత 45 యూనిట్లకు యూనిట్ రూ.3, ఆ తర్వాత 50 యూనిట్లకు యూనిట్ రూ.4.50, అనంతరం 100 యూనిట్లకు యూనిట్ రూ.6, చివరి 25 యూనిట్లకు యూనిట్ రూ.8.75 చొప్పున బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడంతో పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా ప్రక్రియను బలోపేతం చేసేందుకు ఏపీఈఆర్సీ కొత్త విద్యుత్తు టారిఫ్ ప్రకటించింది. 1.91 కోట్ల మంది వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడంలో డిస్కమ్‌లకు ఊరట కల్పించేలా కొత్త టారిఫ్ ఉంది. రాష్ట్రంలో 100 యూనిట్లలోపు విద్యుత్తు వాడే వారికి యూనిట్ రూ.3.11 చార్జీ పడుతుంది. ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. కర్ణాటక, రాజస్థాన్, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో 100 యూనిట్లలోపు వాడే వినియోగదారులు యూనిట్ రూ.8.26, రూ.8.33, రూ.7.74, రూ.7.20, రూ.6.19, రూ.6.61, రూ.6.10 చొప్పున చెల్లిస్తున్నారు. రాష్ట్రంలోని 1.50 కోట్ల మంది గృహ వినియోగదారుల్లో 1.44 కోట్ల (95%) మంది 225 యూనిట్లలోపు వినియోగించే కేటగిరీలోనే ఉన్నారు. 225 యూనిట్లలోపు వినియోగించే వారి నుంచి డిస్కంలు సగటు ధర కంటే తక్కువగానే చార్జీలు వసూలు చేస్తున్నాయి. మూడు డిస్కంలకు మొత్తం సర్వీసు చార్జీ రూ.6.82 నుంచి రూ.6.98కి పెరిగినా వినియోగదారుల నుంచి తక్కువగానే వసూలు చేస్తున్నాం. జిల్లాల విభజన నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. పట్టణీకరణతో విద్యుత్తు డిమాండ్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. (చదవండి: పోలీస్ ఉద్యోగాల కోసం... యువతకు ఉచిత శిక్షణ) -
AP: ఆ వాదనలో నిజం లేదు: ట్రాన్స్ కో ఎండీ
సాక్షి, విజయవాడ: ప్రస్తుతం 230 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని.. ట్రాన్స్‌కో ఎండీ శ్రీధర్ అన్నారు. వేసవి దృష్ట్యా వినియోగం పెరిగిందని.. అదనపు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విద్యుత్ వినియోగంలో 50 శాతం జనాభా 75 యూనిట్లలోపు టారిఫ్‌లోకి వస్తారన్నారు. 50 శాతం మంది ప్రజల మీద పెరిగిన విద్యుత్ ఛార్జీలు భారం స్వల్పంగానే ఉంటుందని తెలిపారు. ప్రజల కోరిక మేరకే టెలిస్కోపిక్ విధానం అమలు చేస్తున్నామని.. ఈ విధానంతో ప్రజలపై పెద్దగా భారం పడదని శ్రీధర్ అన్నారు. చదవండి: సమగ్ర భూసర్వేతో దేశానికే ఏపీ ఒక దిక్సూచి కావాలి: సీఎం జగన్ ‘‘విద్యుత్ ఛార్జీల సవరణ ద్వారా ప్రజలపై పడే భారం స్వల్పమే. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయం ప్రభుత్వానిది కాదు.. ఏపిఈఆర్సీది. గతంలో దీర్ఘకాలిక విద్యుత్ సరఫరా ఒప్పందాలు అధిక ధరలకు చేసుకున్నారు. బొగ్గు ధరల కారణంగా గతంలో కొన్ని యూనిట్లు మూసేయాల్సి వచ్చింది. ప్రస్తుతం వేసవి కారణంగా డిమాండ్ పెరిగింది. అందుకే 230 మిలియన్ యూనిట్లు వినియోగం అవుతోంది. వాస్తవానికి సాధారణ రోజుల్లో 180 మిలియన్ యూనిట్ల వినియోగం మాత్రమే ఉంటుంది. దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంటే తీవ్ర నష్టం జరుగుతుంది. పీపీఏల రద్దు వల్లే ప్రస్తుతం ఛార్జీలు పెరిగాయన్న వాదన నిజం కాదు. పీపీఏలను ప్రభుత్వం రద్దు చేయలేదు. ధరలను సమీక్షించమనే ప్రభుత్వం కంపెనీలను కోరింది. సెకీ నుంచి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం. ఉచిత విద్యుత్ సరఫరా కోసమే సెకీ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్తును వినియోగిస్తామని’’ శ్రీధర్ తెలిపారు. -
విపత్తుల్లోనూ 'పవర్'ఫుల్
సాక్షి, అమరావతి: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా ఏపీ విద్యుత్ సంస్థలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్)తో విద్యుత్ శాఖ సమగ్ర సమాచారాన్ని క్రోడీకరించడం ద్వారా దక్షిణాది పవర్ గ్రిడ్‌కు అనుసంధానం చేసే దిశగా అడుగులు పడతున్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర పవర్ గ్రిడ్ పర్యవేక్షిస్తోంది. దీనిపై ఇటీవల కేంద్రంతో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లితో కలిసి రాష్ట్ర అధికారులు చర్చించారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వివరించారు. రియల్ టైమ్ పద్ధతిలో పర్యవేక్షించేలా.. రాష్ట్రంలో వేలాది కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు విస్తరించి ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా సబ్ స్టేషన్లతో విద్యుత్ నెట్వర్క్ ఉంది. ఇది ఇతర రాష్ట్రాలకు అనుసంధానమై ఉంటుంది. అవసరమైనప్పుడు మనం విద్యుత్ ఇవ్వడం, తీసుకోవడానికి ఈ లైన్లు ఉపయోగపడతాయి. అయితే, అటవీ ప్రాంతాలు, జలాశయాలు, కొండల్లో విద్యుత్ నెట్వర్క్ విస్తరించి ఉంది. ఈ సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎక్కడ ఏ లైన్‌కు ఇబ్బంది ఉంది? ఆ ప్రాంతంలో ఎన్ని సర్వీసులకు సమస్య రావచ్చు? ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ అందించడం ఎలా? వరదలొస్తే ఏ సబ్ స్టేషన్లకు ముప్పు ఉంటుంది? ఇలా అనేక రకాల సమాచారాన్ని భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా అందిస్తారు. అవసరమైనప్పుడు కేవలం మౌస్ క్లిక్ ద్వారా క్షేత్రస్థాయి సమాచారం తేలికగా తెలుసుకునే వీలుంది. ఓవర్ లోడింగ్ సహా అన్ని అంశాలను రియల్ టైం పద్ధతిలో పర్యవేక్షించేందుకు పవర్ గ్రిడ్లకు ఇది తోడ్పడుతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ నెట్‌వర్క్‌ను మ్యాపింగ్ చేసే కార్యక్రమానికి ట్రాన్స్‌కో శ్రీకారం చుట్టింది. సదరన్ గ్రిడ్‌లో అమలు చేసేలా.. ఈ విధానానికి సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని బెంగళూరులోని సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ), కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ సిస్టం ఆపరేషన్స్ కార్పొరేషన్ (పీవోఎస్‌వోసీవో)లు ఏపీ ట్రాన్స్‌కోను కోరాయి. దీన్ని మరో ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కలిపే సదరన్ గ్రిడ్‌లో అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలోనే ఏపీ ట్రాన్స్‌కో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సబ్ స్టేషన్ల జియో ట్యాగింగ్, సరఫరా లైన్లు, డిస్ట్రిబ్యూషన్ లైన్ల భౌతిక పరిస్థితి, ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంలకు సంబంధించిన సరఫరా, పంపిణీ నెట్వర్క్ వెరసి ఏపీ గ్రిడ్ మొత్తాన్ని రియల్ టైం పద్ధతిలో పర్యవేక్షించవచ్చు. ఏపీ నెట్వర్క్ మొత్తాన్ని సదరన్ గ్రిడ్ మ్యాపింగ్ చేస్తుంది. దీనివల్ల రియల్ టైం పద్ధతిలో లైన్ల ఓవర్ లోడింగ్, అండర్ లోడింగ్‌తో పాటు వాతావరణం, లోడ్ షెడ్యూలింగ్‌ను ముందుగానే అంచనా వేయడం, ప్రకృతి విపత్తుల సమయంలో బాధిత ప్రాంతాలను పరిశీలించడం, రియల్ టైం పద్ధతిలో లైన్లను తనిఖీ చేయడం వంటి అనేక ఉపయోగాలు ఉంటాయి. -
Andhra Pradesh: రూ. 2,342.45 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: గత సర్కారు హయాంలో అప్పుల పాలై దివాలా దశకు చేరిన విద్యుత్ సంస్థలు ఇప్పుడు పొదుపు చర్యలు పాటించడం ద్వారా ప్రజాధనాన్ని కాపాడుతున్నాయి. విద్యుత్ కొనుగోళ్లలో గత రెండేళ్లలో ఏకంగా రూ.2,342.45 కోట్లు ఆదా చేసి దేశంలోనే రికార్డు సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రం సైతం ప్రశంసించింది. పూర్తి పారదర్శకంగా, చౌక విద్యుత్ కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇవ్వడం వల్లే దీన్ని సాధించినట్లు ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి వెల్లడించారు. సరికొత్త మైలురాయిని చేరుకోవడంపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. యూనిట్ రూ.3.12కే కొనుగోలు ఇంధనశాఖలో విద్యుత్ కొనుగోళ్లు అత్యంత కీలకం. పైసా తేడా వచ్చినా భారం రూ.కోట్లల్లో ఉంటుంది. గత సర్కారు దీన్ని గుర్తించకపోవడం వల్లే డిస్కమ్‌లు నష్టాల బాట పట్టాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మొట్టికాయలేసింది. ఈ తరహా పొరపాట్లు జరగకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. గత రెండేళ్లుగా చౌక విద్యుత్ కొనుగోళ్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. దీని ద్వారా రూ.2,342.45 కోట్లు ఆదా అయింది. 2019–20లో 3,393 మిలియన్ యూనిట్లు, 2020–21లో 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్తును బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేశారు. సరఫరా చార్జీలు కలిపి సగటున యూనిట్ రూ.3.12 చొప్పున వెచ్చించారు. నిజానికి ఈ విద్యుత్ కొనడానికి యూనిట్‌కు రూ.4.55 వరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించినా అంతకన్నా తక్కువకే విద్యుత్ సంస్థలు కొనుగోలు చేయడం గమనార్హం. మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో.. చౌక విద్యుత్ కొనుగోలుకు ఏపీ ట్రాన్స్‌కో, గ్రిడ్ నిర్వహణ విభాగం దేశంలోనే తొలిసారిగా మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) టెక్నాలజీని అందిపుచ్చుకుంది. గతంలో 24 గంటల ముందు కొనాల్సిన విద్యుత్‌కు ఆర్డర్లు ఇచ్చారు. సరికొత్త టెక్నాలజీ వల్ల కేవలం 15 నిమిషాల్లోనే డిమాండ్‌ను పసిగట్టి అవసరమైన మేరకు ఆర్డర్ ఇవ్వగలిగారు. మరోవైపు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వ్యవస్థను ట్రాన్స్‌కో ఏర్పాటు చేసింది. గత కొన్నేళ్లుగా విద్యుత్ డిమాండ్, లభ్యతను సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానించి వాస్తవ డిమాండ్, లభ్యతను అంచనా వేశారు. దీనివల్ల విద్యుత్ వృథాను అరికట్టడంతోపాటు ఎక్కువ ధరకు కొనుగోళ్లను నియంత్రించగలిగారు. ఖరీదైన విద్యుత్‌కు కత్తెర.. 625 మెగావాట్ల ఖరీదైన విద్యుత్‌ను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) ద్వారా తీసుకుంటుండగా దీన్ని కేంద్రానికి అప్పగించారు. ఫలితంగా డిస్కమ్‌లపై రూ. 1,007 కోట్ల భారం తగ్గింది. గతంలో కేంద్ర విద్యుత్తు గ్రిడ్ మూడు నెలలకు ఒకసారి ఏపీ డిస్కంల నుంచి సీటీయూ (సెంట్రల్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ), పీవోసీ (పాయింట్ ఆఫ్ కనెక్షన్) చార్జీలు వసూలు చేసేది. రాష్ట్ర ఇంధన శాఖ ఒత్తిడి మేరకు కేంద్రం మార్పులు చేసింది. ఫలితంగా రాష్ట్ర విద్యుత్ సంస్థలకు రూ.350 కోట్లు ఆదా అయింది. ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – కేంద్ర విద్యుత్తు శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ ‘విద్యుత్తు కొనుగోళ్లలో భారీ మొత్తంలో ప్రజల సొమ్మును ఆదా చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కోవిడ్ సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అభినందనీయం. ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచింది’ విద్యుత్ శాఖ బలోపేతమే లక్ష్యం – బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యుత్తు శాఖ మంత్రి ‘ఆంధప్రదేశ్ సాధించిన విజయం ప్రశంసనీయం. విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా ముందుకెళ్లాలి’ -
బలమైన గాలి వీచినా ఇక చెక్కుచెదరవ్!
సాక్షి, అమరావతి: విద్యుత్ లైన్లను మరింత బలోపేతం చేయాలని ఏపీ ట్రాన్స్‌కో నిర్ణయించింది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా తట్టుకునేలా నూతన డిజైన్‌ను తీసుకురాబోతోంది. దీని కోసం కొన్ని నెలలుగా దేశ, విదేశీ సాంకేతికతను అధ్యయనం చేసింది. తుపానుల నేపథ్యంలో తరచూ టవర్లు కూలుతుండటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గంటకు 300 కిలోమీటర్ల గాలి వీచినా తట్టుకునేలా టవర్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. కొత్తగా వేసే లైన్లలో ముందుగా దీన్ని పాటించనుంది. ప్రస్తుతం ఉన్న లైన్లను క్రమంగా ఈ స్థాయికి తీసుకువచ్చే వీలుందని గ్రిడ్ అధికారులు వెల్లడించారు. ఎంతకైనా తట్టుకునేలా... ► ఏపీ ట్రాన్స్‌కోకు రాష్ట్రవ్యాప్తంగా 400 కేవీ, 220, 132 కేవీల లైన్లు, సబ్స్టేషన్లు, లైన్లు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త లైన్లు వేసేందుకు ఏపీ ట్రాన్స్‌కో ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని లైన్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ► ప్రస్తుతం ట్రాన్స్‌కో టవర్స్ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా తట్టుకుంటాయి. భూమి తీరును బట్టి వీటి నిర్మాణం చేపడతారు. నేల మెత్తగా ఉంటే మరింత లోతుగా, ఎక్కువ ఇనుము వాడి పునాది గట్టిగా వేస్తారు. ► హుద్‌హుద్ తుపాను సమయంలో బలమైన ట్రాన్స్‌కో టవర్లకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. తుపాను తాకిడికి దాదాపు 62 విద్యుత్ టవర్లు నేలకూలాయి. కల్పక–ఖమ్మం లైన్లో 400 కిలోవాట్ల సామర్థ్యం గత 14 టవర్స్ పడిపోయాయి. ► సాధారణంగా గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని మించి గాలి వీచిన దాఖలాలు అప్పటి వరకూ లేవు. హుద్‌హుద్ అనుభవాన్ని పరిశీలించిన తర్వాత గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునే టవర్స్ నిర్మాణం అవసరమని ట్రాన్స్‌కో భావిస్తోంది. ► తుపాను ప్రభావిత ప్రాంతాలపైనే ముందుగా అధికారులు దృష్టి పెట్టారు. అక్కడి పరిస్థితులను బట్టి డిజైన్‌కు రూపకల్పన చేశామని ట్రాన్స్‌కో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పుడున్న దానికన్నా టవర్ ఎత్తు పెంచడం, మరింత బలమైన మెటీరియల్ ఉపయోగించేలా డిజైన్‌లో మార్పు తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ► కొత్త డిజైన్‌ను అందుబాటులోకి తెస్తే టవర్ నిర్మాణ వ్యయం స్వల్పంగా పెరిగే వీలుందని, అయితే, ఎలాంటి తుపానులొచ్చినా కూలిపోయే వీల్లేదని చెప్పారు. ఆ సమయంలో జరిగే నష్టంతో పోల్చుకుంటే ఇప్పుడే కొంత ఎక్కువ వెచ్చించడం భారం కాదన్నారు. -
పల్లెపల్లెకూ 'పవర్' ఫుల్
సాక్షి, అమరావతి: రాయలసీమలో విద్యుత్ ఉత్పత్తికి అపార అవకాశాలున్నాయి. కోస్తాంధ్రలో విద్యుత్ డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఏపీ ట్రాన్స్‌కో ఈ రెండినీ సమన్వయం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాయలసీమ, కోస్తాంధ్రను అనుసంధానం చేస్తూ పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు నడుం బిగించింది. కొత్త లైన్ల ఏర్పాటు, గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ల నిర్మాణంతో పాటు రూ.1,349 కోట్లతో పలు ప్రాజెక్టులు చేపట్టినట్టు ఏపీ ట్రాన్స్‌కో ఉన్నతాధికారి ఆదివారం మీడియాకు తెలిపారు. దీనివల్ల ప్రతీ పల్లెకు మరింత నాణ్యమైన విద్యుత్ అందబోతోందని ఆయన వివరించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసే గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ వల్ల లో ఓల్టేజీ సమస్యను నివారించవచ్చని తెలిపారు. సీమ, కోస్తాంధ్ర అనుసంధానం రాయలసీమ, కోస్తా ఆంధ్రను అనుసంధానం చేసే 400 కేవీ లైను నిర్మించేందుకు ఏపీ ట్రాన్స్‌కో సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల అన్ని జిల్లాలు ప్రయోజనం పొందుతాయి. రాష్ట్రంలో తొలిసారిగా గుంటూరు జిల్లాలోని తాళ్లయపాలెంలో 400 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్‌ను ఏపీ ట్రాన్స్‌కో ఏర్పాటు చేయనుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో గృహ, వ్యవసాయ విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ఇది దోహద పడుతుంది. అనంతపురం జిల్లా హిందుపూర్, చిత్తూరు జిల్లా రాచగున్నేరి, ప్రకాశం జిల్లా పొదిలిలో గల 400 కేవీ సబ్ స్టేషన్లలో బస్ రియాక్టర్లను పెట్టడం వల్ల ఈ జిల్లాలలో 400 కేవి లైన్లలో వోల్టేజీ సమస్యలు పరిష్కరించొచ్చు. స్విచ్చింగ్ స్టేషన్స్ అనంతపురం జిల్లా ముదిగుబ్బ, వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రిలో 220 కేవీ స్విచ్చింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పామూరులోని 132 కేవీ సబ్ స్టేషన్‌ను 