వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం తప్పదన్న వార్తల నడుమ నాటో ఆయుధాలు ఉక్రెయిన్‌కు భారీ సంఖ్యలో చేరుకుంటున్నాయి. రాజధాని కీవ్‌కు నాటో దేశాల నుంచి ఆయుధాల రాక ఆదివారం నుంచీ జోరందుకుంది. వైమానిక దాడులను తిప్పికొట్టడంతో కీలకమైన యూఎస్ తయారీ స్టింగర్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్స్, సంబంధిత సామగ్రి కూడా నాటో సభ్య దేశం లిథువేనియా నుంచి కీవ్ చేరింది.
రష్యా దూకుడును సమర్థంగా అడ్డుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ సోమవారం అన్నారు. రష్యా ఆక్రమిత క్రిమియా సరిహద్దుల సమీపంలో ఉక్రెయిన్ దళాల కవాతులో ఆయన సోమవారం సైనిక దుస్తుల్లో పాల్గొన్నారు. తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఆయన గంటపాటు ఫోన్లో మాట్లాడారు. మరోవైపు రష్యా దళాలు ఉక్రెయిన్‌ను ఉత్తర, తూర్పు, దక్షిణ దిశల నుంచి చుట్టుముడుతున్నాయి. సరిహద్దుల్లో సైన్యం సంఖ్య కూడా లక్షన్నరను దాటిందని అమెరికా రక్షణ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం ఉక్రెయిన్ తలపెట్టిన సైనిక కవాతును లక్ష్యం చేసుకుని దాడికి రష్యా శ్రీకారం చుట్టొచ్చని అమెరికా, యూరప్ నిఘా వర్గాలంటున్నాయి.
అయితే ‘‘దాడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయించుకున్నదీ లేనిదీ ఇప్పుడప్పుడే చెప్పలేం. యుద్ధమా, శాంతా, లేక ప్రతిష్టంభన ఇంకొంత కాలం ఇలాగే కొనసాగుతుందా అన్నది ఈ వారంలో తేలిపోతుంది’’ అని రక్షణ నిపుణులు అంటున్నారు. మిత్ర దేశమైన బెలారుస్‌లో రష్యా మోహరించిన భారీ సైన్యం పెద్ద ఎత్తున కవాతులు చేస్తోంది. ఈ దళాల కదలికలను బట్టి పుతిన్ ఉద్దేశాలు స్పష్టమవుతాయని అభిప్రాయపడుతున్నారు. అయితే, సంక్షోభ నివారణకు అమెరికా, యూరప్ దేశాలతో మరిన్ని చర్చలు జరపడం మేలని పుతిన్‌కు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ తాజాగా సూచించడం విశేషం! రష్యా ఉద్దేశాలకు ఇది ఒకరకంగా అద్దం పడుతోందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
యూఎస్ సంకేతాలు
రష్యా బుధవారమే యుద్ధానికి దిగవచ్చని నిఘా సమాచారాన్ని ఉటంకిస్తూ బైడెన్ జాతీయ భద్రతా సలహాదారు సలివన్ జోస్యం చెప్పడం తెలిసిందే. దీన్ని నివారించేందుకు యూరప్ దేశాలు మరిన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ పుతిన్‌తో గత సోమవారం ఐదారు గంటలపాటు చర్చలు జరిపారు. సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షునితో చర్చించిన జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కుల్జ్ మంగళవారం పుతిన్‌తోనూ భేటీ కానున్నారు. యూరప్‌లో శాంతికి పెను ప్రమాదంలో పడిందని కీవ్ నుంచి ఆయన ట్వీట్ చేశారు.
ఉక్రెయిన్ నుంచి అమెరికా, పలు యూరప్ దేశాల దౌత్య సిబ్బంది ఉపసంహరణ ముమ్మరంగా సాగుతోంది. ఉక్రెయిన్, మాజీ సోవియట్ సభ్య దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వొద్దని రష్యా పట్టుబడుతుండటం తెలిసిందే. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను ఆపేయాలని, తూర్పు యూరప్ నుంచి నాటో దళాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తోంది. ఇందుకు యూఎస్ ససేమిరా అనడమే గాక యుద్ధానికి దిగితే ఆర్థిక ఆంక్షలతో పాటు తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని రష్యాను హెచ్చరిస్తోంది. అయితే యూరప్‌లో క్షిపణుల మోహరింపును, సైనిక కవాతును తగ్గించడం వంటి విశ్వాస కల్పన చర్యలకు సిద్ధమని యూఎస్ తాజాగా సంకేతాలిస్తోంది.
ఉక్రెయిన్ అధ్యక్షునికి ఇంటిపోరు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఇంటి పోరు ఎక్కువవుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనకు ప్రజాదరణ బాగా తగ్గిపోతోంది. మరోవైపు విపక్షాలు కూడా కత్తులు నూరుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని ఆయనను తొలగించి ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలను గద్దెనెక్కించాలని రష్యా ప్రయత్నిస్తున్నట్టు ఇంగ్లండ్ నిఘా వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment