
రెండో మెరిట్ జాబితాతో ఏఈ పోస్టులు!
♦ విద్యుత్ సంస్థలకు సుప్రీంకోర్టు అనుమతి
♦ 239 మిగులు పోస్టుల భర్తీకి మార్గం సుగమం
♦ త్వరలో 1,000 ఏఈ పోస్టుల భర్తీకి ఉమ్మడి ప్రకటన
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ విద్యుత్ ఇంజనీర్ పోస్టుల భర్తీలో మెరిట్ అభ్యర్థులకు భారీ ఊరట లభించింది. రాష్ట్రంలోని 4 విద్యుత్ సంస్థల్లో మిగిలిన 239 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టులను రెండో మెరిట్ జాబితాతో భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండో మెరిట్ జాబితాతో మిగిలిన పోస్టుల భర్తీకి ఇంధన శాఖ జారీ చేసిన సర్క్యులర్ చెల్లుబాటు కాదంటూ రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను గురువారం కొట్టేసింది.
కేసు నేపథ్యమిది..
జెన్‌కోలో 856, ట్రాన్స్‌కోలో 206, ఎన్పీడీసీఎల్‌లో 164, ఎస్పీడీసీఎల్‌లో 201 ఏఈ పోస్టులు కలిపి 1,427 పోస్టుల భర్తీకి గతేడాది విద్యుత్ సంస్థలు నియామక ప్రకటనలు జారీ చేశాయి. ఒక్కో అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో ఎంపికై ఏదో ఓ సంస్థలో చేరడంతో టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో 164 ఏఈ పోస్టులకు 107, ట్రాన్స్‌కోలో 206 పోస్టులకు 59, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 201 పోస్టులకు 73 పోస్టులు ఖాళీగా మిగిలాయి.
ట్రాన్స్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో 239 పోస్టులను రెండో జాబితా తో భర్తీ చేయాలని ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేయగా నిరుద్యోగులు హైకోర్టులో సవాల్ చేశారు. 1997 జనవరి 22న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.89 ప్రకారం భర్తీ చేయడానికి వీల్లేదని నిరుద్యోగుల వాదనతో కోర్టు ఏకీభవిస్తూ గతేడాది ఆగస్టు 29న ఉత్తర్వులిచ్చింది. ఇంధన శాఖ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి.
సుప్రీంకోర్టు స్పందిస్తూ.. 4 విద్యుత్ సంస్థల్లో ఏఈ పోస్టుల భర్తీకి ఒకేసారి వేర్వేరు ప్రకటనలివ్వడం, పరీక్షలు నిర్వహించడంతో మెరిట్ గల అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారని, దీంతో ప్రత్యేక పరిస్థితులు తలెత్తాయని వ్యాఖ్యానించింది. మిగిలిపోయిన పోస్టుల భర్తీలో జీవో నం.89 వర్తింపజేయాల్సిన అవసరం లేదని, రెండో జాబితాతో భర్తీకి విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకోవచ్చని తాజా తీర్పులో పేర్కొంది.
తొలుత 239 పోస్టుల భర్తీ
తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, టీఎస్ ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో 1,000 ఏఈ పోస్టుల భర్తీకి త్వరలో ఉమ్మడి ప్రకటన జారీ చేయాలని యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 239 పోస్టులను తొలుత భర్తీ చేస్తామని, తర్వాత ఏఈ పోస్టుల ఖాళీలను గుర్తించి నియా మక ప్రకటన ఇస్తామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు.