ఒంగోలు, న్యూస్‌లైన్: రైల్వే శాఖకు సమైక్య సెగ తగిలింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆదివారం విద్యుత్ శాఖ సిబ్బంది సమ్మెలోకి దిగారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి పలు రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. సోమవారమూ మరి కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఆదివారం ఉదయం 5.35 గంటలకు రైల్వేకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రైల్వే అధికారులు ఐదు నిముషాల్లోనే మరో గ్రిడ్‌తో అనుసంధానం చేశారు. ఆగిన రైళ్లు తిరిగి కదలడానికి అరగంటకుపైగా సమయం పట్టింది. ప్రారంభంలోనే అరగంట ఆలస్యంగా బయల్దేరిన పినాకిని(విజయవాడ- చెన్నై) ఎక్స్‌ప్రెస్ చీరాల సమీపానికి వచ్చేసరికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయంగా ఒక డీజిల్ ఇంజన్‌ను తెప్పించి దాదాపు గంటన్నర ఆలస్యంగా రైలును నడిపారు.
రద్దయిన రైళ్లు ఇవే..
ముందస్తుగా గూడ్సు వాహనాలను నిలిపివేయాలని రైల్వే శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు పలు ప్యాసింజర్ రైళ్లును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా లోడు తగ్గకపోవడంతో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లనూ రద్దు చేశారు. ప్రయాణికుల రద్దీ పెరిగిపోవడంతో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు పలు చోట్ల స్టాపింగ్ కల్పించారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఒంగోలుకు చేరుకోగానే కేవలం విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఆగుతుందని ప్రకటించారు. అయితే కొన్ని రైళ్లు రద్దవడంతో ప్రయాణికుల ఇబ్బందులను ఒంగోలు స్టేషన్ మేనేజర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ చీరాల, బాపట్ల, తెనాలి స్టేషన్లలో ఆగుతుందని ప్రకటించి ప్రయాణికులు ఎక్కేందుకు వీలుగా పది నిమిషాల వరకు ఒంగోలు స్టేషన్‌లో ఆపారు. కోరమాండల్‌తోపాటు నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లు మూడు గంటలు ఆలస్యంగా నడిచాయి. సమైక్య ఉద్యమ నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో అదనపు బలగాలు మోహరించాయి.
ప్రయాణికుల తీవ్ర అవస్థలు
ఒక్కసారిగా పలు రైళ్ల సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమ్మె నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమితమవడంతో ఎక్కువ మంది రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. ఆదివారం రైళ్ల సర్వీసులు కూడా రద్దవడంతో ముందస్తుగా బుక్ చేసుకున్న వారు, చంటి పిల్లలతో వచ్చిన వారు, వృద్ధులు అవస్థలు ఎదుర్కొన్నారు.
రైల్వే శాఖకు సమైక్య సెగ
Published Mon, Oct 7 2013 3:53 AM | Last Updated on Wed, Sep 5 2018 3:59 PM
Advertisement