Electricity Employees Union
-
జూలైలో కరవు భత్యం
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులకు ఆ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీపికబురు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న కరవు భత్యాన్ని జూలైలో ఇస్తామని వెల్లడించారు. ఈ మేరకు విద్యుత్ ఉద్యోగ సంఘాలతో మంత్రి సచివాలయంలో మంగళవారం దాదాపు నాలుగు గంటలకుపైగా చర్చలు జరిపారు. వేతనాలు తగ్గిస్తున్నారని పుకార్లు చెలరేగిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అనేక డిమాండ్లకు మంత్రి సానుకూలంగా స్పందించారు. విద్యుత్ ఉద్యోగులకు 2018లో ప్రకటించిన పీఆర్సీని 2022 వరకు ఎలాంటి మార్పు లేకుండా కొనసాగిస్తామన్నారు. కరోనా బాధిత ఉద్యోగులను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అసువులు బాసిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి ఆమోదం తెలిపారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి సానుకూల అభిప్రాయం ఉందని, వారి సేవలను గుర్తించిందన్నారు. వీలైనంతవరకూ వారికి న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వారిని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే పుకార్లను నమ్మొద్దని కోరారు. ఉద్యోగులు డిమాండ్ల సాధన కోసం ఉద్యమించిన నేపథ్యంలో నమోదైన కేసులను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అన్ని అంశాలపై మంత్రి బాలినేని ఓపికగా చర్చించారని, ప్రభుత్వంపై అపారమైన నమ్మకం ఏర్పడిందని చర్చల్లో పాల్గొన్న విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలు వెంకట రమణారెడ్డి, సురేష్ కాంతారెడ్డి, వేదవ్యాస్, చంద్రశేఖర్ తదితరులు మీడియాకు తెలిపారు. గత కొంతకాలంగా వస్తున్న పుకార్లతో నెలకొన్న ఆందోళన మంత్రి హామీతో తొలగిపోయిందన్నారు. -
ఏపీ విద్యుత్ ఉద్యోగుల అడ్డగింత
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రిలీవ్ చేసిన 71 మంది విద్యుత్ ఉద్యోగులు తెలంగాణ విద్యుత్ సంస్థల్లో రిపోర్టు చేయడానికి మంగళవారం విద్యుత్ సౌధకు రాగా, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘాలు వారిని అడ్డుకున్నాయి. దీంతో ఏపీ ఉద్యోగులు రిపోర్టు చేయకుండానే వెనుతిరిగారు. తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఏపీ విద్యుత్ సంస్థలు ఏకపక్షంగా రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగులను ఎట్టి పరిస్థితిలో ఇక్కడ చేర్చుకోవడానికి వీల్లేదని తెలంగాణ విద్యుత్ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. విద్యుత్ ఉద్యోగుల విభజన వివాద పరిష్కారం కోసం సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ కేఎం ధర్మాధికా రి కమిటీ తుది నివేదికకు అనుబంధంగా జారీ చేసిన మరో నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని తప్పుబట్టాయి. ధర్మాధికారి కమిటీ విద్యుత్ ఉద్యోగుల తుది కేటాయింపుల్లో న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించలేదని పేర్కొన్నాయి. తెలంగాణ స్టేట్ పవర్ ఎం ప్లాయీస్ యూనియన్ జేఏసీ, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎం ప్లాయీస్ జేఏసీల ఆధ్వర్యంలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ సౌధలో వేర్వేరుగా నిరసన దీక్షలు ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల యాజమాన్యాల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీ రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు చేర్చుకుంటే తీవ్ర ఆర్థిక భారం పడటంతో పా టు తెలంగాణ విద్యుత్ సంస్థల పనితీరుపై ప్రభావం పడనుందని జేఏసీ నేతలు శివాజీ, రత్నాకర్‌రావులు పేర్కొన్నారు. ఏపీ రిలీవ్ చేసిన 655 మంది ఉద్యోగుల్లో 71 మంది మినహా మిగిలిన 584 మంది ఉద్యోగులను ఎట్టి పరిస్థితిలో తెలంగాణలో చేర్చుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావును కలసి వినతి పత్రం అందజేశారు. -
రేవంత్‌పై భగ్గుమన్న విద్యుత్ ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును గన్‌పార్క్ వద్ద బహిరంగంగా కాల్చిచంపినా తప్పులేదన్న మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై విద్యుత్ ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఎంపీ వాఖ్యలకు నిరసనగా శుక్రవారం ఆ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్‌సౌధ నుంచి గన్‌పార్క్ వరకు భారీ ర్యాలీ జరిపారు. అనంతరం మింట్‌కాంపౌండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని వారంతా మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ.. నిజాయితీ పరుడైన ట్రాన్స్‌కో సీఎండీ ని కాల్చిచంపాలని చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. తన వాఖ్యలను ఉపసంహరించుకుని, సీఎండీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ రేవంత్ విద్యుత్ సంస్థలపై అడ్డగోలు ఆరోపణలు చేసి, వాటిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కార్యక్ర మంలో పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ సంఘాలతోపాటు 2వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. -
విద్యుత్ పీఆర్సీపై ప్రకటన రేపే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల వేతన సవరణపై రేపు (సెప్టెంబర్ 1న) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేయనున్నారు. వేతన సవరణ ఫిట్మెంట్ శాతం, వెయిటేజీ ఇంక్రిమెంట్ల సంఖ్య, వైద్య సదుపాయం తదితర అంశాలపై ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు నేతృత్వంలోని విద్యుత్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధి బృందంతో శనివారం మధ్యా హ్నం 3 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి చర్చలు జరిపి అప్పటికప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాస రావు నేతృత్వంలో నియమించిన విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ సంప్రదింపుల కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నాలుగేళ్ల కిందట.. చివరిసారిగా నాలుగేళ్ల కిందట విద్యుత్ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్, 3 వెయిటేజీ ఇంక్రిమెంట్లతో కలిపి పీఆర్సీని ప్రకటించారు. గత మార్చి 31తో ఈ పీఆర్సీ కాలపరిమితి ముగిసిపోగా, ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉంది. దీంతో ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్లో పని చేస్తున్న 25 వేల మంది విద్యుత్ ఉద్యోగులు కొత్త పీఆర్సీపై ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఉద్యోగులకు 25 శాతం ఫిట్మెంట్తోపాటు 3 వెయిటేజీ ఇంక్రిమెంట్లతో వేతన సవరణను అమలు చేస్తున్నారు. చివరిసారిగా ప్రకటించిన 30 శాతం ఫిట్మెంట్ కన్నా ఎక్కువ మొత్తంలో ఫిట్మెంట్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఏపీలో 25 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అంతకంటే కొద్దిగా ఎక్కువ శాతం ఫిట్‌మెంట్‌ను తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రకటించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిట్మెంట్ శాతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం కీలకంగా మారనుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టి నిరంతర విద్యుత్ సరఫరాను అమలు చేసేందుకు ఉద్యోగులు బాగా పని చేశారని కేసీఆర్ పలుమార్లు ప్రశంసించారు. జేఏసీ ప్రతినిధులతో ప్రభాకర్‌రావు చర్చలు పీఆర్సీ ప్రకటనలో జాప్యానికి నిరసనగా ఆందోళనకు సిద్ధమైన తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ప్రతినిధులతో ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు గురువారం విద్యుత్ సౌధలో చర్చలు జరి పారు. సెప్టెంబర్ 1న ప్రగతి భవన్లో యూనియన్ల నేతలతో చర్చించి పీఆర్సీపై సీఎం ప్రకటన చేస్తారని ట్రాన్స్‌కో సీఎండీ హామీ ఇచ్చినట్లు జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు పద్మారెడ్డి, సాయిబాబా తెలిపారు. -
అతి పెద్ద ప్రధాన సంఖ్య!
వాషింగ్టన్: ప్రపంచంలోనే ఇప్పటి వరకు తెలిసిన అతిపెద్ద ప్రధాన సంఖ్యను ఔత్సాహిక శాస్త్రవేత్త కనుగొన్నారు. గతేడాది డిసెంబర్ 26న అమెరికాకు చెందిన జొనాథన్ పేస్ అనే 51 ఏళ్ల ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఈ ఘనత సాధించారు. 2ను 7,72,32,917 సార్లు గుణించి, ఆ తర్వాత అందులో నుంచి ‘1’ ని తీసివేశారు. ఆ వచ్చిన సంఖ్యలో 2,32,49,425 అంకెలున్నాయి. ఇప్పటివరకు తెలిసిన ప్రధాన సంఖ్య కన్నా ఎం77232917 అని పిలుస్తున్న ఈ కొత్త ప్రధాన సంఖ్యలో దాదాపు 10 లక్షల అంకెలు ఎక్కువగా ఉన్నాయి. అత్యంత అరుదుగా ఉండే ఈ ప్రధాన సంఖ్యలను మెర్సెన్నె ప్రధాన సంఖ్యలు అంటారు. 350 ఏళ్ల కిందటే ఈ ప్రధాన సంఖ్యల గురించి అధ్యయనం చేసిన ఫ్రెంచ్ శాస్త్రవేత్త మారిన్ మెర్సెన్నె పేరు వీటికి పెట్టారు. ఈ కొత్త ప్రధాన సంఖ్యను ఆరు రోజుల పాటు ఆగకుండా లెక్కించారు. ఎం77232917 ఇప్పటి వరకు కనుగొన్న 50వ మెర్సెన్నె ప్రధాన సంఖ్య. గ్రేట్ ఇంటర్నెట్ మెర్సెన్నె ప్రైమ్ సెర్చ్ (జీఐఎంపీఎస్) అనే సాఫ్ట్వేర్ సాయంతో ప్రధాన సంఖ్యలు కనుగొనేందుకు వేల మంది వలంటీర్లు నిత్యం ప్రయతిస్తుంటారు. ఈ ప్రధాన సంఖ్యను కనుగొన్న వారికి రూ.50 వేలను పారితోషికంగా అందిస్తారు. జొనాథన్ పేస్ గత 14 ఏళ్లుగా ప్రధాన సంఖ్యను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మరికొంత సమయమివ్వండి...
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మరికొంత సమయం కావాలని ఉభయ రాష్ట్రాలు హైకోర్టును కోరాయి. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించు కోవాలని గతంలో హైకోర్టు ఇరు రాష్ట్రాలకూ సూచించింది. ఈ క్రమంలో ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తులు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎమ్మెస్కే జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. తెలంగాణ, ఏపీల అడ్వొకేట్ జనరల్స్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, దమ్మాలపాటి శ్రీనివాస్ సమస్య పరిష్కారానికి మరికొంత సమయం కావాలని కోరారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం గడువు మంజూరు చేస్తూ విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఏపీ స్థానికత ఆధారంగా 1,242 మంది ఉద్యోగుల విభజనపై రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన మార్గదర్శకాలు, తుది జాబితాలను వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. -
రెండో మెరిట్ జాబితాతో ఏఈ పోస్టులు!
♦ విద్యుత్ సంస్థలకు సుప్రీంకోర్టు అనుమతి ♦ 239 మిగులు పోస్టుల భర్తీకి మార్గం సుగమం ♦ త్వరలో 1,000 ఏఈ పోస్టుల భర్తీకి ఉమ్మడి ప్రకటన సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ విద్యుత్ ఇంజనీర్ పోస్టుల భర్తీలో మెరిట్ అభ్యర్థులకు భారీ ఊరట లభించింది. రాష్ట్రంలోని 4 విద్యుత్ సంస్థల్లో మిగిలిన 239 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టులను రెండో మెరిట్ జాబితాతో భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండో మెరిట్ జాబితాతో మిగిలిన పోస్టుల భర్తీకి ఇంధన శాఖ జారీ చేసిన సర్క్యులర్ చెల్లుబాటు కాదంటూ రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను గురువారం కొట్టేసింది. కేసు నేపథ్యమిది.. జెన్కోలో 856, ట్రాన్స్‌కోలో 206, ఎన్పీడీసీఎల్లో 164, ఎస్పీడీసీఎల్లో 201 ఏఈ పోస్టులు కలిపి 1,427 పోస్టుల భర్తీకి గతేడాది విద్యుత్ సంస్థలు నియామక ప్రకటనలు జారీ చేశాయి. ఒక్కో అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో ఎంపికై ఏదో ఓ సంస్థలో చేరడంతో టీఎస్ఎన్పీడీసీఎల్లో 164 ఏఈ పోస్టులకు 107, ట్రాన్స్‌కోలో 206 పోస్టులకు 59, టీఎస్ఎస్పీడీసీఎల్లో 201 పోస్టులకు 73 పోస్టులు ఖాళీగా మిగిలాయి. ట్రాన్స్‌కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్లో 239 పోస్టులను రెండో జాబితా తో భర్తీ చేయాలని ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేయగా నిరుద్యోగులు హైకోర్టులో సవాల్ చేశారు. 1997 జనవరి 22న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.89 ప్రకారం భర్తీ చేయడానికి వీల్లేదని నిరుద్యోగుల వాదనతో కోర్టు ఏకీభవిస్తూ గతేడాది ఆగస్టు 29న ఉత్తర్వులిచ్చింది. ఇంధన శాఖ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. సుప్రీంకోర్టు స్పందిస్తూ.. 4 విద్యుత్ సంస్థల్లో ఏఈ పోస్టుల భర్తీకి ఒకేసారి వేర్వేరు ప్రకటనలివ్వడం, పరీక్షలు నిర్వహించడంతో మెరిట్ గల అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారని, దీంతో ప్రత్యేక పరిస్థితులు తలెత్తాయని వ్యాఖ్యానించింది. మిగిలిపోయిన పోస్టుల భర్తీలో జీవో నం.89 వర్తింపజేయాల్సిన అవసరం లేదని, రెండో జాబితాతో భర్తీకి విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకోవచ్చని తాజా తీర్పులో పేర్కొంది. తొలుత 239 పోస్టుల భర్తీ తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్లో 1,000 ఏఈ పోస్టుల భర్తీకి త్వరలో ఉమ్మడి ప్రకటన జారీ చేయాలని యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 239 పోస్టులను తొలుత భర్తీ చేస్తామని, తర్వాత ఏఈ పోస్టుల ఖాళీలను గుర్తించి నియా మక ప్రకటన ఇస్తామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన విద్యుత్ ఉద్యోగులు
విజయవాడ: వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధుల బృందం బుధవారం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసింది. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వినతి పత్రం అందజేసింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గురించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరింది. విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులతో మాట్లాడిన వైఎస్ జగన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు. -
ఆంధ్రా ఉద్యోగులను స్వరాష్ట్రం పంపాలి
పంజగుట్ట: తెలంగాణ నుంచి రిలీవైన ఆంధ్రా స్థానికత కలిగిన విద్యుత్ ఉద్యోగులను తిరిగి తెలంగాణకు అటాచ్ చేస్తే ఉద్యమిస్తామని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఏ ప్రాంత ఉద్యోగులు అదే ప్రాంతంలో పనిచేయాలని వారు డిమాండ్ చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అసోసియేషన్ అధ్యక్షుడు జి.సంపత్‌కుమార్, సెక్రటరీ జనరల్ రత్నాకర్ రావు మాట్లాడారు. తెలంగాణ నుంచి రిలీవ్ అయిన 1250 మంది ఆంధ్రాప్రాంత ఉద్యోగులకు గత ఎప్రిల్ నుంచి ప్రతినెలా తెలంగాణ ప్రభుత్వం 16 కోట్లు చెల్లిస్తోందని, ఇది ఇక్కడి ప్రజలపై ఆర్థికంగా ఎంతో భారమన్నారు. వీరిని వెంటనే రిలీవ్ చేయకపోతే ఇక్కడి పదోన్నతులకు నష్టం వాటిల్లుతుందన్నారు. ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు 220 మందిని ఆక్కడి ప్రభుత్వం రిలీవ్ చేయగానే తెలంగాణ ప్రభుత్వం పోస్టులు లేకున్నప్పటికీ సూపర్‌మెమోరి పోస్టులు క్రియేట్ చేసి విధుల్లో చేర్చుకుందన్నారు. రిలీవ్ అయిన ఆంధ్రా ఉద్యోగులు తమను స్వ రాష్ట్రానికి పంపాలని 20 రోజులుగా విద్యుత్ సౌధలో రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం వారిని విధులో్లకి చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అడిషనల్ సెక్రటరీ జనరల్ కె.కిరణ్‌కుమార్, వెంకట నారాయణ, జనప్రియ, సూర్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఇంజనీర్
ఏడీఈ శ్యాంసుందర్‌రెడ్డి ఆస్తులపై అధికారుల దాడులు పలు చోట్ల భవనాలు, ప్లాట్లు, 11 ఎకరాల స్థలం గుర్తింపు సాక్షి, హైదరాబాద్: అక్రమాలకు, అవకతవకలకు పాల్పడి కోట్లాది రూపాయలు వెనకేసుకున్న మరో అవినీతి తిమింగలం రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ)కి చిక్కింది. విద్యుత్ శాఖ అదనపు డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) చీమర్ల శ్యాంసుందర్‌రెడ్డి నివాసం, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు చేసి... కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. హైదరాబాద్‌లో మింట్ కాంపౌండ్ వద్ద ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయంలో శ్యాంసుందర్‌రెడ్డి ఏడీఈగా పనిచేస్తున్నారు. ఆయన అవినీతిపై సమాచారమున్న ఏసీబీ అధికారులు... హైదరాబాద్ విభాగం డీఎస్పీలు రవికుమార్, అశోక్ నేతృత్వంలో బుధవారం తెల్లవారుజామున దాడులు ప్రారంభించారు. ఏకకాలంలో ఏడు బృందాలతో సైదాబాద్ సరస్వతీనగర్‌లోని శ్యాంసుందర్‌రెడ్డి నివాసం, కూకట్‌పల్లిలో రెండు నివాసాలు, నెరేడ్మెట్, బోడుప్పల్, కొంపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్, దాసుపల్లిలోని ఆయన బంధువుల నివాసాలపై దాడులు చేశారు. ఈ సోదాల్లో పలు ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సంతోష్‌నగర్ కరూర్ వైశ్యా బ్యాంకు, సైదాబాద్ కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో శ్యాంసుందర్‌రెడ్డికి సంబంధించిన ఖాతాల లావాదేవీలను పరిశీలించారు. కరూర్ వైశ్యా బ్యాంకులోని లాకర్ నుంచి 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో బయటపడిన ఆస్తుల విలువ పత్రాల (డాక్యుమెంట్ విలువ) ప్రకారం.. రూ. 1.35 కోట్లు అని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అయితే.. ఈ ఆస్తుల మార్కెట్ విలువ ఇంతకు చాలా రేట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. కాగా శ్యాంసుందర్‌రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. త్వరలో నిందితుడిని రిమాండ్‌కు పంపుతామని తెలిపారు. శ్యాంసుందర్ ఆస్తుల చిట్టా.. సైదాబాద్ సరస్వతీనగర్‌లో భవనం కూకట్‌పల్లిలో రెండస్తుల భవనం (జీ+2) నెరేడ్మెట్లోని ఓ అపార్ట్మెంటులో ఫ్లాట్ బోడుప్పల్, కొంపల్లి ప్రాంతాల్లో ప్లాట్లు ఒక స్విఫ్ట్ కారు మహబూబ్‌నగర్ జిల్ల్లాలో 11 ఎకరాల స్థలం ఇంట్లో ఏడు తులాల బంగారు ఆభరణాలు బ్యాంకు లాకర్లో 60 తులాల బంగారం -
