వ్యక్తిగా ఒక్కరు తీసుకునే నిర్ణయం కంటే సమష్టి నిర్ణయమే ఎప్పుడూ సరైందని పెద్దలు చెబుతారు. కానీ వాషింగ్టన్‌లో మూడు రోజులపాటు జరిగిన నాటో 75 ఏళ్ల వార్షికోత్సవాల్లో దేశాధినేతలు మాట్లాడిన తీరు చూసినా, చివరిలో ప్రకటించిన డిక్లరేషన్ గమనించినా పరిణతికన్నా పరమ మూర్ఖత్వమే కనబడుతుంది. మూడో ప్రపంచ యుద్ధం దిశగా ప్రపంచ దేశాలను కదిలించే ప్రయత్నం దర్శనమిస్తుంది.
రష్యా దురాక్రమణపై పోరాడుతున్న ఉక్రెయిన్‌కు వచ్చే ఏడాదిలోగా సైనిక సాయం రూపంలో కనీసం 4,000 కోట్ల యూరోలు అందజేయాలని నాటో సంకల్పించింది. అంటే రెండున్నరేళ్లుగా వేలాదిమంది మరణాలకూ, కోట్లాది డాలర్ల ఆస్తుల విధ్వంసానికీ కారణమైన ఆ యుద్ధాన్ని మరింత ఎగదోస్తూ పోతారన్నమాట! ఇంకా విడ్డూరమేమంటే నెదర్లాండ్స్ భూభాగంలో ఎఫ్–16 యుద్ధ విమానాలను మోహరించి రష్యాపై దాడులకు ఉక్రెయిన్‌ను పురిగొల్పుతారు.
అంతేకాదు... ఎన్నడూ లేనివిధంగా తొలిసారి చైనాపై నాటో నిప్పులు చెరిగింది. దురాక్రమణ యుద్ధం కొనసాగించేందుకు రష్యాకు దన్నూ, ధైర్యమూ ఇస్తున్నది చైనాయేనని డిక్లరేషన్ ఆరోపించింది. నాటో ఎప్పుడూ చైనా జోలికి పోలేదు. అయిదేళ్లుగా చైనా వ్యవహారశైలిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మాట వాస్తవం. అది కూడా చాలా మర్యాదైన, మృదువైన పదాలతోనే! ఇప్పుడేమైంది? నాటో కొత్త రాగం వెనకున్న కారణమేమిటి?
నిజానికి నాటో సదస్సులో ఈసారి జో బైడెన్ ఆరోగ్యం, ఉక్రెయిన్ యుద్ధం, గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ ప్రస్తావనకొస్తాయని అందరూ ఆశించారు. అమెరికా అధ్యక్ష పదవి రేసులో బైడెన్ ఆరోగ్యం ప్రధాన అంశంగా మారింది. ఆయన కొనసాగితే ఓటమి ఖాయమని డెమాక్రాట్లు నిర్ణయానికొచ్చారు. సర్వేలు సైతం రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ బలపడుతున్న వైనాన్ని ఏకరువు పెడుతున్నాయి. అందుకే నాటో స్వరం మారిందని విశ్లేషకుల ఆరోపణ. ట్రంప్ వస్తే నాటో ఉనికే ప్రశ్నార్థకం కావటం ఖాయం. ఉక్రెయిన్ భవిష్యత్తు అనిశ్చితం. గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ వల్ల ఇంతవరకూ 1,86,000 మంది పౌరులు మరణించారని లాన్సెట్ నివేదిక అంచనా.
ఈ నేపథ్యంలో ఆ యుద్ధాన్ని నివారించటంపై నాటో దృష్టి పెడుతుందని అందరూ అంచనా వేయగా, తీరా దాని గురి చైనా వైపు మళ్లింది! మరోపక్క భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ... ఘర్షణల సమయంలో ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ ఉండదంటూ పరోక్షంగా మనల్ని హెచ్చరించారు. ‘అవసర సమయాల్లో’ భారత్, అమెరికాలు సమష్టిగా పనిచేయాల్సి వుంటుందని చెప్పారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై లోపాయికారీగా మన అధికారుల వద్ద అమెరికా అసంతృప్తి వ్యక్తంచేసినట్టు కథనాలొచ్చాయి. గార్సెటీ దాన్నే బహిరంగంగా చెప్పారు.