220 కేవీకి పెంచుతున్నారు. సిఎస్పురం, రుద్రసముద్రం సోలార్ పార్కుల నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్ సరఫరాకు 220 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. శరవేగంగా సోలార్ లైన్లు రాయలసీమ జిల్లాలైన అనంతపురం, వైఎస్సార్, కర్నూలులో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ మొత్తం విద్యుత్‌ను ఇతర కోస్తాంధ్రతో పాటు ఇతర ప్రాంతాలకు చేర్చాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అనంతపురం జిల్లాలోని తలారిచెరువు 400 కేవీ సబ్ స్టేషన్ నుంచి ప్రకాశం జిల్లా పొదిలి 400 కేవీ సబ్ స్టేషన్ వరకు 400 కేవీ లైన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల కోస్తా, రాయలసీమ ప్రాంతాలను అనుసంధానం చేయవచ్చని ట్రాన్స్‌కో ఉన్నాతాధికారి తెలిపారు. డిమాండ్ కన్నా ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి అయితే, ఆ విద్యుత్తును పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియాకు పంపాల్సి ఉంటుంది. ఇలా కాకుండా అదనపు విద్యుత్‌ను కూడా ఉపయోగించుకోవాలని రాష్ట్రం యోచిస్తోంది. -
ఆర్థిక క్రమశిక్షణ వైపే అడుగులు
సాక్షి, అమరావతి: ఆర్థిక నిర్వహణలో మరింత పొదుపు పాటించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరా సంస్థ (ఏపీ ట్రాన్స్‌కో) నిర్ణయించింది. చౌక విద్యుత్ కొనుగోళ్లు, వృధా వ్యయాన్ని తగ్గించడంపైనే రాబోయే కాలంలో దృష్టి పెట్టాలని తీర్మానించింది. ఏపీ ట్రాన్స్‌కో బోర్డు సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా ట్రాన్స్‌కో ఆర్థిక పరిస్థితిపై సమావేశంలో చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ► వృధాను అరికట్టడంలో గత ఏడాదిగా తీసుకున్న నిర్ణయాలు దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శ ప్రాయమైందని, ముందస్తు వ్యూహంతో చౌక విద్యుత్‌ను కొనుగోలు చేయడం వల్ల రూ.700 కోట్లు మిగిల్చినట్టు పేర్కొన్నారు. ► తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్, యూపీ వంటి రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించేందుకు ఏపీని ఆదర్శంగా తీసుకుంటున్నాయని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. ఈ విషయౖ మె ఆయా రాష్ట్రాలు సంప్రదించినట్టు వివరించారు. ► గడచిన ఏడాదిలోనే రాష్ట్ర విద్యుత్ సంస్థలు రూ.4,783.23 కోట్లు ఆదా చేయగలిగాయని శ్రీకాంత్ ప్రస్తావించారు. 2018–19లో రూ. 48,110.79 కోట్లున్న విద్యుత్ సంస్థల వ్యయాన్ని 2019–20 నాటికి రూ.43,437.56 కోట్లకు తగ్గించినట్టు తెలిపారు. ► విద్యుత్ కొనుగోలుకు ముందే ప్రణాళిక రూపొందించడం వల్ల యూనిట్ రూ.1.63 నుంచి రూ.2.80 మధ్యే లభించిందని, ఇది విద్యుత్ సంస్థల ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించిందని సమావేశం అభిప్రాయపడింది. ► విద్యుత్ సంస్థలను నష్టాల నుంచి గట్టెక్కించే క్రమంలో ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును బోర్డు ప్రశంసించింది. గత ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ సబ్సిడీలకు ఈ ఏడాది రూ.11,311.70 కోట్లు విడుదల చేయడం, రూ.8,353.58 కోట్లు వ్యవసాయ సబ్సిడీ ఇవ్వడంపై ట్రాన్స్‌కో బోర్డు హర్షం వ్యక్తం చేసింది. ► విద్యుత్ సంస్థల ఆర్థిక నిర్వహణ పర్యవేక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబును బోర్డు ప్రత్యేకంగా అభినందించింది. ► విద్యుత్ సంస్థలకు రాష్ట్రం ఇస్తున్న సబ్సిడీ ఏ ఇతర రాష్ట్రాల్లోనూ ఇవ్వడం లేదని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్ గుర్తు చేశారు. -
కరెంట్ చౌర్యం ఖరీదు రూ.3,158 కోట్లు
సాక్షి, అమరావతి: మీ పక్కనే కరెంట్ చౌర్యం జరుగుతున్నా నాకెందుకులే అనుకుంటున్నారా? అయితే ఆ దోపిడీకి మీరు కూడా మూల్యం చెల్లిస్తున్నారని మరిచిపోకండి! రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలు ఏటా సగటున 9.5 % వరకు నమోదవుతున్నాయి. ప్రతి సంవత్సరం 6,526 మిలియన్ యూనిట్ల విద్యుత్ లెక్కకు చిక్కడం లేదు. దీని ఖరీదు అక్షరాలా రూ.3,158 కోట్లు అని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విజిలెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు. టారిఫ్ పెంచడం, లోడ్ చార్జీల భారం మోపడం ద్వారా ఈ మొత్తాన్ని డిస్కమ్‌లు వినియోగదారుల నుంచే వసూలు చేస్తున్నాయి. ప్రత్యేక డ్రైవ్ పంపిణీ, సరఫరా నష్టాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని డిస్కమ్‌లకు సూచించినట్లు ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యుత్ చౌర్యంపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని ట్రాన్స్‌కో సీనియర్ ఇంజనీర్ రాజబాబు అభిప్రాయపడ్డారు. ఎవరో చేసిన చౌర్యం వల్ల నిజాయితీ కలిగిన వినియోగదారుడిపై భారం పడుతున్నట్లు తెలియచేయాలన్నారు. ఎందుకంటే... ఏపీ ట్రాన్స్‌కో, డిస్కమ్‌లు ఏటా 62 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగదారుల వద్దకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిపై యూనిట్‌కు రూ.4.84 చొప్పున రెవెన్యూ రావాలి. కానీ 6,526 మిలియన్ యూనిట్లు లెక్కకు రావడం లేదు. దీనికి పలు కారణాలున్నాయని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. కొందరు మీటర్లు సరిగా తిరగకుండా చేస్తున్నారు. మరికొందరు లైన్లపై నేరుగా వైర్లు వేసి మీటర్ లేకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. ఇలాంటివి వ్యవసాయ విద్యుత్ విషయంలో ఎక్కువగా ఉంటున్నాయి. కొన్ని రకాల పరిశ్రమల్లోనూ మీటర్‌ను టాంపర్ చేసి చౌర్యానికి పాల్పడుతున్నారని అధికారులు చెబుతున్నారు. కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే అడ్డదారిలో విద్యుత్ వాడుకుంటున్నారు. పబ్లిక్ మీటింగ్‌లు, ఫంక్షన్ల కోసం తాత్కాలిక మీటర్లు లేకుండా విద్యుత్ వినియోగిస్తున్నారు. ఇలా ఏటా నష్టపోయే రూ.3,158 కోట్ల విలువైన విద్యుత్ భారాన్ని అధికారులు టారిఫ్ రూపంలో ప్రజలపైనే వేస్తున్నారు. చౌర్యంపై ఇక నిఘా విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు ఫీడర్ల వారీగా వివరాలు సేకరించనున్నారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ అందుబాటులోకి తెస్తున్నామని ఈపీడీసీఎల్ అధికారి ఒకరు తెలిపారు. ఓ ఫీడర్ పరిధిలో ఎంత విద్యుత్ సరఫరా అవుతుంది? ఎంత రీడింగ్ జరుగుతుంది? అనే వివరాలను సాఫ్ట్వేర్ జిల్లా కార్యాలయానికి అందిస్తుంది. దీని ఆధారంగా ఆ ప్రాంతంలో చౌర్యాన్ని గుర్తించే వీలుంది. విద్యుత్తు సిబ్బంది సహకారంతో కొన్ని పరిశ్రమలు చౌర్యానికి పాల్పడుతున్నాయని భావిస్తున్నారు. ఇక నుంచి పంపిణీ, సరఫరా నష్టాలకు స్థానిక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లే బాధ్యులని కొద్ది నెలల క్రితం ఇంధనశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డిస్కమ్‌ల పరిధిలోని విజిలెన్స్ విభాగం కూడా ప్రతి మూడు నెలలకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సిబ్బంది పాత్ర ఉంటే కఠిన చర్యలు విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించాలని సిబ్బందికి సూచించాం. విద్యుత్ చౌర్యం వెనుక వారి పాత్ర ఉందని తెలిస్తే కఠిన చర్యలుంటాయి. చౌర్యాన్ని గుర్తించడానికి వినియోగదారుల సాయం కూడా తీసుకుంటాం. – శ్రీకాంత్ నాగులపల్లి, ఇంధన శాఖ కార్యదర్శి -
భారీ ప్రక్షాళన!
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పెద్ద ఎత్తున ప్రక్షాళన మొదలైంది. అసిస్టెంట్ ఇంజనీర్ మొదలుకొని, చీఫ్ ఇంజనీర్ వరకు కొత్త విభాగాలు అప్పగించనున్నారు. రూ. 50 వేల వేతనం దాటిన ప్రతి ఒక్కరికీ స్థాన చలనం ఉంటుంది. ఏపీ ట్రాన్స్‌కో, జెన్కోతో పాటు రెండు డిస్కమ్‌లలోని దాదాపు 8 వేల మందికి శాఖాపరమైన మార్పు ఉంటుందని అంచనా. ఈ వ్యవహారంపై శుక్రవారం అన్ని స్థాయిల ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఏ క్షణంలోనైనా ఆదేశాలు... మార్పులకు సంబంధించిన ఆదేశాలు ఏ క్షణంలోనైనా రావచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఎక్కడా కూడా ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రధాన కార్యాలయాల (హెడ్ క్వార్టర్స్)నుంచి బయటకు పంపడం లేదు. సెక్షన్లను మాత్రమే మారుస్తున్నారు. ముఖ్యమైన విభాగంలో కీలక వ్యక్తులకు ప్రస్తుతానికి మినహాయింపు ఉంటుందని ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్ బాబు తెలిపారు. కాలక్రమేణా మార్పులు చేస్తామన్నారు. ఇవీ కారణాలు... గత ఐదేళ్లుగా టీడీపీ ప్రభుత్వ అవినీతికి కొమ్ముగాసే వారికే కీలక పోస్టులు దక్కాయి. ఏళ్ల తరబడి అదే విభాగాల్లో తిష్టవేశారు. విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్ ప్లాంట్లలో కీలకమైన బొగ్గు రవాణా, ఉత్పత్తి రంగంలోని ముఖ్యమైన పోస్టుల్లో కొంతమంది ఉద్యోగులు దాదాపు 15 ఏళ్ల పైబడి ఉన్నారు. నిజాయితీగా పనిచేసే వారిని ప్రాధాన్యత లేని పోస్టులకు పంపారు. అవినీతి నిరోధక శాఖకు అనేక మంది ఉద్యోగులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చినా విచారణ జరగకుండా అడ్డుకున్నారు. అవినీతి రహిత పాలన దిశగా కొత్త ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో పాత వ్యక్తులు అప్పటి అవినీతి వెలుగులోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్రస్థాయి సమాచారం సేకరించిన ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రక్షాళన చేపట్టింది. ఈ నిర్ణయం పట్ల మెజారిటీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్పు కోసమే: శ్రీకాంత్ భారీ ప్రక్షాళన విద్యుత్ సంస్థల్లో కొత్త మార్పుకు నాంది పలుకుతుందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విభాగాల మార్పువల్ల ఉద్యోగుల్లో నూతనోత్సాహం వస్తుందని, కొత్త ఆలోచనలతో పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్పు విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, పూర్తి పారదర్శకంగా చేపడుతున్నామని, ఇది విద్యుత్ సంస్థల చరిత్రలో మొదటిసారని పేర్కొన్నారు. -
కదులుతున్న డొంక
ఆ మూడు కాంట్రాక్టుల్లో కుంభకోణం ఎంత?ఎన్నికల ముందేఎందుకీ పనులు?రూ.120 కోట్లుఎవరి జేబుల్లోకెళ్లాయి?విజిలెన్స్ నివేదికనుతొక్కిపెట్టిందెవరు?రాజధాని ప్రాంత విద్యుత్లైన్ల ఏర్పాట్లలో అక్రమాలుప్రభుత్వ పెద్దలు, అధికారులపాత్రపై అనుమానాలు సాక్షి, అమరావతి ఎన్నికల ముందు ఏపీ ట్రాన్స్‌కో ఇచ్చిన మూడు కాంట్రాక్టులు వివాదాస్పదమయ్యాయి. కాంట్రాక్టుల అప్పగింతలో పెద్దఎత్తున ముడుపులు చేతులు మారాయని ఆరోపణలున్నాయి. దీనిపై ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్‌తో పాటు రాష్ట్ర విజిలెన్స్ విభాగం కూడా ఇందుకు సంబంధించిన వాస్తవాలను ప్రభు త్వం దృష్టికి తెచ్చాయి. అయితే, ఇవేవీ పరిగణన లోనికి తీసుకోకుండానే హడావిడిగా కాంట్రాక్టులు ఇచ్చినట్లు సీఎస్ గుర్తించారు. ఎక్కడా లేని విధంగానిబంధనలు పెట్టడం, కొన్ని కంపెనీలకు మేలుచేసే ప్రయత్నం చేయడం, కాంట్రాక్టులు ఎక్కువ రేటుకు ఇవ్వడం వెనుక ప్రభుత్వ పెద్దలు, అధికారుల పాత్ర ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిసింది. గత రెండ్రోజులుగా ఇందుకు సంబంధించిన ఫైళ్లను ఆయన పరిశీలించినట్లు సమాచారం. అక్రమాల బాగోతం ఇదీ.. రాజధాని ప్రాంతానికి అన్ని వైపుల నుంచి విద్యుత్ లైన్లు వేయాలని ఏపీ ట్రాన్స్‌కో ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ప్రపంచ బ్యాంకు నిధులతో సీఆర్డీఏ చేపట్టే పనులను ముందుకు తీసుకొచ్చారు. గుడివాడ, చిలకలూరిపేట, ఏలూరుల్లో 400 కేవీ సబ్స్టేషన్లు, లైన్లకు సరిగ్గా ఎన్నికల ముందే ట్రాన్స్‌కో టెండర్లు పిలిచింది. నిజానికి చాలా కంపెనీలు పోటీకి సిద్ధమయ్యాయి. తక్కువ రేటుకే పనులు చేసేందుకూ ముందుకొచ్చాయి. గుడివాడ లైన్, సబ్‌స్టేషన్ పనులకు రూ.600 కోట్లను ట్రాన్స్‌కో కోట్ చేస్తే అంతకన్నా తక్కువకే చేస్తామని పలు కంపెనీలు వచ్చాయి. దీంతో ఏపీ ట్రాన్స్‌కో ఎక్కడలేని నిబంధనలు పెట్టింది. ఈ టెండర్లలో పాల్గొనే కంపెనీలు ఎప్పుడైనా, ఎక్కడైనా మౌలిక సదుపాయాల పనులకు సంబంధించిన కాంట్రాక్టును ఏడాదిలో 10 శాతం పూర్తిచేసి ఉండాలనే నిబంధన పెట్టింది. అంటే.. ట్రాన్స్‌కో లైన్లు వేసే కంపెనీలు గృహ నిర్మాణ పనులుచేసి ఉన్నా ఫర్వాలేదని పేర్కొంది. అదే విధంగా లైన్, సబ్‌స్టేషన్ ఒకే కంపెనీ, ఒకేసారి చేసి ఉండాలి. మునుపెన్నడూ కూడా ఈ నిబంధనలు పెట్టలేదు. దీంతో కేవలం మూడే మూడు కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి. ఈ మూడు కూడబలుక్కుని మరీ టెండర్లు వేశాయి. ఈ మూడింటికీ వేర్వేరు పనులు అప్పగించారు. ఆరు నెలల క్రితం వరకూ ట్రాన్స్‌కో కోట్‌చేసిన ధర కన్నా నాలుగు శాతం తక్కువకే పనులు అప్పగిస్తే, కంపెనీలు రింగ్ అవ్వడంవల్ల ఏకంగా నాలుగు శాతం ఎక్కువకు పనులు ఇచ్చారు. మొత్తం రూ.1200 కోట్ల విలువైన టెండర్లలో కనీసం రూ.120 కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా, ఎన్నికల కోడ్ సమీపిస్తుండడంతో టెండర్ల ప్రక్రియను హడావుడిగా పూర్తిచేసి మార్చి మొదటి వారంలోనే పనులు అప్పగించారు. వీటన్నింటినీ విజిలెన్స్ విభాగం ప్రభుత్వం దృష్టికి తెచ్చినా పట్టించుకోకపోవడాన్ని ప్రస్తుత సీఎస్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. జేఎండీ కథానాయకుడా? ప్రభుత్వాధినేత కనుసన్నల్లో జరిగిన ఈ టెండర్ల వ్యవహారంలో ట్రాన్స్‌కో జేఎండీ కీలకపాత్ర పోషించినట్టు సీఎస్‌కు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. ఆదాయ పన్నుశాఖ నుంచి డిప్యుటేషన్‌పై ట్రాన్స్‌కో డైరెక్టర్‌గా వచ్చిన ఆయనకు.. ప్రభుత్వం మొదటి నుంచి పెద్దపీట వేసింది. డైరెక్టర్ స్థాయి నుంచి ఏకంగా ఆయనకు జేఎండీగా పదోన్నతి కల్పించింది. డిప్యూటేషన్ కాలం పూర్తయినా కేంద్ర స్థాయిలో మేనేజ్ చేసి ఆయనను ఇక్కడే ఉంచేందుకు టీడీపీకి చెందిన ఓ ఎంపీ విశ్వప్రయత్నం చేశారు. జేఎండీపై ఆయన మాతృ సంస్థకు ఫిర్యాదులు వెళ్లడంతో తప్పనిసరై ఆయన తిరిగి వెళ్లినట్టు ట్రాన్స్‌కో వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే.. మూడు కాంట్రాక్టులు తెరిచి, ఖరారు చేసే వరకూ ఆయన జేఎండీగానే కొనసాగారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తిరిగి మాతృసంస్థకు వెళ్లారు. ఈ వ్యవహారంలో ఆయనకు ఏవైనా ముడుపులు అందాయా అనే కోణంలోనూ సీఎస్ ఆరా తీస్తున్నట్టు తెలిసింది. -
అయితే ఓకే.. సొమ్ము చేసుకో!
► రాజధానిలో భూగర్భ విద్యుత్ వ్యవస్థకు ముఖ్యనేత అడ్డు చక్రం ► సన్నిహితుడైన ప్రజాప్రతినిధికి లబ్ధి చేకూరేలా ట్రాన్స్‌కో విధానాన్నే మార్చేసిన వైనం ► తాత్కాలిక అవసరాలు తీర్చే ఓవర్‌హెడ్ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ఆమోదం ► ఆ ఎమ్మెల్యేకే కాంట్రాక్టు దక్కాలని ఆదేశం సాక్షి, అమరావతి బ్యూరో : ఆవు చేలో మేస్తుంటే... దూడ గట్టున మేస్తుందా ... అన్న చందంగా తయారైంది రాజధాని అమరావతి నిర్మాణ ప్రహసనం. అమరావతి నిర్మాణం పేరిట ప్రభుత్వ ముఖ్యనేత కుటుంబం రూ.వేల కోట్లు వెనకేసుకుంటుంటే... టీడీపీ ప్రజాప్రతినిధులు రూ.వందల కోట్లు బొక్కేయడానికి బరితెగిస్తున్నారు. అందుకే రూ.1,450 కోట్లు వెచ్చిస్తే శాశ్వత ప్రయోజనాన్ని అందించే భూగర్భ విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న ట్రాన్స్‌కో ప్రణాళికను ముఖ్యనేత బుట్టదాఖలు చేశారు. తాత్కాలిక అవసరాలు తీర్చే ఓవర్‌హెడ్ విద్యుత్తు లైన్ల ఏర్పాటుకు రూ.525 కోట్లతో ఆమోదించారు. పైగా తరువాత మళ్లీ భూగర్భ విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటు చేయొచ్చులే అని సెలవిచ్చారు కూడా. విజయవాడకు చెందిన తనకు సన్నిహితుడైన టీడీపీ ఎమ్మెల్యేకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చేందుకే ఆయన ఇలా చేశారు. ట్రాన్స్‌కో వర్గాలను విస్మయానికి గురిచేస్తున్న ఈ కాంట్రాక్టు కథాకమామిషు ... ప్రతిపాదిత రాజధాని అమరావతిలో భూగర్భ కేబుల్ విద్యుత్తు వ్యవస్థను నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పింది. మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొన్న గ్రీన్‌బెల్ట్ ప్రాంతం గుండా భూగర్భ విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తీవ్ర తర్జనభర్జనల అనంతరం అందుకు ప్రణాళికను ట్రాన్స్‌కో ఆమోదించింది. రూ.1,450 కోట్లతో టెండర్లు ప్రక్రియ చూడా చేపట్టింది. మాకేంటంటా...ఒప్పుకోం : ఎమ్మెల్యే ఆగ్రహం భూగర్భ విద్యుత్తు వ్యవస్థ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించడంపై విజయవాడకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. ఎందుకంటే అమరావతిలో విద్యుత్తు ప్రాజెక్టులపై ఆయన సంస్థ కన్నేసింది. భూగర్భ విద్యుత్తు వ్యవస్థ నిర్మించే సామర్థ్యం ఆ సంస్థకు లేదు. దీంతో టెండర్లలో ఆయన సంస్థ పాల్గొనలేదు. అదే ఓవర్‌హెడ్ కేబుళ్లను అయితే ఆ ఎమ్మెల్యే సంస్థ నిర్మించగలదు. అందుకే ఆయన భూగర్భ విద్యుత్తు వ్యవస్థ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ‘మీకు నచ్చినట్టు విధాన నిర్ణయాలు తీసేసుకుంటే ఎలా.. ప్రజాప్రతినిధులుగా మేం ఉండీ ఏం లాభం? అసలు భూగర్భ విద్యుత్తు వ్యవస్థ ఎందుకు? రాజధాని ఇప్పటికప్పుడు కట్టేయరు కదా... ప్రస్తుతానికి ఓవర్‌హెడ్ కేబుళ్లు వేస్తే చాలు. అలా చేయండి’ అని అల్టిమేటం ఇచ్చారు. భూగర్భ విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు చెప్పారు. దీంతో ఆ ఎమ్మెల్యే సీఎం కార్యాలయం వద్దే పంచాయితీ పెట్టారు. అడ్డగోలుగా లబ్ధి తనకు సన్నిహితుడైన ప్రజాప్రతినిధికి అడ్డగోలుగా లబ్ధి చేకూర్చడానికి ముఖ్యనేత ఏకంగా ట్రాన్స్‌కో విధాన నిర్ణయాన్నే మార్చేశారు. భూగర్భ విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటు అంశాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టేయమని ట్రాన్స్‌కోను ఆదేశించారు. ‘ప్రస్తుతం నిధుల సమస్య ఉంది. భూగర్భ విద్యుత్తు వ్యవస్థ వద్దు... ఓవర్‌హెడ్ కేబుళ్లు వేయండి. అందుకు ప్రణాళిక సిద్ధంచేసి టెండర్లు పిలవండి’ అని స్పష్టం చేశారు. నాణ్యత పరంగానే కాకుండా బడ్జెట్ పరంగా కూడా భూగర్భ విద్యుత్తు వ్యవస్థే ఉత్తమమైనదని ముఖ్యనేతకు చెప్పేందుకు ట్రాన్స్‌కో అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఓవర్‌హెడ్ విధానంలో 220 కేవీ ఓవర్‌హెడ్ కేబుళ్లు నాలుగు లైన్లు ఓ వైపు వేసేందుకు రూ.150కోట్లు, 400 కేవీ లైన్లు నాలుగు మరోవైపు వేసేందుకు రూ.375కోట్లు ... వెరసి రూ.525 కోట్లు అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించారు. కానీ అది తాత్కాలిక ప్రయోజనాలనే అందిస్తుంది. కొన్నేళ్ల తరువాత భూగర్భ విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటు చేయకతప్పదు. అదే ఇప్పుడే రూ.1,450 కోట్లతో భూగర్భ విద్యుత్తు వ్యవస్థ నిర్మిస్తే శాశ్వత ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇదే విషయాన్ని ముఖ్యనేతకు చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన ససేమిరా అన్నారు. ప్రస్తుతానికి ఆ ప్రజాప్రతినిధి చెప్పినట్లుగా ఓవర్‌హెడ్ లైన్లు వేయాలని... ఆ కాంట్రాక్టు ఆయనకే దక్కేలా చూడాలని స్పష్టం చేసినట్లు సమాచారం. -