నేడు విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల సభ
సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ జింఖానా మైదానంలో సోమవారం ఏపీ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు ఉద్యోగుల బహిరంగ సభ జరుగనుంది. ఏపీ కాంట్రాక్టు విద్యుత్ కార్మికుల ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కాశీనాథ బాబు అధ్యక్షతన జరిగే సభలో యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొననున్నారు. 15 ఏళ్ల నుంచి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న తమను డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది. బహిరంగ సభ ద్వారా తమ నిరవధిక సమ్మెను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. -
వైఎస్సార్ విద్యుత్ యూనియన్ను బలోపేతం చేయాలి
డిస్కం నాయకులు రమేష్, బాలాజీ నెల్లూరు (రవాణా): సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ బలోపేతం చేయాలని డిస్కం అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, బాలాజీ పిలుపునిచ్చారు. స్థానిక ఓ హోటల్లో ఆదివారం నెల్లూరు రీజనల్ వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ డిస్కం పరిధిలో నిత్యం విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోవడం వల్ల రోజుల పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయన్నారు. మృతుల సంఖ్య తగ్గిం చేందుకు యూనియన్ పరంగా కృషి చేస్తామన్నారు. విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు ఏడాదికి రూ. 1000 చెల్లిస్తే ప్రమాదాల్లో మరణించిన కుటుంబీకులకు బీమా కింద రూ. 20 లక్షలు పరి హారం ఇచ్చేందుకు ఎస్బీఐ, ఎస్బీహెచ్ ముందుకు వచ్చాయన్నారు. 2004 నుంచి రావాల్సిన జీపీఎఫ్, ఈపీఎప్‌లకు కృషి చేస్తామన్నారు. కాంట్రాక్టు కార్మికులకు బ్యాంకు ల ద్వారా వేతనం అందజేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణలో వయో పరిమితి అన్ని శాఖలకు ఒకే తరహా విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ కోసం ఉద్యమించినట్లు చెప్పారు. యూనియన్ నాయకుడు రమణారెడ్డి మాట్లాడుతూ గతంలో 2010లో వేతన సవరణలు జరిగాయన్నారు. మళ్లీ గడువు పూర్తయి 8 నెలలు కావస్తున్నా వేతన సవరణలు జరగలేదన్నారు. అన్ని యూనియన్లలో అవినీతికి పాల్పడ్డ నాయుకులు ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని చెప్పారు. జిల్లా నాయకుడు శివయ్య మాట్లాడుతూ పనిచేసే యూనియన్‌గా వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ ఎదగాలని ఆకాంక్షించారు. విశ్రాంత ఉద్యోగి వెంకటరావు మాట్లాడుతూ అనుభవం లేని నాయకత్వం వల్లే సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ నూతన కమిటీ వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నెల్లూరు రీజనల్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని ఓ హాటల్లో ఆదివారం సమావేశమైన డిస్కం అధ్య, కార్యదర్శుల సమక్షంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రీజనల్ అధ్యక్షుడిగా కె.రమణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంవీ రమణయ్య, ప్రధాన కార్యదర్శిగా జీవీ శివయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రీజనల్ ఉపాధ్యక్షులుగా సీహెచ్ సాంబశివరావు, కె.దేవదాసు, కోశాధికారిగా ఎస్కే షాహిద్, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్వీ కార్తిక్, సహాయ కార్యదర్శులుగా సీహెచ్ సురేష్‌బాబు, ఎం.సుభాన్‌బేగ్‌లను ఎన్నుకున్నారు. -
ఉద్యోగాలు
టీసీఐఎల్ న్యూఢిల్లీలోని టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా కాంట్రాక్ట్ పద్ధతిలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టుల సంఖ్య: 3 అర్హతలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 17 వెబ్సైట్: ఠీఠీఠీ.్టఛిజీజీఛీజ్చీ.ఛిౌఝ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూర్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీర్ ఖాళీలు: 13 వయసు: 28 ఏళ్లకు మించకూడదు. అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 22 వెబ్సైట్: www.bel-india.com స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ పద్ధతిలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: సీఏ/ పీజీ డిప్లొమా ఇన్ కంపెనీ సెక్రటరీ లేదా ఏదైనా పీజీ ఉండాలి. 15 ఏళ్ల అనుభవం అవసరం. వయసు: 40 - 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 22 వెబ్సైట్: www.sbi.co.in -
లంకలో రామాయణ దర్శనం
పాఠక ప్రయాణం శాంకరీదేవి శక్తి పీఠ సందర్శనం.. బుద్ధుని బోధనల ఆధ్యాత్మిక సౌరభం... రామాయణంలోని చివరి అంకానికి సాక్షీభూతమైన ప్రదేశాల ప్రాభవం... సుందర జలపాతాల సౌందర్యం... అడుగడుగునా చారిత్రక వైభవం... కళ్లకు కట్టే శ్రీలంక పర్యటన ఆజన్మాంతం ఓ మధురజ్ఞాపకమని వర్ణిస్తున్నారు ఒంగోలు వాసి అయిన విశ్రాంత ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎస్వీఎస్ భగవానులు. ద్వాదశ జ్యోతిర్లింగాలను గతంలోనే సందర్శించిన నేను ప్రథమ శక్తి పీఠమైన శ్రీ శాంకరీదేవిని దర్శించాలనుకున్నాను. అందులో భాగంగానే శ్రీలంక ప్రయాణానికి మా బంధువులతో కలిసి బయల్దేరాను. శ్రీలంక ట్రావెల్ ఏజెన్సీతో ముందుగానే ఒప్పందం చేసుకున్నాం. ఒంగోలు నుంచి చెన్నైకి రైలులో అటు నుంచి ఇండియన్ ఎయిర్‌లైన్స్ వారి విమానంలో బయల్దేరి, గంటన్నర వ్యవధిలో శ్రీలంక రాజధాని కొలంబో విమానాశ్రయంలో దిగాం. అక్కడ శ్రీలంక ట్రావెల్ ఏజెన్సీ వారు తమ వాహనంలో మమ్మల్ని తీసుకెళ్లారు. కొలంబో నుంచి ట్రిన్కోమలీకి... ముందుగా మున్నేశ్వరం చేరుకొని అక్కడ మున్నేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించాం. రావణవధ అనంత రం రాముడు ప్రతిష్ఠించిన శివ దేవాలయాన్ని, తిరుకోనేశ్వర దేవస్థానం పక్కన సముద్రపు ఒడ్డున గల రావణబ్రహ్మ ఏకైక విగ్రహాన్ని చూసి.. అక్కణ్ణుంచి బయల్దేరి 268 కి.మీ దూరంలోని ట్రిన్కోమలీ పట్టణం చేరాం. ట్రిన్‌కోమలీలో శక్తి పీఠం ట్రిన్కోమలీ పట్టణానికి సమీపంలో సముద్రంలోకి చొచ్చుకొని వచ్చినట్టున్న కొండపై శాంకరీదేవి ఆలయం ఉంది. ఇక్కడ శాంకరీదేవి దర్శనం మాటల్లో వర్ణించలేం. ఇక్కడే శివుడి గుడి ఉన్న ప్రాంతాన్ని తిరుకోనేశ్వరం అంటారు. ఎటు చూసినా హిందూ, బౌద్ధమతాల సమ్మేళనం కళ్లకు కడుతుంది. డంబుల్లా గుహలలో బంగారు బుద్ధుడు మరుసటి రోజు ట్రిన్కోమలీ నుంచి కాండీ పట్టణానికి బయల్దేరి, మధ్యలో డంబుల్లా గుహలలో బంగారు బుద్ధుని ఆలయం, శ్రీ రాములవారు పాశుపతాస్త్రం సంధించిన ధన్వేలి, రామబాణం పడిన లగ్గాల గ్రామాలను సందర్శించాం. రామ-రావణ సంగ్రామం జరిగిన ప్రదేశాన్ని పరికిస్తూ, టీ తోటల సోయగాలను వీక్షిస్తూ, ఆయుర్వేద మూలికల మందుల తయారీ కేంద్రాలను చూస్తూ, రాత్రి కాండీ పట్టణంలోనే బస చేశాం. మరుసటి రోజు బుద్ధుని అవశేషాలను భద్రపరిచి, దాని పైన నిర్మించిన సుందరమైన బుద్ధ దేవాలయాన్ని సందర్శించాం. లంకలో రామాయణం చివరి అంకం కాండీ నుంచి బయల్దేరి రాంబోడా పర్వతాలపై చిన్మయ మిషన్ వారు నిర్మించిన 18 అడుగుల నిలువెత్తు ఆంజనేయ విగ్రహాన్ని దర్శించి, సముద్రమట్టానికి 6135 అడుగుల ఎత్తు గల నువారా ఎలియా అనే పట్టణం చేరాం. అక్కడ నుండి రావణాసురుడి గుహ కలిగిన ఇస్తిపురం బండారువేల చూశాం. ఈ గుహలు ఆసియా ఖండ ప్రాచీనతకు ప్రత్యక్ష నిదర్శనాలు. హనుమ పాదముద్రలు హనుమంతుడు సంజీవని పర్వతం తెచ్చిన గుర్తుగా ఆయన పాదముద్రలు రుమస్సాలలో చూశాం. మటారాలో నిలువెత్తు బౌద్ధ విగ్రహాన్ని సందర్శించి, హిక్కాదువ అనే సముద్ర ప్రాంతానికి చేరుకున్నాం. ఇక్కడ సుమద్రం గంభీరంగా, రామాయణంలోని సంగ్రామ ఘట్టానికి గుర్తుగా నేటికీ కళ్లెదుట నిలిచింది. రామాయణం జరిగింది అనడానికి పూర్తి ఆధారాలు ఆనవాళ్లతో సహా ఇక్కడ కనిపించాయి. కొలంబోలో సుప్రసిద్ధ రథ పంచముఖ హనుమాన్ మందిరం దర్శించుకొని కొలంబో నుంచి చెన్నై మీదుగా ఒంగోలు చేరాం. మన దేశంలో అయోధ్యలో మొదలైన రామాయణం చివరి అంకాన్ని శ్రీలంకలో వీక్షించి, జన్మ ధన్యైమైందని అందరం భావించాం. సింహళానికి చలో చలో... ఒంగోలు నుంచి చెన్నై మీదుగా కొలొంబో కొలంబో నుంచి ట్రిన్‌కోమలి 268 కి.మీ. ట్రిన్‌కోమలిలో అష్టాదశ శక్తిపీఠాలలో తొలిదైన శ్రీశాంకరీదేవి శక్తి పీఠం ఉంది. ట్రిన్‌కోమలి నుంచి కాండీ పట్టణం 181 కి.మీ -
వెళ్లొస్తా మిత్రమా..!
* బంధం వీడింది.....స్నేహం ఓడింది * రాష్ట్ర విభజనతో ఉద్యోగుల మధ్య దూరం * జూన్ 2 నుంచి విద్యుత్ ఉద్యోగుల స్థానచలనం * దుఃఖ సాగరంలో ఉద్యోగుల కుటుంబాలు సీలేరు,న్యూస్‌లైన్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన 20-30 ఏళ్ళ బంధాన్ని వీడిపోయేలా చేసింది. వారి మధ్య ఉన్న స్నేహాన్ని ఓడించి కంట తడి పెట్టేలా చేసింది. దశాబ్దాల నుంచి కలిసిమెలసి ఉన్న వారు ఇప్పుడు సొంత రాష్ట్రమైన తెలంగాణకు పయనమయ్యే రోజు వచ్చింది. దీంతో సీలేరు పవర్ ప్రాజెక్టు కాంప్లెక్స్‌లో అందరి మనసుల్లోనే ఒకటే బాధ....మళ్లీ కలుస్తామో లేదోనన్న ఆవేదన...అందరి హృదయాలూ బరువెక్కగా అసంకల్పితంగా కళ్లు వర్షించాయి. చిరకాల మిత్రుడికి వీడ్కోలు పలికాయి. జూన్ 2వ తేదీ తర్వాత అక్కడి వారు ఇక్కడకి.. ఇక్కడివారు అక్కడకు వెళ్ళిపోవాలన్న నిబంధనతో రాష్ట్రంలో ప్రముఖ జలవిద్యుత్ కేంద్రాలుగా పేరుపొందిన విశాఖ జిల్లా సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న ఉద్యోగులు సైతం ఈ మేరకు సిద్ధమవుతున్నారు. మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం వంటి జలవిద్యుత్ కేంద్రాలలో వివిధ విభాగాలలో పని చేస్తున్న తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల వివరాల సేకరణ ఇప్పటికే పూర్తయింది. ఈ 4 కేంద్రాల్లో వంద మందికి పైగా తెలంగాణ ఉద్యోగులు ఉన్నారు. వీరు గత 20 ఏళ్ళుగా ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఇక్కడి సంసృ ్కతి, సంప్రదాయాలతో మమేకమయ్యారు. అంతేకాకుండా కొందరైతే ఇక్కడివారితో పెళ్లి సంబంధాలూ కలుపుకున్నారు. స్వస్థలాల్లోని సొంత బంధువుల కన్నా ఇక్కడివారితోనే అనుబంధం పెంచుకున్నారు. అలాంటిది ఇప్పుడు రాష్ట్రం విడిపోవడంతో తమ ప్రాంతాలకు వెళ్ళిపోవాలని అనడంతో ప్రస్తుతం ఈ జలవిద్యుత్ కేంద్ర ఉద్యోగులు భారంగానే అటువైపు అడుగులు వేస్తున్నారు. విద్యార్థుల్లో కలవరం రాష్ట్రం విడిపోవడంతో ఆఖరికి చదువుకునే విద్యార్థుల మధ్య కూడా కలవరం రేగింది. చిన్నప్పట్నుంచీ కలసిమెలసి తిరిగి ఆడుకుని చదువుకున్న విద్యార్థుల మధ్య అమలిన స్నేహం కుదిరింది. అయితే ఇప్పుడు వారు సైతం వెళ్లిపోనుండడంతో చిన్నారుల మనసుల్లోనూ ఏదో తెలియని ఆవేదన అలముకుంది. వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలలు మారిపోవడంతో చిన్ననాటి స్నేహితులకు దూరమైపోతున్నామని కుమిలిపోతున్నారు. మోతుగూడెం కేంద్రంలో ఎక్కువ తెలంగాణ ఉద్యోగులే... తెలంగాణ, సీమాంధ్ర సరిహద్దు చింతూరు సమీప మోతుగూడెం జలవిద్యుత్ కేంద్రంలో 60 మందికి పైగా తెలంగాణ ఉద్యోగులే ఉన్నారు. వీరంతా గత 20 ఏళ్ళుగా ఇక్కడే స్థిరంగా ఉండి ఉద్యోగం చేసుకోవడంతోపాటు వారి బంధువులు కూడా వ్యాపారాలు వంటివి చేసుకొని స్థిరనివాసం ఉన్నారు. అలాంటిది ఇప్పుడు వారంతా వెళ్ళిపోతుండటంతో బాధగా ఉందని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విడిపోవడం బాధాకరం గత 30 ఏళ్లుగా కలసిమెలసి అన్నదమ్ముల్లా ఉద్యోగం చేసుకున్న మాకు విడిపోవడం బాధాకరంగా ఉంది. అలాంటిది ఇప్పుడు ఎవరికివారు దూరమైపోవడంతో ఎందుకిలా జరిగిందంటూ బాధపడుతున్నాం. - ఆనంద్, జెన్కో ఉద్యోగి, సీలేరు. ఇక్కడి వారితో కలిసిపోయాం.. మేం పుట్టి పెరిగింది తెలంగాణ, ఉద్యోగం నిమిత్తం గత 15 ఏళ్ళుగా సీలేరులోనే ఉంటున్నాం. ఇక్కడ వారితో, తోటి ఉద్యోగులతోనే ఎక్కువగా స్నేహంగా ఉంటాం. అలాంటిది రాష్ట్రం విడిపోయి నేను తెలంగాణ వెళ్ళిపోవడం చాలాబాధగా ఉంది. - ఆలీ, తెలంగాణ ఉద్యోగి. స్నేహం దూరమవుతుంది ఎన్నో ఏళ్ళుగా కలసిమెలసి చదువుకుంటూ ఆడుకుంటున్న మా పిల్లల మధ్య స్నేహం కూడా రాష్ట్ర విభజన వల్ల దూరమైపోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. - దారరాజు, జెన్కో ఉద్యోగి. విడిపోయినా కలిసి ఉంటాం.. రాష్ట్రం విడిపోయినా ఎప్పటిలాగే కుటుంబ సభ్యులలాగే కలసి ఉంటాం. రాష్ట్రం విడిపోయినంత మాత్రాన స్నేహాన్ని, కుటుంబాలను దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. - యాసిన్‌బాబా, జెన్కో ఉద్యోగి. -
విద్యుత్ ఉద్యోగుల సమ్మె విరమణ
-
విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మె
నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌పై విద్యుత్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాలో మూడువేల మంది విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో జిల్లాలోని పలు సబ్స్టేషన్లలో సిబ్బంది లేకపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఒకవైపు విద్యుత్ కోతలతో అల్లాడుతుంటే, మరోవైపు ఉద్యోగులు సమ్మెకు దిగడంతో జనాలకు కష్టాలు పెరిగాయి. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. బిల్లులు చెల్లింపు కేంద్రాలు సైతం పనిచేయలేదు. డిమాండ్స్‌ను ప్రభుత్వం తీర్చకపోతే నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు జేఏసీ నాయకులు హెచ్చరించారు. విద్యుత్ ఉద్యోగులు నెల్లూరు నగరంలోని విద్యుత్ భవన్లో ఆదివారం అన్ని ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాల నేతలు సమావేశమై విద్యుత్ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మెను ఉధృతం చేయాలని నిర్ణయించారు. తొలుత ఎస్ఈ కార్యాలయంలోని సిబ్బందిని బయటకు పంపారు. ఆనంతరం విద్యుత్ భవన్ ఎదుట ధర్నాకు దిగారు. విద్యుత్ జేఏసీ చైర్మన్ రమేష్, కన్వీనర్ అనీల్‌కుమార్ మాట్లాడుతూ ఏపీ జెన్కో, ట్రాన్స్‌కో యాజమాన్యాలు ఉద్యోగుల పీఆర్సీ(పే రివిజన్ కమిషన్)ని 27.5 శాతం పెంచుతూ ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేక పోయిందన్నారు. ఫైలుపై గవర్నర్ సంతకం చేయకుండా పక్కన పెట్టడం సరికాదన్నారు. 14 సంవత్సరాల సర్వీసు ఉన్నవారికి రెండు ఇంక్రిమెంట్లు, 14 సంవత్సరాల సర్వీసు కంటే ఎక్కువ ఉన్నవారికి మూడు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారు కోరారు. -
కరెంట్‌కు కటకట
హామీలు నెరవేర్చలేదని విద్యుత్ ఉద్యోగుల సమ్మె చాలా చోట్ల పగలంతా పవర్ కట్ ఫ్యూజులు పోయినా పట్టించుకునేవారు లేరు కరెంట్‌లేక ప్రజల అవస్థలు తిరుపతి, న్యూస్‌లైన్: తమ డిమాండ్ల సాధనకోసం విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో ప్రజలకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. ట్రాన్స్‌కో, జెన్ కో సంస్థల సిబ్బంది ఆదివారం నుంచి సమ్మెకు దిగడంతో గ్రామీణ ప్రాంతాల్లో అసలే అంతంత మాత్రంగా ఉన్న కరెంట్ సరఫరా మరింతగా దిగజారింది. ఫలితంగా గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లలో తలెత్తే సాంకేతిక సమస్యలను సరిచేసే వారు లేకపోవడంతో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సిబ్బంది సమ్మె కారణంగా మదనపల్లెలో ఆదివారం ఉదయం నుంచి కరెంట్ సరఫరా లేదు. సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చింది. సోమవారం ఉదయం 9 గంటలకు సరఫరా ఆగిపోయి, సాయంత్రం 5 గంటల వరకు కూడా రాలేదు. పుంగనూరులో ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తె లియని పరిస్థితి. అరగంట సరఫరా ఉంటే మూడు గంటలు ఉండ టం లేదని ప్రజలు వాపోతున్నారు. పీలేరులోఆదివారం ఉదయం పోయిన కరెంట్ రాత్రి వచ్చింది. సోమవారం ఉదయం 7.30 గంటలకు పోయి మధ్యాహ్నం 3 గంటలకు వచ్చింది. పలమనేరులోనూ అదే పరిస్థితి. తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు పట్టణాల్లో మాత్రం కరెంట్ కోత వేళలను యథావిధిగా అమలు చేస్తున్నారు. మొత్తం మీద విద్యుత్ సిబ్బంది సమ్మె ప్రభావం ఇప్పుడిప్పుడే ప్రజలపై పడుతోంది. సమ్మె ఇలాగే కొనసాగితే పల్లె ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తప్పవు. డిస్కం కార్యాలయం వద్ద ధర్నా గతంలో అంగీకరించిన మేరకు జీతాలను సవరించి చెల్లించేందుకు ప్రభుత్వం ససేమిరా అనడంతో అనివార్యంగా సమ్మెకు దిగాల్సి వచ్చిందని విద్యుత్ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ పీ.అశోక్‌కుమార్ తెలిపారు. సమ్మెలో భాగంగా తిరుపతిలో డిస్కం కార్పొరేట్ కార్యాలయం(విద్యుత్ నిలయం) ప్రధాన ద్వారం వద్ద ఉద్యోగులు సోమవారం ధర్నాచేసి తమ డిమాండ్లను నినదించారు. సిబ్బంది సమ్మెకారణంగా డిస్కం కార్యాలయంతో బాటు సర్కిల్, డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో కార్యకలాపాలు స్తంభించాయి. ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ తమ డిమాండ్లపై ట్రాన్స్‌కో యాజమాన్యం విద్యుత్ ఉద్యోగుల సంఘాలతో పలు దఫాలు చర్చలు జరిపి అంగీకరించిన మేరకు ఈనెల 21న అగ్రిమెంట్ పై సంతకాలు చేయాల్సి ఉందన్నారు. అయితే యాజమాన్యం మాట మార్చి ఇప్పుడు కుదరదని చెప్పడంతో తాము సమ్మెకు దిగామన్నారు. జేఏసీ కన్వీనర్ మునిశంకరయ్య మాట్లాడుతూ ప్రతి నాలుగేళ్లకోసారి చేయాల్సిన వేతన సవరణ చేయకుండా యాజమాన్యం మొండి వైఖరిని అవలంబించడం దురదృష్టకరమన్నారు. ధర్నాలో డిస్కం జేఏసీ ప్రచార కార్యదర్శి ఎల్.చలపతి, కో-కన్వీనర్లు ధర్మజ్ఞాని, బాలచంద్రబాబు, ర మేష్‌బాబు, పీ.మాధవరావ్, బీ.వాలాజీ పాల్గొన్నారు. -
విద్యుత్ సమ్మె విరమణ
చర్చలు సఫలం 27.5 శాతం ఐఆర్, మూడు ఇంక్రిమెంట్లకు ఓకే కాంట్రాక్టు ఉద్యోగులకూ నెలాఖరుకు పది శాతం ఐఆర్ {పభుత్వ అనుమతి తీసుకుంటామని యాజమాన్యం హామీ అర్ధరాత్రి నుంచే విధుల్లోకి వెళుతున్నట్లు జేఏసీ ప్రకటన నేటి మధ్యాహ్నానికి ఉత్పత్తి పునరుద్ధరణ! హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులు సమ్మెను విరమించారు. సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు యాజమాన్యంతో జరిగిన చర్చలు ఫలించాయి. ఉద్యోగుల డిమాండ్ మేరకు 27.5 శాతం మధ్యంతర భృతి(ఐఆర్), మూడు ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. అయితే అంతిమంగా ఈ అంశాలపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో మళ్లీ చర్చించి.. అందుకు అనుగుణంగా పీఆర్సీ అమలు చేస్తామని హామీనిచ్చింది. దీంతో సమ్మెను విరమిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సీతారామిరెడ్డి, కన్వీనర్ సుధాకర్‌రావు సోమవారం రాత్రి 10.30 గంటలకు ప్రకటించారు. వాస్తవానికి కాంట్రాక్టు ఉద్యోగులకు ఐఆర్ విషయంపై చర్చల్లో మధ్యాహ్నం నుంచి స్తబ్ధత ఏర్పడింది. కాంట్రాక్టు ఉద్యోగుల జీతభత్యాలపై ట్రాన్స్‌కో జేఎండీ రమేష్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఇప్పటి వరకు నివేదిక ఇవ్వలేదు. ఈ నెలాఖరు నాటికి ఇది అందుతుందని, ఆ తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామని యాజమాన్యం తొలుత పేర్కొంది. ఇందులో భాగంగానే ఈ కమిటీ మంగళవా రం భేటీ అవుతోందని తెలిపింది. అయితే తర్వాత సాగిన చర్చల్లో మాత్రం.. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని ఈ నెలాఖరులోగానే కాంట్రాక్టు ఉద్యోగులకు పది శాతం ఐఆర్ ఇచ్చేందుకు సిద్ధమని యాజమాన్యం కాస్త స్పష్టతనిచ్చింది. దీంతో శాంతించిన జేఏసీ నేతలు సమ్మె ను విరమిస్తున్నట్టు, సోమవారం అర్ధరాత్రి నుంచే విధుల్లోకి చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ చర్చల్లో ట్రాన్స్‌కో సీఎండీ సురేష్‌చందా, జేఎండీ రమేష్, జెన్కో ఎండీ విజయానంద్, సీపీడీసీఎల్ సీఎండీ రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నుంచి కో-చైర్మన్ మోహన్‌రెడ్డి, జేఏసీ నేతలు ఎం. గోపాల్, వెంకన్నగౌడ్, ప్రసాద్, కిరణ్, చంద్రుడు, భానుప్రకాశ్ చర్చలు జరిపారు. కాంట్రాక్టు సిబ్బంది ఆందోళన రెగ్యులర్ ఉద్యోగులతో పాటు తమకూ ఐఆర్ ఇ వ్వాల్సిందేనని చర్చల సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులు పట్టుబట్టారు. చర్చలకు వేదికైన విద్యు త్ సౌధ వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని, తమకూ వేతన సవరణ జరగకుండా సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒకవైపు జీహెచ్ఎంసీలోని కాంట్రాక్టు ఉద్యోగులకు ఐఆర్ ఇస్తున్నారని, తమకివ్వడంలో అభ్యంతరం ఏమిటని యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే, కాంట్రాక్టు ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చే విధానం విద్యుత్ సంస్థల్లో మొదటి నుంచి లేదని.. ఇప్పుడు తాము దీనిపై నిర్ణయం తీసుకోలేమని కొత్తగా ఏర్ప డే ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని యాజ మాన్యం తొలుత పేర్కొంది. ఈ నేపథ్యంలో చర్చల్లో మధ్యాహ్నం నుంచి స్తబ్దత ఏర్పడింది. చివరకు ప్రభుత్వం అనుమతి తీసుకుని ఈ నెలాఖరుకే పది శాతం ఐఆర్ ఇస్తామని యాజమాన్యం పేర్కొనడం తో చర్చలు సఫలమయ్యాయి. కా నీ, కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రం విరమణపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుమతినివ్వకపోతే తమ పరిస్థితేమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సాగదీసే వ్యవహారమని మండిపడ్డారు. పరిశ్రమలకు పూర్తిగా పవర్ కట్! విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో ఉత్పత్తి 11వేల నుంచి 6 వేల మెగావాట్లకు పడిపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలకు విద్యుత్ కోతలను అమలు చేశారు. సోమవారం పరిశ్రమలకు ఒక్క యూనిట్ కూడా సరఫరా కాలేదు. అలాగే వ్యవసాయానికీ పూర్తిగా కోత విధించారు. ఇక ఆదివారం గ్రామా లు, పట్టణాలకే పరిమితమైన కోతలు సోమవారం హైదరాబాద్, తిరుపతి, వైజాగ్, వరంగల్లోనూ అమలు చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్ కోతలతో జనం ఇక్కట్లు పడ్డారు. ఉక్కపోత, దోమల బెడదతో అగచాట్లు పడ్డారు. దీంతో కొన్ని సబ్స్టేషన్లపై ప్రజలు దాడులు చేశారు. అన్నీ మూతలే... ఉద్యోగుల సమ్మె వల్ల జెన్కోకు చెందిన పలు విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. కేటీపీపీ, ఆర్టీఎస్, మాచ్‌ఖండ్, సీలేరు బేసిన్లో మినహా అన్ని విద్యుత్ ప్లాంట్లల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. జెన్కోకు చెందిన అన్ని థర్మల్ ప్లాంట్లలో కలిపి మొత్తం 4,980 మెగావాట్ల ఉత్పత్తి ఆగింది. అయితే, సోమవారం రాత్రికి ఉద్యోగులు విధుల్లో చేరినప్పటికీ థర్మల్ కేంద్రాల్లో మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశం లేదు. -
సమ్మె విరమణ
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ ఉద్యోగులు సోమవారం రాత్రి సమ్మె విరమించారు. ఉద్యోగులకు 27.5, కాంట్రాక్ట్ కార్మికులకు 10 శాతం ఐఆర్, మూడు ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతించడంతో సమ్మె విరమించినట్టు విద్యుత్ జేఏసీ ప్రతినిధులు పోలాకి శ్రీనివాసరావు, వి.ఎస్.ఆర్.కె.గణపతి తెలిపారు. సోమవారం రాత్రి నుంచే విధులకు హాజరవుతున్నట్టు వెల్లడించారు. -
విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మెపై డీజీపీ సమీక్ష
హైదరాబాద్: 75 వేల మంది విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న మెరుపు సమ్మెపై డీజీపీ ప్రసాదరావు స్పందించారు. మెరుపు సమ్మె పేరుతో చట్టాన్ని అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. ప్రభుత్వం, అధికారులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. సమ్మె కారణంగా ప్రజలకు, సంస్థలకు, ఉత్పత్తి రంగాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మెపై డీజీపీ ప్రసాదరావు అధికారులతో సమీక్ష జరిపారు. -
రెపరెపలాడిన అరుణపతాకం
సాక్షి, ముంబై: రాష్ట్ర వ్యాప్తంగా మహారాష్ట్ర అవతరణ దినోత్సవాలతోపాటు కార్మిక దినోత్సవాలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అనేక తెలుగు సంఘాలు కూడా మహారాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని, కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాయి. ముంబై ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనిట్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ర్యాలీలు, జెండా ఆవిష్కరణలు, సభలను రిలయన్స్ కంపెనీకి చెందిన నాలుగు జోన్లల్లో నిర్వహించారు. తిలక్ నగర్ జోన్లో సైదులు సంగపంప, ఎడ్ల సత్తన్న, దిండోషి జోన్లో గుండె శంకర్, మల్లేశ్ ధీరమల్లు, ఎంఎంఆర్డీఏ జోన్లో కత్తుల లింగస్వామి, శ్రీను జింకల, ఎంఐడీసీ జోన్లో పొట్ట వెంకటేశ్ నేతృత్వంలో కంపెనీ గేటు ఎదుట ‘మేడే’ ఎర్ర జెండాలను ఎగురవేశారు. అనంతరం నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలకు యూనియన్ నాయకులు దిండోషిలో వాసు, మిలింద్ రానడే, అఖిల భారత తెలంగాణ రచయిత వేదిక కార్యదర్శి మచ్చ ప్రభాకర్ తదితరులు హాజరై అమరవీరులకు నివాళులు అర్పించారు. కార్మికుల హక్కులనుద్దేశించి మచ్చ ప్రభాకర్ మాట్లాడుతూ... ఎనిమిది గంటల పని విధానం కోసం చికాగోలో 1848, మే 1న కార్మికులు రక్తాన్ని చిందించిన రోజును ప్రపంచమంతటా కార్మికదినంగా జరుపుకుంటున్నారన్నారు. ఆ వారసత్వాన్ని ముంబైలోని రిలయన్స్ తెలుగు కార్మికులు కొనసాగిస్తుండడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ సంవత్సరం సుమారు పది ప్రాంతాల్లో శ్రమజీవి సంఘం, తెలంగాణ సంఘీభావ వేదికతోపాటు మరికొన్ని తెలంగాణ ప్రజా సంఘాలు కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. రిలయన్స్ నాయకులు మిలింద్ రానడే, ఎస్. సైదులు తిలక్ నగర్ జోన్లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ.. కార్మికుల ఐక్యత వల్లనే రిలయన్స్‌లో యూనియన్ బలపడి ఎన్నో హక్కులను సాధించుకొని ముందుకు పోతున్నామన్నారు. భవిష్యత్తులో మరింత విస్తరించి కార్మికుల సంక్షేమం కోసం పోరాడదామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కళా బృందం ఆలపించిన ఓ అరుణ పతాకమా.. కార్మికులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాలకు బొమ్మ లజ్మీన్, చెక్క మహేశ్ తదితరులు సహకరించారు. ఎంఐడీసీలో పొట్ట వెంకటేశ్, వాసు కార్మిక హక్కుల గురించి, మేడే ప్రత్యేకతను వివరించి సంఘటిత పోరాటమే లక్ష్యంగా కార్మికులు ముందుకు నడిచి తమ జీవితాలను మెరుగుపర్చుకోవాలన్నారు. పద్మశాలి సుధారక మండలి ఆధ్వర్యంలో.. పద్మశాలి సమాజ సుధారక మండలి ఆధ్వర్యంలో మహారాష్ట్ర అవతరణ దినోత్సవాలు, కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా జరిగింది. వర్లీ బీడీడీ చాల్స్‌లోని మండలి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండలి సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ధర్మకర్తల మండలి చైర్మన్ మంతెన రమేష్, అధ్యక్షుడు వాసాల శ్రీహరి, ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్ తదితరులు మే డే, అవతరణ దినోత్సవాల గురించి ప్రసంగించారు. ముఖ్యంగా సంయుక్త మహారాష్ట్ర కోసం అమరులైన వీరుల్లో తెలుగు వారు కూడా ఉన్నారని గుర్తుచేసుకున్నారు. హరిత పాటిల్, డి.అన్నపూర్ణాదేవి ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి జిందం భాస్కర్, పీఆర్వో సురుకుట్ల సురేష్, కోశాధికారి వక్కల్దేవి గణేష్, వేముల రామచందర్, చాప పరమేశ్వర్, నుమల్ల గంగాధర్ తదితరుల పాల్గొన్నారు. తూర్పు డోంబివలిలో.. సాక్షి, ముంబై: తెలంగాణ శ్రమజీవి సంఘం, తెలంగాణ ఉద్యమ సంఘీభావ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో తూర్పు డోంబివలిలో గురువారం ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకున్నారు. లేబర్ నాకా వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు ప్రసంగించారు. తర్వాత కళాకారులు ఆలపించిన గేయాలు సభికులను ఉత్తేజపరిచాయి. కార్యక్రమంలో శ్రమజీవి సంఘం నాయకుడు గోండ్యాల రమేష్, అక్కనపెల్లి దుర్గేష్, సీపీఐఎంఎల్ మహారాష్ర్ట అధ్యక్షుడు అరుణ్, అక్షయ్, బాలరాజ్, బద్లాపూర్ నర్సింహ్మ, వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు. తూర్పు అంధేరీలో.. తూర్పు అంధేరిలోని ‘తెలుగు కార్మికుల అసోసియేషన్ ముంబై’ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ముఖ్యఅతిథిగా హాజరైన బస రాజయ్య మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం ఏర్పడిన అనేక చట్టాలు, శాసనాలు కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. కార్యక్రమంలో పదాధికారుల ప్రధాన కార్యదర్శి బత్తుల లింగం, ఉపాధ్యక్షుడు కృపానందం, కార్యదర్శి మగ్గిడి రవి, కోశాధికారులు సంఘం ప్రభాకర్, తలారి భూమన్నలతోపాటు వినోద్, బస మహేష్, మణుకల పోశెట్టి, కోతి గంగారం, బోండోల్ల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ ములుండ్‌లో.. భారత్ సేవా సంఘం (బిఎల్ఎస్ఎస్), సంత్ రవిదాస్ మాదిగ సంఘం (ఎస్ఆర్ఎంఎస్) సంయుక్తంగా గురువారం ఉదయం పశ్చిమ ములుండ్‌లో తెలుగు నాకా వద్ద ప్రపంచ కార్మిక దినం, సంయుక్త మహారాష్ట్ర దినం, నారాయణ మేగాజీ లోఖండే జయంతి సభ నిర్వహించారు. ఈ సభలో బిఎల్ఎస్ఎస్ అధ్యక్షుడు డి. సాయిలు ముదిరాజ్, ఉపాధ్యక్షుడు గడ్సె స్వామి, కార్యదర్శి బోనగిరి కుమార్, ఎస్‌ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు బి. ద్రవిడ్ మాదిగ, జుట్టు లక్ష్మణ్, శనిగారం రవి, డి. శంకర్, బి. రాజేష్, కిషోర్, కొత్తూరి నందు, గుండ్ల అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: శ్రీకాకుళం జిల్లా విద్యుత్ ఉద్యోగులు శుక్రవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. వేతన సవరణ చేయాలని కోరుతూ రెండు రోజులనుంచి ఉద్యోగులు నిరసన దీక్ష చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరిం చారు. ప్రకటించినట్లుగా విద్యుత్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు వెళ్తుండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే పరిస్థితి కూడా ఉండదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ తరుణంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
రేపటి నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
తిరుపతి, న్యూస్‌లైన్: పీఆర్సీ ఏర్పాటులో యాజమాన్య నిరంకుశ వైఖరిని నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. ఇప్పటికే దశలవారీగా ఉద్యమం చేపట్టి వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినా యాజ మాన్యం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్) పరిధిలోని ఆరు జిల్లాల్లో పనిచేసే దాదాపు 10 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. సంస్థలోని 16 ఉద్యోగ సంఘాలు ఏకమై ఏపీ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం వర్క్ టు రూల్ పాటించి తిరుపతిలోని డిస్కం కార్పొరేట్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు ప్రారంభించారు. తమ జీత భత్యాల సవరణ కోసం ఒక పీఆర్సీని వేయమని తాము కోరితే యాజమాన్యం మూడు కమిటీలు వేసి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని జేఏసీ చైర్మన్ అశోక్‌కుమార్, కన్వీనర్ మునిశంకరయ్య ఆరోపించారు. పీఆర్సీతో పాటు కాంట్రాక్ ్ట సిబ్బంది సర్వీసులను క్రమబద్ధం చేయాలని, సంస్థలో ప్రైవేటీకరణకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. తొలి రోజు బుధవారం చేపట్టిన నిరాహార దీక్షలో పీ.బాలాజీ, నంజుండేశ్వర్, పీ.శ్రీధరన్, టీ.సుబ్రమణ్యం నాయుడు, జే. నాగరాజన్, ఎస్.భాస్కర్ పాల్గొన్నారు. వీరికి జేఏసీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. -
కాటేసిన కరెంట్
దోమ, న్యూస్‌లైన్: కరెంట్ కనెక్షన్ ఇస్తుండగా విద్యుత్ ప్రసారమవడంతో ఓ కూలీ విద్యుదాఘాతానికి గురై స్తంభంపైనే మృత్యువాతపడ్డాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని కుటుంబీకులు, స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మండల పరిధిలోని గొడుగోనుపల్లిలో గురువా రం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం.. పులి చెన్నయ్య, లక్ష్మమ్మ దంపతుల కుమారుడు వెంకటేష్(22) ఏడాదిగా స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్‌లో రోజువారి కూలీగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు బాస్పల్లి, బొంపల్లి గ్రామాల బిల్ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. వెంకటేష్ తరచు రైతుల అవసరాల మేరకు విద్యుత్ స్తంభాలు ఎక్కుతూ మరమ్మతులు చేస్తుంటాడు. ఈక్రమంలో గురువారం ఉదయం గ్రామానికి చెందిన రైతులు బాబు, అంజిలయ్య అవసరం మేరకు ట్రాన్స్ఫార్మర్ నుంచి లాగిన తీగలకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు స్తంభం ఎక్కాడు. ఈక్రమంలో విద్యుత్ సరఫరా అవడంతో కరెంట్ షాక్‌కు గురై వెంకటేష్ మృత్యువాత పడ్డాడు. తీగలకు మృతదేహం అలాగే వేలాడుతూ ఉండిపోయింది. యువకుడి మృతితో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.‘ఆదుకుంటావనుకుం టే సచ్చిపోతివా.. కొడుకా..’ అంటూ యువకుడి తల్లిదండ్రులు రోదించిన తీరు హృదయ విదారకం. లైన్ క్లియర్ చేసుకున్నాడా..? లేదా..? వెంకటేష్ మృతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అతడు స్థానిక లైన్మన్లు శం కర్, యూసుఫ్‌ల ఆదేశం మేరకే ఎల్సీ(లైన్ క్లియర్) తీసుకొని స్తంభం ఎక్కాడని రైతులు చెబుతున్నారు.అనుభవజ్ఞుడైన వెంకటేష్ ఎల్సీ తీసుకోకుండా ఎలా స్తంభం ఎక్కుతాడని ప్రశ్నిస్తున్నారు. కాగా వెంకటేష్ తమ నుంచి ఎల్సీ తీసుకోలేదని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. గ్రామస్తుల రాస్తారోకో: స్తంభించిన వాహనాలు వెంకటేష్ మృతితో బాస్పల్లి, గొడుగోనుపల్లి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పెద్దసంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిగి-మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి సుమారు 4 గంటల పాటు రాస్తారోకో చేశారు. దీంతో భారీగా వాహనాలు స్తంభించాయి. ట్రాన్స్‌కో ఏడీ రావాలని పట్టుబట్టారు. పరిగి సీఐ వేణుగోపాల్ రెడ్డి సిబ్బం దితో అక్కడికి చేరుకున్నారు. న్యాయం జరిగే లా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. మృతుడి కుటుంబీ కుల ఫిర్యాదు మేరకు విద్యుత్ లైన్‌మన్ శంకర్‌తో పాటు రైతులు బాబు, అంజిలయ్యలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పరిగి ఆస్పత్రికి తరలించారు. సెల్‌ఫోనే ఆధారం కానుంది.. వెంకటేష్ ఎల్సీ తీసుకున్నాడా లేదా అని తెలిసేందుకు అతడి సెల్‌ఫోనే ప్రధాన ఆధారంగా మారనుంది. వెంకటేష్ మృతదేహాన్ని స్తంభం పైనుంచి దించాక అధికారులు అతడి జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్‌కాల్ వివరాలను పరిశీలిస్తే అతడు విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడాడా..? లేదా అనే విషయం తెలియనుంది. వెంకటేష్ కాల్ లిస్టులో విద్యుత్ సబ్‌స్టేషన్, ఏఈలతో మాట్లాడినట్లు ఉందని పోలీసులు తెలిఆపరు. కాగా అతడు ఏవిషయం మాట్లాడో తెలియ దని, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విచారణ జరిపిస్తాం.. విద్యుత్ మరమ్మతులు చేసేటప్పుడు లైన్మన్లు తప్పనిసరిగా ఎల్సీ తీసుకుంటారు. నాకు తెలియకుండా సిబ్బంది ఎల్సీ తీసుకునే వీలు లేదు. గురువారం ఎవరూ ఎల్సీ తీసుకోలేదు. కొందరు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే స్తంభాలపై ఎక్కడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వెంకటేష్ మృతిపై విచారణ జరిపిస్తాం. - లక్ష్మీ నాయుడు, ట్రాన్స్‌కో ఏఈ -
విద్యుత్ సమ్మె వాయిదా
సీఎంతో సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చర్చలు సఫలం అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడిస్తానని సీఎం హామీ ఇచ్చారు: సాయిబాబా సమ్మె తాత్కాలికంగా వాయిదా వేశాం.. నిరసనలు కొనసాగుతాయి సమైక్యాంధ్రకు అన్యాయం జరిగితే మళ్లీ మెరుపు సమ్మె గురువారం మధ్యాహ్నం నుంచే విధుల్లోకి ఉద్యోగులు.. తొలగిన చీకట్లు సాక్షి, హైదరాబాద్: తుపాన్, పండుగల నేపథ్యంలో అత్యవసర సర్వీసులకు అంతరాయం కలగకుండా సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ(సేవ్ జేఏసీ) చైర్మన్ సాయిబాబా ప్రకటించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డితో విద్యుత్ ఉద్యోగులు గురువారం జరిపిన చర్చలు ఫలించాయి. అనంతరం సాయిబాబా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఓడిస్తామని ముఖ్యమంత్రి తమకు హామీ ఇచ్చారన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రిమండలి కమిటీ నివేదికకు కూడా గడువు ప్రకటించనందున తాము సమ్మెను వాయిదా వేస్తున్నామని చెప్పారు. సమైక్యాంధ్రను మోసం చేస్తే మళ్లీ మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ప్రస్తుతం చేసిన సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తమ వాణి వినిపించామని, ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని అన్నారు. సమ్మెను తాత్కాలికంగా వాయిదావేసినా నిరసన కార్యక్రమాలు మాత్రం యథావిధిగా కొనసాగిస్తామన్నారు. తమ సమ్మె కారణంగా విద్యుత్ లేక ప్రజలు ఇబ్బందులకు గురయినప్పటికీ.. సమైక్యాంధ్ర కోసం మౌనంగానే భరించారన్నారు. విద్యుత్ సరఫరాలేక ఆస్పత్రుల్లో రోగులు, వృద్ధులు, పిల్లలు ఇబ్బందులకు గురయ్యారన్నారు. ప్రజల్ని చీకటిలో ఉంచినందుకు తమను క్షమించాలని కోరారు. ఇప్పటి వరకూ సమ్మెలో పాల్గొన్న 50 వేల మంది ఉద్యోగులూ శుక్రవారం నుంచి విధులకు హాజరుకావాలని సాయిబాబా విజ్ఞప్తి చేశారు. ఈ చర్చల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. సాహూ, ట్రాన్స్‌కో ఇన్చార్జి సీఎండీ మునీంద్ర, జెన్కో ఎండీ విజయానంద్, విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు శ్రీనివాసరావు, గణేశ్, నరసింహులు, అనురాధ, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. పెరిగిన డిమాండ్.. విద్యుత్ ఉద్యోగులు సమ్మెను విరమించిన నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం నుంచి విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. తిరుపతి కేంద్రంగా ఉన్న ఎస్పీడీసీఎల్లో విద్యుత్ సరఫరా చేయాల్సింది 1,700 మెగావాట్లు ఉండగా... ఏకంగా 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేశారు. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఈపీడీసీఎల్ పరిధిలో 1,300 మెగావాట్లు తీసుకోవాల్సి ఉండగా.. ఏకంగా 1,600 మెగావాట్లు వినియోగించారు. దీంతో గ్రిడ్ ఫ్రీక్వెన్సీ 49.5 హెట్జ్కు పడిపోయింది. అయితే, తిరిగి విద్యుత్ కోతలు విధించడంతో సాధారణ స్థితికి చేరుకుంది. శుక్రవారం నుంచి విధుల్లో పాల్గొంటామని నేతలు ప్రకటించినప్పటికీ.. గురువారం మధ్యాహ్నం నుంచి విధుల్లో చేరారు. అనంతరం శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో ఏడు యూనిట్లకు నాలుగు యూనిట్లలో సాయంత్రానికి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఎగువ సీలేరు, డొంకరాయిలోనూ ఉత్పత్తి ప్రారంభమైంది. వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు(ఆర్టీపీపీ)లో ఉద్యోగులు మధ్యాహ్నం నుంచి విధుల్లో చేరారు. గురువారం రాత్రి నాటికి నాలుగో యూనిట్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు ప్రారంభించారు. విజయవాడలోని నార్లతాతారావు థర్మల్ పవర్ స్టేషన్(ఎన్టీటీపీఎస్)లో ఉద్యోగులు సాయంత్రం నుంచి విధుల్లో చేరారు. సమ్మె కాలాన్ని సెలవుగా ప్రకటించాలని కోరారు. ఇందుకు యాజమాన్యం పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో సాయంత్రం నుంచి విధులకు హాజరయ్యారు. ఇందులో కూడా విద్యుత్ ఉత్పత్తి చర్యలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి ఉత్పత్తి ప్రారంభం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇది సరికాదు సమ్మె విరమించిన నేపథ్యంలో ప్రధాన విద్యుత్ ఉద్యోగ సంఘాలతో విద్యుత్ సౌధలో జెన్కో ఎండీ కె. విజయానంద్, ట్రాన్స్‌కో సీఎండీ (ఇన్చార్జి) మునీంద్రలు గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. విద్యుత్ లాంటి అత్యవసర రంగం, ప్రజలకు ఎంతో అవసరమైన రంగంలో సమ్మె చేయడం సరికాదని సంఘాల నాయకులకు అధికారులు వివరించారు. మరోసారి సమ్మెకు దిగకుండా మీ సంఘంలోని కార్యకర్తలకు సూచించాలని కోరారు. ఇందుకు సంఘాల నాయకులు సమ్మతి తెలిపారు. -
రైల్వే శాఖకు సమైక్య సెగ
ఒంగోలు, న్యూస్‌లైన్: రైల్వే శాఖకు సమైక్య సెగ తగిలింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆదివారం విద్యుత్ శాఖ సిబ్బంది సమ్మెలోకి దిగారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి పలు రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. సోమవారమూ మరి కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఆదివారం ఉదయం 5.35 గంటలకు రైల్వేకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రైల్వే అధికారులు ఐదు నిముషాల్లోనే మరో గ్రిడ్‌తో అనుసంధానం చేశారు. ఆగిన రైళ్లు తిరిగి కదలడానికి అరగంటకుపైగా సమయం పట్టింది. ప్రారంభంలోనే అరగంట ఆలస్యంగా బయల్దేరిన పినాకిని(విజయవాడ- చెన్నై) ఎక్స్‌ప్రెస్ చీరాల సమీపానికి వచ్చేసరికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయంగా ఒక డీజిల్ ఇంజన్‌ను తెప్పించి దాదాపు గంటన్నర ఆలస్యంగా రైలును నడిపారు. రద్దయిన రైళ్లు ఇవే.. ముందస్తుగా గూడ్సు వాహనాలను నిలిపివేయాలని రైల్వే శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు పలు ప్యాసింజర్ రైళ్లును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా లోడు తగ్గకపోవడంతో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లనూ రద్దు చేశారు. ప్రయాణికుల రద్దీ పెరిగిపోవడంతో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు పలు చోట్ల స్టాపింగ్ కల్పించారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఒంగోలుకు చేరుకోగానే కేవలం విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఆగుతుందని ప్రకటించారు. అయితే కొన్ని రైళ్లు రద్దవడంతో ప్రయాణికుల ఇబ్బందులను ఒంగోలు స్టేషన్ మేనేజర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ చీరాల, బాపట్ల, తెనాలి స్టేషన్లలో ఆగుతుందని ప్రకటించి ప్రయాణికులు ఎక్కేందుకు వీలుగా పది నిమిషాల వరకు ఒంగోలు స్టేషన్లో ఆపారు. కోరమాండల్తోపాటు నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లు మూడు గంటలు ఆలస్యంగా నడిచాయి. సమైక్య ఉద్యమ నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో అదనపు బలగాలు మోహరించాయి. ప్రయాణికుల తీవ్ర అవస్థలు ఒక్కసారిగా పలు రైళ్ల సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమ్మె నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమితమవడంతో ఎక్కువ మంది రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. ఆదివారం రైళ్ల సర్వీసులు కూడా రద్దవడంతో ముందస్తుగా బుక్ చేసుకున్న వారు, చంటి పిల్లలతో వచ్చిన వారు, వృద్ధులు అవస్థలు ఎదుర్కొన్నారు. -
అంతంకాదు ఆరంభం మాత్రమే:సాయిబాబా
సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగుల చేపట్టిన సమ్మె అంతం కాదని, ఆరంభం మాత్రమేనని సీమాంధ్ర విద్యుత్ ఐకాస ఛైర్మన్ సాయిబాబా శనివారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన 72 గంటల సమ్మె ఈ రోజు అర్థరాత్రితో ముగిస్తుందన్నారు. రేపటినుంచి విద్యుత్ ఉద్యోగులు విధులకు హాజరువుతారని తెలిపారు. అలాగే సమ్మెలో భాగంగా ప్రభుత్వానికి అప్పగించిన సెల్ ఫోన్ సిమ్ కార్డులను రేపు తిరిగి తీసుకుంటామన్నారు. ఈ నెల 16,17 తేదీల్లో తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని సాయిబాబ ఈ సందర్భంగా వెల్లడించారు. -
సమ్మెపై పునరాలోచించండి: జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీలు
సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఏపీ ట్రాన్స్‌కో, ఏపీజెన్ కో సీఎండీలు అభిప్రాయపడ్డారు. సమ్మెపై సీమాంధ్ర ఉద్యోగులు పునరాలోచించుకోవాలని వారు సూచించారు. విద్యుత్ ఉత్పత్తి తగ్గితే ప్రధాన రంగాలైన రైల్వే,ఆసుపత్రులు, సాగునీటికి విద్యుత్ అందజేయవలసి ఉంటుందని తెలిపారు. అయితే సీమాంధ్రులు చేపట్టిన సమ్మెకు ప్రత్యామ్నాయ ప్రణాళిక అవసరం లేదని భావిస్తున్నట్లు వారు వివరించారు. జులై 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. దాంతో సీమాంధ్రలో సమైక్య ఉద్యమం రోజురోజూకు ఉధృతం అవుతోంది. ఇప్పటికే ఏపీఎన్జీవోలు, ఆర్టీసీ తదితర సంస్థలు నిరవధిక సమ్మెకు దిగాయి. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో విద్యుత్ ఉద్యోగులు నేటి అర్థరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ట్రాన్స్‌కో , జెన్కో సీఎండీలకు ఆయా ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులు అందజేశాయి. అంతేకాకుండా ఉద్యోగులకు గతంలో అందజేసిన సిమ్ కార్డులను ఆయా విద్యుత్ సంస్థలకు తిరిగి అందజేశారు.