2024 కొద్ది గంటల్లో ముగియనుంది. 2025 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మధ్యకాలంలో మనం గడచిన ఏడాది మిగిల్చిన గురుతులను ఒకసారి నెమరువేసుకుందాం. ముఖ్యంగా 2024 ఎంతో ప్రత్యేకంగా నిలిచిన జమ్ముకశ్మీర్ గురించి చర్చిద్దాం.
2024 అక్టోబర్ 8న జమ్ముకశ్మీర్‌లో తొలిసారిగా కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం ఏర్పాటయ్యింది. నేషనల్ కాన్ఫరెన్స్ అధికార హోదాను దక్కించుకుంది. ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) అత్యధిక మెజారిటీతో కొత్త అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయితే పూర్తి రాష్ట్ర హోదా లేని కారణంగా ఈ ప్రభుత్వానికి మునుపటిలా అత్యధిక అధికారాలు లేవు. దీంతో పరిమిత అధికారాలతో ప్రభుత్వాన్ని నడపడం ఒమర్ అబ్దుల్లాకు సవాల్‌గా మారింది. అయితే ఈసారి జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం విలసిల్లింది.
జమ్ముకశ్మీర్‌లో ఐదు లోక్‌సభ స్థానాలున్నాయి. 2024లో ఇక్కడ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో(General election) గత 35 ఏళ్ల రికార్డు బద్దలయ్యింది. 58.46 శాతం ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగి, 63.5 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి వేర్పాటువాదులు, జమాత్-ఎ-ఇస్లామీతో సంబంధం ఉన్నవారు కూడా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జమాత్-ఎ-ఇస్లామీ నిషేధానికి గురైనా, దానికి మద్దతు పలికిన అభ్యర్థులు 10 స్థానాల్లో పోటీకి దిగారు. వీరిలో చాలామంది తమ డిపాజిట్లను కూడా కాపాడుకోలేకపోయారు. 2019లో పుల్వామా దాడి తర్వాత జమాత్‌పై నిషేధం విధించారు.
మరోవైపు జమ్ము డివిజన్‌లోని రియాసి, దోడా, కిష్త్వార్, ఉధంపూర్‌లలో పాకిస్తానీ ఉగ్రవాదులు(Pakistani terrorists) దాడులకు పాల్పడటం భారత భద్రతా ఏజన్సీల ఆందోళనను పెంచింది. జూన్ 9న రియాసిలో ఏడుగురు యాత్రికులు శివ్ ఖోరీ తీర్థయాత్ర నుండి బస్సులో తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు వారిని లక్ష్యంగా చేసుకున్నారు. అదేవిధంగా ఉధంపూర్, కిష్త్వార్‌లలో ముగ్గురు గ్రామ రక్షణ గార్డులు మృతిచెందారు. వేర్వేరు ఉగ్రవాద ఘటనల్లో 18 మంది భద్రతా దళాల సిబ్బంది అమరులయ్యారు.
రాబోయే 2025లో జమ్ముకశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు కొనసాగేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. భద్రతా సంస్థలు మరింత ఉత్సాహంగా పాక్ చొరబాటు ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రణాళికలను రచిస్తున్నాయి. 2019కి ముందున్న కాశ్మీర్ అందాలను కాపాడుతూ, ఇక్కడ అల్లరి మూకల హింసాకాండ చెలరేగకుండా భద్రతా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని వాగ్దానం చేసింది. సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: 100 శాతం ఫలితాలతో క్యాన్సర్ ఔషధం.. త్వరలో అందుబాటులోకి..
Comments
Please login to add a commentAdd a comment