నిమి మహారాజు ఇక్ష్వాకుని పుత్రుడు. మిథిలానగరం రాజధానిగా గల విదేహ రాజ్యానికి మొదటి మహారాజు. గొప్ప ధర్మజ్ఞుడు, పరిపాలకుడిగా ప్రజారంజకుడు, సత్యవాది, దానశీలి, మహాజ్ఞాని. నిమి మహారాజు అనేక యజ్ఞాలు చేశాడు. గౌతమ ఆశ్రమ సమీపంలో పురోహితుల కోసం ప్రత్యేకంగా ‘జయం’ అనే పట్టణాన్ని నిర్మించాడు. యజ్ఞ యాగాదులు నిర్వహించే పురోహితులంతా జయంలో చేరి, నిత్యం యజ్ఞ యాగాదులు చేసుకుంటూ, జపతపాదులతో, నిరంతర వేదాధ్యయనంతో సుఖంగా జీవించసాగారు.
ఒకనాడు నిమి మహారాజు అట్టహాసంగా బహుకాలం కొనసాగే మహాయజ్ఞం చేయాలని సంకల్పించాడు. యజ్ఞ నిర్వహణకు తండ్రి ఇక్ష్వాకుడి అనుమతి పొందాడు. మహర్షులతోను, పురోహితులతోను సంప్రదించి, యజ్ఞ సంభారాలన్నింటినీ సమకూర్చుకున్నాడు. వసిష్ఠ, వామదేవ, భృగు, అంగిరస, పులహ, పులస్త్య, ఋచీక, గౌతమాది మహర్షులందరినీ ఆహ్వానించాడు. యజ్ఞకోవిదులైన వేదపండితులను రప్పించాడు.
కులగురువు వసిష్ఠుడికి పాదపూజ చేసి, ‘గురూత్తమా! నువ్వు సర్వజ్ఞుడివి. యజ్ఞ సంభారాలన్నింటినీ సమకూర్చుకున్నాను. దయచేసి, నాతో ఈ మహాయజ్ఞం చేయించు. ఇది ఐదువేల ఏళ్ల పాటు సాగాలి. అటువంటి యజ్ఞదీక్షను ఇప్పించి, నాతో యజ్ఞం చేయించు. ఇది దేవీయజ్ఞం. జగజ్జనని ప్రీతి కోసం ఈ యజ్ఞాన్ని తలపెట్టాను. కాదనక ఆధ్వర్యం వహించు’ అని ప్రార్థించాడు.
‘నిమి మహారాజా! నీ సంకల్పం ప్రశస్తం. కాని ఇంద్రుడు కూడా ఇదే యజ్ఞాన్ని తలపెట్టి, నన్ను ఆధ్వర్యం వహించమని కోరాడు. ఐదువేల సంవత్సరాల దీక్ష చేపట్టాడు. నేను అంగీకరించి, అతడికి మాట ఇచ్చాను. అందువల్ల ముందు ఇంద్రుడి యజ్ఞం పూర్తి చేయించి, ఆ తర్వాత నీతో యజ్ఞం జరిపిస్తాను. అంతవరకు ఓపిక పట్టు. ఆ పని పూర్తికాగానే క్షణమైనా ఆలస్యం చేయకుండా నీ దగ్గరకు వస్తాను. అయినా, దేవేంద్రుడి పనికి అగ్రస్థానం ఇవ్వాలి కదా!’ అని బదులిచ్చాడు వసిష్ఠుడు.
‘గురుదేవా! నేను యజ్ఞ సంభారాలన్నింటినీ సమకూర్చుకున్నాను, మహర్షులు, ఋత్విక్కులందరినీ ఆహ్వానించాను. వారందరూ వచ్చేశారు. ఇప్పుడు తలపెట్టిన యజ్ఞాన్ని వాయిదా వేసి, ఐదువేల ఏళ్లు ఆగడమంటే ఎలా? నువ్వు మా ఇక్ష్వాకుల కులగురువువు. మా పనిని కాదని, మరొకరి పనికి వెళ్లడం నీకు భావ్యమేనా? బహుశా, ధనాశకు లొంగిపోయినట్లు ఉన్నావు. కాస్త ఆలోచించు’ అని నిష్ఠూరంగా ప్రాధేయపడ్డాడు నిమి.
నిమి మాటలకు వసిష్ఠుడు బదులివ్వకుండా, ఇంద్రుడి యజ్ఞం జరిపించడానికి వెళ్లిపోయాడు. వసిష్ఠుడి ప్రవర్తనకు నిమి కలత చెందాడు. ఏది ఏమైనా తలపెట్టిన యజ్ఞం నిర్వహించాలని అనుకున్నాడు. వెంటనే, గౌతమ మహర్షిని యజ్ఞానికి ఆధ్వర్యుడిగా ఉండమని అభ్యర్థించి, ఒప్పించాడు. హిమాలయాల సన్నిధిలో గౌతముడి ఆధ్వర్యంలో దేవీ మహాయజ్ఞాన్ని వైభవోపేతంగా ప్రారంభించాడు. ఋత్విక్కులకు, పురోహితులకు, వేదపండితులకు భూరిదక్షిణలు ఇచ్చాడు. గో భూ సువర్ణదానాలతో వారిని సంతృప్తులను చేశాడు. ఐదువేల ఏళ్ల దీక్ష చేపట్టి, మహాయజ్ఞం చేశాడు.
నిమి చేపట్టిన యజ్ఞం పూర్తి కావస్తుండగా, వసిష్ఠుడు దేవేంద్రుడి చేత యజ్ఞాన్ని దిగ్విజయవంతంగా పూర్తి చేయించాడు. వెంటనే ఇంద్రుడి దగ్గర సెలవు తీసుకుని, నిమి వద్దకు బయలుదేరాడు.స్వర్గం నుంచి బయలుదేరిన వసిష్ఠుడు నేరుగా నిమి మహారాజు ప్రాసాదానికి వచ్చాడు. అప్పటికే యజ్ఞం ముగించుకున్న నిమి మహారాజు అలసి సొలసి అంతఃపురంలో నిద్రపోతూ ఉన్నాడు. మహారాజు విశ్రాంతి తీసుకుంటున్నాడని చెప్పి, సేవకులు వసిష్ఠుడిని కూర్చుండబెట్టారు. అయితే, వారెవరూ నిమి మహారాజును నిద్రలేపడానికి సాహసించలేదు.
కొన్ని గంటలు కూర్చుని ఎదురుచూసిన వసిష్ఠుడికి ఇదంతా అవమానంగా తోచింది. సహనం నశించింది. అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడి కోపంగా లేచాడు.‘కులగురువునైన నన్ను కాదని, వేరొకరిని గురువుగా స్వీకరించి యజ్ఞం నిర్వహించడమే నాకు అవమానం అనుకుంటే, ఇంటికి వచ్చిన నాకు దర్శనం ఇవ్వకుండా ఇలా అవమానిస్తావా? అహంకారంతో కన్నూ మిన్నూ కానని నీకు తగిన శాస్తి జరగాల్సిందే! శరీరం రాలిపోయి, నువ్వు విదేహుడివి అగుదువు గాక!’ అని శపించాడు. వసిష్ఠుడి శాపం విన్న రాజభటులు భయభ్రాంతులయ్యారు. పరుగు పరుగున వెళ్లి, నిమి మహారాజును నిద్రలేపారు. కోపోద్రిక్తుడై ఉన్న వసిష్ఠుడు శపించిన సంగతి చెప్పారు.
నిమి మహారాజు ఒక్క ఉదుటన బయటకు వచ్చాడు. వసిష్ఠుడికి నమస్కరించాడు.‘గురువర్యా! ఇందులో నా దోషం ఆవగింజంత అయినా లేదు. నువ్వు సర్వజ్ఞుడివి. ధర్మజ్ఞుడివి. నీకు నేను చెప్పాలా? ధనలోభంతో ఇంద్రుడు తలపెట్టిన యజ్ఞానికి వెళ్లావు. నేనెంత ప్రార్థించినా కనికరించకుండా, యజమానుడినైన నన్ను వదిలేశావు. ఆహ్వానితులను నిరీక్షణలో ఉంచడం తగని పని కాబట్టి, నేను యజ్ఞం తలపెట్టిన విధంగా పూర్తి చేశాను. ఇటువంటి పని చేసినందుకు సిగ్గుపడవలసినది పోయి తిరిగి నన్ను శపిస్తావా? వేదవేదాంగవేత్తవు, బ్రాహ్మణోత్తముడవు అయిన నువ్వు నిరపరాధిని దండించరాదనే సూక్ష్మ బ్రాహ్మణధర్మాన్ని మరచి, నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి నన్ను శపిస్తున్నావు.
ఎదురుదాడి చేస్తున్నావు. నిష్కారణ క్రోధం ఎవరికీ పనికిరాదు. నీవంటి జ్ఞానులకు అసలు పనికిరాదు. విప్రుడివై ఉండి, నిరపరాధిని అయిన నన్ను శపించావంటే, నువ్వు కూడా ప్రతిశాపానికి అర్హుడివే! నేను నీకు ప్రతిశాపం ఇవ్వడంలో ఎలాంటి దోషమూ ఉండదు. అందువల్ల నేను కూడా శపిస్తున్నాను. క్రోధంతో రగిలిపోతున్న నీ శరీరం రాలిపోవుగాక! నువ్వు కూడా దేహరహితుడవు అగుదువు గాక!’ అని శపించాడు.పరస్పర శాపాల వల్ల నిమి మహారాజు, వసిష్ఠుడు ఇద్దరూ విదేహులయ్యారు.
∙సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment