ముద్గల మహర్షి వేద వేదాంగ పారంగతుడు, సదాచార సంపన్నుడు, పరమ శాంతుడు. ఆయన భార్య ధర్మిష్ట. ఆమె ఆదర్శ గృహిణి. చాలాకాలానికి వారికి ఒక కుమారుడు కలిగాడు. ఆ బాలుడు అంధుడు, మూగవాడు. ముద్గల మహర్షి ఆశ్రమ పరిసరాల్లోని అరణ్యంలో శూర్పాక్షి, ఘటోదరుడు అనే రాక్షస దంపతులు ఉండేవారు. ఘటోదరుడు అంధుడు కావడంతో శూర్పాక్షి వేటకు వెళ్లి, ఆహారం సంపాదించుకుని వచ్చేది. శూర్పాక్షి, ఘటోదరులకు కూడా ఒక కొడుకు పుట్టాడు.ఒకనాడు శూర్పాక్షి తన కొడుకును ముద్గల మహర్షి ఆశ్రమం వద్ద విడిచిపెట్టి, ఆయన కొడుకును తన గుహకు ఎత్తుకుపోయింది. గుహలోకి శూర్పాక్షి వచ్చిన అలికిడి విన్న ఘటోదరుడు ‘ఏం తెచ్చావు?’ అని అడిగాడు. ముద్గల మహర్షి ఆశ్రమం వద్ద తమ బిడ్డను వదిలేసి, వారి బిడ్డను ఎత్తుకు వచ్చినట్లు చెప్పింది. భార్య చేసిన పనికి ఘటోదరుడు కలత చెందాడు.
‘ఎంత పనికిమాలిన పని చేశావు! తపోనిధి అయిన ముద్గల మహర్షి అసలు సంగతి గ్రహిస్తే, మనం ఆయన శాపానికి గురి కావాల్సి వస్తుంది. వెంటనే నువ్వు ఆయన బిడ్డను ఆశ్రమం వద్దనే క్షేమంగా విడిచిపెట్టి, మన బిడ్డను తీసుకు వచ్చేయి’ అని చెప్పాడు. భర్త మాటపై ఆ బిడ్డను తిరిగి ఆశ్రమం వద్ద వదిలేయడానికి శూర్పాక్షి బయలుదేరింది.ఆమె అక్కడకు తిరిగి చేరుకునేలోగానే ముద్గలుడు తన పుత్రుడు ఉండాల్సిన చోట రాక్షస పుత్రుని చూశాడు. ఇది రాక్షసమాయ అని గ్రహించాడు. తన మంత్రబలంతో రాక్షస బాలుడిని ఉయ్యాలలో బంధించేశాడు. తర్వాత కాసేపటికి శూర్పాక్షి అదృశ్యరూపంలో అక్కడకు వచ్చి, ముని కుమారుడిని విడిచిపెట్టింది. తన కుమారుడిని తీసుకుపోవడానికి ప్రయత్నించింది. మంత్ర ప్రభావంతో బంధితుడైన కుమారుడిని తీసుకుపోవడం ఆమెకు సాధ్యపడలేదు. ఇక చేయగలిగినదేమీ లేక వెనుదిరిగింది. గుహకు చేరుకుని, భర్తకు జరిగినదంతా చెప్పింది. ఆ రాక్షస దంపతులు తమ బిడ్డ మీద ఆశలు వదిలేసుకున్నారు.
ముద్గల దంపతులు ఆశ్రమంలో ఇద్దరు బిడ్డలనూ సమానంగా చూడసాగారు. ఒక సుదినాన ముద్గలుడు సుమూహర్తంలో బాలకులిద్దరికీ నామకరణం చేశాడు. రాక్షస బాలకుడికి దివాకరుడని, తన కొడుకుకు నిశాకరుడని పేర్లు పెట్టాడు. ఆ బాలురిద్దరూ ఆవుపాలతో పెరిగారు. విద్యాభ్యాసం ప్రారంభించే వయసు వచ్చాక, ముద్గలుడు ఇద్దరికీ అక్షరాభ్యాసం జరిపి, విద్యాబోధన మొదలుపెట్టాడు. ముని బాలకుడైన నిశాకరుడు మొదటి నుంచి మందకొడిగా ఉండేవాడు. తల్లిదండ్రుల చీవాట్లు, పెద్దల తిరస్కారాలు చిన్నప్పటి నుంచి భరించాడు. మాట పలుకు రాని మూగ, అంధుడు అయిన కొడుకు చదువుకు కూడా కొరగాకుండా పోవడంతో ముద్గలుడు విరక్తి చెందాడు. ఒకనాడు నిర్భాగ్యుడైన నిశాకరుడిని అడవిలోనున్న పాడుపడిన బావిలోకి తోసేశాడు. బావి మీద అడ్డంగా ఒక బండరాతిని పెట్టాడు.
ఆ బావిలో ఒక ఉసిరి చెట్టు ఉంది. నిశాకరుడు ఉసిరిచెట్టు కొమ్మల్లో చిక్కుకున్నాడు. ఉసిరిచెట్టు కాయలనే తింటూ, ఆ బావిలోనే పదేళ్లు పెరిగాడతడు. ఒకనాడు ముద్గలుడి భార్య అడవిలో కట్టెపుల్లలు ఏరుకునేందుకు ఆ బావి వైపుగా వచ్చింది. బావి మీద అడ్డంగా మూసి ఉన్న బండరాతిని చూసింది. ‘బావిని ఎవరిలా మూసేశారు?’ అని గట్టిగా అరిచింది. ‘అమ్మా! బావి మీద బండరాతిని పెట్టినది ఎవరో కాదు, నా తండ్రిగారే’ అని బావిలోనున్న నిశాకరుడు బదులిచ్చాడు. ‘బావిలోంచి మాట్లాడుతున్నదెవరు?’ అడిగిందామె. ‘నేను నిశాకరుడినమ్మా’ బదులిచ్చాడు ఆ బాలుడు. తన కొడుకుకు మాటలు రావడంతో ఆమె సంభ్రమాశ్చార్యాలు చెందింది. ఆమె అతి ప్రయాసతో బావి మీద మూసిన బండరాతిని తొలగించింది. ‘నిశాకరా!’ అని పిలిచింది. అతడు క్షేమంగా బయటకు వచ్చాడు. కన్నకొడుకును కళ్లారా చూసి, దగ్గరకు తీసుకుని ముద్దాడింది.
కొడుకును భర్త వద్దకు తీసుకువెళ్లి జరిగినదంతా వివరించింది.‘నిశాకరా! నీలో ఈ మార్పు ఎలా వచ్చింది?’ అడిగాడు ముద్గలుడు. ‘తండ్రీ! పూర్వజన్మల పాప ఫలితంగానే నేను అంధుడిగా, మూగవాడిగా పుట్టాను. పూర్వజన్మలో నా తండ్రి వేద వేదాంగాలను, ధర్మార్థ కామమోక్షాలను గురించి చక్కగా ఉపదేశించాడు. నేను విజ్ఞానఖనినయ్యాను. జ్ఞానంతో పాటు నాకు అహంకారం కూడా పెరిగింది. అహంకారం బుద్ధిని కమ్మేయడంతో కన్నూ మిన్నూ కానక చేయరాని పాపాలన్నీ చేశాను. పరధనాన్ని దౌర్జన్యంగా అపహరించాను. పరస్త్రీలను బలవంతంగా అనుభవించాను. మరణానంతరం నరకానికి వెళ్లి, కొన్నేళ్లు నరకయాతనలు అనుభవించాను. తర్వాత పులిగా జన్మించాను. ఆ తర్వాత పులిగా చేసిన పాపాలకు గాడిదగా జన్మించాను.
గాడిద జన్మలో చేసిన పాపాలకు ఫలితంగా మూగ గుడ్డిగా మీకు జన్మించాను. తండ్రీ! నువ్వు నన్ను బావిలో పడవేసిన తర్వాత ఉసిరిచెట్టు కొమ్మల్లో చిక్కుకున్నాను. ఉసిరికాయలు తిని బతికాను. ఉసిరికాయలు తినడం మొదలుపెట్టిన ఆరునెలలకు నాకు పూర్వజన్మల స్మృతి కలిగింది. నాకు జ్ఞానోదయమైంది. పూర్వజన్మలో అధ్యయనం చేసిన శాస్త్రాలన్నీ జ్ఞప్తికి వచ్చాయి. పూర్తిగా పాపక్షయం చేసుకోవడానికి నేను తపస్సు చేసుకోవాలి. తపస్సు చేసుకోవడానికి నేను బదరికాశ్రమం వెళుతున్నాను. నన్ను అనుమతించండి’ అని నిశాకరుడు తల్లిదండ్రుల పాదాలకు ప్రణమిల్లాడు.
వారు అనుమతించడంతో తపస్సు చేసుకోవడానికి బదరికాశ్రమం వైపు బయలుదేరాడు.
∙సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment