లెక్క.. ఇక పక్కా!  | AP Transco new initiative Power companies Power purchases | Sakshi
Sakshi News home page

లెక్క.. ఇక పక్కా! 

Published Tue, Sep 6 2022 5:14 AM | Last Updated on Tue, Sep 6 2022 3:02 PM

AP Transco new initiative Power companies Power purchases - Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ కొనుగోళ్లలో సరికొత్త సాంకేతికత రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ ఉపయోగించి ఒక రోజు ముందు విద్యుత్‌ డిమాండ్‌ అంచనా వేస్తున్నారు. ఇప్పుడు పవన విద్యుత్, సౌర విద్యుత్, మార్కెట్‌ సూచన, డిస్పాచ్‌ మోడల్, ఫ్రీక్వెన్సీ సూచనల కోసం 4 రోజుల ముందే డిమాండ్‌ను అంచనా వేసేలా ఎనర్జీ ఫోర్‌కాస్టింగ్‌ సాంకేతికత (నూతన సాఫ్ట్‌వేర్‌)ను విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ (ఏపీ ట్రాన్స్‌కో) అభివృద్ధి చేసింది. 

భవిష్యత్‌ డిమాండ్‌ను ఎదుర్కొనేలా 
ఏపీ ట్రాన్స్‌కోకు ప్రస్తుతం 400 కేవీ ట్రాన్స్‌మిషన్‌ లైన్లు 5532.161 సర్క్యూట్‌ కిలోమీటర్లు (సీకేఎం) ఉన్నాయి. మరో 12200.9 సీకేఎం 220 కేవీ లైన్లు ఉన్నాయి. 132 కేవీ లైన్లు 13568.18 సీకేఎం పొడవున విస్తరించాయి. వీటి ద్వారా విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఏటా సగటున 70 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ పంపిణీ జరుగుతోంది.

వచ్చే మార్చినాటికి విద్యుత్‌ డిమాండ్‌ రోజుకు అత్యధికంగా 250 మిలియన్‌ యూనిట్లకు చేరుతుందని ఏపీ ట్రాన్స్‌కో గ్రిడ్‌ నిర్వహణ విభాగం అంచనా వేసింది. ప్రస్తుత లైన్లపై అదనపు భారం మోపకుండా ఈ అసాధారణ పెరుగుదలను ఎదుర్కొనేందుకు చర్యలు మొదలయ్యాయి. ఆ ప్రయత్నాల్లో ‘ఎనర్జీ ఫోర్‌కాస్టింగ్‌’ కూడా ఒకటని ఏపీ ట్రాన్స్‌కో చెబుతోంది. 

ముందస్తు అంచనాలతో ప్రయోజనాలు 
విద్యుత్‌ సంస్థలు దీర్ఘకాలిక సంప్రదాయ పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ (పీపీఏ) కాలం నుండి స్వల్పకాలిక ఒప్పందాలు (షార్ట్‌ టెర్మ్‌ టెండర్లు) వైపు మళ్లుతున్నాయి. ఈ క్రమంలో ఇంధన ధరల అంచనా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎనర్జీ ఫోర్‌కాస్టింగ్‌ ద్వారా థర్మల్, సోలార్, విండ్, గ్యాస్‌ వంటి ప్రతి విద్యుత్‌ ఉత్పత్తి స్టేషన్‌ నుండి డిస్కంలకు ఎంత విద్యుత్‌ పంపిణీ చేయాలో నాలుగు రోజుల ముందే తెలుసుకోవచ్చు.

ప్రతి 15 నిమిషాలకు ఇది అప్‌డేట్‌ అవుతుంటుంది. అంతేకాదు తక్కువ ఖర్చుతో విద్యుత్‌ పంపిణీ ఎక్కడి నుంచి ఎప్పుడు జరుగుతుందో కచ్చితంగా అంచనా వేసే అవకాశం ఉంటుంది.  పవర్‌ జనరేటర్లు, డిస్కంలు తగిన బిడ్డింగ్‌ వ్యూహాలను రూపొందించడానికి ధర అంచనా డేటాను ఉపయోగిస్తున్నాయి.

జనరేటర్ల ధరల గురించి కచ్చితమైన సూచనను తెలుసుకొంటే దాని లాభాలను పెంచుకోవడానికి బిడ్డింగ్‌ వ్యూహాన్ని రూపొందించవచ్చు. అలాగే మరుసటి రోజు కచ్చితమైన ధర ఎంతో అంచనా వేయగలిగితే డిస్కంలు సొంత ఖర్చులను తగ్గించుకోవడానికి వ్యూహాన్ని రూపొందించుకోవచ్చు. 

ఖర్చు తగ్గుతుంది 
పవన, సౌర విద్యుత్‌ కొనుగోళ్లలో, ఫ్రీక్వెన్సీ సూచనలు తెలుసుకోవడంలో జాతీయ స్థాయిలో విద్యుత్‌ రంగ నిపుణుల సహకారంతో నాలుగు రోజుల ముందే అంచనాలు రూపొందించడానికి ఈ సాంకేతికతను అభివృద్ధి చేశాం.

గ్రిడ్‌ డిమాండ్‌ను తీర్చడానికి, అతి తక్కువ తేడాతో విద్యుత్‌ డిమాండ్‌ను అంచనా వేయడానికి ఎనర్జీ ఫోర్‌కాస్టింగ్‌ మోడల్‌ ఉపయోగపడుతుంది. దీనిద్వారా బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకు విద్యుత్‌ను కొనొచ్చు. తద్వారా విద్యుత్‌ కొనుగోలు ఖర్చు తగ్గుతుంది. 
–బీ శ్రీధర్, సీఎండీ, ఏపీ ట్రాన్స్‌కో 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement