ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టికరణ
కీవ్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం రెండున్నరేళ్లుగా కొనసాగుతోంది. ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇరుదేశాల సైనికులు నీరసించిపోతున్నారు. శత్రుదేశంలో ఇక పోరాడలేమంటూ ఉక్రెయిన్, రష్యా జవాన్లు తేల్చిచెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి ముగింపు పలకాలని రెండు దేశాలూ యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన రష్యా సైన్యం అక్కడే తిష్టవేసింది. తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ భూభాగాలు రష్యా నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఉక్రెయిన్‌లో ఐదింట ఒక వంతు భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. సాంకేతికంగా, చట్టపరంగా ఇది ఉక్రెయిన్ పరిధిలోనిదే. అయినప్పటికీ ప్రస్తుతం దానిపై ఉక్రెయిన్ ప్రభుత్వానికి పట్టులేదు. మరోవైపు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) కూటమిలో చేరికపట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఉత్సాహం చూపిస్తున్నారు.
కనీసం ఇప్పుడు తమ నియంత్రణలో ఉన్న భూభాగాన్ని అయినా నాటోలో చేర్చుకుంటే యుద్ధంతో అత్యంత కీలక దశను ముగించే అవకాశం ఉందని చెప్పారు. ఇదంతా చాలా వేగంగా జరగాలని అభిప్రాయపడ్డారు. తాజాగా స్కైన్యూస్ సంస్థకు జెలెన్‌స్కీ ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ అ«దీనంలో ఉన్న ప్రాంతానికి పూర్తి భద్రత కల్పిస్తామంటూ హామీ ఇవ్వాలని నాటోను కోరారు. అలాగైతే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని తెలిపారు.
ఆ తర్వాత అంతర్జాతీయ సరిహద్దుల పరిధిలో ఉన్న మొత్తం భూభాగాన్ని.. రష్యా ఆక్రమించిన ప్రాంతాలతో సహా నాటోలో చేర్చుకోవాలని చెప్పారు. దాంతో రష్యా ఆక్రమించిన భూమిని దౌత్య మార్గాల్లో మళ్లీ తాము స్వా«దీనం చేసుకొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం కల్పిస్తే రష్యాతో యుద్ధాన్ని ఆపేయడానికి సిద్ధంగా ఉన్నామని జెలెన్‌స్కీ స్పష్టంచేశారు. కానీ, సభ్యత్వం విషయంలో నాటో దేశాల నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్‌ను ఇప్పటికిప్పుడు తమ కూటమిలో చేర్చుకోవడానికి నాటోలోని కొన్ని దేశాలు ఇష్టపడడం లేదని సమాచారం.
ఇది కూడా చదవండి: మహా కుంభమేళాకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టిక్కెట్ల బుకింగ్ షురూ
Comments
Please login to add a commentAdd a comment