పల్లెపల్లెకూ 'పవర్'‌ ఫుల్ | AP Transco master plan for Electricity demand | Sakshi
Sakshi News home page

పల్లెపల్లెకూ 'పవర్'‌ ఫుల్‌

Published Mon, Apr 5 2021 2:58 AM | Last Updated on Mon, Apr 5 2021 11:19 AM

AP Transco master plan for Electricity demand - Sakshi

సాక్షి, అమరావతి: రాయలసీమలో విద్యుత్‌ ఉత్పత్తికి అపార అవకాశాలున్నాయి. కోస్తాంధ్రలో విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది. ఏపీ ట్రాన్స్‌కో ఈ రెండినీ సమన్వయం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాయలసీమ, కోస్తాంధ్రను అనుసంధానం చేస్తూ పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు నడుం బిగించింది. కొత్త లైన్ల ఏర్పాటు, గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణంతో పాటు రూ.1,349 కోట్లతో పలు ప్రాజెక్టులు చేపట్టినట్టు ఏపీ ట్రాన్స్‌కో ఉన్నతాధికారి ఆదివారం మీడియాకు తెలిపారు. దీనివల్ల ప్రతీ పల్లెకు మరింత నాణ్యమైన విద్యుత్‌ అందబోతోందని ఆయన వివరించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసే గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌  స్టేషన్‌ వల్ల లో ఓల్టేజీ సమస్యను నివారించవచ్చని తెలిపారు. 

సీమ, కోస్తాంధ్ర అనుసంధానం
రాయలసీమ, కోస్తా ఆంధ్రను అనుసంధానం చేసే 400 కేవీ లైను నిర్మించేందుకు ఏపీ ట్రాన్స్‌కో సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల అన్ని జిల్లాలు ప్రయోజనం పొందుతాయి. రాష్ట్రంలో తొలిసారిగా గుంటూరు జిల్లాలోని తాళ్లయపాలెంలో 400 కేవీ గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌ స్టేషన్‌ను ఏపీ ట్రాన్స్‌కో ఏర్పాటు చేయనుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో గృహ, వ్యవసాయ విద్యుత్‌ అవసరాలు తీర్చేందుకు ఇది దోహద పడుతుంది. అనంతపురం జిల్లా హిందుపూర్, చిత్తూరు జిల్లా రాచగున్నేరి, ప్రకాశం జిల్లా పొదిలిలో గల 400 కేవీ సబ్‌ స్టేషన్లలో బస్‌ రియాక్టర్లను పెట్టడం వల్ల ఈ జిల్లాలలో 400 కేవి లైన్లలో వోల్టేజీ సమస్యలు పరిష్కరించొచ్చు. 

స్విచ్చింగ్‌ స్టేషన్స్‌
అనంతపురం జిల్లా ముదిగుబ్బ, వైఎస్సార్‌ జిల్లా పెండ్లిమర్రిలో 220 కేవీ స్విచ్చింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పామూరులోని 132 కేవీ సబ్‌ స్టేషన్‌ను 220 కేవీకి పెంచుతున్నారు. సిఎస్‌పురం, రుద్రసముద్రం సోలార్‌ పార్కుల నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ సరఫరాకు 220 కేవీ ట్రాన్స్‌మిషన్‌ లైన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు.

శరవేగంగా సోలార్‌ లైన్లు
రాయలసీమ జిల్లాలైన అనంతపురం, వైఎస్సార్, కర్నూలులో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. రైతులకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ మొత్తం విద్యుత్‌ను ఇతర కోస్తాంధ్రతో పాటు ఇతర ప్రాంతాలకు చేర్చాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అనంతపురం జిల్లాలోని తలారిచెరువు 400 కేవీ సబ్‌ స్టేషన్‌ నుంచి ప్రకాశం జిల్లా పొదిలి 400 కేవీ సబ్‌ స్టేషన్‌ వరకు 400 కేవీ లైన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల కోస్తా, రాయలసీమ ప్రాంతాలను అనుసంధానం చేయవచ్చని ట్రాన్స్‌కో ఉన్నాతాధికారి తెలిపారు. డిమాండ్‌ కన్నా ఎక్కువగా విద్యుత్‌ ఉత్పత్తి అయితే, ఆ విద్యుత్తును పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ అఫ్‌ ఇండియాకు పంపాల్సి ఉంటుంది. ఇలా కాకుండా అదనపు విద్యుత్‌ను కూడా ఉపయోగించుకోవాలని రాష్ట్రం యోచిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement