సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విద్యుత్ కొనుగోలుకు చేసిన ఖర్చులో మిగిలిన మొత్తాన్ని ట్రూ డౌన్ చార్జీల పేరుతో వినియోగదారులకు తొలిసారిగా 2021లో రూ.125 కోట్లు వెనక్కిచ్చిన రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు 2022లో అమలయ్యేలా మరో ప్రతిపాదనతో ముందుకొచ్చాయి. విద్యుత్ డిమాండ్‌లేని సమయాల్లో భారీ పరిశ్రమలకు వినియోగించిన విద్యుత్‌పై యూనిట్‌కు రూ.0.50 పైసల చొప్పున ప్రత్యేక రాయితీ ఇస్తామంటున్నాయి.
డిమాండ్ లేని వేళలు..
2006లో డిస్కంలు.. డిమాండ్‌ను బట్టి విద్యుత్ చార్జీల విధానాన్ని అమల్లోకి తెచ్చాయి. సా.6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు సరఫరా చేసే విద్యుత్‌పై టైం ఆఫ్ ది డే (టీఓడీ) టారిఫ్ పేరుతో చార్జీలు వసూలుచేస్తున్నాయి. ఇందులో కొన్ని మార్పులు చేస్తూ.. డిమాండ్ లేని వేళలు ఉ.10 గంటల నుంచి మ.3 గంటల వరకు, అదే విధంగా రాత్రి 12 గంటల నుంచి ఉ.6 గంటల వరకు వినియోగించే విద్యుత్‌పై రిబేట్ ఇవ్వాలనేది డిస్కంల ఆలోచన. అంతేకాక.. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనూ డిమాండ్ లేని వేళల్లో రాయితీ ఇవ్వడానికీ సంసిద్ధంగా ఉన్నాయి.
సమతూకం కోసమే..
విద్యుత్ పంపిణీ సంస్థలు కరెంట్ కొనుగోలు కోసం విద్యుదుత్పత్తి సంస్థలతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకున్నాయి. వీటి ప్రకారం రోజులో కొన్ని గంటలకు అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేయాలంటే కుదరదు. 24 గంటల చొప్పున సరఫరా తీసుకోవాల్సిందే. దీనివల్ల డిమాండ్ లేని వేళల్లో కూడా జెన్‌కోలకు చెల్లించే చార్జీలు భారంగా మారుతున్నాయి. అదే విధంగా పీక్ అవర్స్‌లో ఒకేసారి అందరూ విద్యుత్ వినియోగించడంవల్ల గ్రిడ్‌పై భారం పడి తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ రెండిటినీ సమతుల్యం చేయడానికి డిస్కంలు పరిశ్రమల్లో విద్యుత్ వినియోగాన్ని రాత్రివేళ ప్రోత్సహించాలని భావిస్తున్నాయి. దీనివల్ల పీక్ అవర్స్‌లో లోడ్ తగ్గుతుంది. పరిశ్రమలు ఏ, బీ, సీ షిఫ్టుల్లో పనిచేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. పరిశ్రమల్లో ఉత్పత్తి కూడా పెరుగుతుంది. విద్యుత్ వినియోగం పెరగడంవల్ల డిస్కంలకు బిల్లుల రూపంలో ఆదాయం వస్తుంది. దీంతో జెన్‌కోలకు చెల్లించే చార్జీల్లో సమతూకం వస్తుంది.
ఈ నెలలోనే విచారణ
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి 2022–23 ఆర్థిక సంవత్సర వార్షిక సగటు ఆదాయ, వ్యయ నివేదిక (ఏఆర్‌ఆర్)లో డిస్కంలు గత డిసెంబర్‌లో కొన్ని ప్రతిపాదనలు సూచించాయి. వీటిల్లో టీఓడీ కూడా ఒకటి. ఏఆర్‌ఆర్‌పై ఈ నెల 24, 25, 27 తేదీల్లో ఏపీఈఆర్‌సీ విశాఖపట్నంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి, మార్చి చివరి వారంలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఏఆర్‌ఆర్ అమల్లోకి వస్తుంది.
– కె. సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్
Comments
Please login to add a commentAdd a comment