2024.. ప్రపంచమంతటినీ యుద్ధ భయం వెంటాడింది. ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలు మూడో ప్రపంచ యుద్ధానికి నాందిగా నిలిచాయి. దీనికితోడు భీకర విధ్వంసాన్ని సృష్టించే అణ్వాయుధాల ముప్పు కూడా తొంగిచూసింది. 2024లో ప్రపంచాన్ని అనునిత్యం భయానికి గురిచేసిన యుద్ధాలివే..
రష్యా-ఉక్రెయిన్
2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 2024లో మరింత తీవ్ర స్థాయికి చేరింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌కు రష్యా అంతర్భాగంలో యూఎస్‌ఏ ఆయుధాలను ఉపయోగించడానికి అనుమతించడం ద్వారా మూడవ ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదిగా భావించే హైపర్‌సోనిక్ ఐసీబీఎం క్షిపణిని ఉక్రెయిన్‌పై ప్రయోగించడం ద్వారా రష్యా అవసరమైతే అణుదాడికి కూడా వెనుకాడబోదన్న సందేశాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్‌కు సహాయం చేస్తున్న నాటో, అమెరికా, బ్రిటన్‌లపై దాడి చేస్తామని రష్యా పలుమార్లు హెచ్చరించింది. ఇది మూడో ప్రపంచ యుద్ధ భయాన్ని మరింతగా పెంచింది.
ఇజ్రాయెల్-హమాస్
2023 అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం క్రమంగా లెబనాన్, యెమెన్, ఇరాన్, సిరియాలను చుట్టుముట్టింది. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా యెమెన్ హౌతీలు.. ఏడెన్ గల్ఫ్‌లోని ఓడలను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఇజ్రాయెల్ హమాస్‌తో పాటు హౌతీలతోనూ పోరాడాల్సి వచ్చింది. హౌతీల దాడులను అరికట్టేందుకు అమెరికా, బ్రిటన్ కలిసి యెమెన్‌పై పలుమార్లు భారీ వైమానిక దాడులు నిర్వహించి, హౌతీల కీలక స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్ కూడా హౌతీలపై బలమైన ప్రతీకార దాడులను చేపట్టింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, యాహ్యా సిన్వార్‌లను హతమార్చడం ద్వారా ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మనోధైర్యాన్ని దెబ్బతీసింది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటివరకు 45 వేల మందికి పైగా జనం మృతిచెందారు.
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా
ఇజ్రాయెల్ దళాలు హమాస్ నేతలను హతమార్చిన దరిమిలా ఇజ్రాయెల్ సైన్యం హెజ్‌బొల్లా స్థావరాలపై వైమానిక దాడి చేపట్టింది. హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఈ వైమానిక దాడిలో మరణించాడు. దీని తరువాత, కొత్త చీఫ్ సఫీద్దీన్ కూడా ఇజ్రాయెల్ సైన్యం చేతుల్లో హతమయ్యాడు. తరువాత గాజా తరహాలో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లో భూ ఆక్రమణకు పాల్పడింది. పేజర్లు, బ్యాటరీ బ్లాస్ట్‌లను ఉపయోగించి వేలాది మంది హెజ్‌బొల్లా యోధులను ఇజ్రాయెల్ అంతమొందించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్- హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది.
ఇజ్రాయెల్-ఇరాన్
ఇజ్రాయెల్- హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణకు ముందు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, యాహ్యా సిన్వార్, హిజ్బుల్లా చీఫ్‌లు హసన్ నస్రల్లా, హషీమ్ సఫీద్దీన్‌లను అంతమొందించడంతో ఇరాన్ షాక్‌నకు గురయ్యింది. 2024 అక్టోబర్‌లో ఇరాన్ అకస్మాత్తుగా 180 క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఇది ప్రపంచమంతటినీ కలవరానికి గురిచేసింది. ఈ దాడి తరువాత, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య నెలకొన్న ప్రత్యక్ష యుద్ధం ముప్పు మధ్యప్రాచ్యాన్ని మరింత ఆందోళనలోకి నెట్టేసింది. ఇప్పటికే యూరప్‌లో జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధ ప్రమాద ముప్పును మరింత పెంచింది. ఈ తరుణంలోనే ఇజ్రాయెల్.. ఇరాన్‌పై వైమానిక దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. ఇరాన్ సైనిక స్థావరాలను నాశనం చేసింది.
సూడాన్- బంగ్లాదేశ్
2024లో సూడాన్- బంగ్లాదేశ్‌లలో జరిగిన తిరుగుబాట్లు చరిత్రలో నిలిచిపోతాయి. ఏప్రిల్ 2023 నుంచి సూడాన్ భీకర అంతర్యుద్ధంలో మునిగితేలుతోంది. జుంటా సైన్యం తిరుగుబాటు దరిమిలా సూడాన్ పారామిలిటరీ దళాలు రంగంలోకి దిగాయి. ఈ రెండింటి మధ్య సంవత్సరాల తరబడి భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు వేలాది మంది సైనికులు, ప్రజలు మరణించారు. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం సూడాన్‌లో జరిగిన ఈ అంతర్యుద్ధంలో 27 వేల మందికి పైగా జనం మరణించారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం కారణంగా ప్రధాని షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి మొహమ్మద్ యూనస్ సారధ్యం వహిస్తున్నారు. అదిమొదలు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగాయి.
సిరియాలో..
సిరియాలో సాయుధ తిరుగుబాటుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. వారు సిరియా రాజధాని డమాస్కస్‌తో సహా అనేక స్థావరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో సిరియా అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశం నుండి పారిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపధ్యంలో రష్యా అసద్‌కు ఆశ్రయం ఇచ్చింది. అనంతరం ఇజ్రాయెల్ సిరియాలోని పలు ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి, ఆ దేశంలోని బఫర్ జోన్‌ను స్వాధీనం చేసుకుంది.
ఇది కూడా చదవండి: Year Ender 2024: భారతీయులు అలెక్సాను అడిగిన ప్రశ్నలివే.. జాబితా షేర్ చేసిన అమెజాన్
Comments
Please login to add a commentAdd a comment