లంకలో రామాయణ దర్శనం
పాఠక ప్రయాణం
శాంకరీదేవి శక్తి పీఠ సందర్శనం.. బుద్ధుని బోధనల ఆధ్యాత్మిక సౌరభం...
రామాయణంలోని చివరి అంకానికి సాక్షీభూతమైన ప్రదేశాల ప్రాభవం...
సుందర జలపాతాల సౌందర్యం... అడుగడుగునా చారిత్రక వైభవం...
కళ్లకు కట్టే శ్రీలంక పర్యటన ఆజన్మాంతం ఓ మధురజ్ఞాపకమని వర్ణిస్తున్నారు
ఒంగోలు వాసి అయిన విశ్రాంత ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎస్వీఎస్ భగవానులు.
ద్వాదశ జ్యోతిర్లింగాలను గతంలోనే సందర్శించిన నేను ప్రథమ శక్తి పీఠమైన శ్రీ శాంకరీదేవిని దర్శించాలనుకున్నాను. అందులో భాగంగానే శ్రీలంక ప్రయాణానికి మా బంధువులతో కలిసి బయల్దేరాను. శ్రీలంక ట్రావెల్ ఏజెన్సీతో ముందుగానే ఒప్పందం చేసుకున్నాం. ఒంగోలు నుంచి చెన్నైకి రైలులో అటు నుంచి ఇండియన్ ఎయిర్‌లైన్స్ వారి విమానంలో బయల్దేరి, గంటన్నర వ్యవధిలో శ్రీలంక రాజధాని కొలంబో విమానాశ్రయంలో దిగాం. అక్కడ శ్రీలంక ట్రావెల్ ఏజెన్సీ వారు తమ వాహనంలో మమ్మల్ని తీసుకెళ్లారు.
కొలంబో నుంచి ట్రిన్‌కోమలీకి...
ముందుగా మున్నేశ్వరం చేరుకొని అక్కడ మున్నేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించాం. రావణవధ అనంత రం రాముడు ప్రతిష్ఠించిన శివ దేవాలయాన్ని, తిరుకోనేశ్వర దేవస్థానం పక్కన సముద్రపు ఒడ్డున గల రావణబ్రహ్మ ఏకైక విగ్రహాన్ని చూసి.. అక్కణ్ణుంచి బయల్దేరి 268 కి.మీ దూరంలోని ట్రిన్‌కోమలీ పట్టణం చేరాం.
ట్రిన్‌కోమలీలో శక్తి పీఠం
ట్రిన్‌కోమలీ పట్టణానికి సమీపంలో సముద్రంలోకి చొచ్చుకొని వచ్చినట్టున్న కొండపై శాంకరీదేవి ఆలయం ఉంది. ఇక్కడ శాంకరీదేవి దర్శనం మాటల్లో వర్ణించలేం. ఇక్కడే శివుడి గుడి ఉన్న ప్రాంతాన్ని తిరుకోనేశ్వరం అంటారు. ఎటు చూసినా హిందూ, బౌద్ధమతాల సమ్మేళనం కళ్లకు కడుతుంది.
డంబుల్లా గుహలలో బంగారు బుద్ధుడు
మరుసటి రోజు ట్రిన్‌కోమలీ నుంచి కాండీ పట్టణానికి బయల్దేరి, మధ్యలో డంబుల్లా గుహలలో బంగారు బుద్ధుని ఆలయం, శ్రీ రాములవారు పాశుపతాస్త్రం సంధించిన ధన్‌వేలి, రామబాణం పడిన లగ్గాల గ్రామాలను సందర్శించాం. రామ-రావణ సంగ్రామం జరిగిన ప్రదేశాన్ని పరికిస్తూ, టీ తోటల సోయగాలను వీక్షిస్తూ, ఆయుర్వేద మూలికల మందుల తయారీ కేంద్రాలను చూస్తూ, రాత్రి కాండీ పట్టణంలోనే బస చేశాం. మరుసటి రోజు బుద్ధుని అవశేషాలను భద్రపరిచి, దాని పైన నిర్మించిన సుందరమైన బుద్ధ దేవాలయాన్ని సందర్శించాం.
లంకలో రామాయణం చివరి అంకం
కాండీ నుంచి బయల్దేరి రాంబోడా పర్వతాలపై చిన్మయ మిషన్ వారు నిర్మించిన 18 అడుగుల నిలువెత్తు ఆంజనేయ విగ్రహాన్ని దర్శించి, సముద్రమట్టానికి 6135 అడుగుల ఎత్తు గల నువారా ఎలియా అనే పట్టణం చేరాం. అక్కడ నుండి రావణాసురుడి గుహ కలిగిన ఇస్తిపురం బండారువేల చూశాం. ఈ గుహలు ఆసియా ఖండ ప్రాచీనతకు ప్రత్యక్ష నిదర్శనాలు.
హనుమ పాదముద్రలు
హనుమంతుడు సంజీవని పర్వతం తెచ్చిన గుర్తుగా ఆయన పాదముద్రలు రుమస్సాలలో చూశాం. మటారాలో నిలువెత్తు బౌద్ధ విగ్రహాన్ని సందర్శించి, హిక్కాదువ అనే సముద్ర ప్రాంతానికి చేరుకున్నాం. ఇక్కడ సుమద్రం గంభీరంగా, రామాయణంలోని సంగ్రామ ఘట్టానికి గుర్తుగా నేటికీ కళ్లెదుట నిలిచింది.
రామాయణం జరిగింది అనడానికి పూర్తి ఆధారాలు ఆనవాళ్లతో సహా ఇక్కడ కనిపించాయి. కొలంబోలో సుప్రసిద్ధ రథ పంచముఖ హనుమాన్ మందిరం దర్శించుకొని కొలంబో నుంచి చెన్నై మీదుగా ఒంగోలు చేరాం. మన దేశంలో అయోధ్యలో మొదలైన రామాయణం చివరి అంకాన్ని శ్రీలంకలో వీక్షించి, జన్మ ధన్యైమైందని అందరం భావించాం.
సింహళానికి చలో చలో...
ఒంగోలు నుంచి చెన్నై మీదుగా కొలొంబో
కొలంబో నుంచి ట్రిన్‌కోమలి 268 కి.మీ.
ట్రిన్‌కోమలిలో అష్టాదశ శక్తిపీఠాలలో తొలిదైన శ్రీశాంకరీదేవి శక్తి పీఠం ఉంది.
ట్రిన్‌కోమలి నుంచి కాండీ పట్టణం 181 కి.మీ