విద్యుత్ సౌధలో ఉద్యోగుల ఆందోళన
హైదరాబాద్: వేతన సవరణ చేయడానికి ప్రభుత్వం అంగీకరించనందుకు నిరసనగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యుత్ సౌధలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. సమస్యల పరిష్కారానికి యాజమాన్యాలు సానుకూలంగా స్పందించడం లేదని ఉద్యోగులు ఆరోపించారు. ఉద్యోగులు ఆందోళన చేపట్టడంతో యాజమాన్యాల చర్చలు ప్రారంభించారు. ఉద్యోగ సంఘ నాయకులు,. యాజమాన్యాల మధ్య చర్చలకు జెన్కో ఎండీ విజయానంద్, ట్రాన్స్ కో సీఎండీ సురేష్ చందా హాజరయ్యారు. విద్యుత్ సమ్మె సోమవారం కూడా కొనసాగితే ఎన్టీటీపీఎస్ పూర్తిగా మూతపడే అవకాశాలు ఉన్నాయని ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు. -
ప్లాంట్లపై అదే పాట
3 విద్యుత్ ప్లాంట్లకు నోటీసులిచ్చిన ట్రాన్స్‌కో ‘సాక్షి’ కథనంలో చెప్పినట్లే సర్కారు వైఖరి సాక్షి, హైదరాబాద్: చేతికందిన మూడు విద్యుత్ ప్లాంట్లను జారవిడుచుకునేందుకే ప్రభుత్వం సిద్ధపడుతోంది. స్పెక్ట్రమ్, జీవీకే-1, ల్యాంకో విద్యుత్ ప్లాంట్లను మళ్లీ ఆ కంపెనీలకే కట్టబెట్టేందుకు సై అంటోంది. ఇందులో భాగంగా మరమ్మతులు, ఆధునీకరణ పనులు చేపట్టాలని సూచిస్తూ ఈ మూడు ప్లాంట్లకు ట్రాన్స్‌కో ‘ఆర్ అండ్ ఎం’ (రినోవేషన్ అండ్ మోడర్నైజేషన్) నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు సోమవారం ఆయా ప్లాంట్లకు అందాయి. స్పెక్ట్రమ్, జీవీకే-1, ల్యాంకో ప్లాంట్లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ముగియడానికి వస్తున్న తరుణంలో వీటిని పూర్తిగా స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అందుకు ససేమిరా అంటోందంటూ ‘సాక్షి’లో సోమవారం ‘పవర్ పోతోంది’ శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ట్రాన్స్‌కో తన నోటీసుల్లో ఆర్ అండ్ ఎంకు అయ్యే వ్యయ ప్రతిపాదనలను 2014 మార్చి 31లోగా సమర్పించాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. విద్యుత్ ప్లాంట్లు అందజేసే వ్యయ ప్రతిపాదనలకు ట్రాన్స్‌కో గ్రీన్‌సిగ్నల్ ఇస్తే.. ఇక ఆ ప్లాంట్లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఆధునీకరణ ద్వారా వాటి జీవిత కాలం ఎంత మేరకు పెరుగుతుందన్నది అంచనా వేసి, ఆ మేరకు వాటి నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలి. ఇలా చేయడమంటే ఆ విద్యుత్ ప్లాంట్ల ఆధునీకరణకు అయ్యే వ్యయం మొత్తాన్ని ట్రాన్స్‌కో చెల్లించడంతోపాటు, వాటికి ఇంధన ధరలు, బీమా, స్థిరఛార్జీలు, అమలు నిర్వహణ, వర్కింగ్ కేపిటల్ మొత్తాన్ని సమకూర్చాల్సి ఉంటుంది. ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లు ఆర్ అండ్ ఎం కోసం ఇచ్చే ప్రతిపాదనలు మరీ ఎక్కువగా ఉన్న పక్షంలో.. వాటిని ట్రాన్స్‌కో తిరస్కరించడానికి అవకాశం ఉంది. కానీ రాజకీయ ఒత్తిళ్లతో ప్రతిపాదనలకు ఓకే చెబితే ప్రజలపై మున్ముందు కూడా కరెంటు చార్జీల బాదుడు కొనసాగుతుంది. -
సమ్మెపై పునరాలోచించండి: జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీలు
సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఏపీ ట్రాన్స్‌కో, ఏపీజెన్ కో సీఎండీలు అభిప్రాయపడ్డారు. సమ్మెపై సీమాంధ్ర ఉద్యోగులు పునరాలోచించుకోవాలని వారు సూచించారు. విద్యుత్ ఉత్పత్తి తగ్గితే ప్రధాన రంగాలైన రైల్వే,ఆసుపత్రులు, సాగునీటికి విద్యుత్ అందజేయవలసి ఉంటుందని తెలిపారు. అయితే సీమాంధ్రులు చేపట్టిన సమ్మెకు ప్రత్యామ్నాయ ప్రణాళిక అవసరం లేదని భావిస్తున్నట్లు వారు వివరించారు. జులై 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. దాంతో సీమాంధ్రలో సమైక్య ఉద్యమం రోజురోజూకు ఉధృతం అవుతోంది. ఇప్పటికే ఏపీఎన్జీవోలు, ఆర్టీసీ తదితర సంస్థలు నిరవధిక సమ్మెకు దిగాయి. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో విద్యుత్ ఉద్యోగులు నేటి అర్థరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ట్రాన్స్‌కో , జెన్కో సీఎండీలకు ఆయా ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులు అందజేశాయి. అంతేకాకుండా ఉద్యోగులకు గతంలో అందజేసిన సిమ్ కార్డులను ఆయా విద్యుత్ సంస్థలకు తిరిగి అందజేశారు.