సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఏపీ ట్రాన్స్కో, ఏపీజెన్ కో సీఎండీలు అభిప్రాయపడ్డారు. సమ్మెపై సీమాంధ్ర ఉద్యోగులు పునరాలోచించుకోవాలని వారు సూచించారు. విద్యుత్ ఉత్పత్తి తగ్గితే ప్రధాన రంగాలైన రైల్వే,ఆసుపత్రులు, సాగునీటికి విద్యుత్ అందజేయవలసి ఉంటుందని తెలిపారు.
అయితే సీమాంధ్రులు చేపట్టిన సమ్మెకు ప్రత్యామ్నాయ ప్రణాళిక అవసరం లేదని భావిస్తున్నట్లు వారు వివరించారు. జులై 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. దాంతో సీమాంధ్రలో సమైక్య ఉద్యమం రోజురోజూకు ఉధృతం అవుతోంది. ఇప్పటికే ఏపీఎన్జీవోలు, ఆర్టీసీ తదితర సంస్థలు నిరవధిక సమ్మెకు దిగాయి.
ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో విద్యుత్ ఉద్యోగులు నేటి అర్థరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ట్రాన్స్కో , జెన్కో సీఎండీలకు ఆయా ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులు అందజేశాయి. అంతేకాకుండా ఉద్యోగులకు గతంలో అందజేసిన సిమ్ కార్డులను ఆయా విద్యుత్ సంస్థలకు తిరిగి అందజేశారు.