పంపాతీరం గుర్తుకు రావడంతో హనుమంతుడు ఒక్కసారిగా..! | Hanuman Kills Trishularoma In Pampa | Sakshi
Sakshi News home page

పంపాతీరంలో హ‌నుమంతునిచే త్రిశూల‌రోముడి హ‌తం.. మునుల‌కు ప్ర‌శాంత‌త‌

Published Sun, Oct 1 2023 9:16 AM | Last Updated on Sun, Oct 1 2023 10:02 AM

Hanuman Kills Trishularoma In Pampa - Sakshi

రామావతారం పరిసమాప్తమైన తర్వాత హనుమంతుడు గంధమాదన పర్వతానికి వెళ్లిపోయాడు. కపివీరుల్లో కొందరు ముఖ్యులు కూడా కిష్కిందకు వెళ్లకుండా ఆ పర్వత పరిసర ప్రాంతాల్లోనే ఉండసాగారు. ఒకనాడు హనుమంతుడికి పంపా తీరానికి వెళ్లాలనిపించింది. సుగ్రీవుడి కొలువులో ఉండగా మొదటిసారిగా రామలక్ష్మణులను కలుసుకున్నది పంపా పరిసర ప్రాంతాల్లోనే! రామునితో సుగ్రీవునికి మైత్రి కుదరిన ప్రదేశం అదే!

పంపాతీరం గుర్తుకు రావడంతోనే హనుమంతుడు తన వాహనమైన ఒంటె మీద బయలుదేరాడు. అతడి ప్రయాణాన్ని గమనించిన సుషేణుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు తదితర కపివీరులందరూ అతణ్ణి అనుసరించారు. తోవ పొడవునా భక్తులు బారులుతీరి ఎక్కడికక్కడ హనుమంతునికి నీరాజనాలు పలికారు. కొందరు ఆయన దీవెనలందుకుని ఇళ్లకు మళ్లితే, ఇంకొందరు ఆయనను అనుసరించి ప్రయాణించసాగారు.

హనుమంతుడు పంపాతీరానికి విచ్చేస్తున్న సమాచారం తెలుసుకుని, సమీపంలోని కిష్కిందరాజ్యంలో ఉంటున్న వానరులు, పంపాతీరంలోని తాపసులు అక్కడకు చేరుకుని, ఆయనకు ఘనస్వాగతం పలికారు. హనుమంతుడు పంపాతీరంలో కొలువుతీరాడు. అక్కడే ఒక చెట్టు కింద శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, రోజూ పంపా సరోవరంలో స్నానమాచరించి, శ్రీరాముడి విగ్రహానికి పూజలు చేసేవాడు. తాపసులతో కొలువుదీరి, వారితో వేదశాస్త్ర చర్చలు సాగించేవాడు. వారి ద్వారా పురాణగాథలు వింటూ కాలక్షేపం చేసేవాడు.

హనుమంతుడు పంపాతీరంలో కొలువుదీరిన కొద్దిరోజులకు మహతి మీటుతూ నారద మహర్షి అక్కడకు వచ్చాడు. నారదుడి రాక గమనించిన హనుమంతుడు ఆయనకు స్వయంగా ఎదురేగి స్వాగతం పలికాడు. ఉచితాసనం మీద కూర్చుండబెట్టి, పండ్లు, తేనె తెచ్చి ఇచ్చి అతిథి సత్కారాలు చేశాడు. ‘మహాత్మా! భక్తాగ్రేసరుడవైన నీ రాకతో పంపాతీర ప్రాంతమంతా పావనమైంది. త్రిలోక సంచారివి అయిన నీవెరుగని విశేషాలు ఉండవు. నేను తెలుసుకోదగిన విషయమేదైనా ఉంటే సెలవివ్వు’ అని వినమ్రంగా అడిగాడు హనుమంతుడు.

‘అంజనానందనా! నీవు శివాంశ సంభూతుడవు, రామమంత్ర మహిమాన్వితుడవు, లోకపూజ్యుడవు. మాబోటి మునిగణాలతో పూజలందుకోవడానికి సర్వవిధాలా అర్హుడవు. నీవు ఇంత వినతుడవై నన్ను పూజించడం నాకే ఆశ్చర్యంగా ఉంది. నిన్ను ఒకసారి చూసిపోవాలని, నీ చెవిన ఒక మాట చెప్పాలని ఇక్కడకు వచ్చాను’ అన్నాడు నారదుడు. ‘చెప్పు మునివరా!’ అన్నాడు హనుమంతుడు.

‘రామావతార కాలంలో దానవుల దాష్టీకాలు దాదాపుగా అంతమొందాయి. అయితే, దానవ వంశం మళ్లీ బలం పుంజుకుంటోంది. అమాయక జనాలను పీడిస్తోంది. అసిరోముడనే రాక్షసుడు జనాలను నానా విధాల పీడించి, చచ్చాడు. వాడి తర్వాత వాడి కొడుకు త్రిశూలరోముడు రాక్షసరాజ్యానికి రాజయ్యాడు. శివుడి ద్వారా వాడు వరాలు పొందాడు. వాడు ఈ ప్రాంతంలోనే సంచరిస్తున్నాడు. యజ్ఞయాగాది క్రతువులకు అడుగడుగునా అడ్డు తగులుతూ, మునిజనులను నానావిధాలుగా హింసిస్తున్నాడు’ అని చెప్పాడు నారదుడు.

‘మునివరా! ఎంతో శ్రమతీసుకుని ఇక్కడకు వచ్చారు. కాసేపు విశ్రమించండి. ఆ రాక్షసుడి సంగతి నేను చూసుకుంటాను’ అన్నాడు హనుమంతుడు. నారదుడు కొద్దిసేపు అక్కడే విశ్రమించి, హనుమంతుడి వద్ద వీడ్కోలు పుచ్చుకుని బయలుదేరాడు. కొద్దిరోజుల్లో పంపాతీరంలో ఉంటున్న మునులు యజ్ఞం తలపెట్టారు. హోమగుండం ఏర్పాటు చేసి, వేదమంత్రాలు పఠిస్తూ, హవిస్సులను స్వీకరించడం కోసం దేవతలను ఆహ్వానిస్తున్నారు. వారి వేదగానాన్ని రహస్యంగా వినడానికి హనుమంతుడు ఒక చెట్టుపైకి ఎక్కి, నక్కి కూర్చుకున్నాడు.

ఆ సమయంలో కలకలం మొదలైంది. ‘దేవతలెవరు? దేవతలకు దేవుణ్ణి నేనే! హోమగుండంలో వేసే హవిస్సులను నేనే గ్రహిస్తాను’ అని కేకలు వేస్తూ, ఒక భీకరాకారుడు దట్టమైన చెట్లను దాటుకుని వచ్చి, అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వాడే త్రిశూలరోముడు. వాడిని చూడగానే హోమగుండం వద్దనున్న మునులు హాహాకారాలు చేస్తూ పరుగులు ప్రారంభించారు.

హోమసంభారాలను గ్రహించడానికి త్రిశూలరోముడు ముందుకు కదిలాడు. చెట్టు మీద కూర్చుని ఉన్న హనుమంతుడు తన వాలాన్ని వాడి మీదకు విసిరి, వాలంతో చుట్టి బంధించాడు. జరుగుతున్నదేమిటో గ్రహించేలోగానే వాడి మీదకు ఒక్కసారిగా దూకాడు. త్రిశూలరోముడు తిరగబడ్డాడు. ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. చుట్టూ ఉన్న మునులు నివ్వెరపోయి చూడసాగారు.

హనుమంతుడి ముష్టిఘాతాలకు తాళలేక త్రిశూలరోముడు ఒక పెంకులా మారి, రాతి లోపల దాగాడు. అది గమనించిన హనుమంతుడు, తన పిడికిటి పోటుతో పెంకు దాగిన రాతిని ఛిన్నాభిన్నం చేశాడు. ఆ దెబ్బకు త్రిశూలరోముడు నిజరూపం దాల్చి నెత్తురు కక్కుతూ ప్రాణాలు విడిచాడు. అలా పంపాతీరంలోని మునులకు రాక్షసపీడ విరగడైంది. తర్వాత అక్కడ కొన్నాళ్లు గడిపిన హనుమంతుడు తిరిగి గంధమాదన పర్వతానికి వెళ్లిపోయాడు.

 సాంఖ్యాయన 

(చదవండి: భగవంతుడుకి పూజలు, వ్రతాలు కంటే అదే అత్యంత ముఖ్యం! అందులోనూ..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement