ramayana
-
హీరోకన్నా విలన్ కు ఎక్కువ పేమెంట్
ఏదైనా సినిమాకు సంబంధించి క్యాస్టింగ్ ఖర్చు లెక్క రాసుకుంటే టాప్ రెమ్యునరేషన్ హీరోకు ఉంటుంది.. తరువాత హీరోయిన్.. అలా ఉంటుంది చివరి రేటు విలన్ కు ఉంటుంది. కానీ ఈ సరికొత్త రామాయణం సినిమాకు సంబంధించి హీరో అయిన రాముడి పాత్రధారి కన్నా విలన్ అయినా రావణుడి పాత్రధారికే ఎక్కువ పేమెంట్ ఇస్తున్నారు. ఎక్కువ అంటే అలాంటిలాంటి పేమెంట్ కాదండి.. ఏకంగా రెండొందల కోట్లు ఇస్తున్నారు. ఇంతకూ ఎవరా రాముడు.. ఎవరా రావణుడు అనేదేగా మీ అనుమానం..బాలీవుడ్ నిర్మాత, నటుడు నితీష్ తివారి నిర్మిస్తున్న రామాయణం(Ramayana) సినిమాకు సంబంధించి హీరోగా అంటే శ్రీరాముడిగా రణబీర్ కపూర్ ను ఎంపిక చేయగా అందులో మరో ప్రధాన పాత్రధారి అయిన రావణుడిగా కేజీఎఫ్ సిరీస్ హీరోగా చేసి బాక్సాఫీస్ కొల్లగొట్టిన కన్నడ స్టార్ యష్(Yash) కు మాత్రం హీరోకన్నా ఎక్కువే చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. నటుడిగా ఇచ్చిన పారితోషికంతోబాటు డిస్ట్రిబ్యూషన్ హక్కులు.. అన్నీకలిపి మొత్తం రూ. 200 కోట్లవరకు యష్ కు ఇచ్చేనందుకు తివారీ అంగీకరించారట. ఇది హిందీ సూపర్ స్టార్లు అయినా సల్మాన్ ఖాన్.. అమీర్ ఖాన్.. షారూక్ ఖాన్ ల హీరోల పారితోషికం కన్నా ఎక్కువని తెలుస్తోంది.(చదవండి: తగ్గని శంకర్.. పెరిగిన బడ్జెట్)ఇటీవల ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన కల్కి చిత్రంలో విలన్ గా నటించిన కమల్ హాసన్ కూడా రూ. 40 కోట్లలోపే తీసుకున్నారట. కానీ యష్ మాత్రం ఏకంగా రూ. 200 కోట్లు తీసుకోవడాన్ని చూసి బాలీవుడ్ సైతం షాక్ అయిందని అంటున్నారు. సల్మాన్ , షారూక్.. అమీర్ ఖాన్లు సైతం ఇంతవరకూ హీరో పారితోషికంతోబాటు డిస్ట్రిబ్యూషన్ హక్కులు సైతం తీసుకుంటారు. ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ వంటివి అన్నీ కలుపుకున్న వారికి ఇంతవరకూ.. రూ. 150 కోట్లు దాటలేదట. కానీ తన అసాధారణ నటనతో కన్నడ బాక్సాఫీస్ కొల్లగొట్టిన యష్ మాత్రం విలన్ పాత్రకోసం ఏకంగా రూ. 200 కోట్లు తీసుకుంటున్నట్లు నితీష్ తివారి అఫీస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక సూపర్ స్టార్లు కూడా ఈ మార్కును టచ్ చేయలేదంటే ఇక రణబీర్ కపూర్ పారితోషికం ఈయనతో సరికిపోల్చడం కూడా కుదరదు అంటున్నారు. ఇక షారూక్ వంటి స్టార్లతో సమానంగా పారితోషికం తీసుకున్నది సౌత్ ఇండియాలో ముగ్గురే ఉన్నారు. రజనీకాంత్, విజయ్ తలపతి , అల్లు అర్జున్ మాత్రమే ఒక్కో సినిమాకు రూ. 200 కోట్లు తీసుకుంటున్నారట . మొత్తానికి మన సౌత్ ఇండియన్ నటుడు యష్ విలన్ పాత్రలో రెండు వందలకోట్ల పారితోషికం తీసుకుని బాలీవుడ్ హీరోలకు సవాల్ విసిరారు.- సిమ్మాదిరప్పన్న -
అభిరామం నృత్యంతో చెప్పే రామాయణం : ఎవరీ ఐశ్వర్య హరీష్!
ఇతిహాసమైన రామాయణం అందం, భక్తి, సంక్లిష్టతలను ఐశ్వర్య హరీష్ ప్రదర్శించే భరతనాట్యం అన్వేషిస్తుంది. శాస్త్రీయ నృత్యాన్ని బహుభాషా కథనాలతో మిళితం చేసి మన ముందు ప్రదర్శిస్తుంది. రామాయణంలో తెలియని మరో కోణాన్ని ఆవిష్కరించడానికి ‘అభిరామం’ ప్రదర్శనను ఎంచుకున్నాను అని చెబుతుంది. ఐశ్వర్య హరీష్ పుట్టుకతోనే నృత్యకారిణి అని చెప్పవచ్చు. ఐదు తరాలుగా ఆ ఇంట నృత్యకళాకారులే ఉన్నారు. ఆ విధంగా చాలా చిన్న వయస్సు నుండి తన తల్లి ద్వారా శిక్షణ పొందుతూ ఐశ్వర్య తన స్వంత నృత్య కథల గురించి కలలు కంటూ పెరిగింది. ఇటీవల ముంబయ్‌లో ప్రఖ్యాత నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సిపిఎ)లో ప్రదర్శన ద్వారా అబ్బురపరిచిన ఐశ్వర్య రామాయణాన్ని నృత్యంగా ఎందుకు ఎంచుకున్నానో వివరించింది.నృత్యంతో అన్వేషణ‘‘రాముడు నా ఇష్ట దేవత. నా చిన్నప్పుడు రాముని గంభీరమైన రూపం, అతనిపై పాట, పద్యం, నృత్యం ఏది నేర్చుకున్నా అది నన్ను ఉత్తేజపరిచింది. ఇటీవల, వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధనగా వాల్మీకి రామాయణాన్ని దాని అనువాదంతో పాటు చదవడం ప్రారంభించాను. చదివేటప్పుడు కథలో ఇంకా ఏవో తెలియని అంశాల సారంశాం ఉందని గ్రహించాను. చాలా అన్వేషించని కోణాలు ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్లోనూ రసాలు ఎక్కువ. ఇది నాకు నృత్యంలో అన్వేషించాలనే ఆలోచనను ఇచ్చింది. రామాయణానికి చాలా వెర్షన్లు ఉన్నాయి. అందుకే నా పరిశోధన విస్తృతం చేశాను. దీంతో అనేక అవకాశాలు నాకు లభించాయి. అన్ని వెర్షన్లు కథాంశం చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కటి విభిన్న దృష్టి, రుచిని కలిగి ఉన్నాయి. ఉదాహరణకు– వాల్మీకి రామాయణం రాముడిని మానవ శ్రేష్ఠతగా చూస్తే, అధ్యాత్మ రామాయణం అతనిని అంతిమ భగవంతునిగా, అద్భుతంగా చూసింది. రామాయణంలో సీత పాత్రకు భిన్నమైన టేకింగ్ ఉంది.ఆత్మను కదిలించాలిఅభిరామం నృత్య రూపకం వివిధ రామాయణ గ్రంథాల నుండి సేకరించిన ఆరు అరుదైన ఎపిసోడ్లను వర్ణిస్తుంది. రామాయణం భారతీయ మనస్తత్వంలో చాలా పాతుకుపోయింది కాబట్టి, నేను కథ టైమ్‌లైన్‌ను నిర్వహించాలనుకున్నాను. రాముడి కథ ప్రతి మట్టిని దాని స్వంత ఫ్లేవర్‌లో తాకింది. నేను దానిని ఉపదేశాత్మకంగానో, సాదాసీదాగానో స్తుతించేలనుకోలేదు. శృంగార భక్తి కోణాన్ని కొనసాగించాను. అదే నన్ను మొదటి స్థానంలో ప్రాజెక్ట్‌లోకి తీసుకువచ్చింది. ఎక్కడి నుంచైనా ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని, దానిని మరో కోణంలో వివరిస్తే అది వినోదభరితంగా ఉండాలి అలాగే ఆత్మను కదిలించాలి. ప్రేక్షకుల ఊహల మైదానంలో ఆ అంశం తిరగాలి. నేను ఎంచుకున్న కథ మాత్రమే కాదు నా డ్యాన్స్ ఎలిమెంట్‌ను కూడా కోల్పోకూడదు. దీన్ని మరింత థియేట్రికల్ ప్రెజెంటేషన్‌గా మార్చాలనుకున్నాను. ఆకర్షించిన అంశాలుమొదట వాల్మీకి రామాయణాన్నే చదివాను. మా అమ్మ అప్పటికే తులసీదాస్ రచనలపై కొంత పరిశోధన చేసింది. అలా తులసి రామాయణం నుండి నాకు నచ్చిన అంశాలను సేకరించడానికి అది ఒక కిటికీలా ఉపయోగపడింది. కౌసల్య తన నవజాత శిశువుతో చేసిన మొదటి సంభాషణ నన్ను అమితంగా ఆకర్షించింది. అదేవిధంగా, రావణుడి పాత్రను చూస్తే విష్ణువు దైవిక బలాన్ని ఎదుర్కోవడంలో పూర్తి జ్ఞానంతో అతను సీతను అపహరించాడు. రావణుడు మోక్షానికి తన ఏకైక సాధనం – భగవంతుడి చేతిలో మరణం ఇదేనని గ్రహించాడు. తులసీరామాయణం రాముడు, సీత స్వయంవరం, వారి కలయిక గురించి చాలా అందంగా, సుందరంగా కవితాత్మకంగా అన్వేషించబడింది. రావణుడి సోదరి శూర్పణఖ సీతను అపహరించడానికి, ఆమె చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తన సోదరుడిని ప్రేరేపించడం ద్వారా రామాయణంలో మలుపు తిరిగింది. అరుణాచల కవి తమిళంలో రామనాటకంలో ఈ క్యారెక్టరైజేషన్‌ని చాలా అందంగా చూపించాడు, రాక్షసి బెంగను అనుభూతి చెందాడు. ప్రొడక్షన్లో ఇది మూడో ఎపిసోడ్‌గా తీసుకోబడింది. కథను ఇలా ముందుకు తీసుకెళ్తుంటే హనుమంతుని అద్భుతమైన చర్యలు, సెయింట్ పురందర దాసు కన్నడ పద్యాల పదునుగా బయటకు వచ్చాయి. తల్లే గురువుమా అమ్మ నా గురువుగా ఉండటం నాకు దొరికిన అద్భుతమైన ఆశీర్వాదం. చిన్నతనం నుండే సాంప్రదాయ సంగీతం, నృత్యం, కథల రూపంలో ఉండే సాహిత్యం, ఏదైనా సాధించాలనే కల, క్రమశిక్షణతో కూడిన ఆలోచనలతో ఉన్నాను. పరిపూర్ణత గురించి ఎప్పుడూ చర్చలు ఉండకూడదు. అలాగే, నాణ్యతలో ఎప్పుడూ రాజీ పడకూడదు. ఇది నా వారసత్వాన్ని చెక్కుచెదరకుండా కొనసాగించే సవాల్, మరింత పరిపూర్ణత కోసం పట్టుదలతో కూడిన బాధ్యత. దానిని స్వీకరించి ముందు తరాలకు ఇవ్వాలనే నిబద్ధతో కృషి చేస్తున్నాను. కూర్పులో సవాల్ప్రతి ఎపిసోడ్ లోనూ కథనంలో మార్పు లేకుండా అందులోని అందాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాం. సంగీతం, నృత్యం అన్నీ వేర్వేరు వ్యక్తులచే కం΄ోజ్ చేయబడ్డాయి. కౌసల్య వాత్సల్యమైనా, రాముడు– సీతల శృంగారమైనా, సీత వైభవం, హనుమంతుడి సుందరకాండ ఇలా ప్రతీది ‘అందం’లోని అంశమే ఈ నృత్యంలో ప్రత్యేకంగా నిలుస్తుంది’’ అని వివరిస్తుంది ఐశ్యర్వ. -
అరబిక్‌లో రామాయణ భారతాలు..అనువాదకులతో ప్రధాని భేటీ
కువైట్సిటీ: ప్రధాని మోదీ కువైట్ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం(డిసెంబర్21) రామాయణ మహాభారతాలను అరబిక్‌లో అనువదించిన అబ్దుల్లా అల్ బరూన్,ఈ ఇతిహాసాల అరబిక్ వెర్షన్లను ప్రచురించిన అబ్దుల్ లతీఫ్ అల్ నెసెఫ్‌లను కలిశారు. తనకు రామాయణమహాభారతాలను అరబిక్‌లో అనువదించేందుకు రెండు సంవత్సరాల 8 నెలలు పట్టిందని అల్ బరూన్ అన్నారు. తాము ప్రచురించిన అరబిక్ రామాయణ మహాభారత పుస్తకాలను ప్రధాని మోదీ చూసి సంతోషించారని,రెండు పుస్తకాలపై ఆయన సంతకం చేశారని ప్రచురణకర్త అబ్దుల్లతీఫ్ అల్నెసెఫ్ చెప్పారు. అల్బరూన్,అల్నెసెఫ్ ప్రపంచంలోని ముప్పై దాకా గొప్ప కావ్యాలను అరబిక్‌లో ప్రచురించారు. 43 ఏళ్లలో భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. కువైట్‌లో ప్రధాని రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. గతంలో ప్రధాని మన్‌కీబాత్‌లో కూడా అరబిక్‌లో రామాయణ మహాభారతాలను అనువదించిన ఇద్దరి గురించి ప్రస్తావించడం గమనార్హం. #WATCH | Kuwait | Ramayana and Mahabharata published in Arabic language; Abdullateef Alnesef, the book publisher and Abdullah Baron, the translator of Ramayana and Mahabharata in the Arabic language, met PM Narendra Modi in Kuwait CityAbdullateef Alnesef, the book publisher… pic.twitter.com/jO3EqcflXJ— ANI (@ANI) December 21, 2024 మా తాతను కలవండని ఓ నెటిజన్ విజ్ఞప్తి.. కలిసిన ప్రధాని ప్రధాని మోదీ కువైట్ పర్యటన నేపథ్యంలో కువైట్‌లో ఉంటున్న తన తాత,రిటైర్డ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఉద్యోగి మంగళ్ సేన్ హండా (101)ను కలవండని ఎక్స్(ట్విటర్)లో ఓ నెటిజన్ ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు. ఆయనను తప్పకుండా కలుస్తానని బదులిచచ్చిన మోదీ కువైట్ చేరుకున్న అనంతరం మంగల్‌సేన్‌హండాను కలిశారు. — Narendra Modi (@narendramodi) December 21, 2024 -
అలాంటి వార్తలు రాస్తే లీగల్ నోటీసులు పంపిస్తా..సాయి పల్లవి వార్నింగ్
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పుడ్ విషయం చాలా జాగ్రత్తగా ఉంటుంది. చిన్నతనం నుంచే ఆమె వెజిటేరియన్. బయట పదార్థాలు ఎక్కువగా తినదు. ఈ విషయం ఆమె చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పింది. కానీ ఇప్పుడు ఆమె తిసుకునే ఫుడ్‌పై రకరకాలు పుకార్లు పుట్టుకొస్తున్నాయి. రామాయణ మూవీ కోసమే సాయి పల్లవి నాన్ వెజ్ తినడం లేదని ఓ తమిళ మీడియా రాసుకొచ్చింది. ఆ సినిమా కోసమే చాలా రోజులుగా బయటి ఫుడ్ తినడం లేదని అందులో పేర్కొంది. దీనిపై సాయి పల్లవి తీవ్ర స్థాయిలో మండిపడింది. (చదవండి: పుష్పరాజ్ వసూళ్ల సునామీ.. ఆరు రోజుల్లోనే రప్ఫాడించాడు!) వాస్తవలు తెలియకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలు రాయకండని వార్నింగ్ ఇచ్చింది. తాను అసలు రూమర్లు, బేస్ లెస్ వార్తల్ని చూసి పట్టించుకోనని, కానీ ఇప్పుడు ఇలాంటి పిచ్చి రాతల్ని చూసి మాట్లాడకతప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చింది.తెలిసి రాస్తారో.. తెలియకుండా రాస్తారో.. వ్యూస్ కోసం రాస్తారో.. అదంతా దేవుడికే తెలియాలి.. ఇలానే ఇకపై రాస్తామంటే మాత్రం కుదరదు.. ఇక్కడితో ఆపేయండి.. నా సినిమా రిలీజ్ టైంలో ఇలాంటివి రాస్తే ఊరుకునేది లేదు.. అవన్నీ నాకు చాలా స్పెషల్ మూమెంట్స్.. మీరు ఇలాంటి వార్తలు రాసి కష్టాలు కొనితెచ్చుకోకండి.. ఇదే చివరి ఛాన్స్.. ఇకపై ఇలాంటి వార్తలు రాస్తే లీగల్ నోటీసులు పంపిస్తాను అంటూ సాయి పల్లవి వార్నింగ్ ఇచ్చింది.Most of the times, Almost every-time, I choose to stay silent whenever I see baseless rumours/ fabricated lies/ incorrect statements being spread with or without motives(God knows) but it’s high-time that I react as it keeps happening consistently and doesn’t seem to cease;… https://t.co/XXKcpyUbEC— Sai Pallavi (@Sai_Pallavi92) December 11, 2024 -
రెండు భాగాలుగా 'రామాయణ’ విడుదలపై ప్రకటన
-
రెండు భాగాలుగా 'రామాయణ'.. విడుదలపై ప్రకటన
భారత ఇతిహాసాలను వెండితెరపై చూపించాలంటే పెద్ద సాహసమేనని చెప్పాలి. ఈ క్రమంలో వచ్చిన చిత్రాలు ఇప్పటకే చాలావరకు విజయాన్ని అందుకున్నాయి. బాలీవుడ్ తెరకెక్కిస్తున్న 'రామాయణ' గురించి ఒక ప్రకటన వచ్చింది. ఈ చిత్రం గురించి ఇప్పటికే కన్నడ స్టార్ యశ్ పలు విషయాలను పంచుకున్నాడు. ఇప్పుడు పోస్టర్స్ విడుదల చేస్తూ విడుదల తేదీలను కూడా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రణ్‌బీర్‌కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు ప్రచారం ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల చేస్తున్నట్లు పోస్టర్స్‌ను కూడా పంచుకున్నారు.ఈ సినిమాలో తాను పోషించనున్న రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్‌బీర్ కపూర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారు. డైలాగ్స్ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్ డిక్షన్లో రణ్‌బీర్ ప్రత్యేక శిక్షణ పొందారు. ఈ విషయంపై ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణతో పాటు డైట్ కూడా ఫాలో అవుతున్నట్లు తెలిపారు. రాముడి పాత్రలో నటిస్తుండటం వల్ల తాను మద్యపానం మానేసినట్లు చెప్పారు. ఇదే సమయంలో సీత పాత్రలో నటిస్తున్న సాయిపల్లవి కూడా పలు విషయాలను పంచుకున్నారు. సీతమ్మ పాత్రలో నటించే అవకాశం దక్కడం తన అదృష్టమని సాయిపల్లవి పేర్కొన్నారు. ఒక నటిగా కాకుండా భక్తురాలిగా నటిస్తున్నట్లు తెలిపారు. -
రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలు ఆవిష్కరణ
సాక్షి, తిరువనంతపురం: గజల్ శ్రీనివాస్ గానం చేసిన రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలను జ్యోతిర్ మఠ్ శంకరాచార్య శ్రీ అవి ముక్తేశ్వరానంద సరస్వతి ఆవిష్కరించారు.పోతన విరచిత భాగవతంలోని ముఖ్య 108 పద్యాలు, కవిత్రయం రచించిన ఆంధ్ర మహాభారతంలోని ముఖ్య 108 పద్యాలు, డా.ముకుంద శర్మ వ్రాసిన గేయ రామాయణాల ఆడియోలను ఉత్తరాఖండ్ జ్యోతిర్ మఠ్ శంకరాచార్య శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీ తిరువనంతపురం (కేరళ) పద్మనాభ స్వామి వారి ఏకాంత దర్శన అనంతరం వేలాది మంది భక్తుల సమక్షంలో ఆవిష్కరించారు.మన సనాతన ధర్మంలో అతి ముఖ్యమైన రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలను ఒకే రోజు ఆవిష్కరించడం అతి గొప్ప ధార్మిక కార్యక్రమం అని, వీటిని స్వరపరచి సందర్భ, తాత్పర్య సహితంగా అందరికీ అర్ధమయ్యేలా గానం చేసిన డా.గజల్ శ్రీనివాస్ అభినందనీయుడని శంకరాచార్య అన్నారు. ఆడియో తొలి ప్రతులను సి.ఎల్.రాజం దంపతులకు, మిజోరమ్ పూర్వ గవర్నర్ కుమ్మనం రాజ శేఖర్‌లకు స్వామి అందించారు. -
వాగులో కొట్టుకుపోయిన ఉపాధ్యాయులు
పార్వతీపురం మన్యం: వృత్తి రీత్యా రాష్ట్రాలు దాటి వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులు వాగులో కొట్టుకుపోయారు. వీరిలో ఒకరు మృతిచెందగా, మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో శుక్రవారం జరిగిన ఘటనకు సంబంధించి ఎస్ఐ నారాయణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సరాయివలస ఏకలవ్య మోడల్ స్కూల్లో వార్డెన్‌గా మహేష్, సోషల్ టీచర్‌గా ఆర్తి పనిచేస్తున్నారు. వీరిది హరియాణ రాష్ట్రం. ఎప్పటివలే శుక్రవారం విధులు ముగించుకుని స్థానికంగా గురివినాయుడుపేట గ్రామంలో తమ నివాసాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ద్విచక్రవాహనంపై మహేష్, ఆర్తి ఇద్దరూ సాయంత్రం 4 గంటల సమయంలో గురివినాయుడుపేట వైపు వస్తుండగా, మార్గమధ్యంలోని రాయిమానువాగు దాటే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఇద్దరూ కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్తి మృతదేహం లభ్యం కాగా.. మహేష్ ఆచూకీ దొరకలేదు. మహేష్ వాగులోని చెట్టుకొమ్మ సాయంతో బయటపడి వాగు అంచును పట్టుకొన్నప్పటికీ.. ఆ అంచు జారిపోవడంతో మళ్లీ వాగులో పడి కొట్టుకుపోయాడని స్థానికులు చెబుతున్నారు. -
రామాయణ...సాయి పల్లవికి రికార్డ్ స్థాయి రెమ్యూనరేషన్..
-
భారత్.. దేశం కాదు ఉపఖండం
చెన్నై: తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా మరో వివాదానికి ఆజ్యం పోశారు. బీజేపీ సిద్ధాంతాలైన భరతమాత, జైశ్రీరామ్‌ను తమిళనాడు ఎప్పటికీ స్వీకరించబోదని, అవి తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇండియా ఒకే దేశం కాదని, ఇదొక ఉపఖండం మాత్రమేనని అన్నారు. ఒకే దేశం అయితే దేశమంతటా ఒకే భాష ఉండాలని చెప్పారు. మధురైలో మంగళవారం డీఎంకే కార్యక్రమంలో ఎ.రాజా ప్రసంగించారు. ‘‘రాముడికి శత్రువు ఎవరు? రాముడి గురించి, రామాయణం గురించి నాకు అంతగా తెలియదు. వాటిపై నాకు నమ్మకం లేదు. రాముడు సీతతో కలిసి అడవికి వెళ్లాడని చిన్నప్పుడు మా తమిళ టీచర్ చెప్పారు. ఒక వేటగాడిని, సుగ్రీవుడిని, విభీషణుడిని రాముడు తన సోదరులుగా స్వీకరించాడు. ఇందులో కులం, మతం ప్రసక్తి లేదని అర్థమవుతోంది. ఇండియా ఒకే దేశమని అంటున్నారు. ఒకే దేశమైతే ఒకే భాష, ఒకే సంప్రదాయం, ఒకే సంస్కృతి ఉండాలి. ఇండియాలో అలా లేదు కాబట్టి ఇదొక ఉపఖండం. ఇండియా గతంలో ఎన్నడూ ఒక దేశంగా లేదు. తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో వాటి సొంత సంస్కృతులు ఉన్నాయి. భిన్న జాతులు, భాషలు, సంస్కృతుల సమాహారమే ఇండియా. ఇక్కడ ఒక సామాజిక వర్గం ప్రజలు గొడ్డు మాంసం తింటారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తమిళనాడులో డీఎంకే ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటున్నారు. తమిళనాడులో డీఎంకే లేకపోతే అసలు భారతదేశమే ఉండదు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే.. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారతదేశ రాజ్యాంగమే ఉండదు. రాజ్యాంగం లేకపోతే దేశం కూడా మనుగడ కోల్పోతుంది. భారతదేశం లేకపోతే తమిళనాడు రాష్ట్రం ఉండదు. దేశం నుంచి మేము విడిపోతాం. ఇలా జరగాలని భారతదేశం కోరుకొంటోందా?’’ అంటూ ఎ.రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజాను వెంటనే అరెస్టు చేయాలి డీఎంకే నేత ఎ.రాజా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను తక్షణమే అరెస్టు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీఎంకే నాయకులు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం మానుకోవడం లేదని బీజేపీ నేత∙అమిత్ మాలవీయా విమర్శించారు. సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ అనుచితంగా మాట్లాడారని చెప్పారు. దేశాన్ని ముక్కలు చేయాలన్నదే డీఎంకే నేతల కుటిల యత్నమని మండిపడ్డారు. రాజాపై కఠిన చర్యలు తీసుకోవాలని తిమళనాడు డీఎంకే అధికార ప్రతినిధి తిరుపతి అన్నారు. రాజా వ్యాఖ్యలను డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్ సైతం ఖండించింది. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని సూచించింది. రాజా వ్యాఖ్యలతో విభేదిస్తున్నానని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే చెప్పారు. -
శూర్పణఖ?
రామాయణం ఆధారంగా హిందీలో దర్శకుడు నితీష్ తివారి ఓ భారీ బడ్జెట్ ట్రయాలజీ ఫిల్మ్‌ను తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్లుగా జరుగు తున్న ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ తుది దశకు చేరుకున్నాయి. దీంతో నితీష్ తివారి ఈ సినిమాలోని నటీనటుల ఎంపికపై దృష్టి సారించారు. ఈ సినిమాలోని రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, హనుమంతునిగా బాబీ డియోల్, విభూషణుడిగా విజయ్ సేతుపతి, రావణుడిగా యశ్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. తాజాగా శూర్పణఖ పాత్రలో రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. రకుల్‌కు ఆల్రెడీ నితీష్ స్టోరీ చెప్పారని, లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని టాక్. కాగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన ఈ వేసవిలో రానుందని, 2025 చివర్లో తొలి భాగం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ టాక్. మరోవైపు ఈ నెలలో రకుల్‌ప్రీత్ సింగ్ వివాహం జాకీ భగ్నానీతో జరగనుంది. -
రామాయణంలో రకుల్.. ఆ పాత్రకు సెట్ అయ్యేనా?
రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు టాలీవుడ్లో ఈ పేరు మారుమ్రోగింది. వరుస సినిమాల్లో నటిస్తూ తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ మొదలు రవితేజ లాంటి స్టార్ హీరోల వరకు అందరితో రకుల్ నటించింది. ఇక్కడ వచ్చిన ఫేమ్‌తో బాలీవుడ్‌కు చక్కెసింది. అక్కడ అనుకున్న స్థాయిలో క్లిక్ కాలేదు. ఇటీవల అయితే ఈ బ్యూటీకి అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ ఒక్క సినిమా లేదు. తాజాగా తమిళ్లో అలయాన్ సినిమాతో ఓ మోస్తరు కమర్షియల్ హిట్ అందుకుంది. అయినా కూడా ఈ బ్యూటి చేతికి పెద్ద ప్రాజెక్టులు రాలేదు. దీంతో వెస్ సిరీస్‌ల మీదనే ఎక్కువ దృష్టిపెట్టింది. ఇక వెండితెరకు రకుల్ దూరమైనట్లే అనుకుంటున్న సమయంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో రకుల్ నటించబోతుందని ఆ వార్త సారాంశం. (చదవండి: పెళ్లయి ఏడాది కూడా కాలేదు, అంతలోనే నటి విడాకులు!) బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారి రామాయణాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ ప్రొడ్యూసర్లతో కలిసి నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే కాస్టింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటించబోతున్నారు. సీత పాత్రలో సాయి పల్లవి లేదా జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. హనుమంతుడిగా నటించేందుకు సన్నీ డియోల్ అంగీకారం తెలిపాడు. తాజాగా మరో కీలకమైన పాత్ర కోసం మేకర్స్ రకుల్‌ని సంప్రదించారట. రామాయణంలో కీలకమైన శూర్పణఖ పాత్రను రకుల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం మేకర్స్ ఆమెను సంప్రదించగా..వెంటనే ఓకే చెప్పిందట. త్వరలోనే లుక్ టెస్ట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రావణుడిగా యష్, విభీషణుడిగా విజయ్ సేతుపతి నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
రాముడి కోసం శిక్షణ
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా హిందీలో ‘రామాయణ’ అనే సినిమా రూపొందనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా రానున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, రావణుడి పాత్రలో యశ్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది వేసవిలో ప్రారంభించాలనుకుంటున్నారట. ఈ సినిమాలో తాను పోషించనున్న రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్‌బీర్ కపూర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారని బాలీవుడ్ సమాచారం. డైలాగ్స్ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్ డిక్షన్లో రణ్‌బీర్ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారట. ఇక ఈ సినిమాను నమిత్ మల్హోత్రా, మధు మంతెన, అల్లు అరవింద్‌లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు హిందీలో ‘లవ్ అండ్ వార్’, ‘బ్రహ్మాస్త్రం’, ‘యానిమల్’ ఫ్రాంచైజీలు కమిటయ్యారు రణ్‌బీర్ కపూర్. -
తిరుమలలో నేడు రామాయణ పారాయణం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 9 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న ఆదివారం 77,334 మంది స్వామివారిని దర్శించుకోగా 23,694 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.04 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతుండగా, దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. తిరుమలలో నేడు రామాయణ పారాయణం తిరుమలలోని ధర్మగిరి వేదపాఠశాలలో సోమవారం సంపూర్ణ రామాయణ పారాయణం కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించనుంది. అయోధ్యలో సోమవారం రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు రామాయణ పారాయణం నిర్వహించనున్నారు. అయోధ్యలో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ఎస్వీబీసీ తమిళం, కన్నడ, హిందీ ఛానళ్లతో పాటు యూట్యూబ్ తెలుగు ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఎస్వీబీసీ తెలుగు ఛానల్లో తిరుమలలోని కళ్యాణోత్సవం అనంతరం 12 గంటల నుంచి అయోధ్య కార్యక్రమాలు ప్రత్యక్షప్రసారం కానున్నాయి. భక్తులు ఈ విషయాలను గమనించి ఎంతో వైభవంగా, ఆగమోక్తంగా జరిగే అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాలను ఎస్వీబీసీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఛానళ్లలో వీక్షించి తరించాలని భక్తలోకానికి టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. -
పంపాతీరం గుర్తుకు రావడంతో హనుమంతుడు ఒక్కసారిగా..!
రామావతారం పరిసమాప్తమైన తర్వాత హనుమంతుడు గంధమాదన పర్వతానికి వెళ్లిపోయాడు. కపివీరుల్లో కొందరు ముఖ్యులు కూడా కిష్కిందకు వెళ్లకుండా ఆ పర్వత పరిసర ప్రాంతాల్లోనే ఉండసాగారు. ఒకనాడు హనుమంతుడికి పంపా తీరానికి వెళ్లాలనిపించింది. సుగ్రీవుడి కొలువులో ఉండగా మొదటిసారిగా రామలక్ష్మణులను కలుసుకున్నది పంపా పరిసర ప్రాంతాల్లోనే! రామునితో సుగ్రీవునికి మైత్రి కుదరిన ప్రదేశం అదే! పంపాతీరం గుర్తుకు రావడంతోనే హనుమంతుడు తన వాహనమైన ఒంటె మీద బయలుదేరాడు. అతడి ప్రయాణాన్ని గమనించిన సుషేణుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు తదితర కపివీరులందరూ అతణ్ణి అనుసరించారు. తోవ పొడవునా భక్తులు బారులుతీరి ఎక్కడికక్కడ హనుమంతునికి నీరాజనాలు పలికారు. కొందరు ఆయన దీవెనలందుకుని ఇళ్లకు మళ్లితే, ఇంకొందరు ఆయనను అనుసరించి ప్రయాణించసాగారు. హనుమంతుడు పంపాతీరానికి విచ్చేస్తున్న సమాచారం తెలుసుకుని, సమీపంలోని కిష్కిందరాజ్యంలో ఉంటున్న వానరులు, పంపాతీరంలోని తాపసులు అక్కడకు చేరుకుని, ఆయనకు ఘనస్వాగతం పలికారు. హనుమంతుడు పంపాతీరంలో కొలువుతీరాడు. అక్కడే ఒక చెట్టు కింద శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, రోజూ పంపా సరోవరంలో స్నానమాచరించి, శ్రీరాముడి విగ్రహానికి పూజలు చేసేవాడు. తాపసులతో కొలువుదీరి, వారితో వేదశాస్త్ర చర్చలు సాగించేవాడు. వారి ద్వారా పురాణగాథలు వింటూ కాలక్షేపం చేసేవాడు. హనుమంతుడు పంపాతీరంలో కొలువుదీరిన కొద్దిరోజులకు మహతి మీటుతూ నారద మహర్షి అక్కడకు వచ్చాడు. నారదుడి రాక గమనించిన హనుమంతుడు ఆయనకు స్వయంగా ఎదురేగి స్వాగతం పలికాడు. ఉచితాసనం మీద కూర్చుండబెట్టి, పండ్లు, తేనె తెచ్చి ఇచ్చి అతిథి సత్కారాలు చేశాడు. ‘మహాత్మా! భక్తాగ్రేసరుడవైన నీ రాకతో పంపాతీర ప్రాంతమంతా పావనమైంది. త్రిలోక సంచారివి అయిన నీవెరుగని విశేషాలు ఉండవు. నేను తెలుసుకోదగిన విషయమేదైనా ఉంటే సెలవివ్వు’ అని వినమ్రంగా అడిగాడు హనుమంతుడు. ‘అంజనానందనా! నీవు శివాంశ సంభూతుడవు, రామమంత్ర మహిమాన్వితుడవు, లోకపూజ్యుడవు. మాబోటి మునిగణాలతో పూజలందుకోవడానికి సర్వవిధాలా అర్హుడవు. నీవు ఇంత వినతుడవై నన్ను పూజించడం నాకే ఆశ్చర్యంగా ఉంది. నిన్ను ఒకసారి చూసిపోవాలని, నీ చెవిన ఒక మాట చెప్పాలని ఇక్కడకు వచ్చాను’ అన్నాడు నారదుడు. ‘చెప్పు మునివరా!’ అన్నాడు హనుమంతుడు. ‘రామావతార కాలంలో దానవుల దాష్టీకాలు దాదాపుగా అంతమొందాయి. అయితే, దానవ వంశం మళ్లీ బలం పుంజుకుంటోంది. అమాయక జనాలను పీడిస్తోంది. అసిరోముడనే రాక్షసుడు జనాలను నానా విధాల పీడించి, చచ్చాడు. వాడి తర్వాత వాడి కొడుకు త్రిశూలరోముడు రాక్షసరాజ్యానికి రాజయ్యాడు. శివుడి ద్వారా వాడు వరాలు పొందాడు. వాడు ఈ ప్రాంతంలోనే సంచరిస్తున్నాడు. యజ్ఞయాగాది క్రతువులకు అడుగడుగునా అడ్డు తగులుతూ, మునిజనులను నానావిధాలుగా హింసిస్తున్నాడు’ అని చెప్పాడు నారదుడు. ‘మునివరా! ఎంతో శ్రమతీసుకుని ఇక్కడకు వచ్చారు. కాసేపు విశ్రమించండి. ఆ రాక్షసుడి సంగతి నేను చూసుకుంటాను’ అన్నాడు హనుమంతుడు. నారదుడు కొద్దిసేపు అక్కడే విశ్రమించి, హనుమంతుడి వద్ద వీడ్కోలు పుచ్చుకుని బయలుదేరాడు. కొద్దిరోజుల్లో పంపాతీరంలో ఉంటున్న మునులు యజ్ఞం తలపెట్టారు. హోమగుండం ఏర్పాటు చేసి, వేదమంత్రాలు పఠిస్తూ, హవిస్సులను స్వీకరించడం కోసం దేవతలను ఆహ్వానిస్తున్నారు. వారి వేదగానాన్ని రహస్యంగా వినడానికి హనుమంతుడు ఒక చెట్టుపైకి ఎక్కి, నక్కి కూర్చుకున్నాడు. ఆ సమయంలో కలకలం మొదలైంది. ‘దేవతలెవరు? దేవతలకు దేవుణ్ణి నేనే! హోమగుండంలో వేసే హవిస్సులను నేనే గ్రహిస్తాను’ అని కేకలు వేస్తూ, ఒక భీకరాకారుడు దట్టమైన చెట్లను దాటుకుని వచ్చి, అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వాడే త్రిశూలరోముడు. వాడిని చూడగానే హోమగుండం వద్దనున్న మునులు హాహాకారాలు చేస్తూ పరుగులు ప్రారంభించారు. హోమసంభారాలను గ్రహించడానికి త్రిశూలరోముడు ముందుకు కదిలాడు. చెట్టు మీద కూర్చుని ఉన్న హనుమంతుడు తన వాలాన్ని వాడి మీదకు విసిరి, వాలంతో చుట్టి బంధించాడు. జరుగుతున్నదేమిటో గ్రహించేలోగానే వాడి మీదకు ఒక్కసారిగా దూకాడు. త్రిశూలరోముడు తిరగబడ్డాడు. ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. చుట్టూ ఉన్న మునులు నివ్వెరపోయి చూడసాగారు. హనుమంతుడి ముష్టిఘాతాలకు తాళలేక త్రిశూలరోముడు ఒక పెంకులా మారి, రాతి లోపల దాగాడు. అది గమనించిన హనుమంతుడు, తన పిడికిటి పోటుతో పెంకు దాగిన రాతిని ఛిన్నాభిన్నం చేశాడు. ఆ దెబ్బకు త్రిశూలరోముడు నిజరూపం దాల్చి నెత్తురు కక్కుతూ ప్రాణాలు విడిచాడు. అలా పంపాతీరంలోని మునులకు రాక్షసపీడ విరగడైంది. తర్వాత అక్కడ కొన్నాళ్లు గడిపిన హనుమంతుడు తిరిగి గంధమాదన పర్వతానికి వెళ్లిపోయాడు. సాంఖ్యాయన (చదవండి: భగవంతుడుకి పూజలు, వ్రతాలు కంటే అదే అత్యంత ముఖ్యం! అందులోనూ..) -
ఆదిపురుష్: ఆ జిల్లాలోని ప్రతి రామాలయానికి 101 టిక్కెట్లు
‘ఆదిపురుష్’ సినిమా కోసం పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతీసనన్ సీతగా నటించారు. భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 16న విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ రిలీజ్ చేస్తోంది. ‘రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటుకి హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ‘ఆదిపురుష్’ సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయిస్తున్నాం’ అంటూ యూనిట్ ఇటీవల ప్రకటించింది. ఈ మంచి కార్యాన్ని తమవంతుగా ప్రోత్సహిస్తూ శ్రేయాస్ మీడియా వారు మరో నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి రామాలయానికి 100+1(1 టిక్కెట్ హనుమాన్‌కి) టిక్కెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్ తెలిపారు. టిక్కెట్లు కావాల్సిన వారు తమను సంప్రదించాలని పేర్కొన్నారు. జై శ్రీరామ్ 🙏Spreading the Divine Aura of Lord Rama unconditionally🤩The Motto to take the Epic & Divine Tale #Adipurush to everyone & every corner continues to be celebrated 🙏@shreyasgroup announces 100+1⃣ tickets to Every Ramalayam in Every Village of Khammam Dt for… pic.twitter.com/2FB5BWVbh6— Shreyas Media (@shreyasgroup) June 11, 2023 చదవండి: నేను తండ్రినయ్యా.. ఇప్పటిదాకా పరిగెత్తింది చాలు: ప్రభుదేవా -
Cheriyal Painting: నేర్చిన కళే నడిపిస్తోంది.. నకాశి
గృహిణి అనగానే ఇంటిని చక్కదిద్దుకుంటూ, వంట చేస్తున్న మహిళలే మనకు గుర్తుకు వస్తారు. ఇల్లు, వంట పనితో పాటు పిల్లల ఆలనాపాలనా చూస్తూనే చేర్యాల చిత్రకళను ఔపోసన పట్టారు వనజ. ఆరుపదులకు చేరవవుతున్న వనజ హైదరాబాద్ బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు. కుటుంబకళగా పేరొందిన నకాశీ చిత్రకళ గురించి, ఈ కళలో మమేకమైన జీవితం గురించి, పొందిన సత్కారాల గురించి ఆనందంగా వివరిస్తారు వనజ. తెలంగాణలో అతి ప్రాచీన జానపద చిత్రకళగా చేర్యాల పెయింటింగ్స్‌కి పేరుంది. దీనినే నకాశి చిత్రకళ అని కూడా అంటారు. రామాయణ, మహాభారత, పురాణాలను, స్థానిక జానపద కథలను కూడా ఈ కళలో చిత్రిస్తారు. ఈ పెయింటింగ్స్‌తో పాటు రాజా రాణి, సీతారామ.. పోతరాజు, వెల్కమ్ మాస్క్‌లను తయారు చేస్తుంటారు వనజ. పెయింటింగ్ నేర్చుకుంటామని వచ్చినవారికి శిక్షణ కూడా ఇస్తుంటారు. వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటారు. 37 ఏళ్ల క్రితం ‘‘చదువుకున్నది ఏడవ తరగతి వరకే. పెళ్లయ్యాక ముగ్గురు పిల్లలు. నా భర్త వైకుంఠం ఈ చిత్రకళలో రోజంతా ఉండేవారు. ఓ వైపు ఇంటిపని, పిల్లల పని.. అంతా పూర్తయ్యాక మధ్యాహ్నం రెండు గంటల నుంచి పెయింటింగ్ నేర్చుకోవడానికి కూర్చునేదాన్ని. అంతకుముందు ఈ కళ మా కుటుంబానికి మా మామగారి ద్వారా ఏ విధంగా వచ్చిందో, ఎంత ప్రాచీనమైనదో తెలుసుకున్నాను. ప్రాణం పెట్టే ఈ కళ సహజత్వం గురించి అర్ధమవుతున్న కొద్దీ నాకు ఎంతో ఇష్టం పెరిగింది. కళ నేర్పిన చదువు వందల ఏళ్ల క్రితం నిరక్షరాస్యులకు ఈ బొమ్మల ద్వారా కథ తెలియజేసే విధానం ఉండేది. ఆ విధంగా సమాజానికి మంచి నేర్పే కళగానూ పేరుంది. దేవతా వర్ణనలతో, ఇతిహాసాలను, పురాణాలను, స్థానిక కుల కథలను కూడా ఈ కళద్వారా చిత్రిస్తాం. ఖాదీ వస్త్రం లేదా కాన్వాస్‌పై ప్రత్యేకంగా ప్రాసెస్ చేసిన చింత గింజల గుజ్జు, కొన్ని చెట్ల జిగురు, సహజ రంగులతో చిత్రిస్తాం. ఎరుపురంగు ప్రధాన భూమికగా ఉంటుంది. నీలం, పసుపు రంగులో దేవతల చిత్రాలు, బ్రౌన్ లేదా డార్క్ షేడ్స్ రాక్షసులకు, పింక్ స్కిన్ టోన్లు మనుషులకు ఉంటాయి. వందల సంవత్సరాల క్రితం పురుడు పోసుకున్న కళ ఇది. 3 అడుగుల వెడల్పుతో 60 అడుగులకు పైగా పొడవుతో ఈ బొమ్మలను చిత్రించవచ్చు. స్క్రోల్‌లో దాదాపు 40 నుంచి 50 ప్యానెల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ప్యానెల్ కథలోని కొంత భాగాన్ని వర్ణిస్తుంది. ఏడాదికి పైగా... రోజూ కనీసం 5–6 గంటల పాటు సాధన చేస్తూ ఉండటంతో ఏడాదిలో కళను నేర్చుకున్నాను. పిల్లలు స్కూల్‌కి వెళ్లే వయసొచ్చాక ఇంకాస్త సమయం కలిసొచ్చింది. దీంతో మెల్లమెల్లగా ఈ పెయింటింగ్స్‌లో లీనమవడం పెరిగింది. స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు కూడా నాతోపాటు పెయింటింగ్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. పిల్లలు చదువుతోపాటు ఈ కళనూ ఒంటపట్టించుకున్నారు. దేశమంతా ప్రయాణించాను ఎక్కడ మా ప్రోగ్రామ్ ఉన్నా నేనూ మెల్ల మెల్లగా వాటిల్లో పాల్గొనడం మొదలుపెట్టాను. ఆ విధంగా ఢిల్లీ, కలకత్తా, ముంబాయ్.. దేశమంతా తిరిగాను. ఎగ్జిబిషన్స్‌లో పెట్టే స్టాల్స్ చూసుకోవడంతో పాటు, ఇంటి వద్దకు వచ్చే మహిళలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. కాలేజీ అమ్మాయిలు కూడా వస్తూ ఉండేవారు. కాలేజీల్లో వర్క్‌షాప్స్ పెట్టేవాళ్లం. ఇప్పుడు రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకైనా పెయింటింగ్ పూర్తయ్యేవరకు వర్క్ చేస్తూనే ఉంటాను. మా వారికి జాతీయ స్థాయిలో అవార్డు వస్తే, నాకు రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. జంట మాస్క్‌లు చిత్రకళతో పాటు వినాయకుడు, రాజూరాణి, సీతారాములు, పోతరాజు, బోణాల పండగ సమయంలో అమర్చే అమ్మవార్ల రూపు మాస్క్‌లను చేస్తున్నాం. అలాగే, ఇంట్లోకి ఆహ్వానించడానికి అలంకరణగా, ఇంటి లోపలి అలంకరణగా కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. ఉడెన్ బాక్స్‌లు, ట్రేలు, జ్యువెలరీ బాక్స్‌లను కూడా పెయింటింగ్ తీర్చిదిద్దుతు న్నాం. వీటిని కానుకలుగా ఇవ్వడానికి వీటిని ఎంచుకుంటు న్నారు. మాస్క్‌ల తయారీలో చింతగింజల పొడి, కర్ర పొట్టు రెండూ కలిపి, తయారుచేసి, పెయింటింగ్ చేస్తాం. అలాగే, మెటల్ ప్లేట్‌కి ఖాదీ క్లాత్ ని పేస్ట్ చేసి, నేచురల్ కలర్స్‌తో పెయింటింగ్ చేసి, వార్నిష్ చేస్తాం. ఇవన్నీ ఇంటి అలంకరణలో అందంగా అమరిపోతాయి. ఈ చిత్రకళ అన్నింటికీ ప్రధాన ఆకర్షణగా తయారయ్యింది. నా తర్వాత మా ఇంటి కోడలు నాతో కలిసి మెల్ల మెల్లగా ఈ కళను నేర్చుకుంటోంది. కుటుంబంలో కలిసిపోవడం అంటే ఆ కుటుంబంలో ఉన్న ఇష్టాన్ని, కష్టాన్ని కూడా పంచుకోవడం మొదలుపెడుతూ ఉండాలి. ఈ విషయాన్ని నా జీవితం నాకే నేర్పింది. నా కుటుంబం చేతిలో కళ ఉంది. దానిని నేనూ అందిపుచ్చుకుంటే నా తర్వాతి తరం దానిని మరింత నైపుణ్యంగా ముందుకు తీసుకువెళుతుంది. ఇదే నేను నమ్మాను. నాలాంటి మహిళలకు ఈ కళలో శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగాను. ఇప్పుడు ఎంతో గుర్తింపుతో పాటు, ప్రపంచాన్ని కొత్తగా చూశానన్న సంతృప్తితో పెయింటింగ్స్‌ను చిత్రిస్తున్నాను. దీని వల్ల నా కుటుంబ ఆదాయమూ పెరిగింది’’ ఆని ఆనందంగా వివరించారు వనజ. – నిర్మలారెడ్డి -
‘యాదాద్రి’ గోపురంపై రామాయణ గాథ
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ గోపురాలు మరింత ఆధ్యాత్మికతను సంతరించుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఉత్తర రాజగోపురంపై రామాయణానికి సంబంధించిన చిత్రాలపై ఆడియో పవర్ ప్రొజెక్టర్ ద్వారా శుక్రవారం రాత్రి ట్రయల్ నిర్వహించారు. రామాయణం, ఇతర ఇతిహాసాలను ప్రొజెక్టర్ ద్వారా తమిళనాడులోని రామేశ్వరం ఆలయంలో మాత్రమే ప్రదర్శిస్తున్నట్లు వీటిని ఏర్పాటు చేస్తున్న సంస్థ ప్రతినిధులు తెలిపారు. భక్తులు ఉత్తర రాజగోపురం వైపు ఉన్న పచ్చికలో కూర్చొని కట్టడాలను వీక్షించే అవకాశం ఉన్నందున్న.. శ్రీనృసింహస్వామి, ప్రహ్లాద చరిత్రను కూడా ప్రదర్శించేందుకు సన్నాహాలు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును వైటీడీఏ అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. -
రావణ పాత్రధారి అరవింద్ త్రివేది కన్నుమూత
ముంబై: 1986లో వచ్చిన రామాయణం సీరియల్లో రావణుడి పాత్ర పోషించిన ప్రముఖ నటుడు అరవింద్ త్రివేది కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో మరణించారని ఆయన బంధువు కౌస్తుభ్ తెలిపారు. వయో సంబంధిత సమస్యలతో ఆయన చాలా కాలం నుంచి బాధపడుతు న్నారని పేర్కొన్నారు. బుధవారం ఉదయం దహనుకార్ వాడి ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. అరవింద్ మృతిపై ప్రధాని∙మోదీ స్పందించారు. రామాయణం సీరియల్లో ఆయన పాత్రను ప్రజలు చిరకాలం గుర్తుంచు కుంటారని అన్నారు. 1991లో అరవింద్ బీజేపీ తరఫున సబర్కాతా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 1996 వరకు ఆయన ఎంపీగా సేవలందించారు. -
భారత్ విజయగాథ అపూర్వం
వాషింగ్టన్ : ప్రభుత్వాలు తరచూ మారిపోయినా.. రాజకీయ పార్టీల్లో కుట్రలు ఎన్ని ఉన్నా.. సాయుధ వేర్పాటు ఉద్యమాలు ఎన్ని నడిచినా, అన్ని రకాల స్కామ్‌లు, అవినీతి ఉన్నప్పటికీ ఆధునిక భారత దేశం సాధించిన ఘనతలు పలు విధాలుగా ఓ విజయగాథ అని అగ్రరాజ్యం అమెరికా 44వ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో రాసుకున్నారు. 1990 తొలినాళ్లలో ఆర్థిక సరళీకరణలు చేపట్టడంతో భారత్‌లోని అసాధారణ భారతీయ వ్యాపార నైపుణ్యాలు ప్రపంచానికి పరిచయం అయ్యాయని, ఫలితంగా దేశ అర్థ వ్యవస్థ పరుగులు పెట్టిందని, టెక్నాలజీ రంగం వృద్ధి చెందిందని ఒబామా ఆ పుస్తకంలో వివరించారు. 2008లో ఒబామా చేపట్టిన అధ్యక్ష ఎన్నికల ప్రచారం మొదలుకొని అధ్యక్షుడిగా తన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. అల్ కాయిదా అధ్యక్షుడు బిన్ లాడెన్‌ను హతమార్చడంతో పాటు తొలి దఫా అధ్యక్ష పదవీ కాలం ముగిసేంత వరకూ జరిగిన పలు ఘట్టాలను ఆయన ఎ ప్రామిస్డ్ ల్యాండ్‌లో విపులీకరించారు. ఈ నెల 15న విడుదలైన ఈ పుస్తకంలో 2010లో ఒబామా భారత్ పర్యటన వివరాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులోని కొన్ని ముఖ్యాంశాలు.. మన్మోహన్పై ప్రశంసలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఒబామా ప్రశంసల వర్షం కురిపించారు. సిక్కు మైనార్టీ వర్గానికి చెందిన మన్మోహన్ దేశ అత్యున్నత పదవిని అందుకోవడం దేశ పురోగతికి ఓ తార్కాణమని, నిజాయితీపరుడిగా గుర్తింపు పొందడం వంటివి మన్మోహన్ సాధించిన విజయాలని ఒబామా వర్ణించారు. ఢిల్లీలో మన్మోహన్ సింగ్‌ను తాను కలిసినప్పుడు ఆయనలోని అసాధారణ విజ్ఞానాన్ని, హుందా వ్యవహారశైలిని గుర్తించానని చెప్పారు. వినడం సోనియాకు ఇష్టం.. 2010లో తొలిసారి ఢిల్లీ వెళ్లినప్పుడు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో విందు సమావేశంలో పాల్గొన్నట్లు ఒబామా వివరించారు. సోనియా మాట్లాడటం కంటే ఎదుటి వ్యక్తి చెప్పింది వినేందుకే ఎక్కువ ఇష్టపడేవారని తెలిపారు. రాహుల్ గాంధీ తెలివైనవాడిగా, పట్టుదల ఉన్నవాడిగానే కనిపించాడు. అయితే రాహుల్‌లో ధైర్యం లేని అపరిపక్వతను తాను గమనించానని, పాఠాలన్నీ చదివి టీచర్ వద్ద మంచి మార్కులు కొట్టేయాలని చూసే విద్యార్థిలా అనిపించాడని ఒబామా వ్యాఖ్యానించారు. -
సెహ్వాగ్‌కు ‘రామాయణం’ గుర్తొచ్చింది..!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో విధ్వంసకర ఓపెనర్‌గా పేరుగాంచిన వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ శైలి మాత్రం విన్నూత్నంగా ఉంటుంది. సాధారణంగా క్రికెట్ ఆడే వాళ్లలో ప్రతీ ఒక్కరూ తమ ఫుట్‌వర్క్‌ను ఎంతోకొంత కదుపుతూ షాట్లను డిసైడ్ చేసుకుంటారు. మరి మనోడి బ్యాటింగ్ స్టైల్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. నిల్చున్న చోట నుంచే ఒక్క అంగుళం కూడా కదలకుండా భారీ షాట్లు ఆడేయగలడు. తన ఆటతో క్రికెట్‌కే వన్నె తెచ్చిన సెహ్వాగ్.. ఫుట్‌వర్క్‌పై ఇప్పటికీ చాలామందికే అనుమానాలున్నాయి. అసలు లెగ్ మూమెంటే లేకుండా ఎలా విరుచుకుపడతాడనే సందేహం చాలామందిలో ఉంది. అప్పట్లో సెహ్వాగ్ ఫుట్‌వర్క్‌పై చాలామంది విమర్శలు చేసినా ‘నేనింతే’ అన్నట్లు ఉండిపోయాడు. అందుకు బ్యాట్‌తోనే సమాధానం చెబుతూ ఉండటంతో విమర్శకులు కూడా ఏమీ మాట్లాడలేకపోయేవారు. తాజాగా తన ఫుట్‌వర్క్‌పై సమాధానమిచ్చాడు సెహ్వాగ్. మరి తన ఫుట్‌వర్క్ గురించి చెప్పాలనుకున్నాడో లేక బ్యాటింగ్ చేయడానికి ఫుట్‌వర్క్ అనేది అవసరం లేదన్నకున్నాడో ఏమో కానీ హిందూ పురాణాల్లో ఒకటైన రామయాణాన్ని గుర్తుచేసుకున్నాడు సెహ్వాగ్. ఆ రామాయణ పురాణంలోని వానర సైన్యంలో ఒకరైన అంగధుడ్ని ప్రేరణగా తీసుకున్నాడు ప్రత్యేకంగా తన ఫుట్‌వర్క్‌ని అంగధుడితో పోల్చుకున్నాడు సెహ్వాగ్. లాక్డౌన్ కారణంగా టీవీలో ప్రసారం అవుతున్న రామాయణాన్ని వీక్షించినట్లు ఉన్న సెహ్వాగ్.. ఈ మేరకు ఒక ఫోటోను పోస్ట్ చేశాడు. సీతను రావణుడు అపహరించిన తర్వాత సంధికోసం వెళ్లిన అంగధుడు అక్కడ ఉన్న లంకేయులతో సవాల్ చేస్తాడు. తన పాదాన్నిఎవరైనా కదిపితే.. శ్రీరాముడు ఓటమిని అంగీకరించినట్లే అని అంగధుడు అంటాడు. అయితే అంగధుడి పాదాన్ని కదిపేందుకు లంకేయులు ప్రయత్నించి విఫలం అవుతారు. ఇదే విషయాన్ని తనకు ఆపాదించుకున్న సెహ్వాగ్ తన ఫుట్‌వర్క్‌ని ఏ ఒక్కరూ మార్చలేకపోయారని చెప్పకనే చెప్పేశాడు. So here is where i took my batting inspiration from :) Pair hilana mushkil hi nahi , namumkin hai . #Angad ji Rocks pic.twitter.com/iUBrDyRQUF — Virender Sehwag (@virendersehwag) April 12, 2020 -
థ్యాంక్స్ మోదీ... థ్యాంక్స్ డీడీ
ప్రపంచమంతా కరోనా కల్లోలం కారణంగా ఇంటి గడపదాటని స్థితి. ప్రధాని పిలుపుతో లాక్డౌన్ వల్ల ప్రజలందరితో పాటు సెలబ్రిటీలు సైతం సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. దూరదర్శన్ ఛానెల్ 32 ఏళ్లకిందట ప్రసారం చేసిన ‘రామాయణ్’ సీరియల్‌ని మళ్లీ ప్రసారం చేస్తోంది. దీంతో పెద్దవాళ్లు, సెలబ్రిటీలు రామాయణాన్ని టీవీలో తిలకిస్తూ తమ బాల్యస్మృతులను నెమరేసుకుంటున్నారు. ‘భారతీయ ఇతిహాసాలు పిల్లలు తెలుసుకోవడానికి ఇది ఓ గొప్ప మార్గం’ అంటూ పలువురు సెలబ్రిటీలు సోషల్‌మీడియా ద్వారా అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సీరియల్ చూస్తూ ఫొటోలు తీసుకొని వాటిని ఆనందంగా షేర్ చేసుకుంటున్నారు. రోజూ 2 ఎపిసోడ్లు రామాయణ్ ధారావాహిక ఈ శనివారం (28–03–2020) ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు మొదటి ఎపిసోడ్‌తో దూరదర్శన్ లో మళ్లీ ప్రారంభమైంది. తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్‌ను ప్రసారం చేసింది. ‘ప్రజల డిమాండ్ మేరకు రామాయణం సీరియల్‌ను పునఃప్రసారం’ చేస్తున్నట్టు సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ శుక్రవారం ప్రకటించారు. దీంతో చాలామంది సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోదీకి, దూరదర్శన్ ఛానెల్‌కు ‘థ్యాంక్స్ మోదీ... థ్యాంక్స్ డీడీ’ అంటూ ధన్యవాదాలు చెబుతున్నారు. అప్పట్లో ఎక్కడివారక్కడే.. జనవరి 25, 1987లో 30 నిమిషాల నిడివితో 78 ఎపిసోడ్లతో మొదటిసారి దూదర్శన్‌లో రామాయణం ప్రసారమైంది. అప్పట్లో ఇది టీవీలో ఓ విప్లవం. ఈ సీరియల్ వచ్చే సమయంలో ప్రజారవాణా సదుపాయాలన్నీ స్తంభించిపోయేవి. రైళ్లు, బస్సులు, ఇంటర్ సిటీ ట్రక్కులు.. జనం లేక వెలవెలబోయేవి. ఊళ్లలో సమూహాలుగా టీవీ సెట్స్ ముందు చేరిపోయేవారు. టీవీల ముందు కొబ్బరికాయలు కొట్టి, అగరొత్తులు వెలిగించేవారు. పువ్వులు జల్లి నీరాజనాలు సమర్పించేవారు. నిజానికి ఇది ఒక కార్యక్రమమే. కానీ పిల్లా జెల్లాతో కలిసి కుటుంబం అంతా ఈ సిరియల్‌ని చూసింది. సీరియల్ పూర్తయ్యాక సత్యమే పలకాలనే వాగ్డానాలు చేసుకునేవారు. పిల్లలు ఇంటి గడప దాటి బయటకు వెళ్లాలన్నా తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకునేవారు. రామాయణంతో టీవీ అలా ప్రతి ఒక్కరినీ కథలో లీనమయ్యేలా చేస్తూ జీవన విలువలనే ధ్యేయంగా విద్యాభ్యాసం చేయించింది. ముప్పై రెండేళ్ల క్రితం ప్రతి ఆదివారం ఉదయం వేళ కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించిన రామాయణం ఇప్పుడు కర్ఫ్యూ వాతావరణంలో మళ్లీ బుల్లితెర మీదకు వచ్చేసింది. రామనవమి వస్తున్న ఈ తరుణంలో రామాయణం మళ్లీ వీక్షించడం మహద్భాగ్యంగా చెప్పుకుంటున్నారు జనం. పాలసంద్రం నుంచి పట్టాభిషేకం దాకా! ‘శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం..’ పాల సముద్రం మీద శేష శయనుడైన నారాయణుడు, పాదాలు వత్తుతూ లక్ష్మీదేవి. బ్రహ్మాది దేవతలంతా స్తుతిస్తున్న సన్నివేశంతో రామాయణం మొదలవుతుంది. యోగనిద్రలో ఉన్న నారాయణుడు కనులు తెరిచి విషయం ఏంటని అడుగుతాడు. రావణాసురుడి ఆగడాలకు అంతులేదు. అధర్మమే అంతటా ఉంది. పాప నాశనం చేసి, ధర్మ సంస్థాపన చేయండి అని వేడుకుంటారు దేవతలు. వరాలను దుర్వినియోగం చేస్తున్న రావణాసురుడిని నిలువరించాల్సిన అత్యావశ్యకం వచ్చింది చెపుతాడు శివుడు. సత్యమే గెలుస్తుందని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సూర్యచంద్రులు ఉండేంతవరకు ఆ ధర్మం అందరికీ మార్గదర్శకం కావాలని కోరుకుంటారు. రావణుడి అహంకారాన్ని మట్టుపెట్టేందుకు తాను జన్మిస్తానని వరమిస్తాడు నారాయణుడు. ‘సత్యమేవ జయతే’ అంటారు దేవగణం. అక్కడి నుంచి.. రాముడు జననం, విద్యాభ్యాసం, వివాహం, వనవాసం మీదుగా కథ నడుస్తూ సీతాదేవి అపహరణ, రావణాసుర సంహారం, తిరిగి అయోధ్యనగర ప్రవేశం, పట్టాభిషేకంతో కథ ముగుస్తుంది. డీడీ1లో ప్రసారమవుతున్న ‘రామాయణ్’ సీరియల్ చూస్తూ, సోషల్‌మీడియాలో ఫోటోలు షేర్ చేసుకుంటున్నారు నిత్యవిద్యార్థి రామానంద సాగర్ రామానంద సాగర్ దాదాపు వందేళ్ల క్రితం కశ్మీరీ ధనిక కుటుంబంలో పుట్టాడు. రచయితగా ఎన్నో మారు పేర్లతో రచనలు చేశాడు. ఒకానొక సమయంలో ముంబయ్‌కి అతని కుటుంబ వలస వచ్చింది. సినిమా మీద వ్యామోహంతో పృథ్వీ థియేటర్లో పృథ్వీరాజ్ కపూర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. 1950లో సాగర్ ఆర్ట్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ కంపెనీని నిర్మించాడు. పదుల సంఖ్యలో నామమాత్రపు సినిమాలు అతని ప్రొడక్షన్లో వచ్చాయి. ఆ తర్వాత అతని దశ, దిశ మార్చింది మాత్రం చిన్నతెరనే. అంతకాలం అతనొక విద్యార్థి. రామాయణంతో అతనిలోని మేధావి ప్రపంచానికి కనిపించాడు. తనలో సాంకేతికæ పరిజ్ఞానం ఏ మాత్రం లేదని ఒప్పుకున్న సాగర్ రామాయణాన్ని బుల్లితెర మీద చూపించడంలో అపారప్రతిభను కనబరిచాడని అంతా చెబుతుంటారు. తులసీదాస్ రామాయణమే మూలం రామానంద సాగర్ తులసీదాస్ రామాయణంలోని కథను తన సీరియల్‌కి ఎంచుకున్నాడు. రామరాజ్య స్థాపనకు ముందు రాముడి జీవితాన్ని ఇందులో తీసుకున్నారు. రాముడు తిరిగి అయోధ్యను చేరుకోవడం, పట్టాభిషేకంతో కథ ముగుస్తుంది. చివరలో సీతను రాముడు వదిలేయడం, లవకుశల అంశాలతో కూడిన ఉత్తర రామాయణ్ తీసుకోలేదు. ‘చాలా మంది రచయితలు రాముడు సీతను వదిలేసినట్టు రాశారు. ‘కానీ, నా రాముడు అలా కాదు అనేవాడు నాన్న. ఆ తర్వాత ప్రత్యేకంగా లవ–కుశ సీరియల్ తీయాలనుకున్నాడు. కానీ, అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది’ అని చెప్పారు ఓ ఇంటర్వూ్యలో రామానంద్ సాగర్ తనయుడు ప్రేమ్‌సాగర్. భారత దేశంలో పౌరాణిక ఇతివృత్తంతో సీరియల్స్ రూపొందించడానికి రామాయణం ఒక మాధ్యమంగా సాగింది. జీవించిన నటీనటులు రామ పాత్రధారి అరుణ్‌గోవిల్ గళం ఈ సీరియల్‌కే పెద్ద ఎస్సెట్. ప్రశాంత చిత్తం. మృదుమైన మాట. అతను మాట్లాడుతుంటే వినేవారి చెవులు ఆసక్తితో రిక్కించుకుని వింటాయి. ఇక ఇప్పటి వరకు వచ్చిన సీత క్యారెక్టర్లలో ఎవరు ది బెస్ట్ అని కళ్లు మూసుకొని వెతికినా దీపికా చికాలియా రూపం కళ్లముందు నిలుస్తుంది. కళ్లతో ఆమె పలికించిన భావాలు మనసు నుంచి చెదిరిపోవు. ఇప్పటికి వచ్చిన రామాయణ్ సీరిస్‌లో హనుమాన్ పాత్ర ధారులను గమనిస్తే హనుమాన్‌గా నటించిన ధారా సింగ్ అపరమేధావిలా కనిపిస్తాడు. హనుమాన్ అంటే ధారాసింగ్ మాత్రమే అనేలా మెప్పించాడు. ఇక రాముడికి దీటుగా రావణుడి పాత్రకోసమే పుట్టాడేమో అనిపించేలా అరవింద్ త్రివేది కనిపిస్తారు. మరింత అందంగా! మూడు దశాబ్దాల క్రితమే కోటి రూపాయల బడ్జెట్‌తో తీసిన ఈ సీరియల్ పాత్రదారులకు బ్రైట్ కలర్ కాస్ట్యూమ్స్ వాడారు. మన దేశ ప్రజలకు అప్పుడప్పుడే కలర్ టెలివిజన్ చేరవవుతుంది. ఈ చిన్న తెరమీద గులాబీ, నీలం, పసుపు, ఎరుపు రంగులతో షోని బ్లాస్ట్ చేశాడు దర్శకుడు. ఇప్పుడు మనంటి గోడ మీద ఠీవీగా స్థానం సంపాదించుకున్న టీవీలో రామాయణం వర్ణాలన్నీ మరింత క్లారిటీగా వీక్షించవచ్చు. రికార్డులు ఇండియన్ టీవీలో మొట్టమొదటి బ్లాక్ బస్టర్, అత్యంత ఎక్కువ ప్రజాదరణ పొందిన పౌరాణిక షో గా రామాయణం వరల్డ్ లిమ్కా బుక్ రికార్డ్స్‌లో చోటు చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన రామాయణాలకు రామానంద్ సాగర్ రామాయణమే పెద్ద బాలశిక్ష అయ్యింది. – నిర్మలారెడ్డి -
ఇంత చిన్న ప్రశ్నకు సమాధానం తెలియదా?!
ముంబై: దేశంలో రామాయణం, మహాభారతం గురించి తెలియని చాలా తక్కువగా ఉంటారు. హిందు మత ఇతిహాసాలైన ఈ గ్రంథాల గురించి.. సినిమాలు, సీరియళ్లతోపాటు నవలలు ఇప్పటికీ వెలువడుతూనే ఉన్నాయి. కానీ, రామాయణానికి సంబంధించి ఓ చిన్న ప్రశ్నకు ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా సమాధానం చెప్పలేకపోయారు. ఇటీవల ఆమె ప్రముఖ క్విజ్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడపతిలో పాల్గొన్నారు. గత రాత్రి ప్రసారమైన ఈ షోలో ‘హాట్ సీట్’లో కూర్చున్న సోనాక్షిని హోస్ట్ అమితాబ్ బచ్చన్ రామాయణానికి సంబంధించి ఓ ప్రశ్న అడిగారు. ఎవరికోసం హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు? అని అడిగిన అమితాబ్.. ఏ. సుగ్రీవుడు, బీ.లక్ష్మణుడు, సీ. సీత, డీ. రాముడు అని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. సోనాక్షి మాత్రం ఈ ప్రశ్న సమాధానం చెప్పలేక.. ఒక లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకున్నారు. దీంతో ఇంత చిన్న ప్రశ్నకు సమాధానం తెలియదా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నల ఆధారంగా సాగే క్విజ్ షో అయిన కౌన్ బనేగా కరోడపతి షోకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. -
రావణుడిగా ప్రభాస్.. సీతగా దీపికా పదుకోన్!
‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా తిరుగులేని స్టార్‌డమ్‌ను ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల వచ్చిన ప్రభాస్ ‘సాహో’ సినిమాకు నెటిగివ్ టాక్, రివ్యూలు వచ్చినా.. కలెక్షన్లు మాత్రం సూపర్బ్ అనిపించాయి. ఈ సినిమా సాధించిన వసూళ్లు బాలీవుడ్‌ను సైతం ఔరా అనిపించాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ను ఓ ప్రతిష్టాత్మకమైన పురాణ పాత్రలో నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రామాయణ కథతో ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కించబోతున్న సినిమాలో ప్రభాస్ రావణుడిగా కనిపించనున్నారని బాలీవుడ్లో వినిపిస్తోంది. రూ. 600 కోట్ల బడ్జెట్‌తో మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బలమైన రావణుడి పాత్ర కోసం ప్రభాస్‌ను చిత్రబృందం సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకు ప్రభాస్ ఈ సినిమాకు ఓకే చెప్పలేదని, ఆయన టీమ్ ప్రస్తుతం ఈ ప్రాజెక్టు టేకాప్ చేయొచ్చా లేదా? అన్నది బేరిజు వేసే పనిలో ఉందని పింక్విల్లా వెబ్సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది. రూ.600 కోట్ల అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రభాస్‌కు ఉన్న దేశవ్యాప్త స్టార్డమ్తోపాటు హైట్, పర్సనాలిటీ పరంగా రావణుడి పాత్రకు పర్ఫెక్ట్గా సూటయ్యే లక్షణాలు ఉండటంతో ఆయనను ఈ సినిమా కోసం తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ప్రభాస్ రావణుడి పాత్రను చేస్తే.. ఆ పాత్రకు న్యాయం చేయడమే కాకుండా ప్రజల్లో మరింత హైప్ వచ్చే అవకాశముంటుందని, మరోవైపు రాముడిగా హృతిక్ రోషన్, సీతగా దీపికా పదుకోణ్ నటించే అవకాశముండటంతో వారికి దీటుగా రావణుడి పాత్రలో ప్రభాస్ అలరించే అవకాశముంటుందని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో సీతారాములుగా హృతిక్, దీపిక నటించనున్నారని కథనాలు రాగా.. ఇంకా ఈ సినిమా కోసం క్యాస్టింగ్ ఫైనల్ చేయలేదని ఈ వార్తలను దర్శకుడు నితేశ్ కొట్టిపారేశారు. మరోవైపు ఈ సినిమాలో నటించే తారాగణంపై ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. -
రామ గానం