![South India Star Actress Saranya Two Daughters Completed Doctor Course](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/27/South-India-Star-Actress-Saranya.jpg.webp?itok=foPxkt_x)
ఇతర రంగాల కంటే సినిమా రంగంలోనే వారసుల రంగప్రవేశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో చిత్రపరిశ్రమకు చెందిన వారి వారసులు ఇప్పటికే హీరోలు, హీరోయిన్‌లు, దర్శకులు, నిర్మాతలుగానూ రాణిస్తున్నారు. అయితే ఒక సినీ జంట మాత్రం తమ వారసులను సినిమాకు దూరంగా, వైద్యులను చేయడం విశేషమే అవుతుంది. ఆ జంట ఎవరో కాదు తమిళ నటుడు, దర్శకుడు పొన్వన్నన్, శరణ్య దంపతులే.. వారి గురించి చెప్పాలంటే మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన నాయకన్ చిత్రం ద్వారా కథానాయకిగా శరణ్య రంగప్రవేశం చేశారు. అందులో అమాయకమైన యువతి పాత్రలో చక్కని నటనను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.
ఆ తరువాత పలు చిత్రాల్లో కథానాయకిగా నటించే అవకాశాలు ఈమెను వరించాయి. ఆ తరువాత అక్కగా, అమ్మగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో నటిస్తూ పేరు తెచ్చుకున్నారు. రఘువరన్ బీటెక్ చిత్రంలో ధనుష్‌కు అమ్మగా శరణ్య నటించారు. ఆ చిత్రంతో తెలుగు వారికి మరింత చేరువ అయ్యారు. ఇక పొన్వన్నన్ కూడా పలు చిత్రాల్లో నటిస్తుండడంతోపాటు కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఇలా చిత్ర పరిశ్రమలో హోదా, అంతస్తు గడించిన ఈ సినిమా జంట తమ వారసులను మాత్రం ఈ రంగానికి దూరంగా పెంచడం విశేషం.
వీరికి చాందిని, ప్రియదర్శిని అనే ఇద్దరు కూతుళ్లు. చూడడానికి ఇద్దరూ హీరోయిన్స్‌లా ఉంటారు. అయితే పొన్వన్నన్, శరణ్య దంపతులు తమ ఇద్దరి వారసురాళ్లనూ వైద్యవిద్యను అభ్యసించేలా చేశారు. వారిద్దరూ డాక్టర్లుగా పట్టభద్రులు అయ్యారు. గతేడాదిలో పెద్ద కూతురు చాందిని ఎంబీబీఎస్ పూర్తి చేయగా ఇప్పుడు రెండో కూతురు ప్రియదర్శిని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పట్టభద్రురాలైంది. దీనికి సంబంధించిన ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment