
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా (86) కన్నుమూశారు. ఆయన విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరొందారు. అయితే రతన్ టాటా ఏనాడూ తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా మాట్లాడలేదు. కానీ 1997లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటా అసంపూర్ణంగా మిగిలిపోయిన తన ప్రేమకథ గురించి ప్రస్తావించారు.
తాను 1960లలో అమెరికాలో చదువుకున్న తర్వాత అక్కడే ఉద్యోగం చేయడం ప్రారంభించానని రతన్ టాటా నాటి ప్రముఖ నటి సిమి గ్రేవాల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ సమయంలో రతన్ టాటా తాను ప్రేమలో పడిన అమ్మాయిని కలుసుకున్నారు. అయితే ఇంతలోనే అతనిని నాన్నమ్మ అతనిని ఇండియాకు తిరిగి రావాలని కోరారు.
దీంతో రతన్ తాను లాస్ ఏంజెల్స్‌లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి భారత్‌కు తిరిగి వచ్చేశారు. రతన్‌టాటా భారత్‌కు తిరిగి రావడానికి ప్రధాన కారణం అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం. ఆ సమయంలో రతన్ టాటా సోదరుడు చాలా చిన్నవాడు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆయన నాన్నమ్మ మాటను కాదనలేక భారత్ తిరిగి వచ్చారు.
తాను భారత్‌కు వచ్చిన తర్వాత తాను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కూడా ఇక్కడికి వస్తుందని భావించానని రతన్ టాటా ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే 1962లో భారత్-చైనా యుద్ధం కారణంగా రతన్ టాటా భావించినట్లు జరగలేదు. భారత్-చైనా యుద్ధం కారణంగా, రతన్ టాటా ప్రేమించిన అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు భారతదేశానికి పంపడానికి ఇష్టపడలేదు. ఈ వివాహానికి వారు సమ్మతించలేదు. ఫలితంగా రతన్ టాటా ప్రేమ కథ అసంపూర్ణంగా మిగిలిపోయింది.
ఇది కూడా చదవండి: రతన్ టాటాకు ప్రధాని మోదీతో పాటు ప్రముఖుల నివాళులు