వెళ్లొస్తా మిత్రమా..! | tearful goodbye to colleagues in siler | Sakshi
Sakshi News home page

వెళ్లొస్తా మిత్రమా..!

Published Mon, Jun 2 2014 7:23 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

వెళ్లొస్తా మిత్రమా..! - Sakshi

వెళ్లొస్తా మిత్రమా..!

* బంధం వీడింది.....స్నేహం ఓడింది

* రాష్ట్ర విభజనతో ఉద్యోగుల మధ్య దూరం

* జూన్ 2 నుంచి విద్యుత్ ఉద్యోగుల స్థానచలనం

* దుఃఖ సాగరంలో ఉద్యోగుల కుటుంబాలు

 సీలేరు,న్యూస్‌లైన్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన 20-30 ఏళ్ళ బంధాన్ని వీడిపోయేలా చేసింది. వారి మధ్య ఉన్న స్నేహాన్ని ఓడించి కంట తడి పెట్టేలా చేసింది. దశాబ్దాల నుంచి కలిసిమెలసి ఉన్న వారు ఇప్పుడు సొంత రాష్ట్రమైన తెలంగాణకు పయనమయ్యే రోజు వచ్చింది. దీంతో సీలేరు పవర్ ప్రాజెక్టు కాంప్లెక్స్‌లో అందరి మనసుల్లోనే ఒకటే బాధ....మళ్లీ కలుస్తామో లేదోనన్న ఆవేదన...అందరి హృదయాలూ బరువెక్కగా అసంకల్పితంగా కళ్లు వర్షించాయి. చిరకాల మిత్రుడికి వీడ్కోలు పలికాయి.
 
జూన్ 2వ తేదీ తర్వాత అక్కడి వారు ఇక్కడకి.. ఇక్కడివారు అక్కడకు వెళ్ళిపోవాలన్న నిబంధనతో రాష్ట్రంలో ప్రముఖ జలవిద్యుత్ కేంద్రాలుగా పేరుపొందిన విశాఖ జిల్లా సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న ఉద్యోగులు సైతం ఈ మేరకు సిద్ధమవుతున్నారు. మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం వంటి జలవిద్యుత్ కేంద్రాలలో వివిధ విభాగాలలో పని చేస్తున్న తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల వివరాల సేకరణ ఇప్పటికే పూర్తయింది.

ఈ 4 కేంద్రాల్లో వంద మందికి పైగా తెలంగాణ ఉద్యోగులు ఉన్నారు. వీరు గత 20 ఏళ్ళుగా ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఇక్కడి సంసృ ్కతి, సంప్రదాయాలతో మమేకమయ్యారు. అంతేకాకుండా కొందరైతే ఇక్కడివారితో పెళ్లి సంబంధాలూ కలుపుకున్నారు. స్వస్థలాల్లోని సొంత బంధువుల కన్నా ఇక్కడివారితోనే అనుబంధం పెంచుకున్నారు. అలాంటిది ఇప్పుడు రాష్ట్రం విడిపోవడంతో తమ ప్రాంతాలకు వెళ్ళిపోవాలని అనడంతో ప్రస్తుతం ఈ జలవిద్యుత్ కేంద్ర ఉద్యోగులు భారంగానే అటువైపు అడుగులు వేస్తున్నారు.
 
విద్యార్థుల్లో కలవరం
 
రాష్ట్రం విడిపోవడంతో ఆఖరికి చదువుకునే విద్యార్థుల మధ్య కూడా కలవరం రేగింది. చిన్నప్పట్నుంచీ కలసిమెలసి తిరిగి ఆడుకుని చదువుకున్న విద్యార్థుల మధ్య అమలిన స్నేహం కుదిరింది. అయితే ఇప్పుడు వారు సైతం వెళ్లిపోనుండడంతో చిన్నారుల మనసుల్లోనూ ఏదో తెలియని ఆవేదన అలముకుంది. వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలలు మారిపోవడంతో చిన్ననాటి స్నేహితులకు దూరమైపోతున్నామని కుమిలిపోతున్నారు.

మోతుగూడెం కేంద్రంలో ఎక్కువ తెలంగాణ ఉద్యోగులే...

తెలంగాణ, సీమాంధ్ర సరిహద్దు చింతూరు సమీప మోతుగూడెం జలవిద్యుత్ కేంద్రంలో 60 మందికి పైగా తెలంగాణ ఉద్యోగులే ఉన్నారు. వీరంతా గత 20 ఏళ్ళుగా ఇక్కడే స్థిరంగా ఉండి ఉద్యోగం చేసుకోవడంతోపాటు వారి బంధువులు కూడా వ్యాపారాలు వంటివి చేసుకొని స్థిరనివాసం ఉన్నారు. అలాంటిది ఇప్పుడు వారంతా వెళ్ళిపోతుండటంతో బాధగా ఉందని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
 
 విడిపోవడం బాధాకరం
 గత 30 ఏళ్లుగా కలసిమెలసి అన్నదమ్ముల్లా ఉద్యోగం చేసుకున్న మాకు విడిపోవడం బాధాకరంగా ఉంది. అలాంటిది ఇప్పుడు ఎవరికివారు దూరమైపోవడంతో ఎందుకిలా జరిగిందంటూ బాధపడుతున్నాం.
 - ఆనంద్, జెన్‌కో ఉద్యోగి, సీలేరు.
 
 ఇక్కడి వారితో కలిసిపోయాం..
 మేం పుట్టి పెరిగింది తెలంగాణ, ఉద్యోగం నిమిత్తం గత 15 ఏళ్ళుగా సీలేరులోనే ఉంటున్నాం. ఇక్కడ వారితో, తోటి ఉద్యోగులతోనే ఎక్కువగా స్నేహంగా ఉంటాం. అలాంటిది రాష్ట్రం విడిపోయి నేను తెలంగాణ వెళ్ళిపోవడం చాలాబాధగా ఉంది.
 - ఆలీ, తెలంగాణ ఉద్యోగి.
 
 స్నేహం దూరమవుతుంది
  ఎన్నో ఏళ్ళుగా కలసిమెలసి చదువుకుంటూ ఆడుకుంటున్న మా పిల్లల మధ్య స్నేహం కూడా రాష్ట్ర విభజన వల్ల దూరమైపోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం.
 - దారరాజు, జెన్‌కో ఉద్యోగి.
 
 విడిపోయినా కలిసి ఉంటాం..
 రాష్ట్రం విడిపోయినా ఎప్పటిలాగే కుటుంబ సభ్యులలాగే కలసి ఉంటాం. రాష్ట్రం విడిపోయినంత మాత్రాన స్నేహాన్ని, కుటుంబాలను దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు.
 - యాసిన్‌బాబా, జెన్‌కో ఉద్యోగి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement