అధునాతన టెక్నాలజీ అభివృద్ధిలో చైనా గణనీయమైన పురోగతి
స్టార్ వార్స్ సినిమా స్ఫూర్తితో అత్యంత ప్రమాదకరమైన ఆయుధాన్ని రూపొందించామని చైనా శాస్త్రవేత్తల ప్రకటన
ఎనిమిది వేర్వేరు లేజర్ కిరణాల కలయికతో ఏర్పడే కాంతి పుంజంతో శతృవుపై దాడి
ఎలక్ట్రానిక్ వ్యవస్థలను క్షణాల్లో నిర్వీర్యం చేయగల బీమ్ వెపన్
భవిష్యత్తులో బీమ్ తరహా ఆయుధాలను విస్తృతంగా ఉపయోగించేందుకు చైనా సన్నాహాలు
బీజింగ్: చైనా.. గత కొన్నేళ్లుగా అధునాతన టెక్నాలజీ అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించింది. తాజాగా డెత్ స్టార్ ఆఫ్ ది స్టార్ వార్స్ సినిమా స్ఫూర్తితో తాము అత్యంత ప్రమాదకరమైన ఆయుధాన్ని రూపొందించామని చైనా శాస్త్రవేత్తలు బాంబులాంటి వార్తను ప్రపంచంముందు ఉంచారు. చైనా దీనికి ‘బీమ్ వెపన్’ అనే పేరు పెట్టింది. స్టార్ వార్స్ సినిమా చూడని వారికి ‘బీమ్ వెపన్’ ఎటువంటిదో అర్థం కాదు. అందుకే ఆ వివరాలు మీకోసం..
స్టార్ వార్స్ చిత్రంలో ఎనిమిది వేర్వేరు లేజర్ కిరణాల కలయికతో ఒక తీవ్రమైన కాంతిపుంజం ఏర్పడుతుంది. ఈ కాంతిపుంజాన్ని శత్రువుపై దాడి చేసేందుకు వినియోగిస్తారు. ఈ అత్యంత శక్తివంతమైన కాంతిపుంజం ఒక గ్రహాన్నే నాశనం చేయగలదు. ఇదొక లేజర్ వెపన్. సరిగ్గా ఇలాంటి పవర్‌ఫుల్ ఆయుధాన్నే చైనా తయారుచేసింది.
బీమ్ వెపన్ అనేది లేజర్‌తో కూడిన అధునాతన సాంకేతిక ఆయుధం. ఇది విడుదల చేసే శక్తివంతమైన కాంతి పుంజం లక్ష్యాన్ని అత్యంత వేగంగా ధ్వంసం చేస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్ వ్యవస్థలను క్షణాల్లో నిర్వీర్యం చేస్తుంది. బీమ్ వెపన్ రూపకల్పన సులభమేమీ కాదు. లేజర్ కిరణాలను నియంత్రిస్తూ, వాటిని శత్రువు వైపు ఎక్కుపెట్టడం అంత తేలికైన ప్రక్రియ కాదని శాస్త్రవేత్తలు తెలిపారు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం మైక్రోవేవ్ బీమ్ ఆయుధాన్ని వినియోగంచేందుకు ఏడు వాహనాలు అవసరమవుతాయి. బీమ్ ఆయుధం భారీ పరిమాణంలో ఉంటూ, అధిక స్థలాన్ని ఆక్రమించినప్పటికీ లక్ష్యాన్ని ఛేదించడంలో అత్యున్నత సామర్థ్యాన్ని చూపిస్తుంది. ఇప్పటివరకూ ఈ స్థాయిలో లక్ష్యాన్ని ఛేదించగల ఆయుధం అందుబాటులో లేదని చైనా మోడరన్ నావిగేషన్ జర్నల్ పేర్కొంది. బీమ్ వెపన్ అధిక ఖచ్చితత్వాన్ని సాధించేందుకు, దానికి మైక్రోవేవ్ ట్రాన్స్‌మిటింగ్ వాహనాలను కనెక్ట్ చేయడానికి ఆప్టికల్ ఫైబర్‌ను ఉపయోగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
బీమ్ తరహా ఆయుధాల అభివృద్ధిలో అనేక సాంకేతిక, ఆచరణాత్మక సవాళ్లు ఎదురవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే అధిక శక్తి వనరులు అవసరమన్నారు. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ చైనా ఈ తరహా ఆయుధాల తయారీలో పురోగతి సాధిస్తోంది. భవిష్యత్తులో బీమ్ ఆయుధాలను విస్తృతంగా ఉపయోగించే ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ యుద్ధాల సమయంలో ఈ తరహా సాంకేతికత కీలకంగా మారనుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌కు శాంతి పరిరక్షక దళం?.. ఏం జరగనుంది?
Comments
Please login to add a commentAdd a comment