రెండేళ్లక్రితం తాను చెప్పిందేమిటో అమెరికాకు గుర్తుందా? ఉక్రెయిన్‌కు చేయూతగా పోలాండ్ నుంచి మిగ్–29 యుద్ధ విమానాలను రంగంలోకి దించటానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తామని 2022 మార్చిలో అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్ చేసిన ప్రకటనను అమెరికా రక్షణ శాఖ తప్పుబట్టింది. ఇందువల్ల రష్యా తీవ్రంగా ప్రతిస్పందించే ప్రమాదం వుంటుందని పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ హెచ్చరించారు. ఆ సమయంలోనే జో బైడెన్ సైతం ఉక్రెయిన్ గగనతలంపై నాటో నో ఫ్లైజోన్ విధించాలన్న ప్రతిపాదనను కొట్టిపడేశారు. దాన్ని అమలు చేయటానికి నాటో నేరుగా యుద్ధరంగంలోకి దిగాల్సివస్తుందని చెప్పారు.
మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభించాలని అమెరికా భావించటం లేదని అన్నారు. ఆఖరికి నాటోలో ప్రధాన భాగస్వాములైన జర్మనీ, ఫ్రాన్స్ సైతం అదే ఉద్దేశంతో ఉన్నాయి. నిరుడు ఫిబ్రవరిలో ఒక విందు సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి జర్మనీ చాన్సలర్ ఓలోఫ్ షుల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియేల్ మేక్రాన్‌లు హితవు చెప్పారు. ‘ఈ యుద్ధంలో మీరు ఓడిపోబోతున్నారు. కనుక రష్యాతో చర్చలకు సిద్ధపడి సంధి చేసుకోవటం అత్యుత్తమం’ అని సలహా ఇచ్చారు. హిట్లర్ కాలంలో జర్మనీ తమ దేశాన్ని దురాక్రమించినా ఆ తర్వాత జర్మనీ, ఫ్రాన్స్‌లు రెండూ పాత వైరాన్ని మరిచిపోయిన సంగతిని గుర్తుచేశారు. ‘నువ్వు గొప్ప యుద్ధ వీరుడివే కావొచ్చుగానీ... ఈ వైరంలో రాజనీతిజ్ఞత అవసరం.
నొప్పి కలిగించినా కష్టమైన నిర్ణయం తీసుకోవటానికి సిద్ధపడాలి’ అని జెలెన్‌స్కీకి మేక్రాన్ హితబోధ చేశారు. అవన్నీ ఏమైనట్టు? నాటో పుట్టిననాటి నుంచి దాన్ని కొనసాగించటానికి అమెరికా సాకులు వెదుకుతూనే వుంది. సోవియెట్ యూనియన్ పెను భూతమనీ, అది యూరప్‌ను కబళించబోతున్నదనీ ఊదరగొట్టి ఏర్పరిచిన నాటో ఉనికిని కాపాడేందుకు పడరాని పాట్లు పడుతోంది. 1989లో పనామా పాలకుడు నొరీగా, 1999లో సెర్బియా పాలకుడు స్లోబోదన్ మైలోసెవిక్, 2003లో ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్‌లు ప్రపంచాన్ని కబళించటానికి సిద్ధంగావున్న హిట్లర్‌లుగా చిత్రీకరించి ఆ దేశాలపై అమెరికా, నాటో దళాలు విరుచుకుపడి గుల్లచేశాయి.
లక్షలాదిమంది అమాయక పౌరులు బలయ్యారు. ఇన్నాళ్లకు నాటోకు యూరప్‌లో పుతిన్ రూపంలో శత్రువు ‘తారసపడ్డాడు’. ఆ లంపటంలోకి ప్రపంచ దేశాలన్నిటినీ దించి లోకరక్షకుడిగా ఆవిర్భవించాలని అమెరికా తలపోస్తున్నట్టు కనబడుతోంది. రష్యా అణ్వాయుధాల ప్రయోగానికి దిగదని అమెరికా, నాటోలు నమ్ముతున్నట్టున్నాయి. ఇలాంటి తప్పుడు సూత్రీకరణలతో, అసంబద్ధ అంచనాలతో ప్రపంచాన్ని యుద్ధంలోకి నెడితే ఊహకందని పర్యవసానాలు ఏర్పడే ప్రమాదముంది. అగ్రరాజ్యాలు విజ్ఞతతో మెలిగి ఉక్రెయిన్, రష్యాల మధ్య సంధికి ప్రయత్నించాలి. ఆ మేరకు ప్రపంచ ప్రజానీకం ఒత్తిడి తేవాలి.
Comments
Please login to add a commentAdd a comment